Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 17

    ప్రక్కింటివాళ్ళ పెరట్లో ఉన్న రాచఉసిరికొమ్మ ఈఇంటి పెరట్లోకి వచ్చింది. కొమ్మమీద ముక్కుపచ్చలారని పిచ్చుక పిల్లలు రెండు పెద్దగా నోరు తెరిచి అరుస్తూ, వణుకుతున్నట్టుగా రెక్కలు కొట్టుకొంటున్నాయి. తల్లిపిట్టక్రింద ఆహారంకోసం అన్వేషిస్తూంది. కుమ్మరిపురుగు ఒకటి నేల రంధ్రంనుండి బయటికి వచ్చి తల్లిపిట్టకు చిక్కిపోయింది, తనకు కాలం సమీపించిందన్నట్టూ, పిట్ట అదృష్టం పండిందన్నట్టూ! ముక్కుతో గట్టిగా పట్టుకొని పిల్లల దగ్గరికి ఎగిరిపోయింది తల్లిపిట్ట. 'అమ్మా! మాకోసం ఏం తెచ్చావ్?' అన్నట్టుగా పిల్లలు సంతోషంగా, రెక్కలు మరీ జోరుగా ఆడిస్తున్నాయి. తల్లిపిట్ట నోటినుండి కుమ్మరిపురుగు నిర్జీవంగా క్రిందికి వ్రేలాడుతూంది.

    నిశ్శబ్ధమైన మధ్యాహ్నం వేళల్లో పెరట్లో పిచ్చుకల కోలాహలం చూస్తూంటే చిన్నప్పుడు తండ్రి చెప్పిన కథ తప్పకుండా జ్ఞాపకం వస్తుంది ప్రేమీకి నాన్న ఎన్నో కథలు, పురాణకథలు, చరిత్రకథలు చెప్పాడు. అందులో సారంగ పక్షుల కథంటే తనకొక చిత్రమైన ఇష్టం ఏర్పడింది.

    కాండవ ప్రస్థమనే ప్రదేశాన్ని పాండవులకు కేటాయించి, ఆ ప్రాంతాన్ని పాలించుకోమని చెబుతాడు ధృతరాష్ట్రుడు. ఖాండవప్రస్థకీకారణ్యంగా ఉంటుందప్పటికి. ఆ కారణ్యాన్ని వాసయోగ్యంగా చేసుకోడానికి కీకారన్యాన్ని దహిస్తాడు అర్జునుడు.

    ఖాండవ వనంలో ఒక చెట్టుమీద తన నలుగురు పిల్లలతో కాపురముంటూంది జరిత అనే సారంగపక్షి.

    అగ్ని శతకోటి నాలికలు చేసుకొని అడవిని దహిస్తూ వస్తూంది!

    "పిల్లలూ! రెక్కలురాణి మిమ్మల్ని నేను ఎక్కడికి తీసికెళ్ళను? మీ తండ్రి మందపాలుడు లపిత అనే మరొక ఆడపక్షి వ్యామోహంలో పడి నన్నువదిలి ఆమెతో జీవిస్తున్నాడు. నేనొక్కదాన్ని మిమ్మల్ని ఈ అగ్నినుండి ఎలా రక్షించుకోను?" దుఃఖిస్తుంది జరిత.

    పిల్లలు చిన్నవైనా జ్ఞానుల్లా మాట్లాడతాయి. "మమ్మల్ని ఎలాగూ నువ్వు రక్షించలేవు! నువ్వు ఎగిరిపో, అమ్మా మా కోసం నీ ప్రాణాలను కూడా పోగొట్టుకోకు. నువ్వు బ్రతికిఉంటే నీకు మళ్ళీ మంచిరోజులు రావచ్చు! నీకు మళ్ళీ పిల్లలు కలుగొచ్చు! అప్పుడు నువ్వు మమ్మల్ని మరిచిపోయి సుఖంగా ఉంటావు! నువ్వు సుఖంగా ఉండాలనే మాకోరిక. ఎగిరిపో, అమ్మా" పిల్లలు తొందర పెడతాయి!

    "మిమ్మల్ని విడిచి నేను వెళ్ళలేను. ఈచెట్టు క్రింద ఒక ఎలుక కలుగు చూశాను. ఆ కలుగులో మిమ్మల్నిదాచి నేను వెళ్ళిపోతాను. అగ్ని ఆగిపోయాక వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొంటాను."

    "కలుగులో ఎలుక మమ్మల్ని తినేస్తుందే." తెలివిగా ప్రశ్నించాయి పిల్లలు.

    "ఎలుకని మొన్నే ఒక గ్రద్ద తన్నుకు పోవడం చూశాను!"

    "ఆ ఎలుకపోతే, ఆ ఎలుక సంతతి ఉండదని ఏం? ఎలుకలు మాశరీరాల్ని పీక్కుతినడంకంటే అగ్నిద్వారా మేం పుణ్య లోకాలకి చేరుకొంటాం. మానొసట ఎలాఉంటే అలా అవుతుంది. మా గురించి చింత మానెయ్యి. నీప్రాణాన్ని రక్షించుకో. మన వంశం మాతోటే అంతరించి పోకుండా చూడు." పిల్లలు బలవంతం చేసి జరితను పంపించేస్తాయి.

