Previous Page Next Page 
శుభోదయం పేజి 18


    అక్కడున్న డాక్టర్లు, పోలీసులు పురుషులయిన అందరూ తలదించుకున్నారు.
    చీరకొంగుతో మొహం దాచుకు ఏడుస్తూన్న రాధని చూసి అందరూ చలించారు.
    "మేడమ్... నా శాయశక్తులా దోషులని పట్టుకునే ప్రయత్నం ఈ క్షణం నుంచి చేస్తాను. ముందు అక్కడికెళ్ళి ఏమన్నా గుర్తులు దొరుకుతాయోమో చూస్తాం. దురదృష్టవశాత్తు ఆమె ఒక్కక్షణం మాత్రం వాళ్ళని చూశారు కనక గుర్తుపట్టడం కష్టం... అయినా మా ప్రయత్నం మేం చేస్తాం" అంటూ అభయం ఇచ్చి వెళ్ళాడు ఇన్ స్పెక్టర్.
    "చూడమ్మా... నీవింక ఏడుపు మానాలి. అసలే వీక్ గా వున్నావు. మానసికంగా ధైర్యం తెచ్చుకుంటేగాని శారీరకంగా కోలుకోలేవు. మీవారి ఆరోగ్యం బాగోలేదు. ఆయనను చూసుకోవాలంటే ముందు నీవు కోలుకోవాలమ్మా. చూడమ్మా, ఆ దుండగీళ్లు మీపై జరిపిన హత్యాచారంలో మీవారికి చెయ్యి విరిగింది .గాయాలు తగిలాయి. అలాగే నీకూ కొన్ని గాయాలయ్యాయి అవటానికి. నీవు అలాగే అనుకోవాలి తప్ప ఏదో అన్యాయం జరిగింది, అపవిత్రం అయిపోయాను ఇలాంటి తలపు నీకు రాకూడదు. ఆ భావం వచ్చినంతకాలం నీవు శాంతిగా వుండలేవు. ఈ మానం, పవిత్రత అంతా స్త్రీని కట్టడిలో వుంచడానికి పురుషులు పురాణాలలో కథలు సృష్టించారు, అంతే. ఒక్క ఆడదానికే మానం, నీతి, పవిత్రత కావాలి. కాని పురుషులు పదిమందితో తిరిగినా అంటని అపవిత్రత మనకు మాత్రం ఎందుకంటాలి?... అంచేత రాధా! ఈ నీతులు, నియమాలు, పవిత్రతలు వాళ్లకి అనుగుణంగా సృష్టించిన నియమాలు! నీ ప్రమేయం లేకుండా జరిగిన దానిలో నీవేదో అపవిత్రురాలివయిపోయావన్న భావం రాకూడదు. ప్రామిస్..." అంది రాధ భుజం ఆప్యాయంగా తట్టి.
    ఆవిడవంక తెల్లబోయి చూసింది రాధ ఒక్కక్షణం. ఆ తరువాత ఆమెకళ్ళలో వెలుగు వచ్చింది. ఎంత చక్కగా చెప్పింది. ఎంత చల్లగా ఓదార్చింది! ఆరాధనా పూర్వకంగా ఆమెవంక చూసి చప్పున ఆవిడ చేయి అందుకుని మొహం దాచుకుంది రాధ.
    లేడి డాక్టరు రాధ తల ఆప్యాయంగా నిమిరి నవ్వి... చేయి నొక్కి... "వస్తానమ్మా, పనంతా అలాగే వుండిపోయింది. ఏమిటో... ఆడవాళ్ళకి ఏ అన్యాయం జరిగినా వూర్కోలేని వీక్ నెస్ నాది. నా చేతుల్లో చట్టం వుంటే... యిలాంటి వెధవలని ఉప్పుపాతర వేయమనేదాన్ని. హు... ఆడదంటే ఆటబొమ్మ అనుకుంటారు... ఇలాంటి కేసులు చూసినప్పుడల్లా రోజంతా ఏదో అశాంతి, ఆవేశం కల్గుతాయి. ఏం చెయ్యగలం మనం, ఆవేశపడడం తప్ప" నిట్టూర్చి రాధకి చెయ్యి ఊపి వార్డులోంచి వెళ్ళిపోయింది. ఎంత చక్కటి మనిషి- ఆ భారీ విగ్రహం, తెల్లటి తెలుపు, హుందాగా, గంభీరంగా. పవిత్రంగా... తెల్లటి బట్టలతో స్టెతస్కోపు మెడలో వేసుకున్న ఆమెని చూస్తే శాంతిదూతలా అన్పించింది. ఆమె మాటలతో, తన మనసులో భారం తగ్గి తేలిక అయినట్లనిపించింది. మరిచిపోవాలి. ఈ పీడకల మరిచిపోవాలి... అనుకుంది.
