"అది మహిళా లోకానికి అవమానంగా వుంది గనుక."
రఘురామయ్య గారు నవ్వారు. "రాకెట్ వేగంతో పరిగెత్తే యీ ఆధునిక యుగంలో ఎవరెవరికి కావలసింది వారు ఏరుకుంటూవుంటారు. లేకపోతే తిరస్కరిస్తూ వుంటారు. మంచియితే మిగులుతుంది. చెత్తయితే ఎగిరిపోతుంది. అంతే గాని యీ ఆపటాలు, ప్రదర్శనలూ ఆటవిక చేష్టలమ్మా."
అతనిమాటలకూ వనజ కోపం తెచ్చుకుంది. "మీ పత్రిక సర్క్యులేషన్ గురించి మీరు చూసుకుంటున్నారు. దేశం గురించి ఆలోచించటం లేదు" అని అక్కడనుంచి లేచి పోయింది.
ఆ మధ్యాహ్నం అనంతమూర్తికి ఫోన్ చేసింది. "నేను వనజకుమారిని. సీరియల్ గా వస్తోన్న మీ నవలమీద నాకు తీవ్రమైన ఆక్షేపణ లున్నాయి. మీతో పర్సనల్ గా మాట్లాడాలి."
"రండి."
"ఎక్కడికి రాను? ఆఫీసుకా? యింటికా?"
"ఎక్కడికైనాసరే పోనీ యింటికే రండి. ఆఫీసులో పని డిస్టర్బ్ అవుతుంది."
"ఇంట్లో అయితే మీ ఆవిడ వుంటుందేమో...మనం మాట్లాడుకునేమాటలు ఆవిడకి కొంత బాధ కలిగించవచ్చు."
"అందుకని దాక్కోవటం నాకలవాటులేదు. మనిషన్నాక బాధకలిగించే సంఘటనలు లేకుండా ఎలా కుదురుతుంది? సాయంత్రం ఆరుతర్వాత రండి?"
వనజ ఆరున్నరకల్లా రాకెట్ లాంటి ఆటోలోంచి దిగింది. అతను అప్పటికి స్నానంచేసి పైజామా, లాల్చీ వేసుకుని డ్రాయింగ్ రూంలొ కూర్చుని వున్నాడు.
"రండి" అన్నాడు సాదరంగా.
"నన్ను మీరు ఇదివరకు చూడలేదనుకుంటాను" అంది వనజకుమారి ఫేముకుర్చీలో కూర్చుంటూ.
"ఇప్పుడు చూస్తున్నానుకదా" అన్నాడు అతను మందహాసం చేస్తూ.
ఆమె అతనివంక చూస్తోంది. ఒడ్డూ, పొడుగూ, వొంటికి యిమిడినట్లు వున్న ఆ డ్రెస్సు, వొత్తయిన నల్లని జుట్టు, మనిషి లోతుల్ని గాలించివేసేలా వున్న విశాలమైన కళ్ళు...
అతను సిగరెట్టు వెలిగించుకున్నాడు "చెప్పండి"
"మీ నవల చదువుతున్నాను."
"సంతోషం."
"అందులో కల్పన పాత్రని చాలాఅక్రమంగా చిత్రిస్తున్నారు."
"కొన్ని పాత్రలలా అక్రమంగా వుంటే నష్టమేమిటి?"
"అది స్త్రీజాతికి అవమానంగనుక"
"ఈ ఊళ్ళో బ్యాంకిస్ట్రీట్ అని ఒక వీధి వుంది. అక్కడ వ్యభిచారం చేసే ఆడవాళ్ళెక్కువగా వుంటారు. కొంతమంది అక్కడ వ్యభిచార వృత్తిలో వున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందరికీ అవమానమవుతుందా?"
"ఇది రచన ఇందులో ఒక పాత్రని చిత్రించేటప్పుడు అది ఆ జాతికంతటికీ వర్తిస్తుందనే భావన కలగటానికి అవకాశముంది?"
"ఎందుకవుతుంది? రచనలో ఒక కారు డ్రైవరుని దొంగగా చిత్రిస్తే లోకంలోని డ్రైవర్లంతా దొంగలని చెప్పినట్లా? ఒక డాక్టరుని అవినీతిపరునిగా చిత్రిస్తే-అందరు డాక్టర్లంగురించీ అలా అనుకొమ్మనా?"
"మీరు ఎస్కేప్ అవటానికి ప్రయత్నిస్తున్నారు. కల్పనలో మీరు ఆధునిక స్త్రీని రిప్రజెంట్ చేశారు. అది మొత్తం అందరికీ వర్తిస్తుంది!"
"స్త్రీ జాతిలో నా భార్యకూడా వుంది. ఆమెగురించి కల్పన లాంటిదనే భావన నాకులేదు."
"ఆమె మీ భార్య కాబట్టి మీయిద్దరి మధ్యా కొన్ని రాజీలుంటాయి."
