స్వాతిశయాన్ని చదరంగపు బల్లగా మార్చుకుని యిలాంటి పావురాల అస్థికల్ని పావులుగా చేసి జూదమాడగల మేడల్లో గొప్పోళ్ళు యీ బంధాన్ని అంగీకరించరని చెప్పినా అర్ధం చేసుకోని మొండిపిల్లలా వుందే....
ఇప్పుడు కాదు. గీత దాటి ఇంతదాకా వచ్చిన ఈ పిల్ల మూలకంగా యికముందేం జరగబోతూంది?
ఆ క్షణాన ఆమెకు ముందు గుర్తుకొచ్చింది మంగ.....వణికిపోతూ బయటికి నడిచిన లక్ష్మమ్మ అక్కడ మంగ వుండటంతో మ్రాన్పడి పోయింది.
ఏదో అడగాలని పెదవి విప్పిన సావేరి తదేకంగా తననే చూస్తున్న శంకూ చూపులకి తట్టుకోలేనట్టు తల వంచుకుంది.
ఆ గదిలో నిశ్శబ్దం ఎదను ఎరలా కొరుక్కుతింటుంది.
అంతదాకా వీచిన గాలి అలలు అలసటతో ఆగి కోరి ఆ గదిలో కస్తూరి సుగంధంతో నింపుకున్న చిత్రమైన అనుభూతి!
అతడి మనసు జడివానకాగా ఆమె జడివానలో తడిసిన పక్షిలా వుంది.
అతడి పెదవులు పలకలేని పుత్తడి అక్షరాల్ని వల్లెవేస్తుంటే ఆమె మనసు అతడి నామకోటిని రాసుకున్న జపమాలలా వుంది.
మౌనంతో అలసిపోయిందామె.
ఇలాంటి అరుదైన అవకాశం యిక రాధనుకుందో ఈ మూగబ్బాయికన్నా తనే ధైర్యంతో ముందు మాట్లాడాలనుకుందో తల పైకెత్తింది. ఇంకా అలాగే చూస్తున్నాడు.
తత్తరపడిపోయింది.....
ప్రసక్తి ఎలా ప్రారంభించాలో తెలీనందుకు ఆ తెలియక పోవటాన్ని మనసులోనే తిట్టుకొంది.
"మీ అన్నయ్య బాగున్నాడా?" అడిగాడు శంకూయే ముందుగా.
ఇలాంటి పరామర్శ అస్సలు నచ్చలేదు సావేరికి.
"తిడుతుంటే తట్టుకోలేకపోయాను...అందుకని...."
"బోడి సింపతీవద్దు" అంది ఠక్కున.
"అదికాదు!"
"ఇప్పుడొచ్చింది అది మాట్టాడానికి కాదు."
"మరి....?"
నీళ్ళు నమిలేస్తూ అంది "మరేమో....నేను..." నీ కిష్టమేనా అని అడగలేక ఎంత ప్రయాసపడిందీ అంటే ఆమె నుదుట చెమటపట్టేసింది. "ప....ప్రసాదం తీసుకొచ్చాను."
"ఎందుకు?"
తనకు తగ్గట్టు అతడూ ఓ అందమైన చచ్చుప్రశ్న వేసేసరికి ఉక్రోశంగా అంది తలవంచుకునే "మొహాన్నేసి కొట్టుకోడానికి"
ఈ స్టేట్ మెంటు నిజంగా అబద్దమనిపించిందేమో "ఛఛ...ప్రసాదం కొట్టుకోరు తింటారు."
"ఎక్కువగా టి.వి. చూస్తుంటావా?"
"మా ఇంట్లో లేదు...."
"మరా వాక్యం వెంటనే ఎలా వచ్చిందీ?"
"ఏ మాట?"
"నేను హార్లిక్స్ తాగను....తింటా అన్నట్టు కొట్టుకోరు తింటారన్నావుగా?"
"నేను చెప్పింది హార్లిక్స్ గురించి కాదు, ప్రసాదం గురించి."
"నిజమా...." పెదవుల్ని హరివిల్లులా వంచి ఉడుకుమోత్తనంగా అంది. "అయితే తిను" శివుడి ప్రసాదాన్ని అందించింది.
ఇది శంకరుడి కోవెల ప్రసాదం అనాలనుకుంది కానీ అలా అంటే అయితే నమలను మింగుతానని ఎక్కడంటాడో అని తమాయించుకుంది.
ఆ తర్వాత చాలాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు
"శంకూ...." ఇప్పుడు వేళ్ళతో నేలపై పిచ్చిగీతలు గీస్తూ అంది "ఒక్కమాట....ఓ మాటకి జవాబు చెబుతావా?"
"ఏమిటి?"
"ఈ కొబ్బరిముక్క ఉంది చూశావే?"
