ఎండమావులు
---హరికిషన్
కార్తీక మాసం ఎముకలు కొరుకుతున్న చలి. చలికి తోడు కొంచెం ఈదురు గాలి. అలాంటి సమయంలోనే జానకిరాం కృష్ణానదికి స్నానానికి బయల్దేరాడు.
అప్పటికి తెల్లవారు ఝామున నాలుగ్గంటలు దాటింది. ఎందుకనో ఆ రోజన వీధుల్లో విద్యుద్దీపాలు లేవు. కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటైనా, అక్కడక్కడా అప్పుడే తీస్తున్న కాఫీ హోటళ్ళ తాలూకు విద్యుద్దీపాలు ఆ చీకటిని చీల్చుకుని వెలుగుని ప్రసాదిస్తున్నవి.
అలాంటి సమయంలోనే ఇంకా చీకటి రోజుల్లోనే జానకిరాం స్నానానికి బయల్దేరిన రోజులున్నాయ్. కాని ఆ రోజున అతని కెందుకనో భయం వేసింది. అయినా కాలు కూడదీసుకుని, మనస్సులో దైవ ప్రార్ధన చేసుకుంటూ ఎట్లాగయితేనేం, స్నానాల రేవుకు చేరాడు. అప్పటి కతని భయం పటాపంచలయింది. కారణం తనమాదిరే ఎంతోమంది కార్తీక స్నానానికి వచ్చారు. సంభావన బ్రాహ్మణులు కృష్ణా జివాలూ, తాటాకు చదరలూ పర్చి, లాంతర్లు పెట్టుకుని, విభూతి రేఖలు తీర్చిదిద్ది, రుద్రాక్షలు మెడన ధరించి, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు తీర్చిదిద్ది, ధర్మాత్ముల కోసం, స్నానం చేసి వచ్చే అందరి ముఖాలవైపూ పరికించి చూస్తున్నారు. ఏ మహానుభావుడైనా, ఏ పుణ్యాత్మురాలైనా, ఏ వితంతువైనా, ఏ పెద్ద ముత్తయిదువైనా, ఒక తోటకూర కట్టతో ఒక అణా డబ్బు లైనా ధర్మం చెయ్యరా అని.
జానకిరాం కాసేపు అటూ, ఇటూ చూసి తానేరు కున్న బ్రాహ్మడికి సంచీ వప్పజెప్పి, కొల్లాయి కట్టుకుని కృష్ణలోకి దిగాడు. కొంకర్లు పోయే టంత చలిలో ఆ చన్నీళ్ళు ఒక్కసారి కరిచినట్లయినా, ఒక్కసారి బుడుంగుమని ముణిగేసరికి ఆ చలి కాస్తా ఆ నదీ ప్రవాహంలోనే కొట్టుకు పోయి నట్లయింది.
నదిలో ఒక్కసారి ముణిగి లేచిన జానకిరాం "జీవితపు లోతుల్ని చవిచూసి సంసారమనే చలిగాలి తాకిళ్ళకు తట్టుకుంటూ, జీవితాంతం ఆ చలిగాలిలోనే జీవయాత్ర సాగించవలసిన నాకు ఇంకా ఈ చలి బాధ ఏమిటి" అని అనుకున్నాడు మనస్సులో.
స్నాన సంధ్యలు పూర్తిచేసి రాగి చెంబులో నీళ్ళు తీసుకుని శివాలయానికి బయల్దేరాడు జానకిరాం.
తలవంచుకు నడుస్తూ వస్తున్న జానకిరాం ని దారిలో ఒక స్త్రీ పలకరించింది.
"స్నానం చేసి వస్తున్నావా బాబూ"
జానకిరాం తలెత్తి చూశాడు.
"నువ్వా స్వాతీ, కులసా, స్నానానికి వెళ్ళు తున్నావా, అన్నయ్య ఊళ్ళో ఉన్నారా" అన్నాడు జానకిరాం.
"ఆ కులాసానే. ఆయనగారి విషయం నీకు తెల్పిందేగా. పుస్తకాల పురుగు కదూ. అది నువ్వు పెట్టిన పేరే" అన్నది నవ్వి.
