Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 18

   
     ఎదురింటి ఆండాళమ్మ కుక్క ఈనింది. వాళ్ళగేదె కొట్టంలో ఓ ప్రక్క! బయటి వాళ్ళెవరినీ అది కొట్టందగ్గరికి రానీయదు. పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోతారనేమో! పిల్లల్ని నాకుతూ, పిల్లలకి పాలిస్తూ అది పిల్లలమీద వర్షించే మమకారం చూస్తే ఒక జంతువుపాటి లేరుకదా ఈ ప్రపంచంలో కొందరు స్త్రీలు-అనిపిస్తుంది. కొందరు కడుపులో ఉండగానే చంపేస్తారు. అలా చంపడానికి వీల్లేని వాళ్ళు బిడ్డ బయటికి వస్తూనే గొంతుపిసికి చంపేస్తారు. అలా చంపడానికి చేతులురాకపోతే ఏ కాలవప్రక్కనో, ఏ చెత్తకుండీల్లోనో పారేస్తారు. తన తల్లి అలాంటిపనే చేసింది. మాత్రుత్వానికే సిగ్గు చేటయిన పని చేసింది. పెంచుకోవాలంటే ఓనాలుగిళ్ళలో పాచిపనిచేసి అయినా పెంచుకోవచ్చు. అలా చేయలేదంటే సమాజంలో తన గౌరవం, మగవాడి అవసరం, జీవితానికి ఒకనిశ్చింత ఇవే ముఖ్యమనుకొని ఉంటుంది. ఎంత హేయమైన స్వార్ధం.

    ప్రేమీకి తన తల్లి చేసినపని గుర్తువస్తే జుగుప్సతో వణికిపోతుంది. ద్వేషంతో భగ భగ లాడిపోతుంది. చాలాసేపటివరకు మనిషికాకుండా పోతుంది.

    ఈ రోజు ఏమీ వ్రాయలేననుకొంది ప్రేమీ. కాఫీకి వేళయిందేమో నని లేచి గడియారం చూస్తే మూడు గంటలే అయింది. కాఫీ పెట్టడానికి ఇంకోగంట టైముంది. నాలుగురోజులక్రితం ప్లాస్టిక్ వైర్ తో మొదలుపెట్టిన ప్లవర్ వాజ్ పూర్తిచేద్దామని చేతిలోకి తీసుకు కూర్చొంది.

    "బాగున్నావా, సుందరం మామా?"

    చిరపరిచితమైన గొంతు వినిపించి దిగ్గునలేచి అవతలగదిలోకి వెళ్ళింది ప్రేమీ. 'ఎప్పుడొచ్చావు, రామూ?" అతడి రాక ఎంత సంతోషాన్ని కలిగించిందో వెలిగిపోతున్న ప్రేమీ ముఖం చెబుతూంది.

    "గంటక్రితమే బాగున్నావా, ప్రేమీకా? నాన్నకి ఏమిటి సుస్తీ? రెండురోజుల క్రితం పేపరు చూస్తూంటే మామ ఇచ్చిన ప్రకటన కనిపించింది. మామకి అంతసుస్తీ ఏం చేసిందా, చేస్తే ప్రేమిక నాకు ఉత్తరం ఎందుకు వ్రాయలేదా అనుకొంటూ బయల్దేరి వచ్చాను," రామచంద్ర జవాబిచ్చాడు.

    "అదే, దగ్గు ఆయాసం! ఇవాళ కొత్త కాదుకదా? ఎందుకిలాంటి పేపరు ప్రకటన చేశాడో తెలియదు. చేసేముందు నాతో ఒక్కమాట చెప్పలేదు. సువర్చల ఆంటీ పేపరుతీసి నా చేతి కిచ్చేవరకు నాన్న ఇలాంటి పనిచేశాడని తెలియదు." తండ్రికేసి కోపంగా చూస్తూ అంది ప్రేమీ.

    సుందరమ్మకీ రామచంద్రరాక ఆనందం కలిగించింది. రామచంద్ర అతడికీ ఆత్మీయుడే. మనసువిప్పి ఏమైనా మాట్లాడుకోవచ్చు. పాప అక్కడుండగా ఏం మాట్లాడాలన్నా భయమే విరుచుకుపడుతుంది. ఆమె కిష్టం లేనిమాటలు వింటే.

    "ఎలా ఉందయ్యా నీగ్రామసేవ?"

