Previous Page Next Page 
జీవనకలశం పేజి 3


    ఇంక లాభంలేదు చెప్పితీరాల్సిందే అని మనస్సులో అనుకుని. సరే... అలాగే... కాసిని గరంగరం "పల్లీలు" పట్రా తింటూ చెప్తాను." నిజంగా చెప్పేసి ఇంటికి వెళ్ళి నిద్ర పోవాలి.
    మరి తప్పదని కాళ్ళీడ్చుకుంటూ పల్లీలు తెచ్చి వాసు దోసిట్లో పోశాడు. వెంకటేశ్వర్లు.
    వాసు తింటూ వెంకటేశ్వర్లు వునికినే మరిచినట్లు నటిస్తూంటే.
    "ఒరే నాన్నా నీ నాటకాలు కట్టిపెట్టు. నువ్వు నిరుద్యోగివి. అందుకుతోడు బ్రహ్మచారివి....నాలాంటి గృహస్థు బాధలు నీకేం తెలుస్తాయి తెలియవ్.... గనక వెంటనే చెప్పు. ఇప్పటికే మా నూరేకారం కర్రూబుర్రూ అంటూ వుంటుంది. తొందర పెట్టాడు వెంకటేశ్వర్లు.
    వాసు పల్లీలు అన్నీ తినేసి షర్టు దులుపు కుంటూ లేచి.
    వెంకటేశ్వర్లూ అసలు నాకు తెలియక అడుగుతా....గృహస్థుకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి తగునా. అంటూ అందకుండా పారిపోయాడు.
    ఓరి నీ తెలివీ ఎంత మస్కా వేసి ఆఠాణా అన్యాయంగా "లాస్" చేశావ్ వుండు. నీ పని రేపు  చెప్తా అంటూ అక్కడనించి కదిలి తన భారమైన శరీరాన్ని ఇంటికి చేరేశాడు వెంకటేశ్వర్లు. వాసూ, వెంకటేశ్వర్లూ బాల్య స్నేహితులు.

                                *    *    *

    మెల్లగా ఇల్లు చేరాడు వాసు.
    వదిన శ్రీలక్ష్మి కొసరి కొసరి వడ్డిస్తున్నా వాసుకి ముద్ద గొంతు దిగటం లేదు.
    "ఇంత పొద్దుపోయె వరకూ ఎక్కడ తిరుగుతున్నట్లు?" అంటూ కబుర్లలోకి దిగింది. శ్రీలక్ష్మి.
    వాసు అన్న రాఘవరావు అసహనంగా ఇటూ అటూ పొర్లుతున్నాడు మంచంమీద. వాసు భోజనం చేసి ముందు గదిలోకి వెడితేగాని శ్రీలక్ష్మి తలుపు వేసి పడుకునేందుకు రాదు.
    రైలు కంపార్టు మెంటు లాంటి ఆ ఇంటికి నూట యాభై అద్దె ఇస్తున్నారేగాని సౌకర్యం చాలా తక్కువ. వంట యిల్లుకాక రెండే గదులు.
    భోజనం చేసి పక్కమీద చేరి ముసుగు పెట్టాడు వాసు. పాంటు జేబులోని ఖాలీ పర్సు అతని తెలివి తక్కువతనాన్ని పరిహసిస్తున్నట్లు పగలబడి నవ్వుతున్నట్లు అన్పించి మరీ ఉక్రోషం వచ్చి దిండు విస్సురుగా నేలకి కొట్టాడు కిటికీ తలుపు విస్సురుగా వేశాడు. మూలగా వుంచిన చాపని కాలితో తోసి పారేశాడు అయినా కోపం తగ్గటం లేదు.
    అసలు ఆ పర్సులో డబ్బు ఎలా మాయం చేయగలిగింది మాలతి. చాలా ఆశ్చర్యంగా వుంది. దానిలో డబ్బు అలాగే వుంచి తనకి భయపడి అక్కడే పారేసి వెళ్ళింది. పాపం ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని పర్సు ఇచ్చేయాలని అనుకున్నాడు, ఆ పిల్లని చూసిన దగ్గరనించీ జాలి కల్గుతోందే గాని కోపం రావటం లేదు. ఎందుచేత? కాని ఇప్పుడు తల్చుకుంటే మాత్రం చచ్చేంత కోపం వస్తోంది. తన కళ్ళల్లోనే కారం కొట్టిన రాక్షసి.