"పోనీలే వదినా! అదో రకమైన కాలక్షేపం. జీవితంలో ఒక చెడు ఎప్పుడయితే ఉంటుందో ఒక మంచి కూడా అప్పుడే ఉంటుంది. అమావాస్య తరువాత పౌర్ణమి రాకపోతుందా" అంటూనే ముందుకు సాగాడు జానకిరాం.
మౌనంతో తలవంచుకుని స్నానాల రేవు వైపు వెళ్ళింది స్వాతి.
శివాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించి, తన మనస్సులోని ఆందోళనను వెలిబుచ్చుకుని, బరువు తీరినట్లుగా నిట్టూర్పు విడిచి, బరువుగానే అడుగులు వేసుకుంటూ ఇంటివైపు వెళ్ళాడు జానకిరాం.
ఇంటికి వెళ్ళగానే భార్య కన్నీళ్ళతోనే స్వాగతం ఇచ్చింది.
"కన్నీళ్ళెందుకు గౌతమీ"
"నా జీవితానికి మిగిలినవి అవే కదూ, ఆ కన్నీళ్లు తెచ్చుకోటానికి కృష్ణకు వెళ్ళ నక్కర్లేదుగా" అన్నది గౌతమి కళ్ళొత్తుకుంటూ.
మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళాడు జానకిరాం. భర్త ననుసరించింది గౌతమి.
మానవ హృదయాలు ఎరిగినవాడే భగవంతుడు. భగవంతుని లీలను ఎరిగినవాడే భక్తుడు. ఆనందం వేరు. సుఖం వేరు, సుఖ శారీరక సంబంధ మైనదిగా భావించవచ్చు. ఆనందం మానసిక సంబంధమైనది. మనస్సుకి ఎప్పుడయితే ఆనందం లేదో అప్పుడు శారీరకంగా సుఖ మనుభవించినా అది మనస్సుకు పట్టదు.
"ఏం జరిగింది గౌతమీ"
"ఈ కార్తీక మాసానికి నేను కాపురాని కొచ్చి అయి దేళ్ళు దాటింది. ఈ అయిదేళ్ళ నుంచీ మీరూ, మీతో బాటుగా నేనూ సుఖ సంతోషాలతో ఆనంద మనుభవిస్తూ, సంచరిస్తున్నమే గాని, ఈ ఇల్లు గడపటానికి మన వల్ల వీస మెత్తు కూడా ఉపయోగం లేదుట. దీని కంతటికీ కారణం మీకు ఉద్యోగం చెయ్యాలనే దృష్టి లేకపోవటమే కదండీ. మీరూ నాలుగు డబ్బులు సంపాదించి మీ నాన్నగారికి చేదోడుగా ఉంటే ఎంత బావుంటుంది. యూనివర్శిటీ డిగ్రీ పుచ్చుకుని, నలుగురిలోనూ తెలివి గలవారనిపించుకుని విద్యార్ధి జీవితంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న మీరు ఈ విధంగా మారి పోతారని ఎవ్వరూ అనుకోలేదు. ఇంతకీ నారాత ఇట్లా ఉంది" అన్నది గౌతమి.
"ఇది మామూలు సంగతేగా గౌతమీ. ఈ విషయమే నీకింత కన్నీరు తెప్పించిందా" అన్నాడు జానకిరాం.
గౌతమి ముఖంలోని మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది.
గౌతమి మాట్లాడకుండానే అవతలకి వెళ్ళి పోయింది. కార్తీక పురాణం చదువుదామనిపించింది జానకిరాంకి. పుస్తకం తీశాడు.
