Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 19

    అతని భుజం చుట్టూ చేయి వేసి ప్రేమగా రాంగో బుగ్గపై ఒక ముద్దిచ్చింది.
   
    ఆయాచితంగా లభించిన ఆ ముద్దు స్పర్శకు రాంగోకు పులకింత కల్గింది..
   
    ఆటో వేగంగా వెళుతూనే ఉన్నది.
   
    ఇద్దరి మనసులూ అంతకన్నా వేగంగా....పరిపరి విధాల ఆలోచిస్తూనే వున్నాయి.
   
                                                                    *    *    *
   
    పోలీసు కమీషనర్ కారు హాస్పిటల్ ఆవరణలో ఆగింది.
   
    అంతకు ముందే అక్కడా సిద్దంగా ఉన్న పోలీసు సిబ్బంది కమీషనర్ ను సరాసరి....ప్రొఫెసర్ జయరామ్ ఉన్న స్పెషల్ రూమ్ లోకి తీసుకెళ్ళారు.
   
    ఇంటెన్సివ్కేర్ లో ఉంచిన ప్రొఫెసర్ అప్పటికి కొద్దిగా కోలుకొన్నాడు.
   
    అతన్ని పరామర్శించడం అయ్యాక....
   
    "ఈ రోజు ఆ విలువైన సంపదను ప్రజలు సందర్శించుకొనే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం గానీ మీరున్న ఈ పరిస్థితిలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం మంచిదేమో...." అంటూ మిగిలిన మాటలను పూర్తి చేయకుండానే అర్దోక్తిలో ఆగిపోయాడు కమీషనర్.
   
    కానీ ప్రొఫెసర్ జయరామ్ అందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదు.
   
    "నో.... నో... నా ఆరోగ్యం బాగోని కారణంగా అపూర్వమైన మన చారిత్రక సంపదను ప్రదర్శించే ప్రోగ్రామ్ లో ఎలాంటి మార్పులూ చేయవద్దు. అనుకున్న సమయానికి ఎరేంజ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎరేంజ్ మెంట్స్ పూర్తి కానీ పక్షంలో మరొక రోజు సమయం తీసుకుని రేపటికి సిద్దం చేయండి.
   
    "ఏ పని చేయాలని నిశ్చయించుకున్నా, వాయిదా వేయాలనుకున్నా మన ముందున్న వృత్తి బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రం చెయ్య కూడదనేది నా పాలసీ...ఎన్ని అడ్డంకులు, కష్టనష్టాలు ఎదురైనా మన పనిని వెనక్కి తీసుకోవడం అంటూ జరగనేకూడదు.
   
    "రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారి చేత.....హోం మంత్రిగారి ఆధ్వర్యంలో బౌద్దకాలం నాటి విశేషాలనూ...బుద్దుని అవశేషాలనూ...సీతారాముల పంచలోహ విగ్రహాలను.....వాటి ఘనచరిత్రనూ ప్రజలు తెలుసుకోవాలి చూసి తరించాలి....ఈ ఏర్పాటులో ఎటువంటి మార్పు చేయకండి. నేను లేకున్నా ఇదిగో నా అసిస్టెంట్స్ ఇద్దరూ ఆ బాధ్యతలో ఎలాంటి కొరత లేకుండా మేనేజ్ చేయగలరు."
   
    ప్రేమ్ నాథ్, మల్లికలవైపు చూస్తూ ప్రొఫెసర్ జయరామ్ కొంచెం ఆవేశంగా చెప్పాడు.
   
    "టేక్ ఇట్ ఈజీ ప్రొఫెసర్ .....మీ ఇష్ట ప్రకారమే చేస్తాంకానీ ఈ విషయంలో మీరు ఎమోషనల్ ఫీల్ కావద్దు. మీరు చెప్పినట్టే రేపటికి ప్రదర్సన సిద్దం చేస్తాం. మీరు రెస్టు తీసుకోండి" లేచి నిలబడుతూ అన్నాడు కమీషనర్.
   