    "ఒక వేటకుక్క ఇంకోపేటకి వెడితే ఆ వేటకుక్కలన్నీ ఊరు దద్దరిల్లిపోయేలా అరుస్తాయి. ఈ స్వభావం కొంచెం మనుషుల్లో కూడా ఉందేమో ననిపిస్తుంది. నేను ఆపల్లెకు ఉద్యోగరీత్యా వెడితే వేరుగా ఉండేది! సేవ చేయడానికి వచ్చానని చెబితే వింతగా, అపనమ్మకంగా, వెలివేసినట్టుగా చూశారు. నేను వెళ్ళిన మొదట్లో ఇప్పుడిప్పుడు ఫర్వాలేదు. నేను వాళ్ళకు, వాళ్ళకు నేను అలవాటైపోయాం. ఇహ సేవా కార్యక్రమం అనుకొన్నంత సులభమైంది కాదు. వాళ్ళలో అజ్ఞానం, అవిద్య, అంధ విశ్వాసాలు తొలగించాలంటే నిజంగా వాటితోనే నేనొక సమరం సాగించాల్సి వస్తూంది. ప్రస్తుతం నేను చేస్తున్నది సమరం, సేవ కాదు.

    "మీ నక్సలైట్ల ఉద్యమంకంటే ఇది మేలుకదూ?" ప్రేమీ అంది.

    "మీ అనొద్దు. ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధంలేదు. ప్రస్తుతం నేను గాంధేయుడిని. అందుకే గ్రామసేవకు బయల్దేరాను. దోపిడీ దౌర్జన్యం మనిషికీ మనిషికీకాదు, మనసుకీ మనసుకీ మధ్య రూపుమాపాలని కంకణం కట్టుకొన్న మనిషిని." అగ్ని ప్రజ్వరిల్లినట్టుగా అతడికళ్ళు వెలుగుతున్నాయి తీక్షణంగా.

    "అదిగో. ఆ వాసన వదలలేదు. దోపిడీ, దౌర్జన్యం మార్క్సిజం మాటలు!"

    "డబ్బు ఏ ఒక్కడిదీ కాకూడదు అంటాడు మార్క్స్. ఈరోజు నీ జీవితావసరానికి మాత్రమే సంపాదించుకో, నిలవవద్దు అంటాడు గాంధీజీ. వాళ్ళ సిద్దాంతాల్లో సామీప్యం ఉంది. దోపిడీ, దౌర్జన్యం గాంధీకూడా హర్షించలేడు. ఆ మాటలకి మార్క్సిజం ఇచ్చే వివరణ వేరనుకో."

    "ఒకడిని కొల్లగొట్టి, ఆ కొల్లగొట్టింది పదిమందికి పంచడంలో హింసఉంది. దౌర్జన్యం ఉంది. హింస దౌర్జన్యం మానవాళికి శుభోదయాన్ని తేలేవు. నీకు నువ్వుగా ఏమిచ్చుకొంటావో అదిచ్చుకో ప్రజలకు అదీ గొప్పతనం. శాంతిప్రియుడైన ఏమహనీయుడైనా మానవుడికిచ్చే సందేశం ఇదే."

    "ప్రేమికా. నువ్వు నాకంటే చిన్నదానివే. ఆలోచనల్లో నాకంటే ముందున్నావని ఒప్పుకొంటాను. ఒప్పుకొన్నాను గనుకే విప్లవశంఖం అడవి పొదల్లోకి గిరవాటేసి శాంతి శంఖం పుచ్చుకొని గ్రామసీమలో కాలుపెట్టాను!" రామచంద్రను ఆ విప్లవపంధానుండి ఇవతలికి లాగడానికి తనెంత శ్రమపడిందో గుర్తువచ్చింది ప్రేమీకి. అట్టడుగు బ్రతుకునుండి, నీటి అడుగునుండి రబ్బరుబంతిలా పైకి తన్నుకు వచ్చినవాడు రామచంద్ర.

    రామచంద్రకు చిన్నప్పుడే తల్లీ తండ్రీపోయారు. అసలే అంతంత మాత్రంగా ఉండే సంసారం చితికిపోయింది. నాయనమ్మ అతడిని తీసికెళ్ళి రఘురామయ్యగారింట్లో పనికి కుదిర్చింది. పనిపాటలు చురుగ్గా చేసుకుపోయే అతడంటే సువర్చలకి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అజయ్ కి ట్యూషన్ చెప్పడానికి మాష్టారు ఇంటికి వచ్చేవాడు. మాస్టారు చెప్పేదంతా ఆ చుట్టుప్రక్కలే ఏదో పనికల్పించుకు తిరుగుతూ వినేవాడు రామచంద్ర.

    "చినబాబూ. ఈ 'బి' అక్షరం ఇలాగేనా? 'ళ' రాయడం ఇలాగేనా" అని పలకమీదవ్రాసి అజయ్ కి చూపేవాడు. అజయ్ మంచిమూడ్ లో ఉంటే వ్రాసి చూపించేవాడు దిద్దికూడా పెట్టించేవాడు. లేకపోతే 'నాకు తెలీదుపో'
 

 Previous Page Next Page