"కార్తీక మాసమందు అవిశ పూలనుచేదండలుగా గ్రుచ్చి, వాటిని మాధవుని కంఠము నలంకరింప జేసినవారు కుబేర సదృశృడగు ధనముకలవాడగును. శ్రీ మహా విష్ణువును తులసీ పత్రము లచే పూజించిన వానికి విష్ణులోకప్రాప్తి కలుగును. మరియు కార్తీక మాసమున ఒక్క అది వారమైనను నదీస్నాన మాచరించిన వారికి, ఆ నెల దినములు స్నాన మాచరించిన వానికి గలుగు ఫల ముతో తుల్యమగు ఫలితము లభించును. శ్రీ మహా విష్ణువును భక్తియుక్తుడై పూజ చేసిన వారు సూర్య మండలముగుండా పోయి, పరమ సుఖవంతులగుదురు. శ్రీ మహా విష్ణువును తులసీ పత్రము లచే పూజించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగును. శ్రీ మహా విష్ణువు నర్పించుట యందు సహాయ మొనర్చిననూ' అధికమైన భక్తితో పూజలు చేసిననూ భక్తులు వెలిగించిన దీపములు చూసి ఆనందించిననూ పరలోకానందము కల్గును. స్వర్గాది సుఖము లనుభవించి, ధ్రువలోక గతులగుదురు"
పుస్తకం మూసి తలెత్తి చూశాడు జానకిరాం. గుమ్మం ముందు తల్లి నిలుస్తుంది ఆమె కొడుకు ఏం మాట్లాడుదామని వచ్చిందో ఆ సంగతే మర్చిపోయింది. మాతృ ప్రేమ మంచినే కోరినప్పటికీ, కొన్ని కొన్ని సమయాల్లో వ్యధిత హృదయురా లవతంచేత నిస్పృహతో కూడిన చిరాకునూ, అయిష్టతనూ కూడా కడుపులోనుంచి వెలికి తెచ్చుకుని, ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా బిడ్డల మీద వెళ్ళగక్కక తప్పదు. యదార్ధ విషయాలు మనస్సును కెలికి బాధించటం చేత ఆమె కొడుకును నాలుగు అడిగి, అతన్ని ప్రయోజకుడిగా చెయ్యాసరికి ఆమె ఆలోచనలన్నీ మంచువలే కరిగిపోయి నయ్యి. ఆ కరగిన చల్లని మంచు నీళ్ళు జానకిరాం శరీరానికి తాకినట్లయి అతనికి కొంచం వణకు పుట్టించినట్లయింది.
"ఏమమ్మా" అంతకన్న ఏం మాట్లాడాలో అతనికి తోచలేదు.
"రామా......" అంతకన్న ఏం చెప్పాలో ఆమెకూ తట్టలేదు.
తల్లీ కొడుకు లిద్దరి మనస్సుల్లోనూ అవ్యక్తమూగబోయినవి. కొడుకు మనస్తత్వం తల్లికి, తల్లి మనస్సులోని ఆవేదన కొడుకుకీ తెల్సినా ఇద్దరూ తెలీనట్లుగానే ఉన్నారు.
"ఏమిటో చెప్పబోయి ఆగా వెందుకమ్మా" అన్నాడు జానకిరాం.
తల్లి ఆంతర్యం తెల్సినా తెలీని వాడిలానే మాట్లాడాడు.
"కార్తీక పురాణం చదువుతున్నావా. పురాణాలు చదవటానికి ఎమ్మే పాసవాలిరా. మనశాస్తుర్లు బాధ అంతకన్నా పెగిలి రాలేదు.
"అక్కర్లేదమ్మా. జీవ యాత్ర గడపటానిక్కూడా ఎమ్మే చదవక్కర్లేదు. నేను ఉద్యోగ ప్రయత్నం చెయ్యటం లేదనేగా అమ్మా నీ బాధ. ఉద్యోగం లేకపోతే బ్రతకలేమా అమ్మా. ఇష్టం లేని వాడు కూడా ఉద్యోగానికి ప్రాకులాడితే, ఇష్టం ఉన్నవాడు ఎంతగా బాధ పడాలి. ఆ ఉద్యోగం దొరక్క మానవ మనస్తత్వమే ఉద్యోగానికి నాందీ ప్రస్తావన. ఉద్యోగం లేకపోతే గడవని పరిస్థితికి మనల్ని భగవంతుడు తీసుకు రాలేదుగా. ఆ పరిస్థితే ఏర్పడినవాడు అది నా ఒక్కడి నేరమూ కాదు. ఇంతమంది ఈ ఇంట్లో ఉండగా నే నొక్కడినే బరువయావా అమ్మా" నన్ను పాలేరుగా చూసుకోండి. గౌతమిని పని మనిషిగా చూసుకోండి........"
