Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 18

        
                                   గ్రంధాలతో కచ్చడాలు


                    అటు ఇటలీనుంచి ఇటు స్కాట్లాండు


                                      వరకు

    ఈ ఇనుపకచ్చడాలు - సూర్యుడులాగ-తూర్పునే ఉదయించాయి- అవసరం వల్లనే అనండి, అత్యాచారంగానే అనండి. తూర్పువారే వీటిని వాడుకలో పెట్టారు. క్రూసేడు యుద్ధాలలో ఇటాలియనులకు, ముఖ్యంగా, ఈ తూర్పువారితో సంపర్కం కలిగింది. ఇక్కడ ఆచారంలో వున్న కచ్చడాల సాధనం ఏదయినావుంటే, తమ ఇండ్లలో వ్యవహారాలు చెడకుండా వుంటాయి కదా అని కలిగింది.
    కచ్చడాల రవాణ తూర్పునుంచి పడమర వరకు ఆరంభించింది. ఇటలాలో ఒకరిని చూచి ఒకరు; ఆ తరవాత ఇటలీని చూచి ఫ్రాన్సు, ఫ్రాన్సును చూసి మరొకదేశం, ఇలా యూరోపు అంతా కచ్చడం విహారం చేసింది.
    నగలలాగ నాణాలలాగ ఈ కచ్చడాలలో షోకు, సొగసు, సౌఖ్యం అంతా వుండేటట్టు చిత్ర విచిత్రంగా తయారీలు జరిగాయి. రకరకాల కచ్చడాలు, రకరకాల ఉపాయాలతో నిర్మాణం జరిగాయి. కార్ఖానాలు వీటిని వందలకొద్దీ తయారుచేసేవి. వర్తకులు వీటికి మంచి కాటలాగులద్వారా ప్రకటనలు చేసేవారు.
    ఉపయోగించడంలో చిన్నచిన్న పొరపాట్లవల్ల, కోర్టులలో కేసులు వచ్చేవి. న్యాయాధికారులు శిక్షలు వేస్తూ వచ్చారు. అయినా, కచ్చడాల ఆచారం తగ్గడంలేదు. నలభై సంవత్సరాల కిందటి దాకా ఇవి వాడుకలో వున్నట్టు "దస్తావేజు" రికార్డులున్నాయి.
    ఇంతవ్యాప్తిలో వున్నప్పుడు ఈ కచ్చడాలు గ్రంధాలకు ఎక్కాయంటే ఆశ్చర్యం ఏముంటుంది? కవిత్వంలో గూడా కచ్చడాలున్నాయంటే తప్పేమి! ఇంతకూ సారస్వతమూ, వాఙ్మయమూ అంటే ఏమిటి? గతించిన కాలాన్ని విమర్శించి, ప్రస్తుతాన్ని ప్రకటించి, రాబోయే దానిని సూచించడమే కదా!
    అందులోనూ కచ్చడాలు, సామాన్యమైన విషయం కాదు. మానవ స్వభావానికీ ఈ కచ్చడాలకూ సంబంధం గట్టింది. అలాంటి కచ్చడాలు సారస్వతంలోనికి ఎక్కకుండా వుంటాయా? తరువాత తరువాత నాజూకుతనం ఎక్కువయి, మడిబట్టలు అధికమయిన తరువాత మన పెద్దలు ఆ గ్రంధాలను ధ్వంసంచేస్తే చెయ్యవచ్చును. కాని, సారస్వతంలోనికి ఎక్కకుండా మాత్రం వుండలేవు.
    ఇటలీలో 1500 ప్రాంతాలలో వ్రాసిన ఒక చిన్నకథ: ఒక ఇల్లాలు ఒకడిని ప్రేమించింది. మహా ప్రయాసతో ఆ అందగాడిని తెప్పించి, అతడితో ఆనందిస్తూ భర్త వస్తాడన్న సంగతే మరిచిపోయింది. భర్తవచ్చాడు. వాడికి తగినశాస్తి చేశాడు; భార్యకు ఒక కచ్చడం కొనిపెట్టాడు. అలాగ ఆ కచ్చడాలు వ్యాపించాయని భావం.