    చూడడానికి ఎంత అందంగా వుంది? పెద్ద కుటుంబంలోని పిల్లల్లాగ అలంకరణ చూసే మొదటిసారి మోసపోయాడు. ఈ సారి ఇంక ఆ పప్పులు వుడకవ్ అనుకున్నాడేగాని తెలియకుండానే బోల్తాబడ్డాడు.
    "వెధవ పర్సు" అంటూ పాంటు జేబులోనించి విసిరికొట్టాడు. అంతలోనే గుర్తు వచ్చింది. అమ్మయ్యో. ఇది ఇది ఎవరన్నా చూస్తే కొంపలు అంటుకుంటాయి అనుకుని దాచేసి స్థిరంగా ఓ నిర్ణయం చేసుకున్నాడు.
    ఏమైనాసరే ఆ మాలతిని పట్టుకుని పోలీసు లకి అప్పచేప్తేగాని తన మనస్సుకి శాంతి వుండదు.
    ఆలోచనల్లో అశాంతిగా నిద్రపట్టింది వాసుకి.
    రాఘవరావు స్నేహితుడు మదన్ మోహన్ వుదయమే వచ్చాడు. మిత్రుడి కోసం.    
    రాఘవరావు స్నానం చేస్తున్నాడు.
    శ్రీలక్ష్మి మదన్ కి కాఫీ తెచ్చి ఇచ్చి చెప్పింది. "ఇప్పుడే వస్తారు." అంటూ కాఫీతాగుతూ మదన్ వులిక్కిపడ్డాడు.
    ఓ మంచం చాటున రాఘవరావు కూతురు వీణ పక్కయింటి ఆరేళ్ళ కుర్రాడు సీనుతో ఆటలాడుతోంది. వీణ చేతులో తన పర్సు చూస్తే మరి వులిక్కిపడక ఏం చేస్తాడు? ఆ క్రితం రోజు అయిదువందల రూపాయలతో సినీమాహాల్లో పోయినపర్సు ఈ చిన్నపిల్లదగ్గర కన్పిస్తే అతనికి మతేపోయింది. ఓ పక్కన తనది కాదేమో అనే సందేహమూ పీకుతోంది.
    "వీణా... పర్సు ఎంత బాగుందమ్మా....నీకెక్కడిదీ" సగంతాగిన కాఫీ అక్కడే వదిలి వీణతో కబుర్లలోకి దిగాడు మదన్.
    "వుండు అంకుల్....బాబుకి ఆకలేస్తోందిట పాలు పడుతున్నా" అంటూ ఆటలో బొమ్మ పాపాయికి పాలు పడుతున్నట్టు నటిస్తోంది వీణ.
    పర్సు చేతిలోకి తీసుకుని తీసి మరీ చూచాడు. సందేహం లేదు తనదే.... తన ఫోటోకూడా ఇంకా అలాగే వుంది.
    ఇది ఇక్కడికి ఎలా వచ్చినట్లు? మెల్లగా వీణతో కబుర్లలోకి దిగి "వీణా ఇది నీ కెవరిచ్చారమ్మా... చెప్పు. సాయంకాలం బోలెడు చాక్ లెట్లు తెస్తాగా చెప్పు." అంటూ.
    "అయ్యో అంకుల్....అదెందుకు తీశావూ... చిన్నాన్నజేబులో వుంది. నాక్కావాలని అడిగితే ఇవ్వను "తీశావా తంతాను" అంటూ నీళ్ళుపోసుకోటానికి వెళ్ళాడు. వెళ్ళిం తర్వాత మంచం ఎక్కి నేనే తీశాను అంకుల్ మరి పర్సు లేందే... సీను ఆఫీసులో జీతం ఎలా తెస్తాడూ. జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టెయ్యరూ"
    వీణ ఏవేవో చెప్తోందిగాని మదన్ బుర్ర వేడెక్కిపోతోంది.
    "ఒరే సీనూ ఆఫీసుకి వెళ్ళి జీతం తీసుకురా. చిన్నాన్నవస్తే మన ఇద్దరినీ తంతాడు. అంటూ అరుస్తోంది వీణ. భుజం మీద పాపాయి బొమ్మని కాళ్ళమీదకి మార్చుకుంటూ.
