Previous Page Next Page 
అసావేరి పేజి 19

    ఎప్పుడూ మోడరన్ డ్రెసెస్ వేసుకునే సావేరి యిప్పుడు బుద్దిగా చీరకట్టుకోవడం చిత్రంగా అనిపించింది.
   
    మంగతోబాటు వెళుతున్న సావేరి అందాన్ని చూడటానికి రాధమ్మ రెండుకళ్ళు చాలలేదు. తిరిగిరాగానే దిష్టి తీయాలనుకుంది.
   
    ఇంట్లో మరో గదిలో వున్న రవి సరిగ్గా అదే సమయంలో ఆలోచిస్తున్నది శంకూ గురించే.
   
    తనకైన గాయం కాలేజీ ఫుల్ బాల్ మేచ్ లో తగిలిందని తల్లి దగ్గర అబద్దం చెప్పాడు.
   
    తన తాయికి పరిష్కారమైపోయే ఏ సమస్య గురించీ యింట్లో చెప్పే అలవాటు లేదు రవికి....
   
    రాత్రి ఏడుగంటలు కావస్తూండటంతో శివాలయంలో సందడి లేదు. సజ్జతో నడిచివస్తున్న సావేరిని ముందు గుర్తుపట్టలేదు ఆలయ పూజారులైన రామశాస్త్రిగారు.
   
    గుర్తించగానే అబ్బురపడిపోయారు.
   
    తను గుడికి అర్చకుడైనా వీర్రాజుగారి ప్రశస్తి తెలిసినవాడు కావటంతో అందులోనూ వచ్చింది ఆయన ముద్దులపట్టిగా గ్రహించడంతో కొద్దిగా తొట్రుపడ్డాడు.
   
    ఏమాత్రం అమర్యాద జరిగినా వీర్రాజుగారి దృష్టికి వెళ్ళిపోతుంది. అందుకే హఠాత్తుగా ఓ గంధర్వకన్య గుడికి తరలి వచ్చినట్టు గౌరవంగా ఆహ్వానించారు.... "రా తల్లీ...."
   
    "బాబాయ్" చీరలో బుట్టబొమ్మలా వున్న సావేరి బోలెడంత సిగ్గుపడిపోతూ అంది "ఈవేళ అర్చన చెయ్యించవచ్చా....?"
   
    "పిచ్చితల్లీ....అర్చనకి వేళేమిటమ్మా మనసు పడినప్పుడెప్పుడైనా చేయించొచ్చు...." సజ్జని అందుకున్నాడు. మంగకీ ఇది విడ్డూరంగానే వుంది.
   
    "ఏ పేరున చేయాలమ్మా" టక్కున అడిగారు శాస్త్రిగారు.
   
    ఖంగుతింది సావేరి. మనసులో అనుకున్నది బయట పెట్టడానికి మనస్కరించటం లేదు. అసలు పేరు చెప్పాలన్న ఓ రూలొకటి వుంటుందని అప్పటిదాకా తెలీదు సావేరికి.
   
    "చెప్పుతల్లీ" రెట్టించారు.
   
    "మరేమో.... శంకూ.... శంకరుడు...." సావేరి తడబాటుగా అంటుంటే ఒక నీటిబొట్టు మంగ కనుకొలకుల్లో ఉడికింది.
   
    "ఇది శంకరుడి కోవెలేతల్లీ.....నువ్వుచేసే అర్చన శంకరుడికే కాబట్టి ఎవరిపేర్న చేయాలి? ఆ శంకరుడి ఆశీస్సులు ఎవరికి కావాలి? ఆ పేరు చెప్పు."

    హఠాత్తుగా సావేరి ఇబ్బందిలో పడిపోయింది. నిజానికి అమాయకంగానో, ఆకతాయిగానో గుడికి బయలుదేరినా ఆ క్షణంలో త్రికరణ శుద్దిగా ఆమె కోరుకున్నది శంకూ శ్రేయస్సు. నిజంగా దేవుడు తన మొరవింటాడా లేదా అన్న మీమాంసతోనూ ఆమె బయలుదేరలేదు.
   
    మనసులోని మాట చెప్పుకోగలిగింది తనకు కనిపించిన మంగకి మాత్రమే. అయితే మంగ సృష్టించిన అలజడిలో దేవుడికి మనసులోనే చెప్పుకోవాలనుకుంది. తన మూలంగా శంకూ కేమీ కాకూడదని దేవుడ్ని ప్రార్ధించాలనుకుంది.
   
    చాలా చిత్రమైన సందిగ్ధతలో నిలబడిన సావేరిలో ఉన్నట్టుండి ఓ ప్రశ్న మొదలై అది క్షణకాలంలో దేవుడంటే పెద్ద సమస్యగా మారిపోయింది.
   
    అసలు శంకూ తనను యిష్టపడుతున్నాడా....
   
    ఓ గాలి అలనో, పువ్వునో పలకరించినట్టు చూపులతో తననూ పరామర్శిస్తున్నాడా....?
   
    అదే నిజమైతే....అమ్మో....ఆ వూహే ఆమెకు భరింపశక్యం కావడం లేదు.
   
    ఏం చెప్పాలీ అని ఆయన నలిగిపోతుండగానే మంగే అంది.
   
