కచ్చడాలు తయారుచేసే కార్ఖానాలు
వాటి ప్రకటనలు
మాన సంరక్షణమనీ, పాతివ్రత్య పోషణమనీ పెద్దపేరులు పెట్టి ఈ కచ్చడాలు వ్యాప్తిలోనికి తెచ్చారు.. నిజం ఆలోచిస్తే అదీ కాదు. ఇదీ కాదు. ఇంకొకడు అనుభవిస్తాడేమో అన్న భావం. తన వస్తువు-- స్త్రీ ఇక్కడ ఒక వస్తువుతో సమానమే-ఇతరులకు ఎందుకు ఉపకరించాలి అన్న బుద్ధి. అంతా నాకే అన్న స్వార్ధపరత్వం. ఇవే ఈ కచ్చడాల నిర్మాణానికి దారితీశాయి.
ఈ విషయమే చక్కగా రూఢి అయ్యింది. ఆచారాలను పట్టి చూచినా, న్యాయస్థానాలలో కేసులను పట్టిచూచినా ఈ మాట నిజం అని బోధపడుతుంది. ఇప్పటికీ అనేక జాతులలో ఉన్న ఆచారాలు, అలంకరణ విధానాలు ఈ కచ్చడాల ఉద్దేశాన్ని నిరూపిస్తున్నాయని మనవి చేశాను.
గ్రంధాలలో కచ్చడాలున్నాయి. సామెతలలో 'తాళాలు' ఉన్నాయి. "ఏమీ ఎరగవు; తాళం వేసుకున్నావు" అని స్త్రీలు తమలో తాము ఎత్తి పొడుచుకోవడం చాలా తరచుగా వుంది.
ప్రస్తుతం ఇంకా అక్కడక్కడా ఈ కచ్చడాలు పెట్టుకొని బాహాటంగా తిరుగుతూ ఉన్నవారు కనబడుతున్నారు. తూర్పు పడమర అన్న బేధం లేకుండా ఈ కచ్చడాలు విశ్వవిహారం చేశాయి. ఆరంభము తూర్పు దేశాలలోనే అయినా, యూరోపియనులు ఈ కచ్చడాలకు ఒక మెరుగు పెట్టారు. రాక్షసకృత్యంగా ఉండవలసిన ఈ కచ్చడాలలో నాజూకుతనం, పనితనం, నేర్పూ, కౌశలం అన్నీ ప్రవేశపెట్టారు. శ్రమకు జంకలేదు ఖర్చుకు వెనుకతియ్యలేదు.
ఈ కచ్చడాల వాడుక పదమూడో శతాబ్దం మొదలు 20వ శతాబ్దందాకా అనగా దాదాపు ఏడువందల సంవత్సరాలు ప్రపంచంలో ఉందని చెప్పడానికి సందేహం లేదు. ఇప్పుడుగూడా, ఏ ప్రదేశంలో ఏ మహానుభావులున్నారో, ఈ కచ్చడాలతో కట్టి స్త్రీలను బంధిచినవారు; ఉండకపోరు. మానవస్వభావంలో ఈ రకాలున్నంత కాలం, ఇటువంటి వాటికి, రూపాంతరాలుంటే ఉండవచ్చును- అవకాశం ఉండక తప్పదు.
ఇంత వ్యాప్తి దేశంలో ఉన్నప్పుడూ, ఈ కచ్చడాల అవసరం ఇంత ఎక్కువగా కనిపించినప్పుడూ, కచ్చడాలు తయారుచేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కార్ఖానాలు ఉండకపోతాయా. ఇప్పటి నగలషాపుల లాగానే అప్పుడు కచ్చడాల కార్ఖానాలుండేవి.
నగల వర్తకులు ఇప్పుడు వ్యయప్రయాసలకు జంకకుండా గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తూ వున్నట్టే, అప్పుడు కచ్చడాల కంపెనీల వారు అపూర్వమైన ప్రకటనలు చేసేవారు. మంచి మంచి బొమ్మలతో రకరకాల కచ్చడాలు, పిండికొద్దీ రొట్టె అన్నట్టు డబ్బుకొద్దీ డాబు దర్పాలతో వుండేవాడిని, వర్ణించి, వర్ణించి, వాటి ఉపయోగాలు చెప్పి చెప్పి ప్రకటనలు చేసేవారు.
నగిషీపని కలవి, గిల్టు వేసినవి, లోపల మఖమల్ అస్తర్లు వేసేవి వెండి తాళాలుండేవి... ఇలాంటివెన్నో - ధరలను బట్టి ప్రకటనలు చేస్తూ వుండేవారు.
1900 ఆ సమయంలో ఒక పెద్ద నగరంలో ఒక ప్రకటన చూడండీ
అందమయిన కచ్చడాలు
స్త్రీల పాతివ్రత్య సంరక్షణ సాధనం
తాళంతో సహా సాదా కచ్చడం -120 ఫ్రాంకులు
పాతివ్రత్య సంరక్షణ సాధనం
తాళంతో డీలక్సు కచ్చడం -180 ఫ్రాంకులు
పాతివ్రత్య సంరక్షణ సాధనం
వెండితాళంతో చక్కని అస్తరు -320 ఫ్రాంకులు
దీనికింద పెద్దవర్ణన, చక్కని అచ్చు, మంచి కాగితాలు. ఇదీ ప్రకటన. దీనిని చూచి, జాబులు వ్రాసేవారికి కొలతల కార్డు ఒకటి పంపించేవారు. దానివల్ల నడుము కొలత, తొడల కొలత మొదలయిన వన్నీ కార్ఖానా వారికి తెలుస్తాయి. కచ్చడం తయారుచేసి పంపిస్తారు.