    ఇదే ఇంకెప్పుడయినా అయితే ఆ బుల్లి సంసారంలోని ఆనందంలో మదన్ కూడా పాలు పంచుకునేవాడు.కాని ఇప్పుడు...
    "సారీ మదన్.... కాస్త ఆలస్యం అయింది. మరి బయటికి వెడదామా. నీ స్కూటర్ తెచ్చావా లేకుంటే నాది తీసుకు వెడదామా! శ్రీ... కప్పూ సాసరూ లోపలపెట్టు" అంటూ రాఘవరావు వాచ్ బెల్టు పెట్టుకుంటూనే మాట్లాడుతున్నాడు.
    జవాబివ్వని మిత్రుడి ముఖంలోకే చూస్తూ "అరే... అలా వున్నావేం.... పర్సు దొరకలేదు గదూ?"
    "దొ....రి....కింది"
    "ఆ.... నిజంగా ఎప్పుడూ.... ఎక్కడ....? నీ కష్టార్జితం ఎక్కడికీ పోదని నేను చెప్పటంలా సంతోషంలో మాట్లాడుతున్నాడు. రాఘవరావు.
    "మదన్ చెప్పు ఎక్కడ దొరికింది?"
    "ఇప్పుడే... ఇక్కడే... ఖాళీ పర్సు కన్పించింది."
    రాఘవరావు తెల్లబోతూ అడిగాడు.
    "ఏమిటీ... ఇప్పుడే... ఇక్కడే.... ఖాళీ పర్సు దొరికిందా!"
    "అవును... వీణ ఆడుకుంటూంది."
    తనని అనుమానిస్తూన్నాడేమో మిత్రుడు అని అంతలోనే కోపంతో ఎర్రబడ్డ రాఘవరావు ముఖం వీణ చేతులోని పర్సులోనించి మదన్ ఫోటో క్రిందపడేసరికి అమాయకంగా చూస్తూ వుండి పోయాడు.
    "రాఘవా..." అంటూ ఏదో అడగబోయి మిత్రుని చూసి మాట్లాడలేకపోతున్న మదన్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని వూపేస్తే అడిగాడు.
    "ఏమిటిదంతా." ఏం చేశావు నువ్వు... మా ఇంట్లోకి నీ పర్సు ఎలా నడిచి వచ్చింది," ఆవేశంగా అంటున్నాడు రాఘవరావు.
    ఇక్కడ స్నేహితులిద్దరూ ఇలా సతమత మవుతూంటే వాసు వంట ఇంట్లో వదినగారి దగ్గర "గారాబం" పోతున్నాడు.
    ఆండాళ్ళు ఓ చిన్న స్టీలుగిన్నె పట్టుకుని.
    "లక్ష్మిగారూ దీనితో పంచదార ఇమ్మంది మా అమ్మ" అంటూ వాసుని చూస్తూ మెలికలు తిరిగిపోతూ బోలెడు సిగ్గుపడిపోయింది.
    ఇలా అనవసరంగా సిగ్గుపడే స్త్రీలంటే వాసుకి పరమ అసహ్యం.
    ఆండాళ్ళని చూడాలని టిప్ టాప్ గా ముస్తాబయి వచ్చిన వెంకటేశ్వర్లు గదిలోనించి కొత్త గొంతులు ఆవేశంగా విన్పించటంతో అక్కడే ఆగిపోయాడు.    
    విషయం అర్ధమయీ అవకుండా వుంది.
    రాఘవరావు తమ్ముడిని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు.
    అక్కడి వాతావరణం అప్పటికే వేడెక్కి పోయింది. అన్ని వాటాల్లో వాళ్ళూ పరుగెత్తు కొచ్చారు.
    "ఏమిటేమిటి?" అంటూ.
    వాసు కళ్ళప్పజెప్పి ఆ ఖాళీ పర్సుని చూడటం తప్ప మరో జవాబు లేదు.
    షర్టు లేకుండా కట్ బనీనులో అతని అందాన్ని చూస్తూ వుండిపోయింది. ఆండాళ్ళు.
    "అసలేం జరిగిందో చెప్పునాయనా" అంటూ శ్రీలక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
    రాఘవరావు కళ్ళు విస్పులింగాలు విరజిమ్ముతున్నాయి.
