జీవనకలశం
సీరియల్
--గోవిందరాజు సీతాదేవి
"జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాతా"
సినిమా పూర్తి అయిపోయి జాతీయగీతం మొదలయింది. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు.
కాని అంతవరకూ వాసు ప్రక్కన కూర్చున్న అమ్మాయి మెల్లగా బైటికి వెళ్ళిపోతోంది. వాసు గబగబా అందరినీ తప్పించుకుంటూ ఆ అమ్మాయిని వెంబడించాడు, ఆ అమ్మాయి వేగం హెచ్చించింది.
ఇంక లాభం లేదని ఆ అమ్మాయి ఎడం చెయ్యి తన గుప్పెట్లో ఇరికించుకున్నాడు.
"ఏయ్.... మిష్టర్" ఆ అమ్మాయి కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. చెయ్యి గుంజుకోవటానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తోంది.
అప్పటికే ఆ ఇద్దరి చుట్టూ పెద్ద గుంపు పోగయింది.
"ఏమిటి?" "ఏమయింది?" అంటున్నారు అందరూ.
చూడండి....ఇతను ఎవరో నాకు తెలియదు. జబర్దస్తీగా చెయ్యి పట్టుకుంటున్నాడు...అసలు సినిమా చూస్తూ కూడా వెధవ వేషాలు వేస్తున్నాడు. ఒంటరిదాన్నని....గమనించి..."
ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు టపటపా రాలాయి. కాలర్ ఎత్తుకు తిరుగుతున్న నలుగురు కుర్రాళ్ళు వాసుమీద విరుచుకుపడ్డారు. "అరే. బద్మాష్....ఆడపిల్ల అంటే ఇంత చులకనా" అంటూ అలా జరుగుతుందని యేమాత్రం వూహించకపోయినా క్షణంలో సగం ఆలోచించిన అతనికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది.
రెండు చేతులతోనూ తన మీదకి వచ్చే కుర్రాళ్ళని వెనక్కినెట్టాడు. "భాయ్ ... ఈమె నా చెల్లెలు .... మధ్య మీరెందుకు, పొండి దూరంగా అంటూ ఆత్మరక్షణకి ఓ చిన్న అబద్ధం ఆడేశాడు.
"నిజంగానే.....ఏమ్మా... చెప్పు" ముగ్గురు ముసలమ్మలు ఆ అమ్మాయిని గుచ్చిచూస్తూఅడిగారు.
"కాదండీ...అతను యెవరో నాకసలు తెలియనే తెలియదు" తెలియదు అంటూ నెత్తీనోరూ కొట్టుకుంది ఆ అమ్మాయి.
పెద్దచిక్కే వచ్చిపడింది అక్కడి వాళ్ళకి, ఎవరిమాట నమ్మటం! కాదని ఆ అమ్మాయి వాదిస్తుంటే అవునని ఆ యువకుడు వాదిస్తున్నాడు. ఇది తేలే తగూలా లేదు.
"ఇంతకీ నీ చెల్లెలే అనుకో...బలవంతంగా లాక్కువెళ్ళవలసిన అవసరం?" మేనేజరు గర్జించాడు.
"చెప్పమంటావా!" అన్నట్లు చూస్తున్న వాసుపై ఖంగారుగా చూసి తల వంచేసింది.
"నువ్వు చెప్పవయ్యా పెద్ద మగాడివి..భయపడతావేం చెప్పకపోయావో పోలీస్ స్టేషనుకి లాక్కువెడతాం. ఇవాళ, రేపూ ఆడపిల్లలు బయటకి రావటానికీ భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళమూలకంగా మా కలెక్షన్సు ఎంత దెబ్బ తిన్నాయో తెలుసా?"
మేనేజర్ గొంతు చించుకుని అరుస్తున్నాడు. గుటకలు మింగాడు వాసు.
ఇదే అదను అనుకుని ఆ అమ్మాయి రెచ్చిపోయింది.
