Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 18

    విస్కీ వాసన చూడనంత వరకూ ఆమె మామూలు ఆడదే... కానీ రుచి మరిగిందో రెచ్చిపోయిన ఆడ పులిలాంటిది....ఆ సమయంలో ఆమె నోట్లో నోరు పెట్టి గెలవడం కష్టం.... ఆ విషయం తెలుసు కాబట్టే మౌనంగా బాత్ రూమ్ లోకి నడిచాడతను.
   
    పాండ్యముత్తు పదినిమిషాల్లో స్నానం ముగించాడు.
   
    నల్లపాప అదే పనిగా మందు లాగిస్తూనే వున్నది.
   
    "పాపా...భోజనం చేయవా?"
   
    "అరే పోబే....! కడుపు నిండా తాగితే సరిపోదూ....కావాలంటే నువ్వెళ్ళి తిను..." నల్లపాప మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి.
   
    పాండ్య ముత్తు దీర్ఘంగా నిట్టూర్చి బయటకు నడిచాడు.
   
    క్రింద వున్న రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి ఆటోలో పురావస్తు శాఖ మ్యూజియమ్ వైపు బయలుదేరాడతను.
   
    అతని మస్తిష్కంలో ఒకే ఒక్క ఆలోచన...
   
    ఎలాగయినా సరే...కిట్టూ అప్పగించిన పని పూర్తి చేయాలి!
   
                                                                       *    *    *
   
    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్!
   
    ఉదయం పది గంటలు....
   
    ఆటోలో నుంచి రాంగో, జాజిబాల క్రిందకు దిగారు.
   
    దిగీదిగిన వెంటనే ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎక్కడ గమనిస్తారో అనే ఖంగారులో హడావుడిగా స్టేషన్ లోపలకు నడిచారిద్దరూ.
   
    సరాసరి రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళారు.
   
    పావుగంట ప్రయాస పడిన అనంతరం రిజర్వేషన్ క్లర్కు చెప్పిన మాటలు విన్న జాజిబాల మస్తిష్కం మొద్దుబారినట్టయింది.
   
    మరుసటి రోజు నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించడానికి వచ్చారు.
   
    కానీ.... మూడు రోజుల వరకూ రిజర్వేషన్ దొరకదట!
   
    "ఏం చేద్దాం...." నీరసంగా ప్రశ్నించాడు రాంగో.
   
    ఆమె అదే విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది.
   
    ఇప్పటికీ విజయవాడలో అటు రాంగో పని చేసే కంపెనీ నుంచి....ఇరు తన బామ్మవైపు నుంచి తమ ఇద్దరి కోసం వేట మొదలై వుంటుందని ఊహించింది.
   
    తామిద్దరూ హైదరాబాద్ లోనే ఉన్న విషయం వాళ్ళకు ఈజీగా తెల్సిపోతుంది కాబట్టి, తమ కోసం ఈపాటికే ఎవరో ఒకరు హైదరాబాద్ వచ్చి వెదుకుతూ వుండాలి....
   
    రాంగో క్యాష్ కలెక్షన్స్ కోసం హైదరాబాద్ వచ్చి రెండవ రోజు కూడా ఆఫీసుకు అటెండ్ కాకపోవడంతో అతని ప్రొప్రయిటర్ రాజేంద్రప్రసాద్ ఖంగారుపడి అతను ఉండే ఇంటి దగ్గరకు వెళతాడు...అప్పటికే తన కోసం మధనపడుతున్న బామ్మ ఆ విషయాన్ని విన్న వెంటనే ఏం జరిగి ఉంటుందో ఊహిస్తుంది.
   
    తన ఊహ నిజమే అయినా పక్షంలో తన తల్లిదండ్రులను దుబాయ్ నుంచి రప్పించి ఉంటుంది.
   
    ఇలాంటి పరిస్థితుల్లో తామింకా ఈ హైదరాబాద్ లోనే వుండడం క్షేమం కాదు....
   
