"మరి ఎప్పుడూ పట్టించుకున్నట్లు కనిపించలేం?"
"నీవు నీ పిల్లల్ని ప్రేమించినట్లే నేనూ నా పిల్లల్ని ప్రేమిస్తాను. నువ్వు నీ పిల్లలు పైకి రావాలని కోరుకుంటాను. దానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకుంటాను. ఎటొచ్చి దాన్ని యిరవై నాలుగు గంటలూ ధ్యానం చేసుకోను. నా బాధ్యత నేను నెరవేరుస్తాను గాని, ఆ ప్రలోభంలో పడి నా అభిరుచుల్నీ ఉద్యోగానికి వినియోగించే కాలాన్నీ, నా ఉనికిని యీ సంఘంలో సుస్థిరం చేసుకునే అవకాశాల్ని పాడుచేసుకోను నా సంసారాన్ని, ఉద్యోగరీత్యా నామీద ఆధారపడినవాళ్ళనూ-వీళ్ళని తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తూనే నన్ను నేను పోగొట్టుకోకుండా శ్రమిస్తూ వుంటాను. మనల్ని మనం పోగొట్టుకున్న తర్వాత-యీ జీవితం, యీ ప్రేమలు, బంధాలు....యివన్నీ వృధా 'నేను' అనేది నిరంతరం నే మరచి పోను."
లోపల్నుంచి విమల గావును బాధతో మూలిగినట్లు వినిపించింది.
రాఘవ ముఖంలో వ్యాకులపాటు కనిపించింది. "కాసేపు అమ్మాయి దగ్గరి కూర్చుని వస్తాను" అంటూ లేచి గబగబ లోపలకు వెళ్ళాడు.
అయిదు నిముషాలు....పది....పావుగంట....గడిచింది. రాఘవ బయటకు రావటంలేదు. అయినా మూర్తి వెళ్ళిపోకుండా ఓపిగ్గా కూచున్నాడు. చివరకు అరగంట అయినాక అతను బయటకొచ్చాడు__"అమ్మాయి యిప్పుడే నిద్రపోయింది" అంటూ.
"నేనో విషయం విన్నాను" అన్నాడు మూర్తి.
"నాగురించా?"
"నువ్వు ఉద్యోగం చేసే తీరుతెన్నుల గురించి పై అధికార్లు తృప్తి పడటం లేదని, ఉద్యోగం పోయే అవకాశం కూడా వుందనీ..."
రాఘవ ముఖంలో కోపం కనిపించింది. కొంచెం గట్టిగా యించుమించు అరుస్తున్నట్లు అన్నాడు: "నేనెవరికీ అన్యాయం చేయలేదు. అవినీతిగా ప్రవర్తించలేదు. నా సమస్యలు నాకుంటాయి. అవి పై ఆఫీసర్లకి తెలియదు. నా బాధ్యతలు నాకుంటాయి. అవి వాళ్ళకు తెలీదు. నేనేం తప్పు చెయ్యటంలేదు, నా ధర్మం నేను నేరవేరుస్తున్నాను. అది న విధి నిర్వహణ అనుకుంటున్నాను. ప్రమోషన్ లు యివ్వకపోయారా? పోనీ!.....ఉద్యోగంలోంచి తీసేశారా? పోనీ! లెక్క చెయ్యను అంతే?"
రాఘవ ముఖం ఎరుపెక్కింది. ఆవేశంగా వున్నాడు.
మూర్తికి అతనితో మాట్లాడి ప్రయోజనం లేదని పించింది. బరువుగా అక్కడినుంచి కదిలి బయటకు వచ్చేశాడు.
ఆ తర్వాత తాసీల్దారుని కలుసుకుని, అతని ఉద్యోగం మాత్రం పోగొట్టకుండా చూడమని, చెప్పవలసిన విధంగా చెప్పి ఒప్పించాడు.
* * *
అనంతమూర్తి నవల విపరీతమైన ప్రాచుర్యంలోకి రావటమేగాకుండా, అది యింటింట్లోనూ చర్చావేదిక అయి, అనేకమైన సంఘర్షణలకి దారితీసింది.
రచయితకు కావల్సింది నిజాయితీ. ఇజాలగురించి సభలలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి, ప్రపంచంలొ మార్క్సిజాన్ని తానే కాచి వడపోసినట్లుమాట్లాడి వ్యక్తిగత జీవితంలో సిద్దాంతానికీ, ఆచరణకూ జకిల్ ఎంగ్ హైడ్ స్థాయిలో భిన్న దృశ్యాలు కలిగివుంది ఊహించలేనంతటి నీచస్థాయిలో వున్నాడు నేటి నవనాగరికపు రచయిత. సిద్దాంతాలను ఏకరువు పెడతాడుగాని జీవితంతో సమన్వయించుకోలేడు. వీళ్ళకు పెళ్ళాలంటే గౌరవం వుండదు. స్నేహపు విలువలు లేవు. మందుకు బానిసలు మందు త్రాగి పేలేపేలుడు కల్లు పాకలో త్రాగి తందనాలాడేవాడి ప్రవర్తన కన్నా అధమస్థితిలో వుంటుంది. నైతిక విలువలు లేవు. అవకాశమొస్తే మొరాలిటీలేని ఏపనికైనా సిద్దం. నోటి రాంకులు, మానసిక వ్యభిచారాలు కోకొల్లలు. డబ్బు ఎర చూపిస్తే తలా తోకా లేని రచనలు చెయ్యటానికి ముందుకు ఉరుకుతారు. కాని వాళ్ళచేతిలో పెన్ వుంది. అది అబద్దాల నైనా కసిగా దూకుడుగా చెక్కియ్యగలదు. ఈ దేశోద్దార కులు, సంఘ సంస్కరణాభిలాషులు దాని ఆధారంతో విజ్రుంభణగా బ్రతికేస్తున్నారు.