    ఇటలీలో మిలాన్ నగరంలో కచ్చడాల ఆచారం ప్రవేశించడానికి ఒక సన్నివేశం చెప్పుకుంటారు. క్రిస్టియన్ "నన్" (యోగిని  అందాం) ఒకర్తె ఒక గొప్పవాడిని ప్రేమించింది, నన్ కాబట్టి కామాన్న సన్యసించాలి. మగవారిలో "మంక్" లాగానే. వీరిద్దరు ఒక వుపాయం పన్నారు. ఈ గొప్పవాడు ఒక మంక్ లాగా వేషం వేసుకుని రాత్రి, పొద్దున ఆ మఠంలోనికి పోవడం అని నిర్ణయించుకున్నారు.
    కొంతకాలం తరువాత ఒకనాడు యీ గొప్పవాడు ఆ వేషంతోనే బయటకువచ్చి, వేషంలో ఉన్నానన్న మాట మరచిపోయి, తెలిసినవాడొకడు దారిన కనబడితే, వాడిని పల్కరించాడు. దానితో కథ అంతా బయటపడ్డది.
    మంకులు మండిపడ్డారు. కచ్చడాలుంటేనేగాని ఈలాంటి అనాచారాలు ఆగవు అని నిర్ణయించుకున్నారు. మతగురువులు చెప్పిన మాటలు కదా అని మహా గౌరవంతో పెద్దలంతా ఇనుపకచ్చడాలు కొని, భార్యలకు అలంకరించారు.
    ఫ్రాన్సులో ఈ ఇనపకచ్చడాల విషయం పెద్ద పెద్ద డిక్షనరీలలోనికి నిఘంటువులలోనికి గూడా ఎక్కింది. వీటిని ఎలాగ తయారు చేస్తారో; ఏ విధంగా వుపయోగించేవారో ఆ సంగతంతా స్పష్టంగా తెలుపుతాయి ఆ నిఘంటువులు.
    ఒక కవి వ్రాసిన పుస్తకంలో ఒకడు ఒక స్త్రీ దుష్ప్రవర్తనను గురించి విసిగి మాటలాడుతూ, "దీనికి ఒక తాళం తెచ్చి బిగించవలసిందే" అంటాడు. ఆ తాళం, ఆ బిగింపూ అంతా కచ్చడాల ముచ్చటే అని వేరే చెప్పనక్కరలేదు గదా.
    స్కాట్లాండులో సరే డేవిడ్ లిండ్సే అన్న కవి ఒక ప్రబంధం వ్రాశాడు. దానిలో నాయికకు భర్త ప్రతీదినమూ ఈ కచ్చడం బిగించి తాళం తలకింద పెట్టుకొని నిద్రపోతాడు. నాయికకు నచ్చిన వాడొకడు వచ్చి ప్రార్ధిస్తాడు. పాపం! నాయిక హృదయం కరుగుతుంది.
    కాని, కచ్చడం వుంది! మెల్లగా భర్త తలక్రిందనున్న తాళం తెమ్మంటుంది. మొద్దు నిద్దరలో వున్న భర్త తలకింది తాళం సులభంగా దొరుకుతుంది.
    తెల్లవారిన తరువాత, భర్త నిద్రలేచి, తలకింద తాళం చూసుకుంటాడు. లేదు. అయ్యో కుయ్యో అని, తాళంపోయిందని ఊరక విసుగుకుంటాడు. నేర్పుగల నాయిక, ఏమిటి? ఎందుకా గాభరా అంటూ వచ్చి అక్కడా ఇక్కడా వెదుకుతూ వున్నట్టు నటించి, మెల్లగా తాళంచెవి తలగడ కింద పెడుతుంది.
    తరువాత కొంతసేపటికి నాయిక భర్తతో "రాత్రి మీరు తాళం తలగడ కిందనే కదా పెట్టారు" అని అంటుంది. అవును అనుకొని భర్త మరొకసారి తలగడ కింద చూస్తాడు.
    తాళం దొరుకుతుంది. భర్త ఆనందం ఎక్కువవుతుంది. నీ అంతటి మంచి భార్య ప్రపంచంలో ఎక్కడా లేదని నాయికను ముద్దుపెట్టుకుంటాడు. దానితో కథ కంచికి వెళుతుంది.

 Previous Page Next Page