Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 18

 

    "వెళ్తాను, వెళ్తాను" అంటూనే పన్నెండు దాటినా కదల్లేదు పానకాలు.
    సుధాకర్ కి ఒకటే ఆవలింతలోస్తున్నాయ్. ఇక చేసెడి లేక "బావగారూ! నాకు నిద్ర వస్తుంది, ఏమి అనుకోకండి. మీరూ ఇక్కడే పడుకోండి. లేదా వెళ్తే త్వరగా బయల్దేరండి. మరీ పోద్దుపోతే మంచిది కాదు" అన్నాడు సుధాకర్.
    "సారీ!...మీ నిద్దర పాడు చేశాను. వెళ్తాను. పొద్దుటే కౌసల్యని పంపించండి. అంటూ లేచాడు పానకాలు. గేటు దాకా వెళ్ళి అతణ్ణి సాగనంపి వచ్చారు సుధాకరూ, రాధా.
    పానకాలు ప్రవర్తనకి విసిగిపోయిన సుధాకర్, రాధా, ఆ రాత్రంతా అతని కబుర్లే. కౌసల్య గురించి దిగులు పట్టు కుంది వాళ్ళకి. కౌసల్య చూస్తూ చూస్తూ అతని చేతిలో చిక్కినందుకు బాధపడ్డారు. కానీ ఏం చేస్తారు? తప్పదు కదా! వివాహ బంధం! పొద్దున్నే కౌసల్య లేచాక, ఆమెకి ధైర్యం చెప్పి , ఇంటి దగ్గర దింపి, పానకాలుతో కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, మాట్లాడి రావాలనుకున్నాడు సుధాకర్.
    కానీ తెల్లవారి లేచాక కౌసల్య చెప్పిన మాటలు విని స్తంభించిపోయాడు సుధాకర్.
    "అమ్మా కౌసల్యా! నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా! పెద్ద చదువులు చెప్పించి , హోదా గల వ్యక్తితో వివాహం చేసుకుని లక్షణంగా సంసారం చేసుకుంటూ , ఇల్లాలిగా మంచి పేరు తెచ్చుకుని ఉన్నతమైన ఆదర్శాలతో , గౌరవంగా బతకాలని కోరుకున్నాను కానీ ఇలా.."
    "అన్నయ్యా! నీ ఆశలన్నీ వమ్ము చేశాను. నా విషయంలో నీ అంచనాలన్నీ తారుమారు చేశాను. అన్నయ్యా! నన్ను మన్నించు నేలచూపులు చూస్తూ అంది కౌసల్య.
    ఇందులో మన్నించడానికేముందమ్మా? నీ తప్పేముందని? అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఎలా జరిగేదీ, ఏం జరిగేది దేవుదేప్పుడో రాసి పెట్టేస్తాడమ్మా!"
    "అన్నయ్యా! నిన్నోకామాటడగనా?"
    "అడుగమ్మా! సందేహం ఎందుకు?" లాలనగా అన్నాడు సుధాకర్.
    ఎలా మొదలెట్టాలా అని ఒక్క నిమిషం ఆలోచించింది కౌసల్య.
    ఏం చెబుతుందోనని ఆదుర్దాగా చూశాడు సుధాకర్.
    "అన్నయ్యా!.....నేను ......ఆయనకి విడాకులిస్తాను. ఆ తరువాత చదువుకుంటాను. ఉద్యోగం చేసుకుంటాను. నా కాళ్ళ మీద నే నిలబదతాను. నన్ను పెంచి పెద్ద చేసిన నీ పేరు నిలబెడతాను."
    గబగబా గుక్క తిప్పుకోకుండా పాఠం అప్ప చెప్పినట్టు చెప్పింది.
    "నేను ఆయనికి విడాకులిస్తాను! ఈ ఒక్క వాక్యమే సుధాకర్ మనసులో నిలిచిపోయింది. తల మీద పిడుగు పడ్డట్టయింది! నోట మాట రాలేదు. తనేం విన్నాడో అర్ధం కాని అయోమయంలో పడ్డాడు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కాస్సేపటికి తేరుకున్నాడు. కౌసల్య కేసి చూస్తూ 'అమ్మా కౌసల్యా! పెళ్ళయి పట్టుమని ఆర్నెల్లు కాలేదు. విడాకులిస్తానంటున్నావా? నాకు తెలుసమ్మా పానకాలు నీచంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని. అతణ్ణి మార్చడానికి ప్రయత్నం చేద్దాం. మారడానికి కొంత టైం పడుతుంది" అన్నాడు.
