Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 18


    "అబ్బాయ్-అలాగనకు. నువ్వు నామాటవింటే నీకోపెద్ద బంగళా బంగళానిండా పనివాళ్ళు- కావాలంటే రోజుకొక అందమైన భార్య .....అన్నీ నీకోసం ఏర్పాటు చేస్తాను. నావంటి బాస్ నీకు దొరకడు...." అన్నాడు చౌదరి.
    "భలేబాస్ వి నువ్వు...." అని గోపీ అదొకలానవ్వి-"ఇందాకా ఇక్కడ సోముతో జరిగినదంతానాటకమని నీకు తెలియదా?" అన్నాడు.
    "అంటే?" అన్నాడు చౌదరి.
    "నేను నాయుడిమనిషిని. నిన్నెలాగో ట్రాప్ చేసి చంపమని నాయుడు నాకుచెప్పాడు. అందుకోసమని ఇందాకటి నాటకమంతా ఏర్పాటయింది. ఇప్పుడు నేను నిన్ను అవలీలగా చంపివెళ్ళిపోగలను. నాకు నువ్వు బాస్ వి కావాలను కుంటున్నావు. ముందు దైవప్రార్ధన చేసుకో -"
    "అబ్బాయ్-" అన్నాడు చౌదరి- "నీపేరేమిటో నాకు తెలియదు గానీ-నీ జేబులోంచి ఏ ఆయుధాన్నైనా తీసి నాపై ప్రయోగించాలనుకుంటే నీతలలోంచి ఒక్కసారిగా ఆరుగుళ్ళు దూసుకుని పోతాయి. నన్ను తక్కువగా అంచనా వెయ్యకు-"
    "నేనునమ్మను-" అన్నాడు గోపీ.
    "అయితే ఒక్కసారి చుట్టూచూడు-"
    గోపీ జేబులో చెయ్యిపెట్టి చుట్టూ చూశాడు. చురుకైన అతడి కనులు తనకు కాస్తదూరంలో-హోటల్లో ఆరు చోట్ల చలనం కలగడం గమనించాడు. చౌదరినిజమేచెప్పాడని అతడు గ్రహించాడు. అప్పుడు సుతారంగా జేబులోంచి రుమాలు తీసి ముఖంతుడుచుకున్నాడు.
    "చెమటలు పట్టాయికదూ-" అన్నాడు చౌదరి మందహాసంచేస్తూ.
    "కళ్ళమ్మట నీళ్ళు వస్తే ఏడుస్తున్నారేమోననుకోవచ్చు నువ్వు. అవి ఆనందబాష్పాలయ్యే అవకాశంకూడాఉంది-" అన్నాడు గోపీ.
    "అంటే?"
    "ఇప్పుడు నీ అనుచరులు నాకుగురిపెట్టిన రివాల్వర్సు వెనక్కు తీసుకున్నారు-"
    "వెర్రివాడా-నీజేబులోకి చేయిపోయిందంటే - అవిమళ్ళీనీకు గురి పెట్టబడగలవు--"
    "సరే-ఒక్కసారిబల్లక్రిందకుచూసి-నాచేతిమీది రుమాలు తీసుకో-"అన్నాడు గోపీ.
    చౌదరి వంగి బల్లకిందకు చూశాడు. బల్లకింద గోపీ ఎడమచేయి ఉంది. ఆ చేతిమీద రుమాలు కప్పిఉంది. ఇందాక అతడుముఖంతుడుచుకున్న రుమాలే అది! చౌదరి ఆరుమాలుతీసి ఉలిక్కిపడ్డాడు. ఆ చేతిలోనే చిన్నసైజు పిస్టల్ ఉన్నది. బహుశా అది ఇందాకారుమాలు మడతల్లో ఉండిఉండాలి.
    "చెమట పడుతున్నదా?" అన్నాడు గోపీ.
    చౌదరి ఒక్కక్షణం ఏమీమాట్లాడలేదు. తర్వాత గంభీరంగా "నీశక్తిని తక్కువ అంచనా వేసినేను చాలా పెద్దపొరపాటు చేశాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. నేను ఓడిపోయాను-" అన్నాడు.
    "ఓడిపోయానన్నావుకదా-ఆ ఒక్కమాట చాలునాకు. ఈ క్షణం నుంచీ నువ్వునాకు మిత్రుడివి. ఆ పిస్టల్ తీసుకుని నా కిచ్చేసేయ్ - అదే స్నేహానికి చిహ్నం నీమీద నాకేర్పడిన నమ్మకానికి గుర్తు...." అన్నాడు గోపీ.
    చౌదరి అతడిచేతిలోని పిస్టల్ తీసుకుని-దాన్ని రుమాలుతో కప్పి-మళ్ళీ గోపీకి బల్లపైన తిరిగి ఇచ్చాడు-"థాంక్స్-" అన్నాడు గోపీ.
    "నీకు బాస్ ని కావాలనుకోవడం నా పొరపాటు. ఈక్షణంనుంచీ నువ్వునాకు పార్టనర్ వి-" అన్నాడు చౌదరి.
    "అలాగన్నావుబాగుంది. ఎగ్రీడ్?" అన్నాడు గోపీ.
    "మనం మళ్ళీ వారంరోజులతర్వాత కలుసుకుందాం. అంతవరకూ సెలవు-" అన్నాడు చౌదరి.
    "సెలవు తీసుకునేముందు ఒకచిన్న మనవి. ఈ ఊళ్ళోమంచి చెరువులు, కుళ్ళుకాలువలు ఎక్కడున్నాయో చెబుతావా?" అన్నాడు గోపీ.
    "అవెందుకు?" అన్నాడు చౌదరి ఆశ్చర్యంగా.
    "వారంరోజులంటే మాటలుకాదు. చెరువు దగ్గరకుపోయి చేపలు పడతాను. కుళ్ళు కాలవదగ్గరకుపోయి దోమల్ని చంపుతాను-కాలక్షేపానికి ఏదోపనికదా-" అన్నాడుగోపీ.
    "అబ్బాయ్-నీ దిగులు అర్ధంలేనిది. ఈ వారంరోజులూ నిన్ను నాయుడి మనుషులు వేటాడుతూంటారు. కాలక్షేపానికి నీకేలోటూ ఉండదు-"
    "అంటే వారంరోజులపాటు నన్ను శత్రువుల దయాధర్మానికి వదిలి పెడతావా? సోము-నాయుడి మనిషని నాకు తెలియదు. నువ్వు దుర్మార్గుడివి. ఇప్పుడీ వారంరోజులూ నా గతి ఏంకావాలి?" అన్నాడు గోపీ భయపడుతూ.
    