    లపితతో ఉన్న మందపాలుడు అడవి తగలబడిపోవడం చూస్తాడు.

    'నా భార్యాపిల్లలు ఈ అగ్ని ప్రజ్వలనంలో ఏమయ్యారో? నేను వెళ్ళి రావాలి!!' అంటాడు.

    లపితకు కోపం వస్తుంది. 'నా మోజు తీరిపోయింది కదూ? మీ మగజాతి అంతా ఇంతే. ఇప్పుడొచ్చారా జ్ఞాపకం భార్యా పిల్లలూ?" స్త్రీ సహజంగా దెప్పుతుంది." అగ్నిమీకు మిత్రుడని చెప్పారు. ఎంత చెడ్డ వాడైనా మిత్రుడి పిల్లలకు హాని చేయడు. మీరు మీ భార్యదగ్గరికి వెళ్ళాలనుకోవడం అగ్ని ఒకసాకు మాత్రమే!"

    మందపాలుడు పూర్వజన్మలో ఒకరుషి. అతడికి సంతానం లేక పోవడంవల్ల దేవలోకప్రవేశం దొరకదుకదా, దూతలతో గెంటి వేయబడతాడు. మందపాలుడు భూలోకానికి వచ్చి పక్షిజన్మ ఎత్తిపిల్లల్ని కంటాడు.

    రుషిగా ఉన్నప్పుడు అతడికి అగ్నిమిత్రుడు.

    'అగ్ని నాకు మిత్రుడే. కాని, ఈ పరిస్థితిలో నా భార్యా పిల్లల్ని చూడకుండా ఉండడం నాకు సాధ్యంకాదు. ఆకాశంలోకి ఎగిరిపోతాడు.

    అక్కడ అగ్ని జరిత పిల్లల్ని ఏమీ చేయదు. జరిత తిరిగివచ్చి క్షేమంగా ఉన్న తన పిల్లల్ని తృప్తిగా చూచుకొంటుంది. గండంగడిచి పోయిందన్న సంతోషంతో పిల్లలు కిచకిచ లాడుతుంటాయి.

    మందపాలుడు వచ్చి చెట్టుకొమ్మ మీదవాలి అడుగుతాడు భార్యను. బాగున్నావా?'

    జరిత ఒకనిర్లక్ష్యమైన చూపుచూసి ముఖం త్రిప్పుకొంటుంది.

    మందపాలుడు వేదాంతిలా నవ్వి అంటాడు. "నీ ప్రవర్తన చాలా సహజమైనది. స్త్రీకి మాత్రుత్వం వచ్చాక భర్తను లక్ష్యపెట్టడం మానెస్తుంది. సరే. నువ్వూ పిల్లలూ క్షేమమేకదా? వస్తాను.' మంధపాలుడు నిశ్చింతగా తిరిగి వెళ్ళిపోతాడు.

    ఈ కధ చిన్నప్పుడు విన్నప్పుడు తనకు సందేహాలు కలుగలేదుగాని పెద్దయ్యాక కలిగాయి. పిల్లల్ని కనడంకోసం పక్షిజన్మ ఎత్తిన మందపాలుడు పిల్లల్నికన్నాక, స్వర్గానికి వెళ్ళిపోక, భార్యాపిల్లల్ని వదిలి మరొకదానితో ఎందుకు పోయాడు? అతడికి పూర్వజన్మ స్మృతికూడా ఉంది.

    పురాణ కథల్లో పక్షులు, జంతువులు మనుషుల్లా మాట్లాడుకొంటాయి. పూర్వజన్మ స్మృతికలిగి ఉంటాయి. పూర్వజ్ఞానంతో మనుష్యధర్మానికి దగ్గరగా మసలుకొంటాయి.

    ఆ కథలు వినడానికి చాల తమాషాగా, ఆసక్తిగా ఉంటాయి. తండ్రిని మరీమరీ అడిగి చెప్పించుకొనేది ప్రేమీ, ఆ పురాణ కథల్ని.

    భర్త వదిలిపెట్టినా పిల్లల్ని చూచుకొంటూ ఉంటుంది జరిత. ఆ మంటల్లో, భర్తవదిలేసిన జరిత తనపిల్లలతో రెక్కలురాని తన పిల్లలతో పాటు తనూ ప్రాణత్యాగం చేయడానికి సిద్దపడుతుంది! ఎంతటి కరుణ గాధ!

    కాని,

    బుద్ది, తెలివి, ఆలోచన అన్నీ ఉన్న తల్లి ఏం చేసింది? కనగానే కంపలోకి విసిరివేసింది. కుక్క చూచుకొంటుంది తన పిల్లల్ని ఆప్యాయంగా.  వేయికళ్ళు చేసుకొని కాపాడుకొంటుంది. కుక్కేమిటి? పిల్లి, ఆవు, గేదె_జంతువులన్నీ మగసాయం లేకుండానే తన పిల్ల రక్షణబాధ్యత స్వీకరిస్తాయి! ఆ మూగజీవాల నేత్రాలలో ఎంత యమకారం తొణుకుతుంది.
   

 Previous Page Next Page