    "అన్నయ్యా! అతని సంగతి నీకు తెలీదు. అతను మారడం దుర్లభం" అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని సుధాకర్ కేసి చూస్తూ కౌసల్య.
    "మార్చడానికి మనం ప్రయత్నమైతే చెయ్యాలి కదమ్మా! ఇంటి నిండా ఎలుకలున్నాయని ఇల్లు కూలగొట్టుకుంటామా> ఎలుకలు లేకుండా ఉండడానికి ఏదైనా మార్గం అన్వేషించాలి. చూడమ్మా! పెళ్ళంటే బొమ్మలాట కాదు. మొన్న పెళ్ళి, ఇవ్వాళ విడాకులూ అనడానికి జీవితంలో అనేక సమస్యలుంటాయి. సమస్యలకి పరిష్కారం ఆలోచించాలి. అందుకు సహనం కావాలి, అంతేకాని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
    "అన్నయ్యా! ఆవేశంతో నేనీ నిర్ణయానికి రాలేదు. బాగా ఆలోచించే చెప్పాను. అతనిలో మార్పు వస్తుందనే ఆశ నాలో ఇసుమంతైనా లేదు.
    ప్రస్తుతం బాధకి నువ్వలా అనుకుంటున్నావు. కానీ పెళ్ళయి ఎంత కాలమయిందనీ అతను మారడానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పడానికి? నా మాట విని నివ్విలా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేయమ్మా!
    "అన్నయ్యా! ఈ కొద్ది రోజుల్లోనే అతను ప్రవర్తించిన తీరూ, జరిగిన ప్రతి సంఘటనా నా హృదయాన్ని ముక్కముక్కలు చేశాయి. అతనిలో మానవత్వం ఏ కోశానా లేదు. మమతా, మర్యాదా అతని రక్తంలోనే లేదు. వాటికి అర్ధం కూడా తెలీదు అతనికి" ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ కసిగా మాట్లాడుతున్న కౌసల్య కేసి ఆశ్చర్యంగా చూశాడు సుధాకర్.
    "ఆ రాక్షసుడితో నేనింక కాపురం చెయ్యలేనన్నయ్య ప్లీజ్! తప్పో ఒప్పో నా నిర్ణయాన్ని మన్నించు" అంది దుఃఖంతో గొంతు వొణుకుతుంటే.
    "రాక్షసులు భార్యలు కూడా రాక్షసులు చేసే రాక్షస కృత్యాలు భరించి పతివ్రతలుగా పేరు తెచ్చుకున్నారమ్మా! భర్తలు తగుబోతులైనా తిరుగుబోతులైనా అణకువతో సపర్యలు చేసి గౌరవాన్ని సంతరించుకున్న పుణ్యవతుల పుట్టినిల్లమ్మా మన భూమి! అటువంటి చోట పుట్టిన నువ్వు విడాకులియ్యాలన్న ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవాలి. పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కౌసల్యా విడాకులిచ్చిన ఆడడానికి గౌరవం ఇవ్వరమ్మా! మన సమాజం ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు. భర్తను వదిలేసినా స్త్రీని పురుగు లాగా చూస్తారు మీ ఆడవాళ్ళే! మొగాళ్ళ అయితే కుక్కల్లాగా వెంట పడతారు. కన్నవాళ్ళు కనికరం  చూపే వాళ్ళు , పుట్టింటి వాళ్ళు ఎందరున్నా భర్త తోడు లేకపోతే ఎన్నో బాధలు పడవలసి వస్తుందమ్మా ఆడది! ఒక వయసొచ్చాక , అన్నా చెల్లెలూ అన్యోన్యంగా తిరిగినా , తండ్రీ కూతుళ్ళూ ఆప్యాయంగా మసిలినా అనుమానిస్తుందమ్మా పాడు లోకం!" నిట్టురుస్తూ చెప్పాడు సుధాకర్.
    'అన్నయ్యా! పాడులోకం అనే మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? మనం తప్పు చెయ్యడం లేదని తెలిసినప్పుడు ఒకరిని చూసి భయపడ్డం దేనికి? మన బతుకు మనం బతుకుతున్నప్పుడు ఎవరో ఏదో అంటారని భయపడుతూ బతకడం , చస్తూ బతకడం అనవసరం! అంది కౌసల్య.సుధాకర్ మాట్లాడలేదు.

 Previous Page Next Page