"నిజంగా నండీ. హాల్లో కూర్చున్నంతసేపూ ...వీడి రౌడీ వేషాలు చూస్తూనే వున్నా... కోరి వేషాలు వేస్తున్నాడు. ఎవరనుకున్నాడో."
"చెప్తావా... నాలుగు తన్నమన్నావా" ఈసారి మానేజర్ ముందుకు తోసుకువచ్చాడు.
అప్పటికే ఓ కుర్రాడు వాసు కాలర్ పట్టుకున్నాడు. వాసుకి కోపంతో వళ్ళు మండిపోయింది.
"రాస్కెల్... మీదకొస్తావ్..." అంటూ యెత్తి దూరంగా పారేశాడు. నాలుగ్గజాల అవతల పడ్డ అతను బట్టలకి అంటిన మట్టి దులుపుకుంటూ బూతులు తిడుతూ తిరిగి వాసుమీదకి వస్తున్నాడు. అతన్ని సపోర్టు చేస్తూ మరో ఇద్దరు ముందుకు దూకారు.
ఇంక లాభంలేదు అనుకుని ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కువెడుతూ మేనేజరుతో.
"చూడండి...ఇంక పరువుఅంటూ ఏం దాచను. ఓ రౌడీ వెధవతో లేచివచ్చి వారం అయింది. అమ్మానాన్నా దీనికోసం మంచం పట్టారు. అవతల పెళ్ళికి లగ్నాలు పెట్టుకున్నాం. నాలుగురోజులనించీ వెతికి వెతికి చివరికి ఇక్కడ పట్టుకున్నాను. నన్నుచూసి ఆ బద్మాష్ చల్లగా జారుకుని వుంటాడు. తనూ చాటుకుందాం అనుకుని మిమ్మల్ని నమ్మించాలని నాటకం ఆడుతోంది నాటకం."
"అబద్ధం... పచ్చి అబద్ధం" నోరుగట్టిగా కొట్టుకుంది అమ్మాయి. ఆ విచిత్రం చూస్తున్న నలుగురు అమ్మాయిలు.
"అతనినివి అబద్ధాలని అన్పిస్తోంది. పోనీ మాతో రా పోలీస్ కంప్లయింట్ ఇద్దాం"
అంటూ సానుభూతి చూపించారు.
"పోలీస్" అనేమాట వినేసరికి ఆ అమ్మాయి ముఖం తెల్లగా పాలిపోయింది.
గ్రహించాడు వాసు.
"...ఆ...అలాగే చెయ్యమనండి.... నేను రెడీగా వున్నాను. పదండి.... యేం వస్తావా....వస్తే నీ రహస్యం కాస్తా బట్టబయలు కాదూ!"
వ్యంగ్యంగా నవ్వాడు వాసు.
అప్పటికీ "ఏది నిజం" అనే నిర్ధారణ కి రాలేకపోయారు అక్కడివాళ్ళు, గుంపు మాత్రం పెద్దదయింది.
కొందరు ఆ అమ్మాయిని తిడుతుంటే, మరి కొందరు ఆ అమ్మాయిని తిడుతున్నారు.
ఆ అబ్బాయి చూస్తే బాగా చదువుకున్న వాడిలాగా వున్నాడు మరి ఆ అమ్మాయీ అలాగే కన్పిస్తోంది. ఏది నమ్మటం....అయినా మాయదారికాలం... అనుకుంటూ కొందరు పెద్దలు వెళ్ళిపోతున్నారు.
"స్టేషన్ కి తీసుకువెడుతున్నాను. మీ కెవరి కన్నా అనుమానం వుంటే నాతోరండి" అంటూ వాసు సవాల్ చెయ్యటంతో
"ఆ మా కిదేపని.... తెల్లారిలేస్తే ఇలాంటివి యెన్నో." అనుకుంటూ అందరూ చెదరిపోయారు.
