Previous Page Next Page 
జీవనకలశం పేజి 2

                                 


    "చీకట్లో ఎవరితోరా మాట్లాడుతున్నావ్" అంటూ వెంకటేశ్వర్లు వస్తూంటే పర్సుతీసి పాంటు జేబులో దూర్చి ఏడవలేక నవ్వుతున్నట్లు "నీ ముఖం ఇక్కడెవడున్నారూ నాటకంలో వేషం వేస్తున్నాను..... ఆ పోర్షన్ ..... రిహార్సల్సు చేస్తున్నా" తన సమయస్ఫూర్తికి తనకే ఆశ్చర్యం వేసింది వాసుకి.
    "ఇక్కడా రిహార్సలు .... ఏ ఆడపిల్లన్నా వెంట పడగలదు" అయినా ఇంట్లో చేసుకోకూడదు"
    "ఆ....అదీ అయింది. మొన్న వదిన లేనప్పుడు తలుపులు బిగించుకుని పోర్షన్ వచ్చిందో లేదో అని చూసుకుంటున్నా,
    "ఆహా.....సుందరీ..... నీ మోము ఎంత అందముగనున్నదే....చందమామకన్నా చల్లగా" అంటూ నాకు తెలియకుండానే నా గొంతు వుచ్చస్థాయి అందుకుంది. ఇలా జరిగింది రెండే రోజులురా వెంకటేశ్వర్లూ......మూడోరోజు మా పక్క పోర్షన్ లో వాళ్ళ అమ్మాయి ఆండాళ్ళు లేదూ ఓ లెటర్ "తలుపు సందులో నించి నా మీదికి పారేసింది. అది చదివి హడిలి పోయాను. జవాబు ఇవ్వకపోయినా లేఖల ప్రవాహం ఆగటం లేదు. ఆ ఉత్తరాలు దాచుకోలేక.... బైట పెట్టలేక చస్తున్నా ననుకో.....ఇంక లాభం లేదని ఓ రోజు డాబా మీద ఒంట రిగా వున్న ఆండాళ్ళుని కలుసుకుని మెల్లగా చెప్పేశాను, "నేను నిన్ను ప్రేమించటం లేదు. నాకో హిడింబిలాంటి మరదలుంది. నేనూ అది పుట్టకముందే మా పెళ్ళి నిర్ణయం అయిపోయింది. గనక దయచేసి ఈ ప్రేమలేఖల ప్రవాహానికి ఆనకట్ట వెయ్యమని మరీ మరీ ప్రార్దించాను."
    ఆండాళ్ళు నిన్ను కలిసిందా?" కుతూహలంగా అడిగాడు వెంకటేశ్వర్లు.
    "అయ్యో వూరుకుందా? వూరుకుంటే ఇంకా కథ అంతటితో సమాప్తం అయిపోయేదిగా! అవలేదు.
    నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను. నీ ప్రతిమాటా నన్ను వుద్దేశించే అని పొంగిపోయి నా స్నేహితులతో చెప్పేశాను. ఇప్పుడు నన్ను నువ్వు ఇలా మోసం చేస్తే నా గతి ఏం గాను. అంటూ సినిమా కన్నీరు కారుస్తూ నా మీద మీదకి వచ్చేసింది. అందితే చావగొట్టి చెవులు మెలేసేదేమో కాని నేను అమాంతం క్రిందికి వురికి పారిపోయాను. వారం రోజులు ఓ దూరపు చుట్టంగాడి ఇంట్లో అజ్ఞాతవాసం చేశాను. నా ప్రారబ్ధం వాడి పెళ్ళాం....ఇంకో రోజు వుంటే కూడెత్తనంటూ మొగుడుతో దెబ్బ లాడేసింది. ఇంతలో మా అన్నయ్య ఆచూకీ లాగి నా చెవులు మెలేసి లాక్కువచ్చి మళ్ళీ ఖైదులో పడేశాడు.