కచ్చడాల ఉద్దేశం కలిగించి ఊరించడానికి తగినట్లుగా చిన్న చిన్న పుస్తకాలలో ప్రకటనలు చేసేవారు.
ఇవి వాడుక చేసినట్టయితే భర్తలు నిశ్చింతగా వుండవచ్చు. భార్యలు అన్యులతో చరించరు, చరించలేరు అన్న నిండు నమ్మకంతో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఏ దేశాలలోనయినా వుండవచ్చు. సిగ్గు, అవమానము పడవలసిన కార్యాలు ఇంటిదగ్గర తాను లేనప్పుడు జరుగనేరవు అని మనస్ఫూర్తిగా వుండవచ్చును.
ఇంటిలోని వయస్సు వచ్చిన ఆడపిల్లలు, కొమార్తెలు చెడ్డ నడకలకు పోకుండా చెయ్యడానికి ఇంతకన్నా మంచిమార్గము చిక్కడం దుర్లభం. వర్ణసంకరాలూ, వంశకళంకాలూ కలగకుండా చేయడానికి ఏకైక సాధనం ఈ కచ్చడమే.
"నాలుగురూపాయల వెలచేసే బంగారాన్ని పెట్టెలలో పెట్టి ఎంతో భద్రంగా ఉంచుతామే, అంతకన్న ఎన్నోరెట్లు ఎక్కువ విలువగల స్త్రీల పాతివ్రత్యాన్ని తాళం వేయకుండా విడిచిపెట్టడం తెలివితక్కువ కాదా!"
ఇలాగ ఆ చెంపా ఈ చెంపా కొట్టినట్టుగా గట్టి ప్రకటనలు చేసేవారు. ఇంకొక మహా కంపెనీ మరికొంచెం ఘాటుగా ప్రకటించుకున్నది- ముక్కుమీద గుద్ది కొనకపోతే పరువుపోతుంది అన్నట్టు:
"మీ యింట (భార్యలకు) పుట్టిన పిల్లలు మీకు పుట్టినవారే అన్న నమ్మకం నూటికి నూరి పాళ్ళూ మీకు కావలసి వుంటే తక్షణం ఈ కచ్చడాలను వాడుకచెయ్యండి. లేకపోతే- నిజం ఆ భగవంతుడికే తెలియాలి" అని ప్రకటించారు.
ఈ కంపెనీల వారే మగవారు కూడా వ్యభిచరించడానికి వీలు లేకుండా వుండేటట్టు చేసే మగ కచ్చడాలను గూడ తయారుచేసి అమ్మేవారు. ఇవి ముఖ్యంగా ఆ రోజులలో చిన్నవారూ, బాలురూ దురభ్యాసాలకు లొంగిపోకుండా వుండేటట్టు చెయ్యడానికి ఉద్దేశించేవారని అనుకోవలసి ఉంటుంది.
ఇప్పటికీ, యూరప్ లోనూ, అమెరికాలోనూ, అప్పుడప్పుడు, పెద్ద మనుష్యులు డాక్టర్ల దగ్గరకూ, వైద్య యంత్రాలు తయారుచేసే కంపెనీల దగ్గరకు వెళ్ళి "స్త్రీల పాతివ్రత్యం కాపాడడానికి (ఇతరులతో చరించకుండా కట్టిపడవేయడానికి అన్నమాట) ఏదయినా సాధనం వుందా" అని అడుగుతూనే వుంటారు.
పాతివ్రత్య సంరక్షణ అవసరం ఇంత ఎక్కువగా వుందని గ్రహించి బ్రిటనులో ఒక గొప్ప డాక్టరు (ఒక యాభయి అరవయి సంవత్సరాల కింద) ఒక పుస్తకం వ్రాశాడు. అది వైద్య గ్రంధం. దానిలోని విషయం స్త్రీల పాతివ్రత్యమూ నీతి సంరక్షించే విధానాలూ విశేషాలు. ఈ డాక్టరు: (యం.డి. సర్జన్ గూడాను) అప్పటి పరిస్థితులను గురించి వ్రాయడంలో ముక్కూ మొగమూ చూడకుండా, వున్నదున్నట్లు ఘాటుగా వ్రాసేవాడు. ఇతని పుస్తకాలు ఇప్పటికీ పెద్ద పెద్ద లైబ్రరీలలో వున్నాయి-- ఎవరూ చూడరుగాని.
ఈ పుస్తకంలో మూడు భాగాలున్నాయి. ఆ రోజుల్లో ముఖ్యంగా స్కాట్లండులోని స్త్రీలలో వుండే దురాచారాలు ఒకభాగంలో నిర్మొగమాటంగా వర్ణించాడు. రెండో భాగంలో ఈ దురభ్యాసాలు కట్టించడానికి సాధనాలూ, ఉపాయాలూ, చారిత్రకంగానూ, బుద్ధికుశలతతోనూ చర్చించాడు. ఈ కచ్చడాలు వాటి నిర్మాణవిధానము మొదలయిన విశేషాలన్నీ మూడోభాగంలో వ్రాశాడు.
దీనిలోనే బాలుర దురభ్యాసాలూ, వాటి నివారణ విధానాలు గూడా కొంత విస్తరించాడు, వాళ్ళకోసం కూడా కొన్ని కచ్చడాలు సూచించాడు.