వాసు ఆ అమ్మాయిని లాక్కువెళ్ళి ఓ రిక్షాలో కూలేశాడు. పబ్లిగ్గాడెన్ దగ్గర రిక్షావాడికి "డబ్బు" ఇచ్చేసి ఆ అమ్మాయిని యెవ్వరూ ఎక్కువగా లేని స్థలంలో కూలేశాడు.
అప్పటివరకూ ఆ అమ్మాయి కుడి చెయ్యి అతని పిడికిలిలో నలిగిపోతూనే వుంది.
ఇరవై సంవత్సరాల అందమైన యువతి స్పర్శ అతనిలో యే వికారాన్ని కల్గించలేదు. కాని కోపంతో కళ్ళు చింత నిప్పులను రాలుస్తున్నాయి.
"పారిపోవటానికి ప్రయత్నించవనుకుంటా. జాగ్రత్త ఇంత చిన్నవయస్సులో ఇంత నైపుణ్యాన్ని ఎలా నేర్చుకున్నావ్. ఏదీ తియ్...పర్సు... నీ జాకెట్. లోపల..."
అప్పటివరకూ అతను పోలీసుల దగ్గరకో మరెక్కడకో తీసుకువెడతాడని భయపడుతూ ప్రాణాన్ని అరచేతిలో వుంచుకుని కర్రలా బిగుసుకుపోయిన శరీరానికి మనస్సుకీ వూపిరి పోస్తూ బేలగా చూస్తూ వుండిపోయింది.
"తియ్... వూ"
కళ్ళు ఆర్పకుండా అతన్ని చూస్తూ వుండి.
"నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వాడిని ఆ నర్సు బైటకి లాగగలను. కాని....నువ్వు. నువ్వు స్త్రీవి..ఈ మాటను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. పోలేను తియ్..." గద్దించాడు వాసు.
ఆ అమ్మాయి జాకెట్టు అంతా చెమటతో తడిసిపోయింది. అరచేతులనించి నీళ్ళు కారుతున్నాయి. శరీరం సన్నగా వణుకుతూంటే మెల్లగా దాచిన పర్సు తీసి క్రింద పారేసింది. కాస్త నిర్లక్ష్యంగా చూస్తూ.
"దానిలో డబ్బు ఎంత వుందో లెక్కపెట్టు."
"అయిదు వందల నలభై ఏడు" పర్సులో పెట్టి అతని దగ్గరగా తోసేసింది. అప్పటికి ఏడు గంటలు దాటి వుంటుంది! దీపాలు వెల్తురులో అతని ముఖంలోని మెరుపు ఇంకా తగ్గలేదని తెలుస్తూనే ఉంది.
"ఎందుకోసం ఈ దొంగతనాలు? చూస్తే కొత్తగా ఈ వృత్తి ప్రారంభించినట్లున్నావు కదూ? చెప్పు" ఈ సంపాదన దేనికోసం?
"..............."
"టెరిలిన్ చీరలకా....గిల్టు నగలకనా? లేకుంటే రోజుకో నాలుగు సినిమాలు చూసేందుకా! లేకుంటే ఆ రంగు కళ్ళద్దాలు నీ దృష్టిని మలినపరుస్తున్నాయా! ఇంత చిన్న వయస్సులో ఇంత దౌర్భాగ్యపు పనులు ఎందుకు చేస్తున్నావ్.... చెప్పు..... ఇదిగో నా దగ్గర అబద్ధం చెప్పి "మస్కా" వేద్ధామని కలలో కూడా అనుకోకు. అబద్ధం చెప్పావా? చెప్పలేవు ఔనా? నిన్ను నెల రోజులుగా గమనిస్తున్నా ఆ రోజు నా పాంటుజేబులో పర్సు కొట్టేసి నప్పుడే గ్రహించాను. కాని తొందర పడుతున్నా నేమో అయినింటి ఆడపిల్లని అల్లరి పాలు చేసినట్టవుతుందేమో అని చాలా చాలా అలోచించాను. విధి వశాత్తు ఈ రోజు నువ్వు నన్ను చూడలేదు. నీ ప్రక్క యువకుడు నీ క్రీగంటి చూపులకి 'ఆయిస్' అయిపోయి పర్సు పోయింది కూడా చూసుకోకుండా నీ స్పర్శ సుఖంలో అన్నీ మర్చి మత్తుగా ఇంటికి వెళ్ళి పోయాడు. బహుశా ఇప్పటికి వళ్ళు తెలిసి వుంటుంది. "ఓసీ రాక్షసీ అంటూ శాపనార్ధాలు పెడుతూ వుంటాడు. మళ్ళీ ఎక్కడైనా తటస్థపడ్డావో అప్పుడు నీ గతి..." ఆగిపోయాడు వాసు.
