ఎదురుగా లక్ష్మమ్మ కూడా వున్నందునేమో అంతకుమించి ముందుకు ప్రసక్తి పొడిగించలేకపోయాడు.
హఠాత్తుగా వచ్చిన పని గుర్తుకొచ్చిందేమో తేరుకొని ముందుకు నడవబోతూ అప్పుడు చూశాడు జారిన మంగ పైటని!
అరక్షణం పాటు రక్తప్రసరణ స్థంభించిపోయింది.
"రండి బాబూ...రమ్మంటుంటే...." ఇంతకుమించి మరె ప్రయోగమూ చేసే శక్తిలేని మంగ కావాలని పైట సర్దుకోవటం మానేసింది.
అనకాపల్లిలోని తన యువసేనని కలిసి తుంపాల వస్తుంటే దారిలో చెప్పాడు ఓ విద్యార్ధి శంకూ మూలంగా రవి గాయపడిన విషయం! ఇంటికి వెళ్ళకుండా సరాసరి శంకూ దగ్గరికి వచ్చాడు చెప్పు కింద తేలులా నేలన పడేసి నలిపేద్దామని చాలా వుత్సాహపడుతున్నాడు.
"ముందు వాడితో మాట్లాడాలే"
"చిన్న పిల్లలు...ఏదో గొడవపడ్డారు....మళ్ళీ రేపు కలిసిపోయే వాళ్ళే....! మీ స్థాయి మనిషీ యింత చిన్న విషయంలో జోక్యం చేసుకోవడం...."
ఎక్స్ రే కళ్ళతో ఆమె సౌష్టవాన్ని చూస్తూ అన్నాడు. "అదికాదే గోటితో పోయేది గొడ్డలిదాకా రానివ్వటం నాకిష్టం లేదు."
నవ్వేసింది ఇంకా అతన్ని రెచ్చగొడుతున్నట్టు. "మీరు గోరుకాదు, గొడ్డలి."
"మొత్తానికి గుర్తుపట్టావు" పంటి బిగువున క్రింది పెదవి నొక్కి పెడుతూ అన్నాడు "సరే! పద...."
నిమిషంలో అతడ్ని పక్కదోవ పట్టించి ప్రక్కనే వున్న యింటికి తీసుకెళ్ళింది.
"ఎవరదీ....?" తూలుకుంటూ ద్వారం దగ్గిరకు వచ్చిన తాగుబోతు తండ్రిని చూపిస్తూ-
"మా అయ్య బాబూ" అంది.
జావగారిపోయాడు రాజేందర్.
గ్లాసుడు కాకపోయినా ఉగ్గుగిన్నెతో అయినా పాలు తాగుదామని చాలా ఉత్సాహపడి వస్తే మధ్యలో ముసలాడు ప్రత్యక్షం కావడం అస్సలు నచ్చలేదు. అయినా యిక తప్పదన్నట్టు రెండు నిమిషాలు అక్కడే కూర్చొవాలనుకున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో__
టెన్షన్ నుంచి తేరుకున్న సావేరి పైకి లేచింది యిక వెళ్ళడానికన్నట్టుగా.
కొబ్బరిముక్క కోసం చూస్తే లేదక్కడ!
"ఏది?" అడిగింది.
"దాచేశాను తినకుండా"
"అదేం?"
"మీ బావ చూస్తాడని...."
"చూస్తే?"
"నువ్వంటే నాకిష్టమని తెలిసిపోతుందని....."
అమాయకంగానయినా తెలియజెప్పాడు తన మనసులోని అభీష్టాన్ని! గాలికి అల్లనల్లన తలవూపి ఓ గడ్డిపరక ఆమె చిలిపి మనసుని తాకిన స్మృతి అయ్యింది. చీకట్లో వచ్చిన వెన్నెలమ్మ నేనొక ప్రత్యూషపు నిర్మలత్వాన్ని! నీ బ్రతుకురంగంలో చోటు కోసం ఆశపడే బాష్పబిందువునీ అంటూ తెలియచెప్పింది.
ఆమె నేత్రాలు వసంతరసాన్ని గ్రోలిన విరజాజులయ్యాయి.
"నువ్విలాగే బాగుంటావు" కొబ్బరిముక్క తింటూ పరిపక్వతకురాని భావాన్ని పసిపిల్లాడిలా చెప్పేశాడు.
అర్ధనిమీలిత నేత్రాలతో చూసింది అతడు తను కట్టుకున్న చీరని గమనించడాన్ని....
ఆగుతూ ఆగని ఊపిరిని మనసు అల్లి ఏ పొదరింట దాచుకొని క్షణం క్రితందాకా పాలపుంతలో నడిచిన ఆమె ఒక పాలపుంతయై కలలోలా పరుగు తీసింది.
* * * * *
"ఎందుకలా వణికిపోతున్నావ్?"