    కాని... ఆమె మరిచిపోవడానికి ప్రయత్నించినా... చుట్టూవున్న మనుష్యులు, సమాజం మరిచిపోకుండా అనుక్షణం చూపులతో, మాటలతో చీల్చి చెండాడి మనశ్శాంతి హరించి, అనుక్షణం అందరిముందు దోషిలా బిలబెడ్తారని కొద్దిరోజులలోనే గ్రహించింది రాధ.
    లోకం అంతా ఏమననీ, ఏమనుకోని ఆమె లెక్కచేసేదికాదు. కాని... కాని... మాధవ్... తన మాధవ్... అంతలా మారిపోతాడని, ఆమె ప్రమేయం లేకుండా జరిగిన దుర్ఘటనకి ఆమెని దోషిని చేసి నిలబెట్టి శిక్షిస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. అంత ప్రేమించిన మాధవ్... అంతలా తనను ద్వేషించగలడని రాధ ఎన్నడూ అనుకోలేదు. జరిగిన దుర్ఘటనకి బాధపడ్తాడు. ఓదారుస్తాడు, కలతపడిన మనసుని చల్లని మాటలతో శాంతపరుస్తాడు, దగ్గిరకు తీసుకుని లాలించి అదో పీడకలని మర్చిపో, అంటాడని ఆశించింది. కాని... ఆ పీడకలని తను మరవకుండా, రాధని మర్చిపోకుండా చేసి హింసిస్తాడని ఎదురుచూడని రాధ అతనిలో మార్పుకి తల్లడిల్లిపోయింది.
    తెలివి వచ్చాక... తనమంచం దగ్గిర ప్రాణంలేని బొమ్మలా కూర్చున్న రాధని... తనకోసం విలపిస్తున్న రాధని ఆపాదమస్తకం పరీక్షగా చూస్తున్నట్టు కళ్ళతో రాధ శరీరం అంతా తడిమాడు. ఆ చూపులు గుర్తించిన రాధ సిగ్గుతో, అభిమానంతో చితికిపోతూ "మాధవ్... మాధవ్..." అంటూ అతని గుండెలమీద వాలి ఏడవసాగింది. అతని చెయ్యి ఓదార్పుగా ఆమె తల నిమరలేదు. అతని మొహం గుర్తించలేనట్టు మాడిపోయింది. చుట్టూవున్న వారి చూపులు తూట్లలా గుచ్చుకుంటూన్నట్టు అవమానపడుతూ రాధని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. మాటా పలుకు లేకుండా నిర్జీవంగా పడివున్నట్టున్న అతన్ని చూసి అతనింకా స్పృహలో లేడని, గాయాల బాధనించి మాట్లాడేస్థితిలో లేడని రాధ భావించి తననితానే ఓదార్చుకుంటూ ఏడుపు మానింది.  
    మర్నాడు పూర్తి తెలివివచ్చాక... రాధ ఏదో చెప్పబోతుంటే_ "ప్లీజ్... రాధా... ఆ విషయం నాకు గుర్తుచెయ్యకు... అది చెప్పకు..." అసహనంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు.
    తనలాగే అతనూ బాధపడ్తూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇంక ఆ విషయం అతని దగ్గిర ఎత్తకూడదని అనుకుంది రాధ.
    పోలీసు ఇన్ స్పెక్టర్ వచ్చి వివరాలు అడుగుతుంటే మాధవ్ చిరాగ్గా... "లీవిట్ ఇన్ స్పెక్టర్. జరిగింది చాలక యింకా కేసులు అంటూ కోర్టులు కూడా ఎక్కిస్తారా మమ్మల్ని" అన్నాడు తీక్షణంగా.
    ఇన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశాడు. అంత ఘాతుకం జరిగితే వాళ్ళని పట్టుకు శిక్షించాలని గట్టిగా చెప్పకుండా కేసు వద్దంటున్న అతన్ని వింతగా చూశాడు. "మీ స్కూటర్ లేదక్కడ... నగలు, వాచీ అన్నీ పోయాయని చెప్పారు మీ మిసెస్..." ఇన్ స్పెక్టర్ అన్నాడు.
    "హు... అసలువే అన్నీపోయాయి... ఇంక వాటికేం వచ్చింది. వదిలేయండి ఇన్ స్పెక్టర్... వాళ్ళెలాగో దొరకరు... యీ కేసులు గొడవ భరించే శక్తి నాకు లేదు. ఈ జరిగిన అవమానం చాలు... యింకా కేసులు పెట్టి మా బతుకులు కోర్టులో కూడా పెట్టుకోవడం నాకిష్టంలేదు... మమ్మల్నిలా వదిలేయండి..."

 Previous Page Next Page