"జానకి........" అంటూ కొడుకుని కావిలించు కుంది తల్లి. అతని భుజమంతా కన్నీటితో తడిసింది. కడుపులోని ఆవేదన పెల్లుబికి శ్రావణ మానవు మేఘాలుగా మారి ఒక్కసారి ఆమె రెండు కళ్ళల్లోనుంచి వర్షించినవి. కొంతసేపు ఆ వర్షపు ధారలనే చూసినా, ఆ కన్నీటి ప్రవాహాన్నే చూసినా, మాతృ హృదయంలో కరుడు గట్టుకు పోయిన తీవ్ర ఆవేదననీ. ఆ ఆవేదన చాటున లాగి ఉన్న అభిమానాన్నీ చూడగలిగాడు జానకిరాం.
"చూడమ్మా నేను ఉద్యోగం చెయ్యకపోయినా మనకు భుక్తికి లోటు లేదని నీకు తెల్సు, కాని, వాళ్ళూ వీళ్ళూ అవే ఎత్తి పొడుపు మాటలకు నీ మనస్సు దహించుకు పోతున్నది. ఎమ్మే ప్యాసయి కొడుకు కార్తీక పురాణాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నా డనేగా నీ మనస్సులోని బాధ" అన్నాడు జానకిరాం.
"అంతేకాదురా, అమ్మ లక్కలు దాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఉద్యోగం చెయ్యకపోయినా, అది నీ తప్పుగా ఎంచటం లేదు. దాన్ని చేసుకున్నా కనే నీకీ స్థితి ఏర్పడిందంటున్నారు. దాని గీతా నీ బుద్ధికి తగినట్లుగానే ఉందేమో" అన్న దావిడ మనస్సులోని బాధను వెళ్ళగక్కుతూ.
ఆ మాటకు నవ్వాడు జానకిరాం. బహుశా గౌతమి కన్నీటి స్రవంతికి కారణం అదేనేమో. ఇప్పటి కతనికి అర్దమైంది.
"పొరబడుతున్నావమ్మా! ఇందులో గౌతమి తప్పేమీ లేదు. నన్ను ఉద్యోగం చెయ్యవద్దని అది ఎప్పుడూ చెప్పలేదు. మీ కన్న ఎక్కువగానే అదీ విచారపడుతున్నది. ఇదంతా తన దురదృష్ట మేమో నని. ఎవరి అదృష్టమైనా, దురదృష్టమైనా అంతా భగవత్ సంకల్పమే గాని, మన వల్ల ఏమవుతుందమ్మా మనవల్ల అయ్యేది దూషణ భూషణలూ, తిరస్కారాలూ, పుల్ల విరుపు మాటలూ తప్ప, ఈ జీవితం సవ్యంగా కడతేరటానికి ఇంకే సన్మార్గాన్నీ ఏర్పరుచుకోలేం. విద్య విజ్ఞానానికి. విజ్ఞానాన్ని నలుగురికీ చెప్పటానికి. పారమార్ధిక చింతతో కూడిన విజ్ఞానం, తరించటానికి దగ్గర మార్గాన్ని చూపిస్తుంది. జీవితం సవ్యంగా జీవించటానికే గాని ధనార్జనకు కాదమ్మా, ధనం మనం కోరినంత మాత్రాన వస్తుందా" అన్నాడు.
కొడుకు ధోరణి ఆవిడకు నచ్చలేదు.