ఏటి ఒడ్డున మామిడి తోపులోని ఓ పొదచాటున శంకూతో కూర్చునున్న సావేరి కోపంగా అడిగింది.
"భ....భయమేస్తూంది."
"ఎందుకు?"
"ఎవరన్నా చూస్తారని...."
"పప్పుముద్ద...." కిసుక్కున నవ్వింది మండుటెండ మెరిసేట్టు. "ఆడపిల్లని నాకు భయం లేదుగా...."
"నీది పిచ్చి ధైర్యం...." ఉక్రోషంగా అన్నాడు.
"ఎందుకలా అనిపించింది....?"
"క్లాసులో అంత ముందుండగా నా నోట్ బుక్ అడిగి క్లాసెగ్గొట్టి యిక్కడకు రమ్మని రాశారుగా....?"
"మరేం అనుకున్నావు? నువ్వు రాకపోతే అప్పుడు నా ధైర్యం యింకా చూసేవాడివి" ఉడికిస్తున్నట్టుగా అంది.
"ఏం చేసేదానివి?"
"ప్రిన్సిపాల్ కి కంప్లయింట్ చేసేదాన్ని...."
"ఏమని.....రానన్నాననా...."
"రమ్మన్నావని....రానంటే-కెమిస్ట్రీ లేబ్ లో నన్ను పట్టుకుని..."
"పట్టుకుని...." పెదవులు బిగబట్టి అడిగాడు.
"మరేమో....గట్టిగా...."
"గట్టిగా....."తొందరగా చెప్పమన్నట్టు చూశాడు.
"ముద్దు పెట్టుకున్నావని....."
"ఛీ....ఆడపిల్లవేగానీ.....నీకు సిగ్గులేదు" తనే సిగ్గుపడ్డాడు.
"మరేంటనుకుంటున్నావు? నేను మహా మొండిదాన్ని!" అధరాలను హరివిల్లులా వంచి ఓరకంట చూస్తూ అంది.
"ఇలా అయితే..." సీరియస్ గా అన్నాడు. "మన స్నేహం...."
చివాలున తలతిప్పి చూసింది. "మన స్నేహం" అలాంటి బెదిరింపుని తట్టుకోలేనట్టు అమాంతం అతని చొక్కాని పట్టుకుని కుదిపేస్తూ అడిగింది. "మన స్నేహం చెల్లిపోయినట్లేనా?"
ఖంగు తిన్నాడేమో మాట్లాడలేకపోయాడు.
"నిన్నే...." పట్టు మరింత బిగించింది.
"ఇద...ఇలా చొక్కా చింపితే నీ స్నేహం నిజంగా మానేస్తా" కోపంగా విదిలించుకున్నాడు.
అంతే....
ఆమె రోషంగా పైకి లేచింది. విడిచిన చెప్పుల్ని సైతం పట్టించుకోనట్టు విసవిసా నడవబోయింది.
అప్పుడు చూశాడు శంకూ నేలపై నిటారుగా నిలబడ్డ ఓ తుమ్మ ముల్లుని. అరక్షణంలో ఆమె అరికాలిలో గుచ్చుకొనేదే....
అంతలోనే చేతిని ఆమె పాదంకింద వుంచాడు. ఆ పాదం బరువుకి ముళ్ళు కసుక్కున అతడి చేతిలోని దిగబడిపోయింది.
"అమ్మా!"
శంకూ గొంతునుంచి వెలువడిన ఆర్తనాదం ప్రకృతికన్నా ముందు ఆమె మనసుని తాకినట్టు గభాలున నేలపై కూర్చుంది.
శంకూ అరచేతినుంచి చిక్కని రక్తం. మధ్యగా పాతిపెట్టిన ఒక ప్రేమస్థూపంలా ముల్లు... అది అతడి చేతినిగాక ఆమె గుండెకే గుచ్చు కున్నట్టు కళ్ళనుంచి నీళ్ళు బొట బొటా రాలాయి.
ఆ నీళ్ళు అతడి రక్తంతో కలసి చందనమై బాధని ఉపశమింప చేస్తుంటే నెమ్మదిగా ముల్లులాగి పెదవులతో చేతిని స్పృశించింది.
"ఛ ఛ....రక్తం" కుంకుమ పూలలా మెరుస్తున్న ఆమె పెదవుల్ని మరో చేత్తో తుడవబోతుంటే శంకూని వారించింది.
"అలాకాదు తుడిచేది" సావేరి నేత్రాలు అరమోడ్పులయ్యాయి.
"మరెలా?"
ఓరగా చూస్తూ పెదవుల్ని ముడిచి సంకేతంగా చెప్పింది. అర్ధమయినట్టు అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
ఒక నిశ్శబ్దం యముడి సృష్టికందని అచేతన సౌదర్యంలా.