"మాధవ్... యింత చేసిన ఆ దుర్మార్గుల్ని వదిలేయమంటావా?... వాళ్ళు... వాళ్ళు... ఆ నీచులు... ఇంత చేసినా తప్పించుకు పోనీయమంటావా..." వణుకుతున్న గొంతుతో అంది రాధ.
మాధవ్ ఆమెవంక విసురుగా చూశాడు. "వదిలేయక కోర్టు ఎక్కి తెలియని వాళ్ళకి కూడా డప్పుకొట్టి చెప్పుకుందామా..." అన్నాడు కోపంగా.
రాధ తలదించుకుంది.
ఇన్ స్పెక్టర్ అర్థం అయినట్టు తలపంకించి "మీ ఇష్టం సార్, కంప్లయింట్ యివ్వకపోతే మేం ఏం చెయ్యలేం, కాని సార్, ఒక్కమాట... ఇలా పరువుకోసం అలాంటి నీచులని వదిలేయడం వాళ్ళని ప్రోత్సహిస్తున్నటవుతుంది. ఇంకోసారి యిలాంటి పని చేసేముందు భయపడేట్టుగా అలాంటివాళ్ళని శిక్షించాలి సార్... అలాంటివాళ్ళని వదిలేయడం కూడా క్రైమ్ అనే అంటారు. ఆ తరువాత మీ యిష్టం..." ఇన్ స్పెక్టర్ అదోలా అని మాధవ్ కి షేక్ హాండ్ యిచ్చి వెళ్ళిపోయాడు.
ఆరోజు అన్ని పేపర్లలో ఈ వార్త వచ్చింది. మాధవ్, రాధ స్నేహితులందరూ ఈ వార్త చదివి నిర్ఘాంతపోయారు. అప్పటికే ఈ నోట ఆ నోట విన్న కొందరు నిజమో కాదో అన్న సందిగ్ధంలోపడి ఎవరిని అడగాలో తెలియక వూరుకున్నవాళ్ళు పేపరులో చదివి ఆస్పత్రికి వెళ్ళారు.
కాని, అలాంటి సమయంలో హితైషులు చూపే సానుభూతి కూడా చేదుమాత్రలానే వుంది. మండేనిప్పుల మీద ఆజ్యం పోసినట్లు, పుండు కెలికి కారం జల్లినట్టు, వాళ్ళ సానుభూతి వెనక అవహేళన దాగినట్లు, పనికట్టుకు వచ్చి పరామర్శిస్తున్నట్టు వివరాలు వినడానికి కుతూహల పడ్తున్నారని_ తమ వెనక గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటారని... దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లనిపించడంలో ఆశ్చర్యంలేదు. మాధవ్ పరిస్థితి అలాగే వుంది. అంతా వచ్చి భుజంతట్టి జాలిగా చూస్తూ... "ధైర్యంగా వుండాలి మాధవ్... రాధగారికి నీవే ధైర్యం చెప్పాలి" అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంటే_ ఒక్కొక్కరూ వచ్చినప్పుడల్లా మాధవ్ మొఖం వివర్ణమయ్యేది.
రాధ ఎవరివంక తలెత్తి చూడలేనట్లు ఏదో నేరం చేసినదానిలా తల దించుకుని కూర్చుంది.
ఆమె ప్రియ స్నేహితురాలు, కొలీగ్ అయిన సరళ వచ్చి "రాధా... డార్లింగ్..." కంపిస్తూన్న గొంతుతో అని చెయ్యి పట్టుకుంది. రాధ కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. "ఛీ... ఛీ... రాధా... కన్నీళ్ళు పెట్టడానికి ఏం జరిగిందని... నీవు ధైర్యస్థురాలివని అనుకున్నాను..." అంటూ ఏం జరగనట్లు మాట్లాడి ఓదారుస్తున్నకొద్దీ రాధ దుఃఖం ఎక్కువైంది. "మాధవ్... ఏమిటిది, రాధకి ధైర్యం చెప్పవలసిందిపోయి మీరే ఏదో కొంప మునిగినట్టు మొహం పెట్టారేమిటి..." అంటూ మొహం గంటుపెట్టుకుని సీరియస్ గా ఎటో చూస్తున్న మాధవ్ ని చనువుగా మందలించింది.
అందరి రాక వక వంతు- మాధవ్ తల్లిదండ్రులరాక ఒక ఎత్తు_ రెండేళ్ళ తరువాత కొడుకుకి జరిగిన విపత్తు గురించి విన్నాక ఆ కన్నప్రాణం మరి నిలవలేదు. ఆ రెండేళ్ళలో భర్తమాట జవదాటలేక ఆవిడ ప్రాణం యెంత కొట్టుకుంటున్నా మాధవ్ యింటికి రాలేదు. మాధవ్ ఒకటి రెండుసార్లు బజారులో ఎదురుపడినప్పుడు... "మాధవా..." ఆర్తిగా పిలిచింది ఆవిడ. తల్లిని చూచి గబగబా నడిచివచ్చి "అమ్మా" అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు మాధవ్ ఆనందంగా. ఆ తల్లికొడుకులు ఆ పదినిముషాలలోనే పదియుగాల మాటలు మాట్లాడుకున్నారు. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. "అమ్మని మరిచిపోయావా నాయనా... మీ నాన్నగారు లేనప్పుడన్నా రాకూడదా యింటికి" నిష్ఠుర్యం వేసింది ఆ తల్లి.
