"అందిందో లేదో అని భయపడుతూ వచ్చాను.... ఇంతకూ వీరెవరు?" చిరంజీవిని చూస్తూ అడిగిందామె.
"వాడు నా ఫ్రెండండీ! ఇద్దరం ఇంటర్ కలిసి చదువుకున్నాం"
"ఓహో! క్లాస్ మేటన్నమాట"
"అవునండీ, 'డి' సెక్షన్! కదురా?"
"అవునండీ..... 'డి' సెక్షన్! రోల్ నెంబర్ థర్టీ సెవెన్"
"నమస్తే" అందామె చిరంజీవివేపు తిరిగి.
"నమస్తే.... నమస్తే..... నమస్తే."
"మీ పేరేమిటండీ?"
"చిరంజీవి అంటారండీ?"
"ఎవరు?"
"ఎవరా? ఎవరంటే... అదే అందరూనండీ.. వీడు కూడా అంతే"
"నిజమేనండీ! వాడి పేరు చిరంజీవే"
"ధనుంజయ్ గారూ మీరేదో రాస్తున్నట్లున్నారు కదూ?" టేబుల్ మీద కాగితాలు, పెన్నూ చూసి అడిగిందామె.
"అవునండీ! అర్జంటుగా ఓ నవల రాద్దామనీ..."
"మీ నవలలంటే నాకెంతో ఇష్టమండీ! మీ నవలలోని హీరోలందరూ రోజుకొకరు చొప్పున నా కలలో కనిపిస్తారండీ"
"అలాగా చాలా సంతోషం"
"కనబడి ఏం చేస్తారో తెలుసాండీ?"
"తెలీదండీ! ఏం చేస్తారు?"
"తెల్లారే వరకూ వదలరండీ! కబుర్లు చెప్తారు; షికార్లు తీసుకెళ్తారు, భలే తమాషాగా ఉంటుందిలెండి! మీ నవల 'గతి తప్పిన మతి' ఎన్ని సార్లు చదివానో మీకు రావానా?"
"రాయలేదండీ!"
"ఇరవై మూడుసార్లు"
"ఎందుకండీ అన్ని సార్లు చదవడం?"
"కనీసం అప్పటికయినా సురేఖ పంతం మాని శ్రీవిరించి దగ్గరకెళ్తుందేమోనండీ!"
సింహాద్రి కన్ ఫ్యూజ్ అయిపోయాడు.
"సురేఖా? సురేఖ ఎవరండీ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"శ్రీదేవి కిలకిల నవ్వేసింది.
"అదేమిటి! మీ నవల్లో హీరోయిన్నే మర్చిపోయారా మీరు"
సింహాద్రికి చెమటలు పట్టేసినాయ్.
"ఇహి.... ఇహిహి" అన్నాడు తప్పించుకోడానికి.
చిరంజీవి మళ్ళీ సింహాద్రి రక్షణకు వచ్చేశాడు.
"వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువలెండి. నవలల పేర్లు, పాత్రలు, సంఘటనలు, కథావస్తువు ఇవేవీ గుర్తుండవండీ! కదురా?"
సింహాద్రి ఠకీమని తేరుకున్నాడు.
"అవునండీ! అస్సలు గుర్తుండవు"
శ్రీదేవి ఆశ్చర్యపోయింది.
"అరె! భలే ఆశ్చర్యంగా ఉందే! అంత మతిమరుపువాళ్ళు మరలాంటి నవలలెలా రాయగలుగుతున్నారు?"
"నాకూ అదే తెలీటం లేదండీ. భలే తమాషాగా ఉంది కదండీ?"
శ్రీదేవి ఓ క్షణం ఆలోచనలో పడి ఇంటి లోపల ఇంకా గదులేమయినా ఉన్నాయో మోనని చూసింది.
"ఇంట్లో మీ ఇద్దరే వుంటున్నారాండీ" సింహాద్రి నడిగిందామె.
"అవునండీ!"
"అంటే మీకింకా పెళ్ళికాలేదా?"
"అబ్బే, ఇంకా లేదండీ! పిల్లలు కూడా లేరు"
"అలాగా!"
"అవునండీ!"
"నేనింకా మీకు పెళ్ళయిపోయిందను కుంటున్నాను"
"ఇంకా లేదండీ! చేసుకుందామనే అనుకున్నానుగానీ చేసుకోలేదు"
"ఎందుకని ఆగారు?"
"ఇంతవరకూ అంటే ఇంతకు ముందువరకూ నాక్కావలసిన టైప్ అమ్మాయి కనిపించలేదన్న మాటండీ!"
"మీక్కావలసిన అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ హీరోయిన్ సురేఖలాగానా, చంద్రకళ లాగానా, భారతిలాగానా?"
సింహాద్రి మళ్ళీ కన్ ఫ్యూజ్ అయిపోయాడు.
"ఎలాగా? ఎలాగంటేనండీ! ఎలాగంటే ఎలారా చిరంజీవీ?"
చిరంజీవి ఠకీమని అందుకున్నాడు.
"భారతిలాగా వుండాలనుకుంటున్నాడండీ!"
సింహాద్రిలో కూడా ఉత్సాహం పొంగుకొచ్చింది.
"అవునండీ! అచ్చం భారతిలా వుంటే నాకు భలే ఇష్టం"
"అయ్యో అదేమిటి?" ఆశ్చర్యపోయింది శ్రీదేవి.
సింహాద్రి నీరసపడిపోయాడు.
"ఏమైందండీ?"
"భారతి పిచ్చిది కదండీ మీ నవల్లో?"
"ఆ....పిచ్చిదా?"
"అవును.... మర్చిపోయారా?"
"అబ్బే గుర్తుంది ఏమిట్రా చిరంజీవి?"
చిరంజీవి కంగారుపడ్డాడు.
"అయితే అయితే ఆ భారతి కాదండీ! వీడు రాయబోతున్న కొత్త నవలలో హీరోయిన్ భారతి..."
ఆమె కళ్ళు ఆనందంతో మెరిసినయ్.
"ఓ... మీరు కొత్త నవల రాస్తున్నానన్నారు కదూ?"
"అవునండీ"
"ఈ నవల కూడా హిప్నాటిజం మీదే రాశారాండీ?"
"అవునండీ! బోలెడు హిప్నాటిజం వుంటుంది కథలో అంతేకాదు- టెలీపతి కూడా వుంటుంది"
"కథేమిటో చెప్పరూ? ప్లీజ్"
సింహాద్రి తడబడపోయాడు!
"కథా? కథా అదేనండీ.... ఏమిటంటే.....ఏమిటంటే"
"అదేరా నాకు చెప్పావుగా ఇందాక జమీందారు ఉంటాడు....." తనందుకున్నాడు చిరంజీవి!
"ఆ గుర్తుకొచ్చేసింది- ఇంక నువ్వు చెప్పొద్దు! నేనే చెప్తా చూడు! అనగనగా ఓ జమీందారు ఉంటాడండీ ఆయన రోజు రిక్షా తొక్కి పొట్ట పోసుకుంటూంటాడండీ"
శ్రీదేవి ఆశ్చర్యపోయింది.
"అదేమిటి? జమీందారు రిక్షా తొక్కటం ఎందుకు?"
"ఏమో తెలీదండీ" అంటూ చిరంజీవి వేపు చూశాడతను.
"జమీందారు కాదురా- జమీందారు కొడుకు అన్నామిందాక"