ఆమె వాక్యం పూర్తిచేసేలోపున వసంత ట్రేలో యిద్దరికీ కాఫీ తీసుకొచ్చింది. ముందు వనజముందుంచి "తీసుకోండి" అంది.
"వసంతా! ఇన్నేళ్ళసంసారంలో మనమిద్దరం ఏ విషయంలోనైనా రాజీపడ్డామా?" అన్నాడు అనంతమూర్తి.
వసంత నవ్వింది. "రాజీ అనే మాతకర్ధం మిమ్మలిని కట్టుకున్నప్పుడే మరిచిపోయాను" అంది.
"రాజీలేకుండా సంసారాలు ఎలా సాధ్యం?" అంది వనజ.
"మా యింట్లో కొన్నాళ్లుండి చూడండి. బోధపడుతుంది" అంది వసంత.
ఆమె లోపలకు వెళ్ళబోతూంటే "మీరు యిక్కడ కూర్చోండి. మా సంభాషణ వినవచ్చు" అంది వనజ.
"ఎందుకులెండి? అంత ఆసక్తి లేదు" అని ఆమె వెళ్ళిపోయింది.
వనజ కాఫీకప్పు టీపాయ్ మీదపెట్టి అంది "కల్పన పాత్రీకరణ సందర్భంలో మీరు కొన్ని సూత్రీకరణలిచ్చారు. అవి మొత్తం స్త్రీజాతికి సంబంధించినవి. మీకసలు నవీన స్త్రీ మీద సదభిప్రాయం లేదు.
ఈసారి అతను సూటిగా జవాబిచ్చాడు. "నవీన స్త్రీమీద అవగాహనలో ఆయా సందర్భాలనిబట్టి నేనువిర్వచించింది, సందర్భానినుండి విడదీసి విశ్వజనీనత నాపాదించటం సంకుచిత్వం. ప్రతి వ్యక్తిలోనూ మంచి-చెడూ వుంటాయి. సంఘపరంగా, వ్యక్తిపరంగా యీ మంచి-చెడూ ఎప్పుడూ కలసి మెలసి విడతీయరానంత కట్టుదిట్టంగా వుంటాయి. బ్రహ్మ సందేశం చెప్పాలనిపించినప్పుడు, ఒక్కో యితివృత్తం తీసుకున్నప్పుడు వీటిని బలవంతంగా విడదీసి ఆయాపాత్రల కాపాదిస్తూ వుంటాము. పురుషుడిలో అనేక బలహీనతలుంటాయి. అలాగే స్త్రీలోనూ వుంటాయి. "స్త్రీకి సాంఘిక జీవనంలో సమాన ప్రతిపత్తి లేదు. స్త్రీకి సమాజంలో రక్షణలేదు, స్త్రీ మొగవాడి కామానికి అన్యాయంగా బలవుతూ వుంటుంది' అనే నిజాలను అంగీకరించినప్పుడు స్త్రీలో సంకుచితత్వం మునుపటికన్నా యిప్పుడు ఎక్కువగా పెరిగింది. కుటుంబాలు ఎక్కువగా ఆడవాళ్ళ తగాదాలవలే విడిపోతూవుంటాయి. జీవితాన్ని తేలిగ్గా జీవిస్తూ బరువుగా ఆలోచించటం నేటి ఆడవాళ్ళ సొత్తు అసలు నేటి స్త్రీకి ఆలోచనలో పరిపక్వతకన్న తొందరపాటు ఎక్కువవుంది-అనే సత్యాలని కూడా ఎందుకంగీకరించరో?"
"అవన్నీ ఆరోపణలే కాని సత్యాలుకావు"
"ఎందుకుకాదు? కాలేజీలకెళ్ళి చూడండి. మత్తు టాబ్లెట్లకి ఎంతమంది అలవాటు పడ్డారో, పదిమంది ఆడపిల్లలు కలసి వున్నప్పుడు చూడండి___వాళ్ళెంతా హిళనగా, వెక్కిరింపుగా మాట్లాడుకుంటారో మనం అభ్యుదయం, అభ్యుదయం అనే మాట గురించి తరచు చర్చించుకుంటుంటాము. తోటి స్త్రీ ఏదో సందర్భంగా ముందడుగు వేసినప్పుడు యీ ఆడవాళ్ళే దాన్నెంత వక్రంగా చిత్రించి మాట్లాడుకుంటారో చూడండి. అసలు ఒక స్త్రీ పట్ల యింకొక స్త్రీకి ఎంత నిర్దాక్షిణ్యం! ఒక ఆడపిల్లకి పెళ్ళికాకపోతే యిరుగు పొరుగు ఆడవాళ్ళలో ఎన్ని గుసగుసలు, పుకార్లు! అసలు ఒకరిమీద ఒకరికి సానుభూతి వుందా? ఇంట్లో పనిచేసే వాళ్ళమీద, తన మొగుడితో చనువుగా మాట్లాడిన పరాయి ఆడవాళ్ళ మీద ఎంత కఠినంగా వుంటారు!"