Previous Page Next Page 
భారతి పేజి 18

    "అబ్బాయిగారూ! మీరెక్కడ  వున్నారు" అని మళ్ళీ  అరుస్తున్నాడు రాజయ్య దూరం నుంచి.

    "ఇక్కడ, రాజయ్యా" అన్నాడు గట్టిగా సారథి రెండు నిమిషాల్లో  రాజయ్య. తోటమాలీ వారున్న వైపు నడిచి వచ్చారు. ఒకరు గొడుగు పట్టుకున్నారు: మరొకరు దీపం  పట్టుకున్నారు.

    రాజయ్య దీపం ఎత్తి వారిద్దరివంకా  చూసి భయపడిపోయి, "అయ్యబాబో! ఇద్దరూ ఎంత తప్పగా  తడిసిపోయారో! ఇవాళ  నాకు మూడింది. అయ్యగారు నన్ను బతకనివ్వరు" అన్నాడు జరగబోయేది తలుచుకుంటూ.

    అతడలా  భయకంపితుడవటం చూసి భారతికి జాలి వేసింది. "ఇందులో నీ తప్పేముంది, రాజయ్యా? నువ్వేం చేశావు?" అని భర్త అంటాడని ఆశించింది  కానీ అతనేమీ అనకుండా  మెదలకుండా  వూరుకున్నాడు.

    "సరేలెండి. జరిగేదేదో  జరుగుతుంది. అక్కడ  అయ్యగారు కారాలూ మిరియాలూ నూరుతుంటారు. తొందరగా పోదాం, పదండి" అని రాజయ్య వారిద్దర్నీ  బయల్దేరదీసి, మరింత తడవకుండా  వుండేందుకుగానూ తాను వెనక నడుస్తూ  గొడుగు వారిద్దరిమీదా  నిలిచేటట్లు  పట్టుకున్నాడు. మెల్లగా నడిచి పది మినిషాల్లో  అందరూ గేటు దగ్గరకు వచ్చారు.

    "సారథీ, భారతీ డ్రైవరు తలుపు తెరవగానే  చప్పున కారులో ఎక్కి  కూర్చున్నారు. తోటమాలి సెలవు తీసుకుని పాకలో దూరాడు.

    కారులో కూర్చున్నాక సారథికి  చలి మరింత  ఎక్కువయినట్లయి, ముడుచుకుపోయి వణుకుతున్నాడు. అతని అవస్థ  గమనించి రాజయ్య  తలుపులకున్న  అద్దాలు  పూర్తిగా  పైకెత్తేశాడు.

    అతని సుకుమారత్వానికి  ఒక్కోసారి  ఆశ్చర్యం వేస్తోంది  భారతికి. ఎందుకో ఆమె కళ్ళ కా సుకుమారత్వం అందంగానే కనబడుతుంది.

    వర్షం ఇంకా ఏమాత్రం తగ్గుముఖం  పట్టక వుదృతంగా కురుస్తూనే వుంది. ఆ వర్షాన్నీ, చీకటినీ చీల్చుకుంటూ కష్టంమీద ముందుకు దూసుకుపోతున్నది కారు. ముందు అద్దంమీద నీళ్ళు పడి పొగలా  ఆవరిస్తూన్న  దృశ్యాన్ని చెరపటానికి  వైపర్స్ పనిచేస్తున్నాగాని, తిరిగి ఎప్పటికప్పుడు  ఆ మసకతనం పేరుకుంటూ  వుండడంవల్ల  రాజయ్యకి కారు డ్రైవ్ చేయటం  అతి కష్టంగా  పరిణమిస్తూంది. అతను కారు నడుపుతూన్నంతసేపూ, "ఈవేళ అయ్యగారు నా ప్రాణాలు తీసేస్తారు" అని గొణుక్కుంటేనే  వునాడు.

    భారతి వేరే విషయం గురించి  ఆలోచిస్తున్నది. తను నిన్నగాక మొన్న పెళ్ళయిన యువతి. తగుదునమ్మా  అని భర్తతో  షికారుకు బయలుదేరటం  సిగ్గుమాలిన పని అయినా కాకపోయినా, ఈ తడిబట్టలతో భర్తతో కలిసి  అందరూ  చూస్తూండగా కారులోంచి  బయటకు దిగటం మాత్రం తప్పకుండా సిగ్గుమాలిన పనే అవును.