    "పంతులుగారూ....అమ్మాయిగారికి శంకరుడు మంచి దేవుడూ అనిపించిందట....అందుకే యిన్నాళ్ళు తానంతట తానుగా ఏ గుడికీ వెళ్ళని మా సావేరమ్మ తొలిసారి శంకరుడి గుడికి వచ్చింది. కావలసింది శంకరుడు ఆశీస్సులే కాబట్టే అర్చన అమ్మాయిగారి పేర్న చేయండి...." క్షణంపాటు నవ్వుతూ సావేరిని చూస్తూ "అమ్మాయిగారి మనస్సుని అర్ధం చేసుకొమ్మని ఈశ్వరుడికి మరీ మరీ చెప్పండి...." అంది.
   
    సావేరి చెంపలు నునుసిగ్గుల కెంపులై పోగా తల వంచుకుంది.
   
    గోత్రాన్ని తెలుసుకున్న శాస్త్రిగారు అర్చన చేస్తుంటే సావేరి చేతులు జోడించింది.
   
    'ప్రేమనే' భావం ఒక మనిషిలో యిలాంటి అసాధారణమైన మార్పుని రప్పించగలదని తెలీని మంగ నిశ్చేష్టురాలై చూస్తూంది సావేరిని....

    అసంకల్పితంగా మంగకూడా తన చేతుల్ని జోడించింది...శివుడ్ని చూస్తూనే తనను ఉద్దరించమని కాదు. ఒకరినొకరు కోరుకున్న రెండు నందివర్ధనాలూ శాశ్వతంగా కలుసుకోవాలనీ వందపువ్వులూ వేయికాయలై ఆ దేవుడి మెడలో మాలగా మారాలని.
   
                                           *    *    *    *
   
    "ఇటెక్కడికమ్మ" మంగ మాటలింకా పూర్తికానేలేదు. సావేరి సరాసరి శంకూ యింటిలోకి నడిచింది.
   
    ముందు వచ్చిందెవరో లక్ష్మమ్మకు అర్ధం కాలేదు.
   
    అర్ధమయ్యేసరికే సావేరి ఒక్క అంగలో మంచంపై పడుకున్న శంకూని చేరుకుంది.
   
    ఏమిటీ మొండితనం....మంగ గుండె జలదరించిపోయింది.
   
    ఎవరన్నా చూస్తే....
   
    తత్తరపాటుతో ద్వారం దగ్గరే ఆగిపోయి ఆందోళనగా బయటికి చూస్తూంది కాపలాగా.
   
    "సా.... వే..... రి....."
   
    అశ్రుబిందువులు చెంపలపై పడగానే కళ్ళు తెరిచిన శంకూ అవాక్కయిపోతూ చూశాడు.
   
    ముందు కలేమో అనుకున్నాడు.
   
    కలకాదన్న సత్యానికి సాక్ష్యంగా సావేరి కళ్ళు బిడియంగా వాలి ఇంకా అశ్రువులు చిందిస్తూనే వున్నాయి ....మొహంపై అతడి గాయాల్ని చూసి తట్టుకోలేకపోతూంది.
   
    "నువ్వు.... ఇలా... ఇక్కడికి..." తడబడుతూ లేవబోతుంటే వారించింది తల అడ్డంగా వూపుతూ.
   
    ఎన్నో అడగాలనుకుంది ఏదేదో చెప్పాలనుకుంది కానీ ఆగకుండా నీళ్ళు వర్షిస్తున్నాయే తప్ప గొంతు పెగలడంలేదు "ఎందుకు....ఎందుకొచ్చావు."
   
    ఆమె రావడం ఆనందంగా అనిపించినా అంతకుమించి భయంతో కంగారు పడుతున్నాడు "వెళ్ళిపో.... సావేరీ....వద్దు..."
   
    "అమ్మా!" లక్ష్మమ్మ గొంతు అప్పటికిగాని పెగల్లేదు "చెడబుట్టిన వాడమ్మా....నీకు సరిపోనివాడు....నీ ఇంటివసారాలో కలుపుమొక్కగా నైనా నిలబడే అర్హత లేనివాడు....వాడు పొరపాటున నిన్నేదన్నా అని వుంటే...."
   
    "లేదు" ఓ ఆక్రోషంలా తలని అడ్డంగా వూపింది "శంకూ నన్నేమీ అనలేదు....అస్సలు శంకూ తప్పేమీలేదు....అవును బామ్మా!"
   
    "సంతోషమమ్మా....అది చెప్పడానికి నువ్విలా రావడం ఆనందదాయకమే అయినా ఇదెవరన్నా చూస్తే....అదీ శంకూ చేసిన తప్పే అవుతుంది వెళ్ళిపోతల్లీ!"
   
    "వెళ్ళను...." మొండిగా రొప్పుతూ అంది. "ఈసారి శంకూని ఎవరన్నా ఏమి చేస్తారో నేనూ చూస్తాను...." గదిలోని లైటు కాంతిలో సావేరి చిందిస్తున్న కన్నీళ్ళు సుషుప్తిలోకి జారిన సూర్యుడి కోసం కలతపడ్డ ప్రకృతి పూలపై వర్షించే మంచుబిందువుల్లా కనిపిస్తున్నాయి.
   
    ఈ పిచ్చిపిల్లకెలా చెప్పాలో తెలీని లక్ష్మమ్మకి గగుర్పాటుగా వుంది.
   
    ఏదీ చెప్పని శంకూకన్నా క్షణంలో చెప్పకుండా చాలా చెప్పిన సావేరి మనసు స్పష్టంగా అర్ధమైపోయినా ఎవరు హర్షిస్తారని....మెరుపు మనిషై పూరిగుడిసెకి నడిచి వస్తేమాత్రం ఎవరు ఆమోదిస్తారని?

 Previous Page Next Page