మీకు సింహమూ, చిట్టెలుకా కథ తెలీదనుకుంటాను. ఎవరి సహాయం ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరు చెప్పగలరు?" అన్నాడు
ఆమె కోపంగా చూసి "నీ సహాయం మాత్రం నాకు అవసరం రాదనుకుంటాను" అని వెనక్కి తిరిగి అడుగులు వెయ్యసాగింది.
అతను వెనుకనుంచి "మూర్ఖులూ, చనిపోయినవాళ్ళూ మాత్రమే తమ అభిప్రాయాలు మార్చుకోరు. కాబట్టి మీరు తప్పకుండా మీ మీ అభిప్రాయం మార్చుకుంటారని నాకు నమ్మకం వుంది" అన్నాడు.
ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
* * *
ఆ రాత్రి శక్తిమతి మంచంమీద బోర్లా పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే సాయంత్రం బీచ్ లో జరిగిన సంఘటనలూ, ఆ యువకుడి మాటలూ గుర్తొచ్చాయి.
ఆమె పెదవుల మీద చిన్ననవ్వు పరుచుకుంది.
మనం చెప్పే జోక్ లో విట్ వుంటే శతృవుల్ని కూడా నవ్వించవచ్చు. ఆమెకి ఆ విధంగా అతనిమీద కోపం పోయింది.
ముందు గదిలోనుంచి పెద్దక్క ఏడవడం, ఆమెని తండ్రి సముదాయించడం వినిపిస్తోంది.
"ఏళ్ల తరబడి ఒకే విషయానికి ఈ ఆడవాళ్ళు ఎందుకేడుస్తారో?" అనుకొంది శక్తిమతి.
ఆమె పెద్దక్క తన భర్త అనుమానంతో తనని పెడుతున్న చిత్రహింసల గురించి చెప్పుకొని ఏడుస్తోంది.
ఇంతగా ఏడుస్తున్న ఈమే రేపు ఆ భర్తగారొచ్చి రమ్మనగానే మారు మాట్లాడకుండా "ఆయనకీ యిబ్బందే.... నేను మా ఇంటికెళతాను" అని వెళ్ళిపోతుందని శక్తిమతికి తెలుసు.
కొంతసేపటికి తండ్రీ, అక్కల సంభాషణ శక్తిమతి పెళ్ళివైపు మళ్ళింది.
"ఈ సంబంధం అయినా కుదిరితే బావుణ్ణు. కట్నంగురించి దానికి తెలీనివ్వకండి" శక్తిమతి పెద్దక్కసలహా యిస్తోంది.
'పెళ్ళి చేసుకుని తను అనుభవిస్తున్నది చాలదన్నట్లు చెల్లెలిని కూడా ఆ రొంపిలోకి దించమని సలహా ఒకటీ!' అనుకొంది శక్తి.
"నెలకి ఐదువేల పైగా సంపాదించే నేను ఎందుకని కట్నం యివ్వాలంటుంది? మొగుడిగా వుండటానికి వాడికి పగడీనా? అని గోల పెడుతుంది. పైగా కాలేజీలో ఏదో శపధంకూడా చేసిందట" తండ్రి నిష్టూరంగా అంటున్నాడు.
శక్తి కిటికీలోంచి బయటకు చూసింది.
ఆకాశం నల్లని రగ్గులా, అందులో ఓ చిరుగులా చందమామా కనిపించాయి.
'నాకూ నా జీవితానికీ సంబంధించిన విషయంగురించీ వీళ్ళంతా ఎందుకు డిస్కస్ చేసుకుంటారు' అనిపించింది.
ఆమె పెద్దబావ, చిన్నబావా గుర్తొచ్చారు.
'అటువంటి మొగుళ్ళనీ, వాళ్ళ కాపురాల్నీ చూశాక ఆకాశం, వెన్నెలా, పెళ్ళీ, సంసారంలాంటి విషయాల్ని అందంగా ఎలా వూహించుకోవడం' అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది.
తండ్రీ, పెద్దక్కా కలిసి చిన్నక్క కాపురంగురించి మాట్లాడుతున్నారు.
'వేరే వాళ్ళ విషయాలగురించి చర్చించే సమయం మన విషయాలపై కేటాయిస్తే ఏదైనా పరిష్కారం దొరకవచ్చు అని వీళ్ళకి ఎవరు బోధించ గలరూ!' అనుకొంది.