    భయం భయంగా ఆలోచిస్తూ ఆమె పరధ్యానంగా ఎదురుగా ఉన్న అద్దం ద్వారా, అందులోని మసకలోంచి  అవతల కనిపించే అస్పష్టమైన వర్షపు ధారల్నీ, కనిపించీ కనిపించనట్లు రోడ్డునీ తిలకిస్తూంది.

    అంతలో  ఎదురుగా  ఓ ఆకారం నడిరోడ్డుమీద తెల్లగా  ముద్దలా మెరిసినట్లయింది. ఆమె ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూసింది. ఆ ఆకారం కాస్త కదులుతూన్నట్లుగా  కూడా వుంది. కారేమో అంతకంతకూ  దాన్ని సమీపిస్తూంది.

    రాను రానూ భారతికి  ఆ ఆకారం ఓ మనిషిలా గోచరించింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఓ మనిషి కారు దుముకుతూ మీదకు వస్తున్నా ఆ మనిషి కదలటంలేదు. రెండు మూడు క్షణాలు గడిచేటప్పటికి  కారు అతన్ని మరింత  సమీపించి త్రుటిలో  అతనిమీద దూకేంతటి దగ్గరగా పోయింది.

    భారతి ఒళ్ళు ఝల్లుమంది  "డ్రైవర్ కారాపు" అని గట్టిగా అరుద్డామనుకుంది. కాని శక్తిలేనట్లు, గొంతు మూగవోగా  నిస్సహాయంగా ఊరుకుంది.

    డ్రైవరే మేలుకున్నట్లు  గిర్రున బ్రేకు వేసేశాడు. వర్షానికి తడిసి వున్నాయేమో బ్రేకులు మారాం చేసి, అనుకున్నదానికన్నా ముందుకు సాగి చివరికి  ఆ వ్యక్తిని అంటుకున్నట్లు  కారు ఆగిపోయింది.

    రాజయ్య కోపంగా  ఘార్ణిల్లి, "తాగి వున్నావా, బాబూ! ఈ రోజుతో భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయనుకున్నాను. ఈవేళ నువ్వు లేచిన  వేళ చాలా మంచిదనుకో. ఇంకా ఎందుకు విగ్రహంలా నిలబడ్డావు ఎదురుగుండా? లే. అడ్డులే" అని అరుస్తున్నాడు.

    ఆ వ్యక్తి కారు వంక  ఒకసారి తిన్నగా చూసి, వెర్రిగా నవ్వి ప్రక్కకి  తప్పుకున్నాడు. అప్పుడు కనిపించిందతనికి  ముఖం భారతికి స్పష్టంగా. ఆమె ఒళ్ళు మరోసారి ఝల్లుమంది.

    "నాగరాజు! ఇంత గాలివానలో, ఈ ఊళ్లో, చీకటివేళ ఎక్కడికి  నడిచిపోతున్నాడు? అసలెక్కడి నుంచి వస్తున్నాడు?"

    ఆమెకు వూపిరాడనట్లయి, నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కారు ముందుకు సాగిపోయింది.

    నాగరాజు ఎలాంటివాడో, అతని నైజగుణం  ఎటువంటిదో  ఆమెకు స్పష్టంగా తెలియదుగాని అతనంటే ఆమెకు హీనమైన అభిప్రాయం వుంది. తగని అసహ్యం. అతను దుర్మార్గుడనీ, అతని చరిత్ర చాలా చెడ్డదనీ ఆమె నమ్మకం.

    భారతిని అజ్ఞాతమైన  భయం  ఆవహించింది. ఆమె మనసు కీడును శంకించినట్లయింది.

    సారధి కారులో  కూర్చున్నప్పటి నుంచీ  చలికి గడ్డ కట్టుకుపోతూ ముడుచుకు పోతున్నాడనీ, అతని నోటి నుండి ఒక్క మాట కూడా  వెలువడటం లేదనీ ఆమె మరిచిపోయింది.