    ఏ క్షణంలోనయినా తమ ఉనికిని పసిగట్టవచ్చు....
   
    "పోనీ... బస్ కు బయలుదేరితే..." ఎంతకూ ఆమె సమాధానం చెప్పకపోవడంతో తనే చెప్పాడు మళ్ళీ.....
   
    "వద్దు...అంత దూరం బస్ జర్నీ అంటే నావల్ల కాదు... నాకు సరిపడదు....తిరుపతికి ట్రైన్ లోనే వెళదాం....మూడు రోజుల తరువాతే వెళదాం..."
   
    "అదేంటి....అంతవరకూ మనం ఇక్కడే ఉంటే..."
   
    "ఏం ఫర్వాలేదు....బయలుదేరేవరకూ మనం హోటల్ గదిలో నుంచి బయటకు రాకుండా వుందాం...." జాజిబాల ఖచ్చితంగా చెప్పింది.
   
    రాంగో మారు మాట్టాదకుండా రిజర్వేషన్ స్లిప్ పూర్తి చేశాడు....
   
    ఐదు నిమిషాల తరువాత తిరిగి ఆటోలో బయలుదేరారు.
   
    "ఎక్కడకు వెళదాం...."
   
    ఎక్కడకు వెళ్ళాలో చెప్పకుండానే ఆటోలో కూర్చుంటున్న రాంగోని చూస్తూ అనుమానంగా ప్రశ్నించిందామె.
   
    "చెబుతాను....చాలా పనుంది....ముందు ఏదయినా హోటల్ లో టిఫిన్ కార్యక్రమం ముగిద్దాం.... ఏమంటావ్?"
   
    "ఊ....తరువాత..."అతని భుజంపైకి ఒరిగిపోయి అతని చెవిలో కువకువ లాడింది జాజిబాల.
   
    "నేరుగా ఏదయినా శారీ కాంప్లెక్స్ కు వెళదాం...."
   
    "ఎందుకు?"
   
    "నువ్వు కొన్ని చీరెలు సెలెక్ట్ చేసుకో. ముందు మన ఒంటిమీద నున్న ఈ బట్టలు మార్చుకుంటే తప్ప మనలో కొంత మార్పు రాదు....కొత్తగా పెళ్ళయిన దంపతుల్లా ఉన్నామా మనం...ఊహూ...." జాజిబాల మాట్లాడకుండా అతని చేతిని గిల్లింది సంతోషాన్ని పట్టలేక!
   
    ఆమె వైపు ఏమిటన్నట్టు చూశాడు.
   
    "ఈ మధ్య తమరి మైండ్ లో మెర్క్యురిక్ బల్బులు బాగా వెలుగుతున్నట్టున్నాయే."
   
    "అవును బాలా.... నువ్వు ప్రక్కనుంటే పెద్ద జనరేటర్ వున్నట్టే..."
   
    ఆహ్లాదకరమైన చల్లని చిరుగాలి ఆ రెండు శరీరాలను ఆప్యాయంగా స్పృశించి వెళ్ళిపోతున్నది. మనసు మైమరచి పోవడంతో అప్రయత్నంగానే ఆమె శరీరం రాంగోకు దగ్గరగా జరిగింది.
   
    "ఇంతకూ మన భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?"
   
    "అదే ఆలోచిస్తున్నాను....తిరుపతి వెళ్ళాక అక్కడొక వారం రోజులు ఉందాం. అప్పుడు ఆలోచిద్దాం ఏ ఊరిలో సెటిల్ అవుదామన్న సంగతి...."
   
    రాంగో మాటలు విన్న జాజిబాలకు కూడా అదే మంచిదనిపించింది.
   
    ఇప్పటి నుంచే టెన్షన్ తో మనసును బాధ పెట్టుకునే కన్నా ప్రశాంతంగా ఆ వేంకటేశ్వరుని దర్శించుకుని... ఆయన సన్నిధిలో భావి జీవితాన్ని ప్లాన్ చేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చింది జాజిబాల.

 Previous Page Next Page