Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 20


    "అవును బాస్!"
    "అయితే వెళ్ళు ఈ నిజాన్ని వాళ్ళకు వంటబట్టేలా ప్రచారంచేయి. వాళ్ళను పూర్తిగా నా వాళ్ళను చేయి. అప్పుడు నీ స్థానం ఇంకా పైకి పోతుంది. అతి త్వరలో నువ్వీ విజయం సాధిస్తే - నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను. సమ్మతమేనా?"
    హమీద్ ముఖంలో సంతోషం కనబడింది. అతడు తల వూపాడు.
    నాయుడు యాష్ ట్రేని ఓ పొజిషన్లో ఆపాడు. తన చేతిలోని సిగరెట్ నుఇ అందులో నలిపి ఆర్పి-అలాగే వదిలేశాడు.
    "ఇంక నువ్వు వెళ్ళొచ్చు-" అన్నాడు నాయుడు. హమీద్ లేచి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాలాగి తనూ గదిలోంచి బయటకు వచ్చాడు నాయుడు అప్పుడు అతడినొక యువకుడు పలకరించి- "బాస్! సోము అర్జంటుగా మిమ్మల్ని చూడాలంటున్నాడు-" అన్నాడు.
    "అయితే హాల్లోకి పంపించు-" అన్నాడు నాయుడు. యువకుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నాయుడు హాల్లోకివెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కొద్ది క్షణాల్లో అక్కడికి సోము వచ్చాడు అతడి భుజానికున్న కట్టును చూసి- "ఏం జరిగింది" అన్నాడు నాయుడు.
    "ప్రమాదం బాస్-" అన్నాడు సోము.
    "ప్రమాదం నా మారుపేరు, ఇంకేమైనా విశేషాలుంటే చెప్పు-" అన్నాడు నాయుడు సోమువంకనే పరీక్షగా చూస్తూ.
    సోము క్లుప్తంగా హోటల్లో తనకు జరిగిన అనుభవం చెప్పి "వాడీ ఊళ్ళో ఉండడం మనకు ప్రమాదం బాస్-" అన్నాడు.
    "వాడు వురకలు వేస్తున్న నది కావచ్చును. అలాంటి వాడు సముద్రంలో కలవకతప్పదు. మనం వాడి గురించి మరికాస్త తెలుసుకోవాలి-" అన్నాడు నాయుడు.
    "ఎందుకని?"
    "వాడు పోలీసుల మనిషయుండడు. మనకలాంటి వార్తలేమీ రాలేదు. దుడుకువాడయుంటాడు. ఈ ఊరుగురించో, మనప్రతిభ గురించో విని మనతో కలవాలని వచ్చి ఉంటాడు. తన సరుకు చూపించాడు. చౌదరి కొట్టేసేలోగా ఇలాంటివాణ్ణి మనం స్వాధీనం చేసుకోవాలి నా అనుమానం ఇప్పటికే చౌదరి వాణ్ణి కలిసి ఉంటాడని...." అన్నాడు.
    "ఇప్పుడు నన్నేం చేయమంటావు బాస్!" అన్నాడు సోము.
    "వాడి శక్తియుక్తులు మనకు తెలియాలి. మనమేమిటో వాడికి తెలియాలి. అందుగురించి వేట ప్రారంభించు. వాడిని ప్రాణాలతోనే పట్టుకునే టందుకు ప్రయత్నించు-" అన్నాడు నాయుడు.
    "వాడినెలా పట్టుకోవాలో నాకు తోచడంలేదు బాస్!"
    "పులిని పట్టాలంటే ఎరకావాలి. ఎరగా ఆపిల్లనే ఉపయోగించు. ఆపిల్ల పేరేమిటన్నావ్?" అన్నాడు నాయుడు.
    "దాని పేరు విశాల. ఏదో కంపెనీలో స్టెనాగా పనిచేస్తోంది-"
    "అలాగా ఆ పిల్లకో ఉత్తరం రాసివ్వు. నేను చెప్పేవరకూ మళ్ళీ ఆమె జోలికి వెళ్ళకు-" అన్నాడు నాయుడు.
    "పట్టుకున్నాక వాడినేం చేద్దాం బాస్...."
    "పులిని పట్టుకుని ఏం చేస్తాం? సర్కస్ చేయిస్తాం-" అన్నాడు నాయుడు. ఆ మాటలని అతడు తమాషాగా నవ్వాడు.
    