    "సరే-అన్ని విద్యలతోపాటు నటనకూడా నేర్చుకున్నావన్నమాట నీ ప్రతిభ మెచ్చుకోతగ్గది-" అని- "నీమీద నాకు పూర్తి నమ్మకముంది. వారంరోజుల తర్వాత మనం మళ్ళీ కలుసుకుంటాం-" అన్నాడు చౌదరి.
    "బ్రతికుంటే తప్పక కలుసుకుంటాం-" అన్నాడు గోపీ సాలోచనగా అప్పుడతడి ముఖమెంతో గంభీరంగా ఉన్నది.
    
                                               10


    అక్కడ సుమారు యాభైమంది పనివాళ్ళున్నారు. వారి ముందు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
    "మనిషికి సోమరితనం మంచిదని నేననను. కానీ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి. లేనప్పుడు తృప్తి అన్నది ఉండదు. అందులోనూ మనవంటివారి పరిస్థితి మరీ దారుణం. చేసేది గాడిద చాకిరీ. ఇదే చాకిరీ భూస్వాములకు చేస్తే అమాయకులమన్న తృప్తి ఉండేది. జైల్లో చేస్తే చేసిన నేరాలకు శిక్షనను భవిస్తున్నామన్న తృప్తి ఉండేది. ఏ గవర్నమెంటాఫీసులోనైనా చేస్తే ప్రజాసేవ చేస్తున్నామన్న తృప్తి అయినా ఉండేది. కానీ మనమిక్కడ దేశభక్తిని, ఆత్మాభిమానాన్ని, అంతరాత్మను చంపుకుని-చట్టవిరుద్ధమైన పనులను చేస్తున్నాం. అందుకు సరైన ప్రతిఫలం లభిస్తున్నదా అని నేను మిమ్మల్నందర్నీ అడుగుతున్నాను. మన చాకిరీకి ఫలితంగా కొందరికి జేబులు నిండి కోట్లకు పడగ లెత్తుతూంటే మన జీవితం అంతంత మాత్రంగానే ఉన్నది. అటు మంచి వారమన్న పేరూలేదు. ఇటు చెప్పుకోదగ్గ సంపాదనాలేదు. ఈ విషయమై మన మందరం తీవ్రంగా ఆలోచించాలి...." అని ఆగాడతడు.

 Previous Page Next Page