"గొప్పగా చెప్పావు హమీద్...." అంటూ పనివాళ్ళలోంచి ఒకడు అరిచాడు.
"ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు-" అన్నాడింకో పనివాడు.
"చెబుతాను. మనమేం చేయాలంటే..." ....
అక్కడ వీడియో ఆగిపోయింది.
"ఇంకా చూస్తావా-చూసింది చాలా?" అన్నాడు నాయుడు.
హమీద్ తడబడుతూ-" పోరాపాటైపోయింది బాస్!" అన్నాడు.
"పొరపాటంటే-అది నీ ఉపన్యాసమా-లేక నువ్వు నాకు దొరికిపోవడమా?" అన్నాడు నాయుడు.
హమీద్ మాట్లాడలేదు.
"పనివాళ్ళముందొకలాగా - నాముందొకలాగా మాట్లాడితే దాని భావం ఏమిటో తెలుసా? నువ్వు అటువాళ్ళకూ-ఇటు నాకూ కూడా నమ్మకద్రోహం చేస్తున్నావన్నమాట...."
హమీద్ మాట్లాడలేదు.
"ఇంతకీ అలా ఉపన్యాస మిమ్మని నిన్నెవరు పురికొల్పారు?"
"క్షమించండి బాస్-ఎందుకో నాకే అలాంటి బుద్ధిపుట్టింది....."
"ఇందులో క్షమార్పణ ప్రసక్తి ఏముంది? నీకు అలాంటి బుద్ధి పుట్టిందంటే ఆ తప్పు నాదే! నేను మీకు బాగాలోకువిచ్చి ఉండాలి. లేదా మీ పనికి సరైన న్యాయం చేకూర్చలేక పోతున్నానో-?"
హమీద్ మాట్లాడలేదు.
"సమస్యలనేవి అందరికీ ఉంటాయి. సమస్యలు వచ్చినపుడు ఆవేశపడి అందర్నీ రెచ్చగొట్టడంవల్ల అవి పరిష్కారంకావు. సమస్యల పరిష్కారానికి నాకు తెలిసిన తిరుగులేని ఉపాయమొకటున్నది. అదేమిటో తెలుసా-బల్ల కటూ ఇటూ కూర్చుని కబుర్లు మొదలెడితే ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు-" అన్నాడు నాయుడు.
హమీద్ మాట్లాడలేదు.
"భయపడకు-నాతో పద...." అన్నాడు నాయుడు. హమీద్ మారు మాట్లాడకుండా నాయుడిని అనుసరించాడు. ఇద్దరూ అక్కణ్ణించి ఓ గదిలోనికి ప్రవేశించారు. ఆ గదిలో ఒక బల్ల ఉన్నది. బల్ల కటూ యిటూ కుర్చీలు. బల్లమీద యాష్ ట్రే!
"కూర్చో!" అన్నాడు నాయుడు.
సంకోచిస్తూనే హమీద్ ఓ కుర్చీలో కూర్చున్నాడు. నాయుడు అవతలివైపు తనూ కూర్చుని-"డియర్ హమీద్-నువ్వు ఆకలిబాధ భరించలేక నేరస్థుడివయ్యావు. నిన్నెవ్వరూ నేరాలు చేయమని ప్రోత్సహించలేదు. నీ ఆకలే నిన్నందుకు ప్రోత్సహించింది. ఒప్పుకుంటావా?" అన్నాడు.
హమీద్ అంగీకార సూచకంగా తలాడించాడు.
"సిగరెట్ తాగుతావా?" అన్నాడు నాయుడు. హమీద్ తల అడ్డంగా ఊపాడు. అప్పుడు నాయుడు సిగరెట్ కేసుతీసి- "నేను కాల్చితే అభ్యంతరం లేదుగా?" అన్నాడు. హమీద్ తల అడ్డంగా ఊపగానే అతడు సుతారంగా సిగరెట్ పెదాల మధ్య ఉంచుకుని-సిగరెట్ కేసునే లైటరుగా ఉపయోగించాడు. తర్వాత కేసు జేబులోనికి వెళ్ళిపోయింది. నాయుడి ఎడమచేయి యాష్ ట్రేను గిరగిరా తిప్పుతున్నది. హమీద్ ఆ యాష్ ట్రే వంకనే చూస్తున్నాడు.
"నేరాలు నీ ఆకలిని కొంతవరకూ తీర్చాయి. కానీ నువ్వు పోలీసుల బారినుంచి తప్పించుకోలేక పోయావు. ఫలితంగా జైలు పాలయ్యావు. జైల్లో నీకు దొరికిందేమిటి-కుళ్ళురొట్టెలు-అంతేకదా!"
హమీద్ తల ఊపాడు.
