తెగించిన మొగాణ్ణి ధైర్యస్థుడు అంటారు, కాని తెగించిన ఆడదాన్ని నానా మాటలూ అంటారు. అది నుంచి లోకంలో నడుస్తున్న రీతే అంతే కదన్నాయ్యా! అడదానికో న్యాయం! మొగాడికో న్యాయం! అన్యాయం కాదూ?" అంది.
ఆవేశంగా చెప్పుకుపోతున్న కౌసల్యని తేరిపార చూసి "అమ్మా! నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తోంది. నిన్న మొన్నటి దాకా నోట్లో నాలుకలేనట్టుండేదానివి, నీకింత ధైర్యం ఎలా వొచ్చిందమ్మా!" అన్నాడు.
"పరిస్థితులే మనిషికి ధైర్యాన్నిస్తాయన్నయ్యా!" అంది నిర్లిప్తంగా చూస్తూ కౌసల్య.
"వొద్దమ్మా వొద్దు. మొండి ధైర్యం పనికి రాదు. ఆవేశాన్ని అనవసరంగా పనికి రాని వాటి మీదా, ప్రమాదకరమైన వాటి మీదా వాడకూడదు. ఆవేశాన్ని న్యాయ పోరాటం కోసం, ధర్మం కోసం వాడుకోవాలి" అన్నాడు.
అతని కేసి ఆశ్చర్యంగా చూస్తూ "అయితే అన్నయ్య! నే చెప్పేది న్యాయమూ, ధర్మమూ కాదనా నీ ఉద్దేశ్యం?"
సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు.
"మొగాడు తిట్టినా, కొట్టినా ఆడది పడుండవలసిందేనా న్యాయం? మానసికంగా, శారీరకంగా ఎన్ని హింసలు పెట్టినా పడుండడమేనా ధర్మం? అవున్లే అన్నయ్యా, నువ్వు మొగాడివేగా? మొగాళ్ళని సమర్ధించక పొతే ఏం చేస్తావ్?" కోపంతో ఆమె మొహం జేవురించింది. ఎర్ర బడ్డ కళ్ళల్లోంచి కన్నీళ్ళు చెంపలమీదుగా కారాయి.
సుధాకర్ మతి పోయినట్టనిపించింది.
నోట మాట రాలేదు. కాలం స్తంభించిపోయినట్టపించింది.
కాస్సేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం! ఆకు కదిలినా ఉలిక్కి'పడేంత నిశ్శబ్దం!
"కౌసల్యా!" నెమ్మదిగా పిలిచాడు సుధాకర్.
"ఆ" అంటూ ఉలిక్కిపడి తిరిగి చూసింది కౌసల్య. మనసు మమకారంతో నిండిపోయినప్పుడు, వాక్యులంగా ఉన్నప్పుడూ అలా పిలుస్తాడు సుధాకర్. ఆ సంగతి ఆమెకు తెలుసు. అందుకే 'ఊ' అంటూ కళ్ళనిండా నిండిన కన్నీటి పొర అతని రూపాన్ని కనిపించకుండా మసకబారేస్తుంటే పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుని అతనికేసి చూసింది.
"విదాకులిచ్చిన ఆడదాన్ని చులనగా చూసేది. హేళన చేసేది నానా మాటలూ అనేదీ ముందుగా మీ అడ జాతేనమ్మా! ఆ బాధ నువ్వు పడలేవు. నీకుగా నువ్వు జీవితాన్ని అసహ్యించుకుని, ఆత్మహత్య చేసుకునేంత హీనంగా మాట్లాడుతుందమ్మా మీ అడజాతి! ఒక్కొక్క మాట వేయి తూటాల పోటులా తగుల్తుంది గుండెకి! ఆ నరకయాతన నువ్వనుభవించలేవు! అనుభవించ'కూడదు! నీతో పాటు నన్నూ నాతొ పాటు మీ వొదిననీ మా ఇద్దరితో పాటు పసిది స్మితనీ కూడా అడిపోసుకుంటారు. తల్లిలా పెంచిన మీ వొదిన పెంపకాన్ని గూర్చి దెప్పిపొడుస్తాను. నిన్ను ఉదాహరణగా చెబుతూ , అభం శుభం తెలీని స్మిత పై కూడా నిందలు వేస్తారు కౌసల్యా! అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. జీవితానికి ఎదురీదడం కన్నా, జీవితంతో రాజీ పడడం మిన్న, నా మాట వినీ ఆ విడాకులూ గిడాకులూ అనేమాట మర్చిపోయి , బావగారిని మార్చడానికి ప్రయత్నించు.మంచితనంతో ఓర్పుతో ఎంతటి దుర్మార్గుడినైనా మార్చవచ్చు.'