"ఇందాకట్నుంచీ చూస్తున్నాను."
సావేరి కళ్ళలో ఇప్పుడు చిలిపితనం లేదు. సీరియస్ గా అంది. "నేను....నేనంటే నీకిష్టమేనా!?"
వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
సావేరి సన్నగా ప్రకంపిస్తూంది.
"చెప్పు శంకూ...నిజానికి నేను దేవుడి గుడికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను....నిన్ను కలుసుకోవాలని..." ఒక అందమయిన పువ్వు ముకుళించుకుపోతున్నట్టు బిడియంతో కుంచించుకుపోతూంది. "నాకిష్టమే.... మరి నీకో?"
అప్పటికీ శంకూ నుంచి జవాబు లేకపోయేసరికి కొబ్బరి ముక్కని మంచంపై వుంచింది. గొంతు గాద్గదికమైపోతుంటే అంది "నిజంగా నేను నీకిష్టమైతే ఆ కొబ్బరిముక్క తినాలి. రెండు నిమిషాలు టైమ్ యిస్తున్నాను. అది దేవుడి ప్రసాదంగా తింటే యిష్టమని దేవుడి మీద ఒట్టేసి చెప్పినట్టన్న మాట!"
ఓరకంట చూస్తూంది పది....ఇరవై...అరవై....ఎనభై....నూరు చేతికున్న రిస్టువాచీలో సెకండ్ల ముళ్ళు తిరుగుతూంది. శంకూలో చలనం లేదు. ఆ విషయం స్పష్టంగా బోధపడుతూనే వుంది. నూటపది....నూట పదిహేను....మరో ఐదు సెకండ్లలో గడువు పూర్తయ్యేది.
అప్పుడు వినిపించింది చీకటి ప్రతిధ్వనించేట్టు ఓ కేక.
"ర్రేయ్! శంకర్...."
ముందు అదిరిపడింది సావేరి.
"హీరోవైపోయావట్రా....." ఈసారి కేక మరింత దగ్గరగా వినిపించింది.
సావేరి నిలువునా వణికిపోయింది.
సరాసరి లోపలకే వస్తున్నట్టున్నాడు.
ఈసారి మరింత గట్టిగా పిలిచాడు.
అలా కేకపెట్టి పిలుస్తున్నది బావ రాజేందర్ గా గుర్తించిన సావేరి యిప్పుడు అనర్ధం జరిగిపోతూందని తెలిసి అలజడి పడిపోతూంది.
* * * * *
మరో అరక్షణం ఆలస్యమైతే రాజేందర్ లోపల అడుగుపెట్టేవాడే! మంగ ఎదురు నిలబడింది.
ధైర్యంతో కాదు.....లౌక్యంగా అడ్డుకోవాలని.
"ఏంటి బావగారూ...మీరు స్వయంగా శంకూ కోసం రావడమేంటి? చెబితే నేను తీసుకొచ్చేదాన్నిగా?" తన ప్రయత్నంలో ఎంతవరకూ సఫలీకృతురాలయ్యేదీ ఆమెకు తెలీదు. కానీ అతడి అహాన్ని జోకొట్టాలని కొద్దిపాటి సాహసం చేసింది.
వీధి లైటుకాంతి మంగ చెంపలపైపడి జారిపోతూంటే కాంక్షగా చూశాడు రాజేందర్ అసలు మంగ మీద మనసుపడి చాలా రోజులయింది. చనువుగా దారిలోకి రప్పించుకుందామని ప్రయత్నించిన ప్రతిసారీ తెలివిగా పాదరసంలా జారిపోతూంది కానీ యీ రోజు ముందు తానే పలకరించింది.
"నువ్విక్కడున్నావేమిటి....?" బింకంగా వున్న ఆమె పొంకాన్ని చూస్తూ నాలుకతో పెదవుల్ని తడుపుకున్నాడు.
"ఈ పక్కదే మా యిల్లు! రండి....కాసిన్ని మజ్జిగ నీళ్ళు తాగుదురుగాని" అతడి దారి మళ్ళించాలని మరికాస్త ముందుకెళ్ళింది.
"మజ్జిక్కేముంది? మరెక్కడైనా దొరుకుతుంది. నాకు ఫ్రష్ గా వుండే పాలంటే యిష్టం."
అతడి చూపులు ఎక్కడ కేంద్రీకరించిందీ అర్ధమైన మంగ పైట సర్దుకుంటూ నవ్వేసింది యిష్టం లేకపోయినా "పాలకి మీకు కొదవేముంది బాబూ! మీ ఇంటినిండా పాడావులేగా?"
"పెరటిలోని ఆవు పాలు తాగడానికి పనికిరావే" మాటల్లో మరింత చాతుర్యాన్ని ప్రదర్శించాడు.