" 'అమ్మా!' అని పిలిపించుకోని జన్మ ఎందుకండీ....నాకోసం ఊరుకోండి. నాకేం కాదు! కోదండరాముడే కాపాడతాడు!" అంది.
భార్య పట్టుదల ముందు సుబ్బారాయుడి నిర్ణయం వీగిపోయింది. ఆ రోజునుండి ఆమెకి నొప్పులొచ్చేదాకా ఎన్నెన్ని సంతర్పణలు చేయించాడో, ఏయే యాత్రలు చేసొచ్చాడో లెక్కలేదు.
వారి పుణ్యం పండి అలా అపురూపంగా పుట్టిన పిల్లే రాధ! ఆమె బోర్లాపడితే ఇంటిల్లిపాదీ బూరెల గంపలో పడినట్లు పొంగిపోయారు. 'ఉంగా....' అంటే గింగిరాలు తిరిగిపోయారు. చిట్టిపొట్టి అడుగులేస్తే సిరినట్టింట్లో తిరుగుతున్నట్లు ఊహించుకుని సంబరపడిపోయారు. వయసొచ్చి కొబ్బరి మట్టమీద కూర్చున్నప్పుడు ఊరందర్నీ మూడురోజులు పొయ్యి వెలిగించనీయకుండా విందులు చేశారు.
ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు వచ్చిన రాధ ఎక్కుపెట్టిన మన్మథుడి విల్లులా ఉంటుంది. సొగసులో గులాబీ, ఒద్దికలో చేమంతి, మంచితనంలో మల్లె, ముగ్ధత్వంలో ముద్దబంతితో తులతూగే అందం ఆమెది. గుమ్మడి పాదులాంటి ఉమ్మడికుటుంబంలో అందరికీ ఆమె కనుపాప! ఆ కంట్లో నలకపడితే ఇంటిల్లిపాది కళ్ళూ చెమ్మగిల్లుతాయి. ఆ కాల్లో ముల్లు గుచ్చుకుంటే ఒకరిని మార్చి ఒకరు ఎత్తుకు తిప్పడానికి సిద్దమైపోతారు. ఆమెకి ఒంట్లో నలతగా ఉంటే పాలేర్లూ, పనిమనుషులతో సహా ఎవ్వరూ ముద్దముట్టరు. ఆమెకి కోపం వస్తే అందరి మనసుల్లో చీకటి ముసిరేసినట్టు! ఆమె గలగలనవ్వితే వెన్నెల వెల్లువైనట్లు! పాలివెల్లివంటి ఇంట్లో మురిపాల జాబిల్లి రాధ!
అటువంటి రాధ పంటచేలకి అడ్డంపడి పరుగులు పెడుతూ వస్తుంటే, అందరూ ఏం జరిగిందోనని చిత్తరువుల్లా నిలబడి చూస్తూండిపోయారు.
"అమ్మాయిగారూ! ఏమైందండీ?" అని అడుగుతున్నవారికి జవాబివ్వకుండానే, చేల గట్లమ్మట, గొల్లభామలా అడుగులేస్తూ తండ్రి ఉన్న చోటుకి వచ్చింది.
ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డ కూతుర్ని చూసి సుబ్బారాయుడు కంగారుగా "ఏమైంది తల్లీ?" అన్నాడు.
అసలే పెద్దవైన కళ్ళు ఇంకాస్త పెద్దవి చేస్తూ, "నాన్నా......! లక్ష్మికి నొప్పులొస్తున్నాయి! అమ్మకి చెయ్యీ కాలూ ఆడ్డంలేదు. డాక్టర్ని పిలిపించండి నాన్నా!"
"ఆ!" అంటూ నోట్లోంచి చుట్టపీక పారేసి సుబ్బారాయుడు పెద్ద పెద్ద అంగలతో నడక మొదలెట్టాడు. ఎదురొచ్చిన ప్రతివాళ్ళకీ 'లక్ష్మికి నొప్పు లొస్తున్నాయట!' అని చెప్తూనే ఉన్నాడు బావగారి వెనకాల నడుస్తున్న సన్యాసిరావు.
రాధ తండ్రివెంట రాకుండా రివ్వున వెనక్కి తిరిగి రచ్చబండ వైపు పరుగు పెట్టింది. అక్కడ గోటేబిళ్ళలాడుతున్న చిన్నాన్న పిల్లల్ని చూసి, ఒక్క నిమిషం అలుపు తీర్చుకుని, "మీ నాన్నేడిరా?" అని అడిగింది.
పెద్దవాడు తలెత్తి చూసి, "గుళ్ళో సంగీతం చెప్తున్నాడు. ఏమైంది రాధక్కా? ఎందుకలా పరుగెడుతున్నావు?" అన్నాడు.