    ప్రొఫెసర్ జయరామ్ మౌనం వహించాడు.
   
    కమీషనర్..ప్రేమ్ నాథ్ వైపు చూస్తూ-
   
    "మైడియర్ యంగ్ మాన్....మనం సెక్యూరిటీ ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఆఫీసుకు ఒకసారి రండి..." అన్నాడు.
   
    "అలాగేసర్...ఒక గంట తర్వాత మిమ్మల్ని కలుస్తాను..." వినయంగా చెప్పాడు ప్రేమ్ నాథ్. ప్రొఫెసర్ ను మరొకసారి పరామర్శించిన పోలీసు కమీషనర్ వెళ్ళిపోయాడు.
   
    పోలీసు బృందాలు హాస్పిటల్ ను విడిచి వెళ్ళిపోవడంతోనే అంత వరకు ఆ పరిసరాలలోనే తచ్చట్లాడుతున్న హాస్పిటల్ కాంపౌండరు ఒకడు ప్రొఫెసర్ జయరామ్ వున్న స్పెషల్ రూమ్ లోకి వెళ్ళాడు.
   
    తన కప్పగించిన డ్యూటీ ఏదో తను చేస్తున్నట్టు తల వంచుకుని శ్రద్దగా పని చేసుకుంటున్న ఆ కాంపౌండరువైపు క్షణం పరిశీలనగా    
            [9]
   

      చూసిన ప్రొఫెసర్ జయరామ్ ఓపిక చేసుకొని లేచి కూర్చున్నాడు.
   
    ఆయన చెప్పే పాయింట్సును జాగ్రత్తగా నోట్ చేసుకోవడంలో నిమగ్నమై పోయారు మల్లిక, ప్రేమ్ నాథ్...
   
    పది నిమిషాల తరువాత....

   
    "రేపటి ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడంలోనూ, దగ్గరుండి ఏర్పాట్లు చేయడంలోనూ మీ కెరీర్ ఆధారపడి వున్నదన్న విషయాన్ని మరువకండి. ఈ డిపార్టుమెంటులో మొదటి నుంచి అంకితభావంతో పని చేసుకు పోయేవాళ్ళకీ రావలసినంతగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాకాక ఏ కొంచెం నిర్లక్ష్యం చేసినా చాలా ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి.
   
    "అవి ఎలాంటివి? ఏ రూపంలో వస్తాయన్న విషయం నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకొంటాను. చూడమ్మా మల్లికా....ఒక్కొక్కసారి ప్రేమ్ నాథ్ అతి ముఖ్యమైన విషయాన్ని ప్రక్కనపెట్టేసి ఆత్రుత పడుతుంటాడు. నువ్వెటూ పక్కనే వుంటావు కాబట్టి అతన్ని కొద్దిగా గమనిస్తుండు...."
   
    ఆ చివరి మాటలతో మల్లికా బుగ్గలు ఎరుపెక్కాయి.
   
    అంత టెన్షన్ లోనూ హాయిగా జోకులెయ్యడం ప్రొఫెసర్ కే చెల్లింది.
   
    మరో పది నిమిషాల తరువాత....
   
    ప్రేమ్ నాథ్, మల్లిక హాస్పిటల్ లో నుంచి బయటకు వచ్చారు.
   
    ప్రేమ్ నాథ్ హీరో హోండా స్టార్ట్ చేశాడు....
   
    వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక, అంతవరకూ ప్రొఫెసర్ రూమ్ లో వున్న కాంపౌండర్ కూడా బయటకు నడిచాడు.
   
    అతను పాండ్యముత్తు!
   
                                                *    *    *
   
    వెన్నెలా ఫైనాన్స్ కంపెనీ....
   
    ప్రొప్రయిటర్ రాజేంద్రప్రసాద్ గుండెల్లో గత నాలుగు రోజులు నుంచి భారతదేశంలోని ఎక్స్ ప్రెస్ రైళ్ళన్నీ బ్రేకుల్లెకుండా పరుగెడుతున్నాయి.

 Previous Page Next Page