"నేను రాద్దాంతం చేస్తున్నానా ? మీరన్నదానికి ఏదైనా చిన్న సమాధానం చెప్పినా రాద్ధంతమే! అప్పుడే పెళ్ళయినట్లు తెగ మురిసిపోతుంటే , పిల్ల నచ్చాలి కదా అన్నాను. ఇందులో అంత కానిమాటేముంది? సంతోషిస్తారు మీరూ.....మీరూ , పిల్ల వెధవలకి రెండు గుడ్డ ముక్కలు కొనియ్యటానికైనా గతిలేని సంసారంలో ముందున్న వేలకు వేల ఖర్చు చూసి నా గుండె ఝల్లుమంటుంది. మీరెందుకు సంతోషించరు? మీ పిల్లల విషయం మీకు కాబట్టిందా? అందాలరాణి మీ చెల్లెలు అంగరంగ వైభవంగా పెళ్ళాడేసి సుఖంగా అత్తారింట్లో ఉంటె చాలు. పిల్లలు ఏమైపోయినా మీకు చీకూ చింతా లేదు. నాది తల్లి ప్రాణం . అలా ఎలా అనుకోగలను?"
"అయితే ఏం చెయ్యమంటావో చెప్పు? దాని మెడకో గుదిబండ కట్టి చెరువులో పోరేయ్యమంటావా?"
"ఆవిడ మెడకేందుకు ? నా మెడకే నా పిల్లల్ని కట్టి చెరువులో పారెయ్యండి. మీకు ఖర్చు తగ్గుతుంది. మీ చెల్లెలికి బోలెడు కట్నమిచ్చి మంచి సంబంధం తేవచ్చు."
"ఛీ ! ఛీ! " అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసు.
"నా ఖర్మ!" అంటూ గదిలో మంచం మీద ముసుగు పెట్టుకుని కుళ్ళీ కుళ్ళీ ఏడవసాగింది అలమేలు.
వంటింట్లో పచ్చడి రుబ్బుతోన్న జానకికి అన్నా వదినల ఘర్షణ ప్రతి అక్షరమూ వినిపిస్తోంది. కళ్ళల్లోనుంచి నీళ్ళు తొణికి క్రిందకు రాకుండా అతి ప్రయత్నం మీద నిగ్రహించుకోగలిగింది కాని క్షోభిల్లుతున్న గుండెల్ని ఎలా స్థిమితపరచుకోవాలో అర్ధం కాలేదు జానకికి.
అన్నావదినెలు ఎప్పుడూ ఇలా కొట్లాడుకునేవారే అయితే జానకి ఇంతగా బాధపడకపోను. కానీ, ఈ కావేషాలన్నీ ఒక్క తన విషయంలోనే వస్తున్నాయి. మిగతా అన్ని విషయాల్లో ఇద్దరూ ఒక్క మాటా మీద ఉంటారు. కలిసి సినిమాల కేల్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు. ఒకరినొకరు చిలిపి మాటలతో , పరిహసలతో కవ్వించుకుంటారు. ఆనందమయమైన సంసారం తన మూలంగా చికాకులమయం కావటం సహించలేకపోతోంది జానకి. అన్న తన సుఖం ఎంతగా కోరుతున్నాడో అంతకు రెండు రెట్లేక్కువగా అన్న సుఖం తను కోరుకుంటుంది. తనను ఒక్క మాట అనటం సహించలేడు అన్న, సహించలేడని తెలిసీ అన్న ఎదురుగానే తనను విదిలించటం మానదు వదిన.
"వదినా! అన్నయ్య లేనప్పుడు నన్నేన్నైనా అను బండను, మొండిని నాకేం బాధలేదు. అన్నయ్య ఎదురుగా మాత్రం ఏమీ అనకు. నీ సంసారంలో చికాకులు కొని తెచ్చుకోకు" అని అరవాలనిపిస్తుంది జానకికి. ఇటీవల మరీ తన పెళ్ళి విషయంలో అన్నవదినల మధ్య ఘర్షణ ఎక్కువై పోయింది.
అక్కడికీ ఒకరోజున జానకి సాహసించి అన్నతో అంది "నా పెళ్ళి కేందుకిన్ని తర్జన భర్జనలు ? ఏ రెండో పెళ్ళి వాడో కట్నం తీసుకోకుండా చేసుకోడా?"
అన్న మొదట నిర్ఘాంత పోయాడు. క్షణం సేపు బాధతో కనురెప్పలు రెపరెపలాడాయి. అంతలో కోపంగా తనవంక చూశాడు.
"నీ మంచి చెడ్డ ఆలోచించడానికి ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నువ్వూ మీ వదినా కలిసి నన్ను కాల్చుకుతిన్న తర్వాత స్వయం నిర్ణయాలు చెసుకుందురు గాని" అని విసురుగా వెళ్ళిపోయాడు శ్రీనివాసు.
ఎన్నడూ ఏడ్వనంతగా ఏడ్చింది జానకి ఆనాడు. సాయంత్రం జానకి ఉబ్బిన ముఖం చూస్తూ "నన్ను క్షమించమ్మా!" అన్నాడు శ్రీనివాసు బాధగా. "అది కాదు, అది కాదు " అంటూ నిగ్రహించుకోలేక అన్న ఒళ్ళో తల పెట్టుకుని బావురుమంది జానకి. "నామీద చికాకు పడ్డావని కాదు. నా కోసం నువ్వు పడుతున్న బాధ చూడలేక....' దీనంగా అంది జానకి.
శ్రీనివాసు ఒక్కమాటా మాట్లాడకుండా జానకి కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోయాడు.