"జానకీ! మగవాడై జన్మించి, చదువు సంధ్యలు నేర్పి, ఇంత విజ్ఞానాన్ని సంపాదించుకున్నందుకు అది సార్ధకత చెందాలంటే ఉద్యోగం చెయ్యటమేరా. ఉద్యోగం పురుష లక్షలమనే కాదు. నాలుగు డబ్బులు తెచ్చుకుంటూ, భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ, సంసార సాగరంలోనే మునిగి తేలుతూ కూడా భగవత్ చింతనతో తరించిన వారెంత మంది లేరు. ఆ పరాత్పరుని సేవించటానికి మనకు మనస్సు కుదిరి, బుద్ధి నిలకడగా ఉండాలేగాని, ఉద్యోగ వ్యాపారాలు అడ్డురావురా బాబూ, ఏ దేవుడూ కూడా ఏ అవతారంలోనూ భుక్తి మార్గం చూసుకోవద్దనీ, స్వశక్తితో భార్యా బిడ్డల్ని పోషించుకో వద్దనీ చెప్పలేదు. భుక్తి మార్గంలో రాణిస్తూనే భక్తి మార్గంలో ప్రకాశించవచ్చు. భుక్తి మార్గం భక్తి మార్గానికి ఎన్నడూ అవరోధం కాదు. కన్నతల్లి కన్నీరూ, మనోవేదనా ఇంతగా చూడాలని ఏ దేవుడూ నీకు చెప్పలేదురా, మీ నాన్న గారు ఎంతగా కుమిలిపోతున్నారో నీకు తెలియదు. ఆయన మాత్రం ఆ పర్పాతరుని సేవించటం లేదా? భార్యా బిడ్డల్ని పోషించుకోవటం లేదా? పెద్దవాడు ఆ తీరు, నువ్వు ఈ తీరు, ఈ ఇద్దరు కొడుకులూ మాకు చెరో కన్ను అనుకున్నాం. ప్రకాశవంతమైన ఈ రెండు కళ్ళూ కూడా మాకు అంధత్వాన్నే ప్రసాదించినయ్యి. నవ మాసాలూ మోసి, కని, పెంచి, విద్యా బుద్దులు నేర్పి ఇంత వాళ్ళను చేసినందుకు, మాకు మీరు చూసే కృతజ్ఞత ఇదే కదూ!"
ఇంక మాట్లాడలేక వెళ్ళిపోయిందావిడ.
ఎంత సేపట్నుంచీ నిల్చుందో గుమ్మం వద్ద శ్రీ లక్ష్మిని చూశాడు జానకిరాం.
2
"హల్లో మురహరీ! ఈ మూడు రోజుల్నుంచీ కనుపించనే లేదేం. బొత్తిగా అంత నల్ల పూసవై పోయావా"
"ఏం లేదు జయలక్ష్మీ. మా చుట్టాలింట్లో పెళ్ళయితేనూ మా ఊరు వెళ్ళాను"
"మరేమిటి మీ ఊరి విశేషాలు"
"ఏ మున్నయ్యి, ఉన్నవారూ, లేనివాడూ రెండు పూటలా తింటున్నారు. ఆకలి చావులు లేవు. దైవం మేలు చేస్తే పంటలు బానే ఉన్నయ్యి" అన్నాడు నవ్వుతూ మురహరి.
"ఈ కబుర్లకేం గాని, ఇవ్వాళ నీ ప్రోగ్రాం ఏమిటి? ఎక్కడికి వెళదాం. సినిమాకా, బీచికా? ఏదో ఒకటి తేల్చి చెప్పాలి" అన్నది జయలక్ష్మి సీరియస్ గా ముఖం పెట్టి.
"అబ్బే ఈ వయస్సులో సినిమా లేమిటి పురాణానికి పోదాం. సరేనా" అన్నాడు.
"అబ్బో చాలా హాట్ హాట్ గా మాట్లాడుతున్నావే. ఇంక మనం తగ్గితే ఎంతో మంచిది. ఆరోగ్యకరం. దంపుడు బియ్యంతో అన్నం తిన్నంత చల్లగా ఉంటుంది కడుపులో" అన్నది.
"అహ సీతాకాలంలో ఐస్ క్రీం తిన్నట్లుగా ఉంటుంది. అంతేగాని చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకుందామని లేదు. అట్లా రాకూడదూ" అన్నాడు.