అప్పటికి ఆ అమ్మాయి మోకాళ్ళమీద తల వుంచి వెక్కి వెక్కి యేడుస్తోంది. "ఇదిగో...స్త్రీకి కన్నీళ్ళు కొంత రక్షణ కల్గిస్తాయేమో కాని నీలాటి వాళ్ళకి....కాదు. మన భారత దేశంలో స్త్రీ ఎంత పూజనీయురాలు? అలాంటిది నువ్వు ఆ జాతికి తలవంపులు తెస్తూ ఇలాంటి పనికి పాల్పడితే ఇంక గౌరవం ఏం నిలుస్తుంది? ఇలాంటి పరిస్థితికి పురుషులు సిగ్గుతో చచ్చిపోవాలి. ఛీ...ఛీ....నీకు తల్లి దండ్రులు లేరూ! అన్నదమ్ములు లేరూ... పోనీ భర్తన్నా లేడూ అసలు వెళ్ళయిందా లేదా?"
అతని కంఠంలో అంతవరకూ వున్న కాఠిన్యంపోయి వ్యధ వ్యక్తమయింది. అది గ్రహించిన మాలతికి మరీ దుఃఖం ముంచుకొచ్చింది.
"నీ పేరు"
"మాలతి"
"ఎంత మంచిపేరు. కాని ఆ మంచితనాన్ని మలినపరుస్తున్నావు, నీ తల్లి దండ్రులు ఇష్ట పడుతున్నారా ఇలా అందరి జేబూలూ కొట్టలా నికి?"
".... ..... ... ..."
"ఇలా చేస్తూ ఏదో ఒకరోజు పోలీసు చేతుల్లో చిక్కితే నీలాంటి ఆడపిల్లగతి ఏమవుతుందో కాస్తన్నా ఆలోచించారా మీ పెద్ధవాళ్ళు. మాట్లాడవేం?"
".... .... ...."
"మాలతీ.... చెప్పు.... నీ భవిష్యత్తు ఎలా మారుతుందో ఆలోచించే ఈ వృత్తిలో దిగావా అని అడుగుతున్నాను నీ చుట్టూవున్న ప్రపంచాన్ని కాస్తచూడు. ఆడపిల్లలు ఇలాంటి పనులా చేసేది.... ఛీ... ఛీ... పొట్టగడప కుంటే డబ్బు సంపాదనకి మరేదారీ లేదూ? చదువుకుంటే వుద్యోగం దొరకలేదూ? తల్లీ దండ్రీ లేరూ.... చెప్పు. నా మాటకి జవాబివ్వు."
".... .... .... ..."
"నా ప్రశ్నలకి జవాబివ్వకుంటే ఏం చేస్తానో తెలుసా! పోలీసులకి అప్పచెప్పి నా దారిన నేను పోతాను"
"వద్దు....వద్దు" రెండు చేతులతోనూ దణ్ణం పెడుతూ అంది.
"మరి చెప్పు ఏ పరిస్థితిలో ఇలాంటి పనికి తలవొగ్గావు."
"ఏ పనీ చెయ్యటానికి చేతకాక? ఏ దారీ దొరకక.....ముసలితండ్రి పక్షవాతంలో మంచంలో పడి మ్రగ్గుతూవుంటే కాస్త గంజికి డబ్బులేక.... ఇంక చాలా అన్నట్లు చూసింది మాలతి.