"నేను నిన్ను ఆకలినుంచీ, పోలీసులనుంచీ, జైలునుంచీ, కుళ్ళు రొట్టెల బారినుంచీ రక్షించాను. పోలీసులు నేరస్థుడికి శిక్ష ఇస్తారు-కానీ రొట్టె ఇవ్వలేరు. ఉద్యోగం ఇవ్వలేరు. నీ ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేరు. అవన్నీ నేను చేశాను-నిజమే కదా!"
హమీద్ తల ఊపాడు.
నాయుడుచేయి వెనక్కుజాపి గోడమీది ఓ స్విచ్ దొక్కాడు. మరుక్షణం గదిలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. నాయుడా యువకుడు ప్రవేశించాడు. నాయుడా యువకుడి వంక చూసి- "మిస్టర్ హమీద్ ఫైలు తీసుకునిరా-"అన్నాడు.
కొద్ది క్షణాల్లో ఒక ఫైలు నాయుడి ముందుకు వచ్చింది. ఆయువకుడు వెళ్ళిపోయాడు. నాయుడు ఫైలు తెరిచి- "అరె, నాకు గుర్తేలేదే-నువ్వు నీ స్నేహితులకు అన్యాయం చేశావు. భార్యను మోసం చేశావు. నీవంటి వాడితో కలిసి జీవించడం దుర్భరమని నీ భార్య నిన్ను వదిలిపెట్టింది. ఆమె కారణంగానే నువ్వు పోలీసులకు పట్టుబడ్డావు...." అని మరికొన్ని కాగితాలు తిప్పి-"భార్య శరీరంలో వ్యాపారంచేయాలనుకోవడం ద్రోహమే అని కోర్టుకూడా అన్నది. నీవు భార్యకు ద్రోహం చేశావని తిరుగులేని విధంగా ఋజువయింది. అంటే ద్రోహం చేయడం మొదట్నించీ నీకు అలవాటేనన్నమాట-అందుకే ఇప్పుడు నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావు-" అని-"నీ ఫైలులో ఇంకా చాలా వివరాలున్నాయి-చదవనా-గుర్తుచేయనా?" అన్నాడు.
"వద్దుబాస్..." అన్నాడు హమీద్ భయంగా.
"నువ్వు నేరస్థుడివి. రక్షణలేని నేరస్థుడివి. నేను నీకు రక్షణ కల్పించాను. నేరస్థుడిని దేశద్రోహిగా మార్చాను. ఈ పనికి నువ్వు చక్కగా సరిపోయావు. ఎందుకంటే ద్రోహంచేయడంలో నిన్ను మించిన వారు లేరు-అందుకే నిన్నిప్పుడు పిలిచాను. వింటున్నావా?"
"వింటున్నాను బాస్-" అన్నాడు హమీద్.
"ద్రోహం చేయడమంటే నీకు యిష్టం. అది నీ హాబీ. నీ రక్తంలో జీర్ణింకుకుని పోయింది. కొంత కాలంగా ద్రోహంచేసే అవకాశం రాకద్రోహం చేయడానికి ఎవరూ దొరక్క- తెగించి నాకే ద్రోహం చేయాలనుకున్నావు. నీ గురించి తెలిసికూడా నిన్నుపేక్షిం'చడం నా తప్పు-" నాయుడి ఎడమచేయి ఫైలును వదిలి యాష్ ట్రేను పట్టుకున్నది. సిగరెట్ కుడిచేతి వ్రేళ్ళమధ్య ఉన్నది.
"ఇంకెప్పుడూ ఇలా జరగదు. నన్ను మన్నించండి బాస్-" అన్నాడు హమీద్.
"తప్పు నీదైతే కదా- నిన్ను మన్నించడం. నువ్వే నన్ను మన్నించాలి. నా తప్పును నేను దిద్దుకుంటాను. ఇప్పుడు నేను నీకు ద్రోహంచేసే అవకాశం ఇస్తాను. శ్రద్దగా విను-" అని ఒక్క క్షణం ఆగి- "జీవితంలో పైకి రావాలంటే అన్నంపెట్టిన వాడిని కాదు- నీతో పాటు అన్నం తింటూ-నీవే తమ అన్నవని భావించేవారిని ద్రోహంచేయాలి. వెళ్ళి నీ స్నేహితులకు చెప్పు. వారిలో ప్రతి ఒక్కడి జీవితమూ నా వద్ద ఫైళ్ళ రూపంలో ఉన్నది. వారు నన్ను వదిలితే-జైల్లో రాళ్ళు కొడుతూ, ఎండు రొట్టెలు తింటూ జీవితంగడపాలి. నేను వాళ్ళకు అన్నం పెడుతున్నాను. ఇల్లిచ్చాను. రక్షణ కల్పించాను. ఇంతవరకూ నీవు వాళ్ళకు చెబుతున్నవన్నీ అబద్దాలు. నన్ను నమ్ముకుంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఏమంటావ్-నేను చెప్పేదంతా నిజమే కదా-" అన్నాడు.