[8]
ఆ తరువాత....ఇద్దరూ విడిపోయారు.
"టైమ్ చాలా అయింది....వేరే హోటల్ కు మారదాం" తిరిగి రిపీట్ చేశాడు రాంగో.
"వద్దు...."
జాజిబాల ఆలోచించి చెప్పింది.
ఆమె వైపు విచిత్రంగా చూశాడు రాంగో.
"పేరున్న పెద్ద హోటల్స్ లో మనకోసం వెదుకుతారు. ఈ చిన్న హోటల్ గురించి అయితే ఎవరికీ అనుమానం రాదు. ఇక పోలీసుల రైడింగ్స్ అంటావా! ఆ ఇన్ స్పెక్టర్ మనం కొత్త దంపతులమేనని గట్టిగా నమ్మాడు. కనుక మళ్ళీ మన జోలికి రాకపోవచ్చు ఈ రెండు రోజులూ ఇక్కడే వుండి నిజంగానే మనం తిరుపతి బయలుదేరుదాం" అన్నది జాజిబాల.
"వెరీ గుడ్....ఇప్పుడు నీ బ్రెయిన్ బాగా పనిచేస్తున్నది. రేపు మార్నింగ్ వెళ్ళి నారాయణఎక్స్ ప్రెస్ కు రెండు బెర్త్ లు రిజర్వేషన్ చేయిస్తాను...." ఉత్సాహంగా చెప్పాడు రాంగో.
మాటల్లో చెప్పలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అతని ఎదపై వాలిపోయింది జాజిబాల.
కోరకుండానే దేవత కరుణించినట్టు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఆమెను జాగ్రత్తగా పొదివి పట్టుకున్నాడు రాంగో.
వాళ్ళ మధ్య మాటలే కరువైనట్టు మౌనంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ ఇద్దరూ...!
అప్పటికి రెండు రోజుల క్రితం...
నల్లపాప, పాండ్యముత్తు...హైదరాబాద్ చేరుకుని హోటల్ రూమ్ బుక్ చేసుకుని తమ పని ప్రారంభించారు.
ఒక రోజంతా సిటీలో ఎడాపెడా తిరిగి.... రెండో రోజు ఉదయుం పదిగంటల సమయంలో పురావస్తుశాఖ కార్యాలయం దగ్గర బీట్ వేశారు.
సరిగ్గా అదేరోజు ప్రొఫెసర్ జయరామ్ కు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన్ను హాస్పిటల్ కు తరలించడం చూశాక వాళ్ళ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
ఎంతోసేపు ఎదురు చూడకుండానే సమయం కలిసివచ్చినట్టు నల్లపాప, పాండ్య ముత్తు ఆ ప్రాంతంలో యధేచ్చగా సంచరించి వెళ్ళిపోయారు.
సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళిద్దరిని గమనించే అవకాశం లేకపోయింది. మ్యూజియంకు పరిసర ప్రాంతాలు, అసలు మెయిన్ గదిలోకి ఎంటర్ అయ్యే అవకాశాలూ, తిరిగి ఎటువేపు ఈజీగా గోడ దూకి వెళ్ళిపోవచ్చు అనే మార్గాలను అన్ని రకాలుగా పరిశీలించిన తరువాతనే తీరిగ్గా తాము దిగిన హోటల్ కు వెళ్ళారు.
"ఆ ప్రొఫెసర్ గాడు పోతాడేమో...." అన్నాడు పాండ్యముత్తు విసుగ్గా.
"పోతే పోనియ్... వాడు పోతే మనకేమిటంట?" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నల్లపాప.
"వాడు పోతే అసలు ఆ విగ్రహాలు మ్యూజియంలోనే పెట్టరు."
అతని మాటలకు నల్ల పాపకు చిర్రెత్తుకొచ్చింది.
