ప్రస్తుతం ఆ ఆడపిల్లల పరిస్థితి చూసిన రాజారావుకి చిన్నతనం గుర్తుకి వచ్చింది. అతను వారివంకే కుతూహలంగా చూస్తూండగా వాళ్ళ ముఖాలు సీరియస్ గా అయిపోయాయి. కారణం ఏమీలేదు- కండక్టరు వచ్చాడు!
నల్లపరికిణి పిల్లరెండ్రూపాయలనోటుకండక్టరుకు అందించగానే అతను పుచ్చుకోలేదు- "మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడదింపేసే అవకాశం నాచేతిలో వుంచుకుంటాను. అందుకేమీకు ఇప్పట్లో రసీదివ్వను-" అని వెళ్ళిపోయాడు.
ఆడపిల్లలు ముఖముఖాలు చూసుకుంటూంటే రాజారావుకు నవ్వు వచ్చింది. అయితే వాళ్ళలా ఎంతోసేపులేరు. మళ్ళీ కబుర్లలో పడ్డారు.
సికింద్రాబాదు ఇంకో అరగంటలో చేరుకుంటామనగా ఈశ్వరరావు, చౌదరి దిగివచ్చారు, చౌదరి నెమ్మదిగా- "ఏం పిల్లలండీ బాబూ క్షణం తీరుబడి లేకుండా ఒకటేవాగుడు. నాకు నిద్రపట్టలేదు. ఆ వాగుడేమిటో, ఆ నవ్వులేమిటో..." అన్నాడు.
వాళ్ళు వింటారేమోనని రాజారావు భయపడ్డాడు కానీ వాళ్ళు వింటున్నట్లు లేదు. ఈశ్వరరావు కు మాత్రం నిద్రబాగా పట్టిందట అతను ఫ్రెష్ గా వున్నాడు.
ట్రయిన్ సికింద్రాబాదు లో ఆగగానే- సామాన్లు ముగ్గురూ కలిసి దింపుకున్నారు.
"ఫస్టుక్లాసులో ఏమైనా ఆశవుంటుందేమో-"అన్నాడు రాజారావు.
"ఇప్పుడలాంటివేం పెట్టుకోకండి. జనరల్ కంపార్టుమెంటే మనకు శరణ్యం, అదుగో బండి సిద్దంగా వుంది. అదృష్టవశాత్తూ మన ట్రయిన్ ప్లాట్ ఫారానికవతల పక్కన ఆగింది. అవతల పక్కన బొంబాయిబండి. మనకేశ్రమాలేదు..." అన్నాడు చౌదరి
ఈశ్వరరావు కాస్త హడావిడిగా పరిగెత్తాడు. అతనికి కాస్త వెనుకగా చౌదరి నడుతూమ్తే రాజారావు సామాను దగ్గర కాపలా వున్నాడు.
ఓ అయిదు నిముషాలలో ఈశ్వరరావు పరుగెత్తుకు వచ్చి జనరల్ కంపార్టుమెంటులో కాళీ కనబడుతోందన్నాడు. ఇది ఊహించని అదృష్టమనికూడా అతనన్నాడు. అతని వెనకాలే చౌదరి వచ్చి- "జనరల్ కంపార్టుమెంటులో కాళీ వుంది కానీ- అవి పోర్టర్సు రిజర్వ్ చేసేశారట ఎవ్వర్నీ ఎక్కనివ్వడంలేదు..." అన్నాడు
"అయితే ఏం చేయాలిట?"
"బెర్తుకి పదిరూపాయలు, సీటుకి అయిదురూపాయలు అంటున్నారు..." అన్నాడు చౌదరి.