కోసల్య సుధాకర్ కేసి నోరు తెరిచి చూసింది ఆశ్చర్యంగా. అవతలి గదిలో తలుపు దగ్గర నుంచి వీరి సంభాషణ అంతా వింటున్న వొదిన గారిని కూడా చూసింది. ఆమె అంతా వింటూ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని సలహా చెప్పకపోవడం అశ్చర్యం కలిగించింది కౌసల్యకి. 'అంటే ఆమె కూడా అన్నయ్య అభిప్రాయంతోటే ఏకీభవిస్తోందన్నమాట! లేకపోతే కలగజేసుకుని తన పక్షాన అన్నయ్యతో వాదించుండేదిగా!" అనుకుంది.
సుధాకర్ ఏదో పనున్నవాడిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వొదిన కూడా లోపలికి వెళ్ళిపోయింది.
వాళ్ళ మనసు పూర్తిగా అర్ధం అయిపొయింది కౌసల్యకి.
తన భావాలకి అ ఇంట్లో స్థానం లేదు. స్థానం రాదు. తన కష్టాలు వినేదిక్కు ఇంకెవ్వరూ లేరు. పానకాలు చేత తిట్లూ చీదరిపులూ తింటూ భరిస్తూ కుక్కిన పేనులా పడుండమో , లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా పిట్టకి తెలీకుండా , పెట్టె బేడా పట్టుకుని , ఇల్లూ ఊరూ కూడా విడిచి పెట్టి, ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తను బతకడమో , లేకపోతే ఈ జీవితానికి ముగింపు గీతం పాడేసి ఆత్మహత్య చేసుకోవడమో- ఈ మూడే మార్గాలు కనిపిస్తున్నాయి ఎంత ఆలోచించినా! మొదట ఈ మూడో మార్గం సులభంగా కనిపించింది.
అసలు ఎందుకు బతకాలి! ఎవరి కోసం బ్రతకాలి! తను చస్తే మాత్రం ఏమిటి లోటు? కాస్సేపు అన్నయ్య వొదినా ఏడుస్తారు. క్రమేణా కాలంతో పాటు వాళ్ళూ మర్చిపోతారు. తనకిష్టం లేని బతుకు తనెందుకు బతకాలి! ఈ బాధలన్నీ తనెందుకు పడాలి? ఒక్క నిముషం చావాలన్న నిర్ణయం గట్టి పడితే శాశ్వతంగా ఈ దుఖానికి దూరం కావచ్చు అనుకుంది. అంతలోనే కడుపులో ఏదో తిరిగినట్టనిపించింది. అదొక కొత్త అనుభూతి "ఏమైంది బాబూ?" అనుకుని ఒక్క క్షణం కంగారు పడింది కౌసల్య . అంతలోనే జ్ఞాపకం వచ్చింది తన ప్రాణంతో పాటు మరో ప్రాణం కూడా తనతో ముడిపడుతుందనీ! ఆ ప్రాణాన్ని తీసే హక్కు తనకు లేదనీ! ఒక్కసారి పొట్టని అరిచేత్తో తడిమి చూసుకుంది. ఏదో వింత అనుభూతి! తను తల్లి కాబోతుంది. మాతృత్వంలోని మధురిమలను తను నాశనమై పోకూడదు. చచ్చి ఏం సాధిస్తుంది? బతికుండి తన బిడ్డలో తన ఆశయాలూం ఆదర్శాలు చూసుకుంటూ ఆనందించొచ్చు! తను చావకూడదు! బతకాలి! బతికి తీరాలి! తన కోసం కాదు. తన రక్తమాంసాలు పంచుకుని తన ప్రతీకగా నిలిచే పుట్టబోయే బిడ్డ కోసం! బతుకు మీద తీపి కలిగింది. నిరాశ హరించుకుపోయింది. చావాలనే ఆలోచనకి స్వస్తి చెప్పింది.
ఏదో కొత్త ఆశ!
కొత్త పులకింత!