వాసు చేతులు నలుపుకుంటూ ఇటూ అటూ పచార్లు చేస్తూ అన్నాడు. కేవలం దరిద్రమే కారణ మైతే. బ్రతకటానికి ఎన్నోదారులు వున్నాయే అవన్నీ వదిలి ఈ పనే చెయ్యాలా?"
"మీరు ఏ పనన్నా ఇప్పించగలరా!" ఆశగా చూస్తూ అడిగింది.
వాసు క్షణం ఆలోచించాడు. ఏదైనా పని ఇప్పిస్తే ఈ దొంగతనాలు మానేస్తుంది. కాని..తనే ఓ నిరుద్యోగి వుద్యోగం ప్రయత్నంలో ఇప్పటికి ఎన్ని జతల చెప్పులు అరిగిపోయినాయో. ఈ మహాపట్నంలో ఇన్ని లక్షల మంది నిర్విరామంగా శ్రమిస్తూ క్షణం తీరుబడి లేనట్లు పరుగు లెత్తుతూ పనులు చేసుకుంటున్నారు. కాని తనకి యే పనీ దొరకలేదు. బి.ఎ పాసై యం. ఏలో జాయిన్ అయ్యేప్పుడు యెన్నో కోర్కెలు తనలో క్లాసు తెచ్చుకుని ఐ.ఏ. యస్ కి కట్టి సెలక్షన్ వచ్చి ఏ డిప్యూటీ కలెక్టరో అయిపోవాలనీ అవుతాననీ కలలుగన్నాడు. కష్టపడి చదివి క్లాసు తెచ్చుకున్నాడు. తీరా వుద్యోగాన్వేషణలో తెలుస్తోంది తన డిగ్రీకి వున్న విలువ.
తల్లి ఒంటిమీద బంగారం తండ్రి మిగిల్చి వెళ్ళిన ఎకరం పొలం అన్నీ ఆఖరైన తర్వాత పూర్తి అయింది తన చదువు. నేను మగాడిని గనక దొరకలేదు. ఈ అమ్మాయి ఆడపిల్ల అందులో అందమైన ఆడపిల్ల, ఏదో ఒకటి దొరక్కపోతుందా! ప్రయత్నిస్తాను అనుకొని. "ఎంతవరకూ చదువుకున్నావ్" అన్నాడు.
"..............."
"ఇంగ్లీషు టైపూ వస్తే..."
".........."
"మరేం వచ్చు."
"................"
"టైపూ రాదు... మరేం రాదు.... పోనీ అంట్లు తోమటం వచ్చా?" కసిగా చూస్తూ అన్నాడు.
గభాలున "రాదు" అన్నట్లు తల అడ్డంగా తిప్పబోయి టక్కున ఆగి "వచ్చు" అన్నట్లు తల వూగించింది.
వాసుకి వళ్ళు మండిపోతోంది ఈ అమ్మా యిని చూస్తే. చదువురాదు సంధ్య రాదు. ఒట్టి చూపుల గొడ్డు" అనుకున్నాడు.
"ఇంక వెడతాను" అంటూ వాసువైపు బెదురుతూ చూస్తూ అంది.
"ఆ పర్సు అక్కడే వదిలి వెళ్ళిపోతావేం..తీసుకో....అది తీసుకుని అతనికిచ్చేయ్.
"అమ్మయ్యో" గుండె పట్టుకుంది.
"ఏం దొంగతనం చేసేటప్పుడైనా అంతగా భయపడని నువ్వు ఇవ్వటానకి ఎంత భయం"
తల వంచేసింది మాలతి.
ఇంతలో వాసు స్నేహితుడు వెంకటేశ్వర్లు "వాసూ అంటూ అటే వస్తున్నాడు.
మాలతి ఈ సమయం చూసుకుని మెల్లగా చీకట్లోకి జారుకుంది. అక్కడే పడివున్న పర్సు వాసుని పల్కరించింది. నేనిక్కడేవున్నా.