"అమ్మా... అలా దొంగతనంగా వచ్చిపోవడానికి నేనేం నేరం చేశానమ్మా... ఎప్పటికయినా నాన్న నా తప్పులేదని గుర్తించిననాడు సంతోషంగా వస్తాను. పోనీ, నీ కొడుకు యింటికి నీవెందుకు రాలేదు చెప్పు..." అన్నాడు నవ్వుతూ.
ఆమె జవాబు చెప్పలేక తడబడింది.
"నాన్నగారికిష్టంలేని పని నీవెలా చెయ్యలేవో నేనూ అలాగే చెయ్యలేనమ్మా... చేశాను కనక ఆయన యిష్టానికి వ్యతిరేకంగా నడవను..."
"ఏదో నాయనా కావాలని చేసుకున్నావు. మీ యిద్దరూ ఆనందంగా వుంటే అంతే చాలు" అంది ఆమె తృప్తిగా.
అవకాశం వచ్చినప్పుడల్లా కొడుకుని దూరంచేసిన భర్తని ఆమె క్షమించకుండా దుయ్యబడుతూనే వుంది. ఈరోజు మాత్రం ఆవిడ తెగేసి "మాధవ్ ని వెళ్ళి చూసి తీర్తాను, మీకిష్టంలేదంటే మళ్ళీ గడప తొక్కను, వాడు నాలుగు మెతుకులు పెట్టకపోడు. నాది కన్నాప్రాణం అండీ, ఎలా వూరుకోగలను..." అంటూ ఏడుస్తూ రిక్షా తెప్పించుకుని ఎక్కుతూంటే, ఆయనా వచ్చి మాట్లాడకుండా ఆమెపక్కన కూర్చున్నాడు.
"మాధవా... ఏమిటిరా ఈ ఘోరం, ఎవర్రా ఇంత దారుణం చేశారు" ఆస్పత్రికి వచ్చి గదిలోకి వస్తూనే వంటినిండా కట్లతో పాలిపోయినట్లు పడుకుని వున్న మాధవ్ ని చూస్తూనే ఆవిడ ఏడుస్తూ కొడుకుమీద పడింది.
అవధానిగారు కొడుకుని ఆ స్థితిలో చూసి చలించిపోయి ఏం మాట్లాడాలో తెలియక యిబ్బందిపడ్తూ కొడుకు మంచం దగ్గర నిలబడ్డారు.
తల్లిదండ్రుల్ని చూడగానే మాధవ్ మొహంలో కళ వచ్చింది. "అమ్మా... వచ్చావా... నాన్నగారూ... వచ్చారా" అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు ఆనందంగా.
"ఎవరు చేశారురా యీ పని నాయనా, నిన్నిలా కొట్టడానికి నీవేం అపకారం చేశావురా వాళ్ళకి... వెధవలు డబ్బు, నగలు తీసుకుంటే తీసుకున్నారు. ఇలా దారుణం ఎందుకు చేశారురా... కులం గోత్రం తెలియనిదాన్ని పెళ్ళాడినా మీరిద్దరూ సుఖంగా వున్నారని తృప్తిపడ్డాను. కుక్కముట్టిన కుండ అయిపోయిందిరా ఇప్పుడింక" ఆవిడ ఏడుస్తూ అన్నమాటలకి మాధవ్ గతుక్కుమన్నాడు. కుక్కముట్టిన కుండ! అత్తగారు మామగారు రాగానే మర్యాదగా లేచి మూలగా నిల్చుంది రాధ. ఆ మాటకి రాధ మొహం నల్లబడింది. మాధవ్ రాధవంక చూశాడు. రాధ కళ్ళల్లో తిరిగే నీరు బలవంతాన అదిమిపెడ్తూంది.
"ఎంత కాదనుకున్నా మా కోడలు... కాకపోదు... అసలే తలెత్తుకోలేక చస్తున్నాం... యిప్పుడింక మొహం ఎలా చూపడంరా" అవధానిగారి బాధ అది.
వాళ్ళిద్దరూ రాధ ఆ గదిలో వుందన్నట్టే గుర్తించకుండా అటువేపన్నా చూడకుండా అంటున్న మాటలని సహించే శక్తిలేక రాధ గబగబా ఆ గదిలోంచి వెళ్ళిపోయి వరండాలో బెంచీమీద చతికిలబడి, చేతుల్లో మొహం దాచుకుంది. ఇందులో తన నేరం ఏముందని ఇంత నిర్థాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు? అత్తగారు స్త్రీ అయివుండి కూడా తోటి ఆడదాని గురించి 'కుక్కముట్టిన కుండ' అంటూ అంత హీనంగా ఎలా అనగలిగారు! అదే ఆవిడ కూతురయితే ఆ మాట అనగలిగేవారా?... ఆ క్షణంలో రాధకి తనకెవరూ లేని లోటు తెలిసివచ్చింది. తన తల్లేవుంటే కడుపులో దాచుకునేది తనని... తన అవమానాన్ని ఆమెదిగా భావించి ఈ మాట అన్నవాళ్ళ నోరు మూయించేది. తనకెవరూ లేరు... ఆ క్షణంలో రాధ ఎంతో వంటరిగా ఫీలయింది. తనవాడు అనుకున్న మాధవ్ ఆ రెండురోజులలోనే ఎంతో దూరం అయిపోయినట్లనిపించింది. వంటరిగా, దిగులుగా, భయంగా, దిక్కుతోచనట్టు ఆ బెంచిమీద వంటరిగా అలా ఎంతసేపో కూర్చుంది రాధ.