"ఏమిటండోయ్ అంత దారుణంగా మాట్లాడుతున్నారు."
"నిజమెప్పుడూ దారుణంగానే వుంటుంది. నేను నారీ ద్వేషిననుకుంటున్నారు మీరు. అవసర మొచ్చినప్పుడు కొన్ని కఠిన సత్యాలని చెప్పక తప్పదు. అయినా మొగవాళ్ళ అత్యాచారాలు చిత్రికరిస్తూ, చిత్రీకపడుతూ ఎన్నో నవలలు వచ్చినప్పుడు ఎవరూ పెదవి మెదపలేదు. ఒక స్త్రీ పాత్రలో కొంత మానసిక వైఖరిని యిమడ్చి రాస్తే అంత ఉలికిపడిపోతున్నారెందుకు?"
"మీ మొగవాళ్ళ అత్యాచారాలన్నీ పచ్చి నిజాలు. అవి యుగయుగాల నుండీ యీ సమాజాన్ని కొరుక్కు తినేస్తున్నవి. ఆడవళ్ళ గురించి మీరు చెప్పేవన్నీ అభూత కల్పనలు" వనజ ఆవేశంగా అరిచింది.
అనంతమూర్తి ఆరోజు దినపత్రిక ఆమె ముందు గిరాటేశాడు. "జన్మదిన వినోదాల్లో పాల్గొనటం కోసం, పుట్టిన బిడ్డల్ని డస్టిబిన్ లో గిరాటేసిన యువతి, ప్రేమికుడితో వుండటాన్ని కొడుకు చూసి తండ్రికి చెబుతానని బెదిరించాడని, ఆ కొడుకుని హత్యచేసిన స్త్రీ యిదంతా ఏమిటి?"
"అవన్నీ వ్యక్తిగతమైన ప్రలోభాలు. మొత్తం జాతి కంతటికీ సంబంధించినవి కావు."
"మొగవాడిలోని వ్యక్తిగతమైన ప్రలోభాల్ని ఆ జాతి కంతటికీ ఆపాదించిదుయ్యబట్టటంలేదా? ఎవడో పెళ్ళాన్ని కొట్టాడని మొగవాళ్ళంతా దూర్మార్గులైనట్లా? చాపల్యంకొద్దీ తప్పుచేశాడని నమ్మినవాళ్ళనంతా వంచించి పారేశాడని, ప్రచారం చెయ్యటం లేదా?"
వనజకు కోపమొచ్చింది. "వ్యక్తిపరంగా మొగవాడికీ కొన్ని తేడాలున్నప్పటికీ సాంఘికంగా అతడి దౌర్జన్యమే విలయతాండవం చేసిందనటం సత్యంకాదంటారా?" అన్నది.
"అది ఒకనాటి మాట. ఇప్పుడు సంఘంకన్నా వ్యక్తే బలమైనవాడు."
"అదెట్లా?"
"జరుగుతూన్నదదే. వ్యక్తి శక్తివంతుడైతే అతడి సిద్దాంతం నిజాయితీతో కూడినదైనా, కాకపోయినా మొత్తం సంఘాన్ని తనవైపు త్రిప్పుకుని పరిపాలిస్తున్నాడు. ఈనాడు వ్యక్తి సంఘాన్ని చూసి ఝడిసిపోవటంలేదు. తన సమ ఉజ్జీలుగాని, సమానంగానో, పైకో ఎదగబోయేవారిని చూసి భయపడుతున్నాడు."
"మీరు సమస్యను ప్రక్కదారి పట్టిస్తున్నారు"
"కాదు. మరింత లోతుగా, విశాలంగా పోతున్నాను. అసలు మొగ__ఆడ యీ రెండూ పరస్పర శత్రువుల్లా అంత ఎల్లలు వేసుకుని చూడటమేమిటి? ఇద్దరూ మనుషులు మాంసం, రక్తం, బొమికలు, మనసు వీటితో చెయ్యబడ్డ వాళ్ళు. ఒకరిలో కొంత ఎక్కువ రక్త మాంసాలు వుండవచ్చు. ఇంకొకరిలొ తక్కువ వుండవచ్చు. ఇద్దరూ స్వార్ధాలకూ, బలహీనతలకూ ఆలవాలాలని కొంచం గట్టిగా చెబుతే అంత ఉలికిపాటు దేనికి? తీసుకున్న యితివృత్తాని బట్టి ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిని శస్త్ర చికిత్స చెయ్యాల్సి వస్తుంది. నేను చూసిన కొన్ని కొన్ని సంఘటనలు యీ నవలను నన్నీరకంగా వ్రాయటానికి ప్రేరేపించి వుండవచ్చు. అలా అని ఎప్పుడూ యీ వినోదాలతోనే సాహిత్యాన్ని నింపాలనే కమిట్ మెంట్ ఏదీ లేదే. ఇందులో నేను ఆడవాళ్ళనేమిటి వివిధ వర్గాల వాళ్ళని విమర్శించాను. శ్రామికుడ్ని విమర్శించాను. పెత్తందార్ల పద్ధతుల్నీ ఖండించాను. మానవాళి అభ్యుదయానికి వర్ణ విభేదాల భేషజాలకన్నా, జాతి విచక్షతల అజ్ఞానం కన్నా మానవతా దృక్పథం సర్వతో ముఖ వికాసం పెరగాలని నా ఆవేదన. ఎక్కడనిజం వుంటే అక్కడ వెంటాడతాను."