* * *
శక్తిమతి పనిచేసే బ్యాంక్ వూరికి కాస్తంత దూరంలో వుండటంతో ఆమె ఓ గంట ముందుగా బయల్దేరాల్సి వస్తుంది. ఆమె హడావుడిపడుతూ తయారవుతుండగా తండ్రి పిలిచాడు.
"ఏమిటీ?" శక్తి టైం చూసుకుంటూ అడిగింది.
"ఈరోజు కాస్త త్వరగా రా తల్లీ!" అన్నాడు.
శక్తికళ్ళల్లో అంతులేని చిరాకు కనిపించింది.
"మళ్ళీ పెళ్ళిచూపులా?" కోపంగా అంది.
ఆయన నచ్చచెబుతున్నట్టుగా "మంచి సంబంధం అబ్బాయి ఇంజనీర్, పైగా నీ ఫోటో బాగా నచ్చిందట" అన్నాడు.
"రేటెంత అడుగుతున్నారు? ఇంజనీర్లకి బాగా పలుకుతోందనుకుంటాను. ఇవికూడా "పెళ్ళికొడుకుల మార్కెట్" అని పేపర్లో ఓ పక్కన ప్రకటిస్తే బాగుంటుందేమో!" హేళనగా అంది.
కూతురితో మాట్లాడడానికి జంకుతున్నట్లుగా ఆయన ఒకనిముషం ఆగి "శక్తీ.... ఈ అందం, వయసూ వుండగానే జీవితంలో సెటిలై పోవాలమ్మా సిద్దాంతాలూ, నినాదాలూ బాధలనితప్ప అనందాలనివ్వవు" అన్నాడు.
ఆమె నవ్వి "ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు కట్నాలిచ్చి ఘనంగా చేసిన నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నాన్నా! నీ పెద్ద కూతురూ, చిన్నకూతురూ జీవితంలో సెటిలైనట్లేనా? ఆనందంగా కాపురం చేసుకుంటున్నట్లేనా? అభద్రతాభావంతో ప్రతి నిముషం బ్రతికేవాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటున్నారని లోకానికి తెలియజేయడానికి వాళ్ళకొచ్చే కడుపులూ, చేసుకుంటున్నారని లోకానికి తెలియజేయడానికి వాళ్ళకొచ్చే కడుపులూ, పురుళ్ళూ రుజువులేమో కానీ అన్నీ తెలిసిన నాకు కాదు" అని కొట్టిపారేసింది.
ఆయన బాధగా "అందరి అదృష్టాలూ ఒకేలా వుండవు తల్లీ! నువ్వు చిన్నప్పటినుంచీ చదువు విషయంలోనూ, మిగతా అన్ని విషయాల్లోనూ వాళ్ళ కన్నా మెరుగ్గానే వున్నావు. మొగుడి విషయంలోకూడా అని అనుకోవచ్చుగా!"
శక్తి గూట్లోంచి చెప్పులు తీసి వేసుకుంటూ "వాళ్ళని చూసి నేను జాగ్రత్తపడుతూ వచ్చాను. ఈ విషయంలో కూడా అంతే! నా జీవితాన్ని నాకొదిలెయ్ నాన్నా... ప్లీజ్!" అంది.
"ఈ ఒక్కసారికీ..." తండ్రి నసిగాడు.
"ప్రయత్నిస్తాను" అని ఆమె వెళ్ళిపోయింది.
ఆరోజు శనివారం కావడంతో బ్యాంక్ చాలా రష్ గా వుంది. శక్తి క్యాష్ కౌంటర్లో వుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం దొరక్క అవస్థ పడుతోంది.
అటెండర్ టీ తీసుకొచ్చి పెడుతూ "చుట్టుపక్కల పాములు బాగా తిరుగుతున్నట్లున్నాయి. వాచ్ మెన్ రాత్రి పెద్ద తాచుపాముని చూశాడట" అన్నాడు.
ఆమె ఆ విషయమై పెద్దగా శ్రద్ద చూపించలేదు. గ్యాప్ దొరికినప్పుడు టీ తాగుతుండగా "హాయ్! మీరు ఈ బ్రాంచ్ లో పనిచేస్తున్నారా?" అన్న పలకరింపు విని తలెత్తి చూసింది.