    కారు గంగాధరంగారి  భవనం ముందు  ఆగేసరికి  మరో పది నిమిషాలు గడిచింది. తెరిచివున్న గేటులోంచి కారు లోపలికి  పోనిచ్చాక రాజయ్య తలుపు తెరుచుకుని దిగి, "మీరు కూర్చునే ఉండండి, బాబూ! నేను దబ్బునపోయి  గొడుగు తీసుకువస్తాను" అని వర్షంలో తడుస్తూ లోపలికి పరుగెత్తాడు.

    మరో అయిదు నిమషాల్లో  అతను గొడుగు తీసుకుని కారు దగ్గరకు వచ్చాడు. సారధి ముందుగా కారు దిగి, గొడుగు చేతిలో పట్టుకుని, "దిగు, భారతీ!" అన్నాడు. భారతి దిగి గొడుగు క్రిందకు వచ్చి మౌనంగా  భర్తను అనుసరించింది. ఎందుకో ఆమె గుండె గబగబ కొట్టుకుంటూంది.

    మెట్లు ఎక్కి ,వసారా దాటి హాలులోకి ప్రవేశించేసరికి "ఆగు!" అన్న సింహగర్జన వినిపించి ప్రాణాలు ఎగిరిపోయినట్లయి  ఆమె ఉన్న చోటనే  నిలబడిపోయింది. ఎలాగో కళ్ళలోకి  జీవం తెచ్చుకుని చూసేసరికి  చింతనిప్పులవంటి  కళ్ళతో, అగ్నిహోత్రుడులా  మండిపోతూ ఎదురుగా  గంగాధరంగారూ, ఆయనకు కొద్దిదూరంలో  గోడకు ఒదిగి, భయకంపితురాలై  నిలబడ్డ  రంగాజమ్మగారూ కనిపించారు. ఇంకా ఆ సమయంలో నౌకరూ, దూరపు బందువులూ  ఎక్కడెక్కడో గదుల్లో  దూరి నక్కి చూస్తూ వుండే వుంటారు. లేకపోతే  అంత పెద్ద ఇంట్లో మా పెళ్ళి జరిగి మూడు దినాలైనా  కాకముందే కనిపించే మనుషులు ఆ ఇద్దరేనా?

    భారతి ప్రక్క సారధి కూడా అప్రతిభుడై  నిలబడిపోయాడు. అతని గుండె దడదడలాడిపోయింది. తండ్రి అనేకులమీద  మండిపడటం  ఇదివరలో చూసినా, ఇంతటి  వుగ్రరూపం దర్శించి ఎరగడు.

    గంగాధరంగారు చేతి కర్రని  జుళిపిస్తున్నట్లుగా  గాలిలో  ఊగిస్తూ  భారతికి సూటిగా వచ్చి క్షణం దూరంతో నిలిచాడు.
    మళ్ళీ ఆయన గర్జన వినబడింది. "భారతీ! నువ్వు మమల్ని మోసం చేశావా లేదా?"

    భారతి ముఖంలోంచి నెత్తురంతా క్రిందికి దిగిపోయి, తెల్లగా మారిపోయింది. అచేతనంగా నిలబడిపోయి  ఆయనవంక కళ్ళప్పగించి చూస్తూంది.

    "ఏమీ తెలియనిదానిలా  అలా గుడ్లు  మిటకరించి చూడకు. ఎన్నడూ  ఎవరిచేతా మోసగించబడని నన్ను నువ్వూ, మీ నాన్నా కలిసి వంచించారా లేదా? నువ్వు నన్నిక బుకాయించలేవు. ఏం? మీరిద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టలేదూ?"

    భారతి కళ్ళ ముందు నల్లని మబ్బులు  క్రమ్ముకున్నాయి. క్షణకాలం  మాత్రమే. అంతలోనే ఆ మబ్బుల మధ్య మెరుపు  మెరిసినట్లయింది. ఆమెకు అంతా బోధపడింది.

 Previous Page Next Page