Read more!
 Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 2


    "ఆయన.... ఆయనాఖరికి ఈ విధంగా నామీద కక్ష తీర్చుకుంటారనుకోలేదు. కావాలనే, నా బ్రతుకు నలుగురిలో నవ్వులపాలు కావాలనే ఇలా చేశారు. ఇన్నాళ్ళు ఎన్ని రకాలుగా హింసించినా నామీద కసి తీర్చుకోవాలన్నట్టు ఆయన చేసిన ప్రతీ పనిని సహించాను! నన్నెన్ని రకాలుగా కాల్చుకుతిన్నా నోరు విప్పకుండా మౌనంగా భరించాను. నతా పిల్లలకోసం భరించాను. వాళ్ళ భవిష్యత్ కోసం సహించాను ఇంకా కక్ష తీరక ఇంత దారుణం చేస్తారని, ఎన్నడూ అనుకోలేదు నన్నిలా నడిరోడ్డు మీదకు లాగుతారని ఊహించలేదు" తలుచుకు తలుచుకు ఏడవడం ఆరంభించింది కళ్యాణి. 'ఇదంతా నేను సహించలేను ఇంక. చచ్చిపోతాను నేను. ఈ బ్రతుకు ఇంక బ్రతకలేను. ఎవరికోసం బ్రతకాలి ఇంకా?"
    "ఆంటీ, ప్లీజ్....ఏడవకండి, అలా మాట్లాడకండి. జరిగిందేదో జరిగింది. ఇన్నాళ్ళు ఏ పిల్లలకోసమైతే అదంతా సహించారో ఆ పిల్లల కోసమే ఇదీ భరించాలి" సుజాత పట్టుకున్న గొంతుతో కళ్ళు వత్తుకుంటూ అంది.
    "ఈ పిల్లలకోసమే ఇన్నాళ్ళు సహించాను. లేకపోతే ఏనాడో ఈ ఇల్లు వదిలేదాన్ని..... ఏనాడో నేను కోరుకునే జీవితానికి వెళ్ళేదాన్ని. లేకపోతే ఇంత విషం మింగేదాన్ని. కాని ఇంక సహించడం నావల్లకాదు .... నేనింక బ్రతకలేను." వెర్రిగా ఏడుస్తూ అంది కళ్యాణి. ఆమెతోపాటు సుజాత ఏడుస్తూ కూర్చుంది.
    కాసేపటికి ఏడుపు ఉద్రేకం తగ్గాక, సుజాతవంక చూస్తూ 'సుజాతా! నీకు నేనంటే ఇదివరకటి అభిమానం వుందా? గౌరవం వుందా" అంది కళ్యాణి.
    సుజాత నొచ్చుకుంటూ ... "దయచేసి మీరలా మాట్లాడకండి. నాకు చాలా కష్టంగా వుంటుంది. మీరంటే నాకున్న భావం నేనెన్ని మాటలు చెప్పినా వ్యక్తీకరించలేను" అంది బాధగా.
    "సుజాత, నాకు తెలుసు! అందుకే నిన్నొకటి కోరదల్చాను. నీవు నాకు ఒక సహాయం చేయాలి. నా మాట ఒకటి వింటావా, నే చెప్పినట్టు నడుచుకుంటావా?"
    "తప్పకుండా మీరేంచెప్పినా శిరసావహిస్తాను .... చెప్పండి" ఆరాటంగా అడిగింది సుజాత.
    కళ్యాణి కాసేపు ఆలోచించి "ఇప్పుడుకాదు, రేపు చెబుతాను. జ్ఞాపకం వుంచుకో నాకు మాటిచ్చావని .... నేను చెప్పినట్టు చేస్తానన్న మాట తప్పకూడదు."
    "ప్రమాణం చేస్తున్నాను .... మీరేం చెప్పినా, అదెంత కష్టమైన దైనా సరే మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదన్నా చేస్తాను. మీరు నాకు చేసినదానికి ప్రతిగా నేనేంచేసి మీకు కృతజ్ఞత చూపుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూంటాను.....అలాంటి అవకాశం నాకీయండి" ఆవేశంగా అంది సుజాత.