"మీకు చెప్పేది కాదులే!" అంటూ గుళ్ళోకి పరుగుతీసింది.
ప్రకాశం గొంతెత్తి హుషారుగా "ఖగరాజూ .... నీయానతి విని వేగా.... చనలేదా..... గగనానికి .... ఇలకూ బహదూరంబనినాడో ..... అని పాడుతున్న వాడల్లా రాధని చూసి పాట అనేసి, "నువ్వొచ్చావేంటమ్మా" అన్నాడు.
"చిన్నాన్నా! మన లక్ష్మికి నొప్పులొస్తున్నాయి. ఏడుస్తోంది!" అంటూ రాధ చిన్నాన్న చెయ్యిపట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది.
"అలాగా ..... పద వెళ్దాం! మా తల్లివిగా! ఏడుపు ఆపమ్మా!" అంటూ ప్రకాశం ఆమె తల నిమిరి బుజ్జగించి ఆమెతో ఇంటికి బయలుదేరాడు.
"ఆగు చిన్నాన్నా!" అంటూ రాధ మండపం ఎక్కి లోపలికి పరుగెత్తి రాములవారి విగ్రహంముందు సాష్టాంగపడి "తండ్రీ లక్ష్మికి త్వరగా పురుడొచ్చేస్తే వందసార్లు దండాలు పెడతాను!" అని మొక్కుకుని చెంపలేసుకుంది. సీతమ్మవారి కాళ్ళ దగ్గరున్న పారిజాతం పువ్వు తీసి తలలో తురుముకుని తూనీగలాగ పరుగుతీసింది.
దారిలో ఎదురుపడిన వాతల తాతయ్యతో "నీకీ విషయం తెలుసా?" అంది.
ఆయన పేపరు మడత విప్పుతూ, "ఏలూరు కుంభకోణం గురించేనా?" అన్నాడు.
ప్రకాశం మండిపడుతూ, "నీ పాడే, నీ పచ్చిబద్దలూ! ముందు ఇంటికి నడు....! మన లక్ష్మికి నొప్పులొస్తున్నాయట!" అన్నాడు.
"అలాగా! దశమీ, శుక్రవారం! నక్షత్రం బాగుంది!" ఆయన నశ్యండబ్బా మూతతీస్తూ అన్నాడు.
"పద, పద!" ప్రకాశం రాధని తొందరచేతూ గబగబా అడుగులేశాడు.
రాధ ప్రకాశం చేతిని అందుకుని, "అదిగో, గణపతి బావ రావులమ్మ హోటల్ దగ్గరున్నాడు, చెప్దామా?" అంది.
"వాడొస్తే వచ్చే పురుడుకాస్తా ఆగిపోతుంది! ఇనుప పాదం వెధవ, నువ్వు పద!" విసుక్కున్నాడు ప్రకాశం.
వాళ్ళలా ఇల్లు చేరేసరికే, అప్పటికే అక్కడ చాలామంది ఆడవాళ్ళు గుంపుగాచేరి దడి కట్టి నిలబడ్డారు.
"ప్రకాశం! మీ అన్నయ్య డాక్టర్ గారిని పిలవడానికెళ్ళారు. నాకు కంగారుగా ఉందయ్యా!" మరిదిని చూసి గొల్లుమంది పార్వతమ్మ.
"ఏమీకాదు, వదినా! నువ్వు కంట తడిపెట్టకు. ఈ రోజసలే శుక్రవారం!" అన్నాడు తల్లడిల్లిపోతూ ప్రకాశం.
వసారాలో మంచంమీదనుండే రాధ బామ్మ తాయారమ్మ "పురుడొచ్చిందటే?" ఇంకా ఎంతసేపూ?" అని అరుస్తోంది.
"తొలిచూలు కదా! కాస్త టైము పడుతుంది. మీరు గాభారాపడి దాన్ని గాభరా పెట్టకండే" ధైర్యం చెపుతూనే మందలించింది రాధ అత్తా సూరమ్మ.
శాంత రాధని చూసి, "చిన్నపిల్లవి .... జడుసుకుంటావు. లోపల కెళ్ళు" అంది.
ప్రకాశం వెంటనే, "అవును పిన్ని చెప్పింది నిజం! లోపలికి పద!" అని రాధని తీసుకుని లోపలికి నడిచాడు.
రాధ చిన్నాన్న చేతిని పట్టుకుని ఊపుతూ, "లక్ష్మి అంత పెద్దగా అరుస్తోంది....చచ్చిపోతుందా పిన్నీ?" అని అమాయకంగా అడిగింది.
ప్రకాశం చిన్నగా నవ్వి, "లేదమ్మా! చిన్న బుజ్జాయినిస్తుంది!" అన్నాడు.
"అందుకు ఇంత కష్టపడాలా?" రాధ గుండెలమీద చెయ్యి వేసుకుంది.