    పోలీస్ వ్యాను ఆగటం వాసుని ఎక్కించు కొని సాగిపోవటం చూస్తూ నక్కివున్న వెంకటేశ్వర్లు కుప్పలా కూలబడ్డాడు. అంతలోనే ఏం ఆలోచన వచ్చిందో లేచి పరుగెత్తాడు.
    వాసుని లాకప్ లో వుంచారు ఇన్ స్పెక్టర్ ఎలాగైనా ఈ కేసు పైకిపోనీయకూడదని ఎన్నోవిధాల ప్రశ్నించాడు.
    అసలు వాసు దొంగతనం చెయ్యవలసిన అవుసరం ఏం లేదే? చేశాడంటే నమ్మకం కూడా లేదు.    
    కాని విషయంయేమిటో చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడో రాఘవరావుకి తల పగలగొట్టుకున్నా అర్ధం కావటంలేదు.
    తమ్ముడిని నోటికి వచ్చినట్లు తిట్టేశాడు.
    "వాసే తీసినా అయిదువందలు ఒక్క రాత్రిలో ఎలా ఖర్చు పెట్టినట్లు" మదన్ కి అర్ధం కావటం లేదు. ఏమయినాసరే దీని అంతు తేల్చేసుకోవాలి అనుకుని మదన్ పట్టు విడవటం లేదు.
    వాసు. విషయం చెప్పటం లేదు.
    ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడు రాఘవరావు.
    'ఇలా అయితే నేచెయ్యగలిగింది లేదు. కోర్టులో హాజరు పర్చడం తప్ప" ఇన్ స్పెక్టర్ విసుక్కున్నాడు.
    "ఇన్ స్పెక్టర్ గారూ.... ఇదిగో డబ్బు.. ఇది ఆయన తియ్యలేదు. నేను తీశాను" వణుకుతూ ముందుకు వచ్చింది మాలతి.
    వెంకటేశ్వర్లు ఏం జరుగుతుందో అని నక్కి నక్కి చూస్తున్నాడు.
    "నన్ను ఖైదు చెయ్యండి." అంటూ చేతులు ముందుకు చాచింది మాలతి.
    "మాలతీ... మాలతీ"
    అంటూ కలవరిస్తున్న వాసుని తట్టి లేపింది లక్ష్మి.
    వాసుకి మెలుకువ వచ్చింది. పూర్తిగా రైల్వే కంపార్టు మెంటు లాంటి అన్నయ్య ఇంటి మూడో గదిలో తను రోజూ పడుకునే పరుపు మీదే వున్నాడు.
    "ఏమిటీ నేను పోలీస్ స్టేషనులో లేనూ..ఇదంతా కలా' అనుకుంటూ రాత్రి తను భద్రంగా దాచిన ఖాళీ పర్సుకోసం జేబులు తడుముకున్నాడు. చేతికి తగిలింది. నేనిక్కడ భద్రంగానే వున్నా నంటూ "అమ్మయ్య ఎలాంటి పాడుకల గన్నామా" అనుకుంటూ గ్లాసుడు నీరు తాగేశాడు. కాస్త ప్రశాంతత చిక్కింది.
    తననే విచిత్రంగా చూస్తున్న వదినగార్ని అప్పటికి గమనించి సిగ్గుపడిపోతూ.
    "ఎందుకలా చూశావ్. వెళ్ళి పడుకో. ఇంక కలవరించనులే." అంటూ ముసుగు బిగించేశాడు.
    "పగలంతా గాడిదలాగా తెగతిరిగి రాత్రి కలవరిస్తూ ఇల్లు యెగరగొడుతున్నాడు వెధవ" అంటున్న అన్నగారి గొంతు ఇంక విన్పించ కుండా రెండు చెవుల్లోనూ వేళ్ళు దూర్చేశాడు.
    ఎందుకంటే...అన్నగారు ఆపైన అనబోయే మాటలు తనకి తెలుసు గనుక ఆ భార్యా భర్తల సంభాషణ అటుతిరిగి యిటు తిరిగి ఏ వైపుకి మళ్ళుతుందో వాసుకి బాగా తెలుసు. భార్యా భర్తలు ఏకాంతంగా మాట్టాడుతూంటే వినకూడదని చిన్నప్పుడు బామ్మ చెప్పినమాట తు. చ తప్పకుండా అమలుచేస్తున్నాడు వాసు.

                                  *    *    *

 Previous Page Next Page