    ఆండాళ్ళు వాళ్ళ అమ్మకీ, నాన్నకీ యేం చెప్పిందో మా ప్రక్క పోర్షను ఖాళీ చేసి క్రింద ఓ పోర్షనులోకి మారిపోయారు.
    బ్రతుకు జీవుడా అనుకున్నాను. ఇదీ సంగతి. వాసు చెప్పటం ఆపి మళ్ళీ యేదో గుర్తు వచ్చి నవ్వడం మొదలు పెట్టి. అరె వెంకటేశ్వర్లూ ఈ రోజు పొద్దున అందరి స్నానాలూ అయిం తర్వాత సోపు కాకి ఎత్తుకుపోతుంటే దాన్ని అదిలిస్తూ క్రిందికి చూశాను అక్కడ......అంటే క్రింద పోర్షనులో ఆండాళ్ళు వుండే పోర్షనన్న మాట అక్కడ ఆండాళ్ళు....ఏం చేస్తోందంటే" చెప్పడం ఆపి వెంకటేశ్వర్లు వైపు చూశాడు వాసు.
    అబ్బ... సస్పెన్సు.... చంపక చెప్పు"     
    వెంకటేశ్వర్లు త్వరపెట్టాడు.
    "చెప్పను. చస్తే చెప్పను. ఇందాకటినించీ చెప్పీ చెప్పీ నా నోరు ఎండిపోయింది. కాస్త వేడి వేడి మిరపకాయల బజ్జీలు అంటూ ఈ పాపిష్టి ప్రాణి అలమటిస్తోంది" అన్నాడు వాసు.
    వెంకటేశ్వర్లు ఓ డజను మిరపకాయలతో అయిదు నిమిషాల్లో వచ్చి... తర్వాత తిందువు గాని చెప్పరా" ఆలస్యాన్ని భరించలేక. వాసు విన్పించుకోకుండా గబగబా నాలుగు తినేసి.
    "నోరు మండిపోతోంది. మంచినీళ్ళు మంచినీళ్ళు."        
    వెంకటేశ్వర్లు వళ్ళు మండిపోతోంది. కాస్త గట్టిగా యేదైనా అంటే "చస్తే చెప్పను" అంటూ లేచిపోయే మొండి ఘటం వాసు. అందుకే నమ్రత తెచ్చిపెట్టుకుంటూ.
    "సోడా తెమ్మంటావా?"
    "ఛీ....ఛీ.... సోడా సయించదు."
    "నీ బొంద సయించదు నా కళ్ళముందు ఎన్ని సార్లు తాగలేదు నాజేబూ ఎలాంటప్పుడు ఖాళీ చెయ్యచ్చో బాగా తెలుసు." పోనీ చెప్పకపోతే పోనీ అని తను వూరుకోలేడు. ఇలాంటి ఇంట్రష్టింగ్ విషయాలంటే తనకి తగని ఇష్టం. మైసూర్ పాక్ తింటున్నట్లు బాదంగీర్ త్రాగుతున్నట్లు జయలలితతో కాశ్మీర్ డాల్ సరస్సులో షికారు చేస్తున్నట్లు ఎంతో హాయిహాయిగా అన్పిస్తుంది. అసలు ఆ వాసు స్థానంలో తను వుండి అమ్మాయిల్ని యేడిపిస్తున్నట్లు ఆ అమ్మాయిలంతా వెంటబడి నేనంటే నేనని ముందుకు తోసుకు వస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. ధర్మదాత సినిమాలో" హల్లో ఇంజినీయర్ "అంటూ కాంచన తనవెంటేపడినట్లు పగటికలలు" టెక్నికలర్ లో కన్పిస్తూ వుంటాయి. తను ఆ కలల్లో జీవిస్తాడు జీవితంలో ఇవి తను ఎలాగూ సాధించలేడు. అంత ధైర్యం లేదు. కాదు అందమైన ఆడపిల్లలని ఆకర్షించే రూపం కూడా లేదు. అందుకే ఆ కలలలో నైనా సంతృప్తి పడకుంటే తన మనస్సు క్షోభిస్తోంది. తను అందగాడు కానంతమాత్రాన మనస్సులో కోరికలు లేకుండా వుంటాయా?