పాండ్యముత్తు వ్యవహారమంతా స్ట్రెయిట్ గా వుంటుంది. మనసులో ఏదైనా విషయం అనుకున్నా వెంటనే అనేయడం, అన్న పని చేసేయడం అలవాటు...
అతని అపశకునపు మాటలకు కోపం వచ్చినా నిగ్రహించుకున్న నల్లపాప...
"ప్రతి పని ప్రారంభించే ముందు ఇలా అశుభం డైలాగులు వదలకు ముత్తూ... ఆ ప్రొఫెసర్ గాడు నిజంగానే చచ్చాడనుకో ఇప్పట్లో మన కోరిక తీరదు" అన్నది.
"పాపా.... వాడు అంత తేలిగ్గా చచ్చే రకం కాదులే.... వాడొట్టి బండ మనిషి, హాస్పిటల్ లో పడి కొన్ని రోజులు నీల్గుతాడు. అదీ మన మంచికే జరిగిందేమో....
"అంటే..."
"ఒక విధంగా మనకిది గొప్ప అవకాశం..."
"అదే...ఎలాగనే నేను అడిగేది?"
"ఒక పెద్ద తలకాయ తనంతట తనే అడ్డు తొలిగి మనకు లైన్ క్లియర్ చేసినట్టే. ఇక పూర్తి బాధ్యత అంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రేమ్ నాథ్ మీద పడుతుంది"
"అవును....వాడు మంచి యవ్వనంలో వున్న యువకుడు కూడా... వాడ్ని ఎలాగోలా మనం లొంగదీసుకోవచ్చు....ముత్తూ...అదే కదూ నీ ఆలోచన" చిరునవ్వుతో అన్నది నల్లపాప.
"ఎగ్జాట్లీ...రేపు మ్యూజియంలో ప్రజలు చూసేందుకు వీలుగా బుద్దుని దంతాలున్న పెట్టె, సీతారాముల పంచలోహ విగ్రహాలు బయట పెడతారా లేదా అన్నదే డౌటు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ రోజులు గడవకుండా పని పూర్తి చేసుకుపోవాలి. భోజనం అయ్యాక సెక్యూరిటీ వాళ్ళ సంగతి ఎంక్వయిరీ చేసుకువస్తాను..."
పాండ్యముత్తు ఒక వైపు ధారాళంగా చెబుతూనే వున్నాడు.
కానీ, అప్పటికే నల్లపాప మద్రాసు నుంచి సీక్రెట్ గా తెచ్చుకున్న విస్కీబాటిల్ ఓపెన్ చేసి మందు లాగించడం మొదలుపెట్టింది.
"పాపా....ఎప్పుడు పడితే అప్పుడు విస్కీ తీయొద్దని చెప్పానా లేదా? ఇక్కడ ప్రొహిబిషన్ ఉన్న విషయం మరిచిపోతే ఎలా? వాసనపడితే చాలు వచ్చేస్తారు పోలీసులు. అనవసరంగా లేనిపోని తలనొప్పుల్లో తలదూర్చితే మనం వచ్చిన పని సవ్యంగా జరగదు....నీ అలవాట్లు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఊరుకునేది లేదు.... వెంటనే మద్రాసు వెళ్ళే ట్రెయిన్ ఎక్కించేస్తాను...."
"అరె పోబే....! నాకు మందుకొట్టొద్దని చెబుతావా? కళ్ళు పోతాయిరా....ఇక్కడ పిచ్చి జనానికి మందులో మజా తెలియక నిషేధం కావాలని కోరుకున్నారు...అందుకే ఇప్పుడు ఆ బాధ ఎలావుంటుందో తెలిసి అఘోరిస్తున్నారు...."
విస్కీ మత్తు అప్పటికే ఆమె తలకు ఎక్కడంతో తూలిపోతూ...మాటలు పేలడం ఆరంభించింది.
పాండ్యముత్తుకు ఆమె పరిస్థితి అర్ధమయింది.