అప్పుడప్పుడూ ఎవరో పెళ్ళివారు వస్తూనే ఉన్నారు. కట్నం దగ్గర పెదవి విరుస్తూనే ఉన్నారు.
జానకికిది బాగా అలవాటైపోయింది. ఇటీవల బాధపడటం కూడా మానివేసింది.
"వెధవ సంసారం. నేనీదలేను. ఇప్పటికే తలకు మించిన బరువు మోస్తున్నాను. ఉన్న ఆ ఒక్క కొంపా కూడా అమ్మేస్తే ముందు ముందు పిల్లలకి కాస్త నీడైనా ఉండద్దా? ఛీ! ఛీ! పిల్లల్నందరినీ యే నూతిలోకో దింపేసి, నేనూ దిగిపోతే పీడా విరగడయిపోతుంది. అన్నా, చెల్లెలూ సుఖంగా ఉంటారు" వంటింట్లొంచి అలమేలు ధోరణి తీవ్రంగా వినిపిస్తోంటే నూతి గట్టు దగ్గర బట్టలు తుక్కుంటున్న జానకి గుండెలు దడదడలాడాయి.
ఉతుకుతున్న చీరను నెమ్మదిగా బాల్చీలో పడేసి, తడబడే అడుగులతో వదిన దగ్గర కొచ్చింది. జానకిని చూడగానే అలమేలు మరింత పెట్రేగి పోయింది.
"అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏం, నేనేం తప్పు చేశాను? ఏం కాని మాటన్నాను? నాకూ ఆడపిల్లలున్నారు. మొగపిల్లలున్నారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి. మొగ పిల్లలకు చదువులు చెప్పించాలి. ఉన్న ఆ ఒక్క యిల్లూ అమ్మేసి ఆ అన్నగారు ఈ చెల్లెలిగారికి పెళ్లి చేస్తే మిగిలిన వాళ్ళ గతేం కావాలి? ఇప్పుడు లేని సిరి అప్పుడేక్కడి నుంచి ఎత్తుకొస్తుంది?
"అన్నయ్య ఇల్లమ్ముతున్నడా?" భయంభయంగా అడిగింది జానకి.
"అవునమ్మా అవును. అది కట్నంగా యిచ్చి నీకు మంచి సంబంధం చేస్తారు. నువ్వు సుఖపదతావు. మేమూ సుఖపడతాంలే! నూతిలోపడి చచ్చాక సుఖం కాక ఏముంది ?" రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది అలమేలు.
అన్న భోజనం చేసి వాలుకుర్చీలో కూర్చున్నాక వెనగ్గా వెళ్ళి నుంచుంది జానకి.
"అన్నయ్యా! ఇల్లమ్ముతున్నావా? ఎందుకూ?
"నోరుమూసుకో! అందరూ నాకు చెప్పేవాళ్ళే! నా యిష్టం వచ్చినట్లు చేసుకుంటాను. ఛీ! ఛీ! ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండనివ్వరు......' ఉగ్రుడై అవతలి కెళ్ళిపోయాడు శ్రీనివాసు. బొమ్మలా నిలబడిపోయింది జానకి.
కట్నం ఇయ్యకపోతే జానకికి పెళ్లి కాదు. వెన్నెల కిరణాలు అమృతపు జల్లుల్లు కురిపిస్తున్నా ఆలోచనలతో తల వేడెక్కించుకోంటున్న శ్రీనివాసుకు నూతి దగ్గర ఎవరో కదిలినట్లు కనిపించింది. పరీక్షగా చూశాడు. సందేహం లేదు జనకే!
"జానకీ!"
ఆర్తనాదంలా వెలువడిందా పిలుపు శ్రీనివాసు నోటినుండి. ఒకకాలు నూతి గట్టు మీద పెట్టి మరోకాలు కూడా పైకి తీసుకోబోతున్న జానకి ఆ పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కు గెంతింది.
ఒక్క అంగలో వచ్చి తూలి పడబోతున్న జానకిని పొదివి పట్టుకున్నాడు శ్రీనివాసు.
"ఇదేం పనమ్మా జానకి!"
జానకి అన్న గుండెల్లో ఒదిగిపోయింది తలెత్తలేక. "నువ్వు తప్పించుకుంటున్నావు సరే! ఆ తర్వాత నేనెంత క్షోభపడాలో ఆలోచించావా? ఏ నేరానికమ్మా నీకింత శిక్ష?"
జానకి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎంతో సేపటికి తమాయించుకుని "అన్నయ్యా నీ బాధ్యత ఒక్క చెల్లెలి విషయంలోనేనా? పిల్లల విషయంలో లేదా? ఇల్లు అమ్మనని మాటియ్యి. లేకపోతే నేను నీ దగ్గర ఉండను. ఆ పసికందులను అన్యాయం చేసి నా సుఖం నేను వెతుక్కోలేను" అంది. శ్రీనివాసు బరువుగా నిట్టూర్చాడు.
"నేను ఇందాకటి నుంచి ఆ విషయమే ఆలోచిస్తున్నానమ్మా! ఇల్లు అమ్మను నీ అదృష్టమెలా వుంటే అలా అవుతుంది. నీకు చదువయినా చెప్పించాను కాను" జానకిని అలాగే పొదివి పట్టుకుని ఇంట్లోకి నడిచాడు శ్రీనివాసు.
ఇన్నాళ్ళకు సరోజినీ ద్వారా తనకు కట్నం ప్రమేయం లేకుండా సంబంధం రాబోతుందంటే ఒక్క నిముషం తన చెవులను తను నమ్మలేకపోయింది జానకి. సరోజినీ కాత్యాయనీ గురించి వివరంగా చెప్పాక ఎండిపోయిన ఆమె గుండెలలో చిన్న ఆశాలత మొలకెత్తింది.