Next Page 
నల్లతంబి పేజి 1

                                 

                                                    నల్లతంబి
       
                                               ------చందు హర్షవర్ధన్

 

 

1994 ఏప్రిల్ 15వ తేదీ శుక్రవారం
మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు
నిముషాలు.
విజయవాడ రైల్వే జంక్షన్.
ఫ్లాట్ ఫాం నెంబరు 5.
ఫ్లైఓవర్ మీద నుండి ఫ్లాట్ ఫారం మీదకు మెట్లున్నాయి. మెట్లు ప్రారంభమయ్యే చోట రూఫ్ నుంచి టి.వి. బాక్సు వ్రేలాడుతోంది. గెస్ట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారు_రైలు ఆలస్యమని తెలుసుకొని ఆ టి.వి. వద్ద కాలక్షేపం చేస్తున్నారు.
అలా నిలుచున టి.వి. ప్రేక్షకులలో ఒకని తీరుచూస్తే అతను టి.వి. చూస్తున్నట్టే వుంది. కాని చూపులు మాత్రం అక్కడ లేవు. అవి రైలుపట్టాలవెంట పరిగెడుతున్నాయి. కొద్దిగా దూరాన ప్రస్పుటంగా కనిపిస్తున్న గ్రీన్ సిగ్నల్ వైపుకు దూసుకుపోతున్నాయి!
రాబోయే రైలు కోసం జనమంతా అయిదవ నంబరు ఫ్లాట్ ఫారం మీద నిలుచున్నారు. వారిలో రైలెక్కేది కొందరు; దిగే వారిని రిసీవ్ చేసుకునేవారు మరికొందరు.
అయితే, ఆ జనంలో దాదాపుగా మూడో వంతు మంది విధి నిర్వహణలో వున్న ప్రభుత్వోద్యోగులే!
రైలు ప్రయాణీకులకు నల్లకోటు వేసుకున్న రైల్వే సిబ్బంది మినహా మిగిలిన వారెవరూ కనిపించరు; కనిపించినా వారెవరో తెలుసుకోలేరు.
'విజయవాడ రైల్వే స్టేషను ఒక పెద్ద కూడలి' అని మాత్రమే అందరికీ తెలుసు.
స్మగ్లింగ్, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, లూఠీలు, ఆయుధాల అక్రమ రవాణా, వ్యభిచారం చేసేవారికి అదొక రింగ్!
ఆ రింగ్ ను పోలీసులు, కస్టమ్స్ వారు మరెందరో కమ్ముకుని వున్నారు. స్టేషన్ కి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని వేయి కళ్ళతో గమనిస్తున్నారు.
కోరమాండల్ ఎ.సి. టూ టైర్ కంపార్టుమెంటు నుంచి ఒక కెనడా జంట దిగింది. లగేజీని వీపుకు తగిలించుకుని, కొన్నింటిని భుజాలకు వ్రేళ్ళాడేసుకుని, మరికొన్నింటిని రెండు చేతులతో తీసుకుని హుషారుగా "ఎగ్జిట్" వైపుకు కదిలారు.
వాళ్ళు దిగిన రెండు నిముషాలకు ఆంధ్ర జంట అదే కంపార్టుమెంట్ నుంచి దిగింది. "లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్" అన్నట్టు వాళ్ళ భుజాలకు సింపుల్ గా ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వ్రేళ్ళాడుతున్నాయి.
అంతకుముందే అరవ నంబర్ ఫ్లాట్ ఫారమ్ మీద మద్రాస్ టు న్యూఢిల్లీ హాలిడే స్పెషల్ వచ్చి వుంది.
సరిగ్గా అప్పుడే సిగ్నల్ పడింది. హాలిడే స్పెషల్ బయలుదేరింది....
కెనడా యువజంట హుషారుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కారు. యధాలాపంగా ఆమె చూపు తన చేతి వ్రేలికి వున్న ఉంగరంపై నిలిచింది. మరుక్షణం ఉలిక్కి పడిందా యువతి.
"మైగాడ్....మైరింగ్.....మై డైమండ్ రింగ్" కెవ్వున కేక పెట్టింది.
కెనడా యువకుడు ఒక్క అంగలో ఆమెను సమీపించడం, అతని చేతిలోని వస్తువులను విడిచి ఆమె చేతి వ్రేలికివున్న ఉంగరాన్ని చూడడం తృటికాలంలో జరిగాయి.
"ఆమె చేతికి వున్న ఒరిజినల్ డైమండ్ రింగ్ స్థానంలో డూప్లికేట్ రింగ్ ఎలా వచ్చింది?"