                                            11
    
    గోపీ హోటల్లోంచి బయటకువచ్చి బుల్లెట్ స్టార్ట్ చేస్తూ- "చౌదరిచ్చిన వారం రోజుల్లోనూ ఒకరోజు గడిచింది-" అనుకున్నాడు.
    బుల్లెట్ స్టార్టయింది. అతడు దాన్నధిరోహించేలోగా-"ఏయ్ మిస్టర్...." అంటూ పరుగున విశాల అక్కడకు వచ్చింది.
    గోపీ ఆమెను చూడకుండా తీక్షణమైన కళ్ళతో చుట్టూ చూడసాగాడు. విశాల ఆశ్చర్యంగా- "ఏమిటలా చూస్తున్నావ్?" అనడిగింది.
    "నీ వెంటబడిన వాడెక్కడా అని చూస్తున్నాను-"
    విశాలముఖం ఎర్రబడింది- "ప్రతి రోజూ నన్నెవరోఒకరు వెంటాడాలనుంటుందా నీకు-?"
    "అయితే ఈ రోజు ఎవరూ నీ వెంటబడలేదా?"
    "లేదు-"
    గోపీ నిట్టూర్చి- "ఈ ఫిరంగిపురం వాళ్ళంతా చచ్చుదద్దమ్మలని ఈరోజే నాకు తెలిసింది. మా ఊళ్ళో అయితే నీవంటి సౌందర్యవతి ఇలా రోడ్డుమీదకు రాగానే అలా పదిమంది వెంటపడతారు. అయినా ఎవరూ వెంటపడకపోవడం నీ అందానికి అవమానమని నీకు అనిపించడంలేదూ?" అన్నాడు.
    "ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందీవిషయంచూడు. నా ప్రియుడు నాకు ప్రేమలేఖ వ్రాశాడని నీకు చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ పూర్తిగా చదివి అప్పుడు నీ అభిప్రాయం చెప్పు-" అన్నది విశాల.
    గోపీ ఆమె చేతిలోని ఉత్తరం అందుకుని బుల్లెట్ ఇంజన్ ఆఫ్ చేశాడు. ఉత్తరం పైకే చదువుతూ-"డియర్ విశాలా!" అని- "అయితే నీ పేరు విశాల అన్నమాట. నువ్వు నాకు ఇంతవరకూ నీ పేరే చెప్పలేదు-" అన్నాడు.
    "నువ్వు నీ పేరు చెప్పావు గనుకనా-" అన్నది విశాల.
    "నా పేరు నీచేతే చెప్పిస్తాను...." అన్నాడు గోపీ.
    "ఎలా?"
    "పదిమంది గూండాల్ని ఒక్కచేత్తో చిత్తుచేసేవాణ్ణి ఏమంటారు?"
    "హీరో - అదే నా పేరు-" అని- నీ పేరు నేను చెప్పాను. నా పేరు నువ్వు చెప్పావు. ఇలాంటి సంఘటన ఎక్కడో చూసినట్లు గుర్తు-" అన్నాడు గోపీ.
    విశాల ముఖం ఎర్రబడింది. పెళ్ళిళ్ళలో వధూవరుల పేర్లు ఒకరి చేత ఒకరివి చెప్పిస్తారు. గోపీ మాటలు అర్ధంకాగా ఆమె టాపిక్ మార్చడం కోసం- "నీ తెలివికి సంతోషించాను. ఉత్తరం చదువు..." అన్నది.
    గోపీ ఉత్తరాన్నామెకు అందించి- "నేను ఉత్తరాలు చదవను. చూస్తాను. ఇది చూడడం అయిపోయింది-" అన్నాడు.

 Previous Page Next Page