అనుకోకుండా అనంతమూర్తి ఆవేశపూరితుడయి నాడు. మాట్లాడుతోంటే అతని ముఖం ఎర్రబడింది.
"రచయితకు ఒక్కో సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు-మిగతా అంశాలన్నీ తాత్కాలికంగా మరిచిపోయి ముఖ్యవిషయం మీదే మనసు కేంద్రీకృతమౌతుంది. అలా కాకపోతే అతను రాయలేడు. అంతమాత్రం చేత అతన్లో పక్షపాత బుద్ది వున్నట్లు కాదు. మిగతా సత్యాలు తెలియదని కాదు. అసలు చూడండి. మానవత్వపు విలువల విషయమే తీసుకుంటే యిద్దరిలో వుదారత్వం ఎవరికెక్కువ అంటారు? మీలో నిజమైన నిజమైన హృదయం ఎవరికన్నా వున్నదంటే అది బీదబాలికలలో వుంటుంది. డబ్బున్న ఆడవాళ్ళకు__ఎంతసేపూ వాళ్ళ మొగుళ్ళ గొప్పతనాలు, అలంకారాలు, ఆడంబరాలు, స్థాయీ బేధాలు యీ గొడవలే తప్ప పేద స్త్రీల సమస్యల్ని ఆర్ధం చేసుకునే సహనం, ఓర్పు, శక్తి వున్నాయా? వారిపట్ల సానుభూతి వుందా? అసలు ఒక మొగవాడు, మరో మొగవాడ్ని సానుభూతితో పరిశీలించినట్లు-ఒక స్త్రీ తోటి స్త్రీని సానుభూతితో అవగాహన చేసుకుంటుందా? నేటి స్త్రీ తనే ఉత్తమురాలు మిగతా వాళ్ళంతా అదోరకం మనుషులు అని అనుకోవటం లేదా? అసలు ఏ సమస్య పట్లనైనా తేలిగ్గా తర్కించుకునే సద్గుణం ఎంతమందికుంది? వాళ్ళదృష్టిలో ప్రతిదీ బోర్. ప్రతిదాన్ని గురించి వెటకారం. ఒక ఆడది తప్పుచేస్తే చీల్చి ఛండాడుతారు. వాళ్ళు నోరు విప్పితే పక్కవారి శీలాన్ని గురించే చర్చల ప్రవాహం, పైగా జలసీలు మీ రచయిత్రులనే తీసుకోండి. సామాన్యులైనా మాట్లాడుకోవటానికి వెనుకంజ వేసే విషయాలు, మీరెంత ధారాళంగా లజ్జారహితంగా మాట్లాడుకుంటారు. ఒకళ్ళ గొప్పతనం ఒకళ్ళు ఛస్తే ఒప్పుకోరు. మీలో ఒకరు కాస్త పైకివస్తే ఒకరు కారాలు నూరేస్తారు. అసలు మీ సమస్యలేమిటో మీకు తెలీదు. మీకు మీక్కావలసిన దేమిటో మీకు తెలీదు. మీలో ఉద్రేకపూరితులనుకున్న వాళ్ళు సెక్సు స్వాతంత్ర్యాన్ని గురించి వర్గ విబేధాల గురించీ ఏదో మాట్లాడేస్తారు. నిర్మలత్వమంటే మీకు భయం సందేహాలు. అందమైన జీవితాలు మీ కర్ధం కావు. పురుషుడికి వయస్సు వస్తూన్న కొద్దీ విశాల దృక్పథం పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ వుంటారు. మీరు వయసు పైబడుతున్న కొద్దీ ఇరుకు మనుషులవుతుంటారు. ఎక్కడన్నా పరిపాలకులు స్త్రీలయితే చూడండి వాళ్ళవిధానాలు ఎంత మొండిగా, నిరంకుశంగా వుంటాయో...స్థూలంగా చెప్పుకున్నప్పుడు స్త్రీకి ఆర్ధిక సమానత్వంలేదు. శారీరకంగా రక్షణలేదు. కుటుంబ జీవితంలో పైకి కనిపించే మానవత లేదు. స్త్రీ ఒక భోగవస్తువుగా చూడబడుతోంది. యిది మినహాయిస్తే మనస్సుకు సంబంధించిన విషయాలలో తక్కువ చెయ్యి ఏమీ కాదు?"
వనజకు కోపమొచ్చింది. "మీర్ మేదావులను కున్నాను. స్త్రీల గురించి యింత సంకుచితంగా ఆలోచించే అల్పులనుకోలేదు" అన్నది.
"ప్రపంచంలొ అల్పులెవరన్నా వుంటే వాళ్ళు మేధావులే. ఎందుకంటే వాళ్ళు అత్యల్పమైన వాటి గురించి అతి ఎక్కువగా ఆలోచిస్తూ వుంటారు?"
"ఇది మాటల గారడీ కాదు. స్త్రీజాతికి మీరు చేస్తున్న ద్రోహం."