                                                      *    *    *

    

    హీరోలాంటి వాసు అంటే వెంకటేశ్వర్లుకి తగని ఇష్టం. ఎక్కువ చదువు వంటబట్టకున్నా వెంకటేశ్వర్లు నాంపల్లి సెంటర్లో "బందరు కిల్లీ షాపు పెట్టి అందులో పదిపైసలకి అద్దెకిచ్చే వారమాస పత్రికలూ అవీ అతని వ్యాపారాన్నీ  బాగానే నిలదొక్కుకునేలా చేశాయి. "వెంకటేశ్వర్లూ కిల్లీ షాపు భాగ్యానికి ఈ హైదరాబాద్ కి ఎందుకు బందరులో పెట్టుకుంటే పోలా" అన్నాడు ఓసారి. "నీముఖం.......చాపనోడివి నీకేం తెలుసు దీనిలో తిరకాసు. చెప్పనా .... బందరులోనే బందరు కిల్లీ షాపు అంటూ తెరిచానే అనుకో... అహ అనుకో.. అప్పుడు మన తెలుగు వాడెవడూ ఈ కిల్లీ వేసుకోడు. ఏ కొందరి సంగతో కాదు నే చెప్పేది అదే ఈ భాగ్యనగరంలో నాంపల్లి సర్కిల్ లాంటి సెంటరులో పెద్దపెద్ద అక్షరాల్తో "బందరు కిల్లీ" అనే పేరు చూసి ప్రతివాడూ కారు ఆపి ఓటి కొనుక్కుని నోట్లో వేసుకుని మరీ వెడతాడు. ఇంక 'అసెంబ్లీ' జరుగుతున్నప్పుడు మన ఆంద్ర సొంధరులు గుంపులు గుంపులుగా దిగుతారు. అప్పుడు నాకు వూపిరి పీల్చుకునేంత కూడా తీరుబడి లేదంటే నమ్ము. బలే గిరాకీ వుంటుంది. అందుకే ఓ అసిస్టెంటుని వేసుకుందాం అనుకుంటున్నా."
    తినే తినే మిరపకాయల పొట్లం అవతల గిరాటు కొట్టి యెగిరి గంతేశాడు వాసు,.
    వెంకటేశ్వర్లూ.....ఆండాళ్ళు సంగతి తర్వాత చెప్తాగాని, చెప్పటంకాదు ఓసారి నిన్ను తీసుకెల్లి "నా క్లోజ్ ఫ్రండ్" అని పరిచయం చేస్తాలే గాని ఒక్క సాయం చేసి పెట్టరా... నీ కెలాగూ అసిస్టెంటు కావాలి.... అదే... "ఇంక చెప్పకుండా నీళ్ళు నమిలాడు వాసు.
    చెప్పు. నీ యెరికలో యెవరన్నా వున్నారా!
    "ఆ...అదే....చెప్పేది....వున్నది ఒక అందమైన ఆడపిల్ల, చక్కగా "బాపూ" వేసిన బొమ్మ బాగా వుంటుంది. ఆ అమ్మాయినే నీకొట్లో వుంచావంటే నీ వ్యాపారం చూడు. నిమిషాల మీద. కిల్లీషాపు ఫాన్సీషాపు. అది బట్టల షాపు. అది అలా అలా పెద్దదై ద్వారకా హోటలంత పెరిగీ పెరిగీ... పెరిగీ...
    వాసుని .... లాగి కూర్చోపెట్టి అన్నాడు వెంకటేశ్వర్లు, "అందమైన ఆడ....పిల్ల.....నా కిల్లీ షాపులో... ఆఫ్ ట్రాల్ కిల్లీ షాపులో.... వుద్యోగం ఏపిల్ల చేస్తుందిరా సన్నాసీ నేనిచ్చే ముఫ్ఫైమూడు రూపాయలకి.
    అదంతా అనవసరం. వుద్యోగం ఇస్తావా లేదా? రెండే మాటలు. కాదు ఒక్కటే మాట. "ఇస్తాను" లేకుంటే "ఇవ్వను" అంతే.