వాళ్ళలో ఇంకో విశేషం వుంది. వాళ్ళు కొంత మందినే గుర్తిస్తారు. ఆ గుర్తించబడ్డవాళ్ళు చేసేవే రచనలు. ఇతరులు ఎంతటి చిత్తశుద్ధితో కూడిన ఆశ్చర్యం కొలిపే రచనలు చెయ్యనీ, అందులో అచ్చుతప్పులూ, పేరాగ్రాఫుల డివిజన్లలోని లోపాలూ వెదుకుతారుగాని మిరుమిట్లుగొలిపే ఆ జీవిత చిత్రణలగురించి పట్టించుకోరు.
అనంతమూర్తి చిత్రించిన స్త్రీ పాత్రపేరు కల్పన.
ఆమె, ఆమె భర్తా ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. జీవితంలొ ముందుకు పోతోన్న కొద్దీ పేరు ప్రఖ్యతహులమీద, సోషిస్టుకేటెడ్ లైఫ్ మీద, పైభోగాలమీద ఆమెకు తీవ్రమైన లాలన ఏర్పడుతుంది. ఆ లాలసత్వానికి లొంగిపోయిన భర్తను అడుగడుక్కీ మోసంచేస్తుంది. ఎంతమందితోనో సంబంధాలు పెట్టుకుంటుంది. ఆమెకు కొడుకులుంటారు. కూతుర్లుంటారు వయసు పైబడుతూన్న కొద్దీ ఆమెలో అందాలు పెరుగుతూ వుంటాయి. తాననుకున్నది సాధిస్తూ వుంటుంది. కాని ఇంటిలో మాత్రం పట్టుబడకుండా భర్తను, పిల్లలనూ నిరంతరం వంచిస్తూ వుంటుంది. ఆమె ప్రేమలో కొంత క్రూరత్వం కూడా వుంటుంది. ఆమెకు పెద్దపెద్ద బిజినెస్ మేగ్నెట్ లతో, ప్రభుత్వాధికారులతో పరిచయం వుంటుంది. ఆమె జీవితం అలా సాగిసాగి ఆ కుటుంబంలో కొన్ని ఆత్మహత్యలతో హత్యలతో అంతమవుతుంది. ఆమెలో మాత్రం పశ్చాత్తాపం వుండదు.
ఈ నవల సీరియల్ గా వస్తున్నప్పుడు మహిళా లోకంలో పెద్ద సంచలనం రేగింది. స్త్రీలంతా ఆ నవలను ఘోరంగా నిరశించారు. ఆ నిరశన ఒక ఉద్యమరూపం పొందింది. ఆ ఉద్యమానికి వనజకుమారి అనే యువతి నాయకత్వం వహించింది.
ఈ 'వనజ' అందగత్తెల కోవలోకే వస్తుంది. వయసు పాతికేళ్ళలోపు. ఇంకాపెళ్ళి చేసుకోలేదు. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గత మూడు నాలుగేళ్ళుగా నవలలు రాసిపారేస్తుంది.
ఆమె ఓరోజు ఉదయం పదిమంది ఆడవాళ్ళని కూడగట్టుకుని రఘురామయ్య గారింటికి వెళ్ళింది.
ఆయన కొన్నాళ్లుగా హైబ్లడ్ ప్రెషర్ తో బాధపడుతూ యింటిపట్టునే వుంటున్నాడు.
వనజకుమారి ఆయనతో చాలా ఉద్రేకంగా, ఆవేశపూరితంగా మాట్లాడింది. ఆ నవలలో స్త్రీజాతిని చాలా హీనంగా చిత్రిస్తున్నారనీ_అది మహిళాలోకానికి తలవొంపులనీ, అవమానకరమనీ, వెంటనే ఆ నవలని సీరియల్ గా ప్రచురించటం నిలుపుచేయాలనీ పౌరుషంగా కోరింది.
రఘురామయ్యగారు బ్లడ్ ప్రెషర్ పేషంటే అయినా వాళ్ళతోపాటూ తానూ ఆవేశపడలేదు.
"ఆ నవల నేనూ చదువుతున్నాను" అన్నాడు శాంతంగా.
"మీకేమనిపించింది?"
"అతని అభిప్రాయాలు అతను రాస్తున్నాడు. అనంతమూర్తి మెచ్యూరిటీ వున్న రచయిత. అతని బాధ్యత అతనికి తెలుసు. ఆ అభిప్రాయాలు మీకు నచ్చకపోతే అంతకంటే శక్తివంతంగా ఖండించండి. అంతేగాని నవలను ఆపెయ్యమంటారేమిటి?"