    కళ్యాణి సుజాత భుజంతట్టింది. "అలా అనుకోకు సుజా! కృతజ్ఞతలకి మనమధ్య చోటు లేదు. నేను నీకు చేసిందానికన్నా నీవు నాకు చేసిందే ఎక్కువ అనిపిస్తుంది నాకు. మనిద్దరిమధ్య ఏనాటి అనుబంధమో ఇది. సుజా, నీ మీద నాకు పూర్తి నమ్మకం వుంది. అందుకే ఇంత నిశ్చింతగా మాట మధ్యలోనే ఆపేసింది కళ్యాణి.
    "పాలు త్రాగండి చల్లారిపోతున్నాయి. ఉదయంనించి ఏం తినలేదు మీరు."
    "త్రాగుతాను వుంచు .... అన్నట్టు పిల్లలు పడుకున్నారా? అమ్మ పడుకుందా" అంటూ లేచింది కళ్యాణి. క్రిందికి వెళ్ళి పడుక్కున్న తల్లిని కాసేపు అలా చూసి నిట్టూర్చి, ఆమె దుప్పటి సరిచేసి యివతలకి వచ్చింది. "సుజా, అమ్మకి మందులని సరిగా యిస్తున్నావా? ఆవిడ విషయం అశ్రద్ధచేయకు సుమా" అంది సుజాతతో.
    తరువాత పిల్లల గదిలోకి వెళ్ళి పడుకున్న ఇద్దరి పిల్లలమధ్య మంచం మీద కూర్చుని వాళ్ళిద్దరిని ముద్దాడింది. ఆప్యాయంగా వళ్ళంతా నిమిరింది.
    "సుజాతా, నీకు వీళ్ళంటే నిజంగా అభిమానం వుందిగదూ?"
    ఆ ప్రశ్నకి సుజాత మనస్సు కలుక్కుమంది. "ఎందుకలా అడుగుతున్నారు? మీ కెందుకా అనుమానం వచ్చింది? ఇన్నాళ్ళయినా మీరు నన్ను గుర్తించలేదా?"
    "లేదులేదు. ఆ ఉద్దేశంతో అడగడం లేదు సుజా! నాకు తెల్సు నీవు వాళ్ళని ఎంత బాగా చూస్తావో. నీవే లేకపోతే నేను ఇంత నిశ్చింతగా.... "ఆవిడ మాట పూర్తి చెయ్యలేదు. "సరే నీ వినక వెళ్ళిపడుకో సుజాతా. వెళ్ళు వెళ్ళు పదిన్నర అయింది.... పడుకో.... అన్నట్టు రామకృష్ణ పడుకున్నాడా.... సర్లే వెళ్ళు.... నే నిక్కడ కాసేపుండి వస్తాను.... అన్నట్టు ఉదయం నిద్రపోతున్నా ఆరుగంటలకల్లా లేపేయి....పనుంది" అంది కల్యాణి.
    "అలాగే.... పాలు త్రాగండి, మరిచిపోకండి...." అంటూ మరోసారి గుర్తుచేసి సుజాత గదిలోంచి వెళ్ళిపోయింది.
    నిన్న జరిగిందంతా గుర్తు వచ్చింది సుజాతకి. "ఆవిడ మాటలు, ప్రవర్తన చూసికూడా యిలాంటిదేదో చేస్తారన్న అనుమానం రాలేదు నాకు. లేకపోతే.... లేకపోతే రాత్రంతా ఆమె దగ్గిరేవుండి జాగ్రత్తగా చూసేదాన్ని" ఏడుస్తూ అంది సుజాత.
    "హు, నీ పిచ్చి కాకపోతే చచ్చిపోవాలనుకునే వారిని ఎన్నాళ్ళు కనిపెట్టి జాగ్రత్తగా చూడగలవు? అలాంటి ఆలోచన రావడమే దురదృష్టం" రామకృష్ణ అన్నాడు.
    ఈ గలాభాకి క్రిందనించి వంటవాడు. పనిమనిషి పైకొచ్చారు. ప్రక్క గదిలో పడుకున్న పిల్లలిద్దరుకూడా లేచివచ్చారు. నిశ్చలంగా పడుకున్న తల్లిని, ఏడుస్తున్న సుజాతని చూసి జరిగిందేమిటో అర్ధంకాక తెల్లపోయి చూడసాగారు.
    "అమ్మగారికి ఏం అయింది సుజాతమ్మగారూ.... అలా పడుకున్నారేమిటి?" పనిమనిషి ఆదుర్దాగా అడిగింది. సుజాత జవాబీయకుండా కళ్ళతో పిల్లలున్నారు అడగద్దు అన్నట్టు వారిస్తూ చూసింది.

 Previous Page Next Page