   
    సీరియస్ గా ముఖం పెట్టాడు వాసు.
    "తప్పదియ్యా అయ్యేయస్ పరీక్ష రాసేటప్పటికే ఆఫీసర్ లక్షణాలు పట్టడ్డాయి. ఓవేళ సెలక్షన్ వస్తే....ఈ కిల్లీ కొట్టు వెంకటేశ్వర్లు గుర్తువుంటాడా" మిత్రుడివైపు గర్వంగా చూస్తూ అన్నాడు వెంకటేశ్వర్లు.
    వాసు సీరియస్ నెస్ యెగిరి చక్కాబోయింది.
    పనీ పాటా లేక పరీక్ష రాస్తే ఇంతలోనే సెలక్షన్ వచ్చేస్తుందా? అయ్యో రామ. అవన్నీ జరిగని మాటలు. ప=పోష్టుగ్రాడ్యుయేట్సు ఎక్కే గుమ్మం దిగేగుమ్మం కర్మే వుండదుగా ఇన్ని చెప్పుల జతలు అరిగే ఖర్మం అసలే వుండదు. ఈ డిగ్రీల వాళ్ళకే ఎన్ని చెప్పుల జతలూ చాలటం లేదు. ఓ పని చేస్తాం. సెలక్షన్ రాని. డబుల్ డిగ్రీల వాళ్ళం అందరం నాంపల్లి సర్కిల్ లో "బందరు కిల్లీషాపు" అన్నట్లు బందరు చెప్పుల షాపు అంటూ వరసగా పెట్టె..."
    వెంకటేశ్వర్లు వాసు నోరు మూసేశాడు.
    "శుభమా అంటూ పరీక్షలో సెలక్షన్ రావాలని మొక్కుకోవాలిగాని రాని నిర్భాగ్యులని గుర్తు చేసుకుంటూ వుసూరుమంటే ఎలా. చఛా నీ పద్ధతి బాగాలేదు. ఇదిగో ఈ వెంకటేశ్వర్లు చెప్తున్నాడు శ్రీశ్రీ వాసుదేవరావుకి తప్పకుండా సెలక్షన్ వస్తుంది. మన గవర్నమెంట్ సరాసరి ట్రైనింగ్ అవటంతోనే కృష్ణా జాయింట్ కలెక్టర్ గా సారీ డిప్యూటీ కలెక్టర్ గా ఆర్దర్సు వేస్తారు, అలా కాకపోతే ఇదిగో ఈ వెంకటేశ్వర్లు తిరుపతి వెంకటేశ్వర్లు కానేకాడు. ఈ పేరు తీసుకువెళ్ళి ఆ యేడు కొండలవాడి మొఖాన కొడతా... శపథం అంటే శపథం అంతే...
    "అబ్బో.... మంగమ్మ శపథం లా... హాస్యం పట్టించాడు వాసు.
    "నీ ముఖం మంగమ్మ ఆడది. నేను మగ మహారాజులుంగార్ని.
    సరేగాని వాసూ డజను మిరపకాయల బజ్జీలు లాగేశావు గాని ఆ ఆండాళ్ళు... నూతి దగ్గర....ఏం చేస్తోందో చెప్పావేకాదు. ఈ రోజు కంటినిండా నిద్రపోనీయదల్లే వుంది. చెప్పవయ్యా వాసుదేవయ్యా సాష్టాంగ పడ్డాడు వెంకటేశ్వర్లు.

 Previous Page Next Page