రాజారావుకి తను పూర్వం చేసిన ఒక ప్రయాణం గుర్తుకు వచ్చింది. ఢిల్లీలో కల్కామెయిలులో కూలివాళ్ళు రిజర్వ్ చేయగా అతనో బెర్తు తీసుకున్నాడు. ట్రయిన్ కదిలేక దాన్నిండా జనం నిండిపోయారు. తను కూలివాళ్ళకి అధికంగా డబ్బిచ్చానన్నా తన బెర్తునిలబడలేదు. దీనిమీద నలుగురు కూర్చున్నారు.
"కూలివాళ్ళ రిజర్వేషన్ లాభంలేదండీ-" అన్నాడతను.
"అవుననుకోండి, బెర్తు ఎలాగూ లాభంలేదు, సీటుకి ఎంతో కొంత ఇవ్వకపోతే కంపాటుమెంటులో అడుగు పెట్టలేము. ఒకసారి బోగీలో ఎక్కికూర్చుంటే ఎలాగో అలా బొంబాయి చేరుకోలేకపోము...." అన్నాడు చౌదరి.
"అయినా ఇదెక్కడి అన్యాయం! జనరల్ కంపార్టు మెంటు అనే పదానికి అర్ధమేమిటి?" అన్నాడు ఈశ్వర్రావు.
"ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కూర్చుంటే అవతల ఆ సీట్లేవరో కొట్టేస్తారు- పదండిపోదాం..." అన్నాడు చౌదరి.
సీటుకి మూడురూపాయలని బేరం కుదిరింది. ముగ్గురికీ కూడా సీట్లు దొరికాయి. రాజారావూ, ఈస్వర్రావూ పక్క పక్కన కూర్చున్నారు. చోదరి వారికి ఎదురుగా కూర్చుని వున్నాడు. బోగీ చిన్నది. చాలా ఇరుగ్గా వుంది.
ఫస్టు క్లాసులో ప్రయత్నించవలసిందేమో-" అన్నాడు రాజారావు.
పై బెర్తుమీద నడుం వాల్చిన ఒక పెద్దమనిషి ఆ మాట లకు చలించినట్లున్నాడు. చటుక్కున లేచి కూర్చుని- "ఫస్టు క్లాసెక్కడాకాళీలేదండి. నాది ఆ టిక్కెట్టే ఆ దండుగా పోనూ ఇక్కడ పన్నెండు రూపాయలిచ్చి ఈ బెర్తు సంపాదించాను.," అన్నాడు ఇంగ్లీషులో.
మనిషి చాలా హుందాగా వున్నాడు. ఆకుపచ్చని యూనిఫారంనుబట్టి మిలిటరీకో, నేవీకో చెందినవాడని అనుకోవాలి. తెలుగు అర్ధమౌతుందేమోకానీ మాటాడడంవచ్చి వుండదు మాతృభాష హిందీలాగుంది.
రాజారావు ఆశ్చర్యంగా "ఇది చాలా గోరం జనరల్ కంపార్ట్ మెంటులో రిజర్వేషన్ చేసే అధికారం ఈ పోర్టర్ల కెవరిచ్చారు?" అన్నాడు ఇంగ్లీషులో.
"మనమే-" అన్నాడు ఆకుపచ్చ యూనిఫారం- "మన దేశంలో ఏ మాత్రం అవకాశమున్నా ఎదుటివాడి బలహీనతను ఎక్స్ ప్లాయిట్ చేయడం మామూలు. పోర్టర్సు గురించి ఎవరై నాకంప్లాయింట్ చేస్తున్నారా? లేదు. నా దగ్గర డబ్బుంది కాబట్టి ఇచ్చి బెర్తు తీసుకున్నాను. అలా చేయడం తప్పని నాకు తెలుసును. కానీ డబ్బులేనివాడికి లేని అవకాశం నాకిచ్చినందుకు పోర్టర్సుమీద ఏమూలో అభిమానం కూడా నాకుంది. వాళ్ళకీ అధికారంలేకపోతే నా ప్రయాణం ఈరోజుకి ఆగిపోయి వుండేది. మనకు నీతి, నిజాయితీలకంటే మన అవసరాలే ముఖ్యం!"