                                                         *    *    *
వాడొక గజదొంగ.
ఆ గజదొంగవైపు విస్మయంగా, అంతకు మించి అభినందనగా చూస్తున్నాడు ఆ తెల్లదొర.
"ఒక వ్యక్తి అన్ని దొంగతనాలు చేయడం సాధ్యమా?" అన్న అపనమ్మకం కూడా ఆ దొరగారిలో లేకపోలేదు.
"దొరా.....నా తప్పులు కాయండి" అన్నాడు వినమ్రంగా ఆ దొంగ.
"అట్లాగే" అన్న దొర సమాధానానికి దొంగ ముఖం విప్పారింది. అంతలోనే "అయితే ఓ షరతు..." అనడంతో గతుక్కుమన్నాడు దొంగ.
"మా దొరసాని ఒంటి మీదున్న గౌనును దొంగిలించి నాకు ఇవ్వాలి" తిరిగి అన్నాడు దొర.
"నా తప్పు కాయండి దొరా, అట్లనే...." అని ఆ సవాలుని స్వీకరించాడు దొంగ!
తన భార్య ఒంటిమీద వున్న గౌనును దొంగిలించి తీసుకొచ్చి తనకే బహుమతిగా ఇవ్వడమా? నమ్మలేకపోయాడు దొర.
అయితే, ఆ సవాలును దొంగ తీసుకున్న తీరు దొరకు ఇంటరెస్టింగ్ గా వుంది!
వెంటనే తన గుడారం చుట్టూ కాపలా రెట్టింపు చేశాడు. తుపాకీ పట్టుకుని తనూ కూర్చున్నాడు.
పొద్దుపోవటంతో దొరసాని నిద్రలోకి జారుకుంది.
దొరసాని ఒంటిమీద వున్న నైటీని గుర్తు పెట్టుకున్నాడు దొర.
పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు దొంగ. అది పెద్ద తోట. ప్రతీ అడుగుకీ ఒక సిపాయి. అంతటా దివిటీలు.
వెంటనే కోతిలా చెట్టుమీద నుంచి చెట్టుమీదకు పాకుతూ గుడారాన్ని చేరుకున్నాడు. కత్తితో గుడారం మీద కొద్దిగా కంత చేశాడు.
దొరసాని పడుకున్న వైనాన్ని చూశాడు.
నెమ్మదిగా పైనుంచి దొరసానిమీద పడేలా లఘుశంక వదిలాడు.
ఆ తడికీ, వాసనకూ లేచిన దొరసాని బల్లి తన నైటీని పాడుచేసిందనుకున్నది. డ్రెస్ మార్చుకుంది.
దొరవారు ఎంట్రెన్స్ లో తుపాకీతో కూర్చునే వున్నారు. చుట్టూ కాపలా వుండనే వున్నారు.
గుడారంలో దండెం మీదకు దొరసాని విసిరిన నైటీని గాలం తాడుతో పైకి లాక్కున్నాడు దొంగ.
మరుసటి రోజున సగర్వంగా ఆ నైటీని దొరవారికి బహూకరించాడు దొంగ.
దొరవారు కూడా అదే ఠీవీతో దొంగను క్షమించడమే గాక అతని బుద్ది కుశలతకు గౌరవంగా సత్కరించాడు.

                                                       *    *    *
ఇది మన దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగిన యదార్ధ సంఘటన.
స్వతంత్ర భారతంలో విజయవాడ రైల్వే స్టేషన్ అయిదవ నెంబరు ఫ్లాట్ ఫారమ్ మీదవున్న ఇన్ స్పెక్టరు ధీరజ్ - కెనడియన్ దొరసాని చేతికి వున్న డైమండ్ రింగ్ ను దొంగిలించి నకిలీరింగ్ ను ఎలా తొడిగాడు దొంగ? అని ఆలోచించే స్థితిలో లేడు__

Next Page