Previous Page Next Page 
భారతి పేజి 17

    అతడెంత  నిగ్రహంగా  వుందామన్నా కంఠం చలికి  గడగడ లాడిపోవటం  కనిపెట్టి, ఆ ఆరిపోతూన్న  వెలుగులో ఎవరయినా  సాయం వస్తున్నారేమో  చూడటానికి ప్రయత్నిస్తూ  ఆమె తల అటూ ఇటూ త్రిప్పింది. అంతా  అగమ్యగోచరంగానే  వుందిగానీ, ఆమె దృష్టి కెవరూ  ఆనలేదు.

    హఠాత్తుగా ఆమెకు మరో భయం పట్టుకుంది. 'మీరు చూస్తే అతి సుకుమారులు. ఒంటిమీద ఒక నీటిబొట్టు పడినా, సూర్యకిరణం పడినా  అణువణువూ  చలించిపోయేటట్లు వున్నారు. తన దురదృష్టవశాత్తూ ఆయనకే న్యూమోనియా అయినా వస్తే మామగారు  తనని బ్రతక నిస్తాడా? అగ్నివర్షం కురిపించడూ?"

    ఆమెకేం చేయటానికీ  పాలుపోలేదు. వర్షం  ఎక్కువ కావటంతో  బాటు చీకటి నలువైపులా  ఆక్రమించి వేసింది. నలుమూలల నుండీ  ఏవో వింత వింత శబ్దాలు, దూరంగా  ఎక్కడో  పిడుగుపడి  భూమి బ్రద్ధలైనట్లుగా  ధ్వని. ఆమెకి భయం వెయ్యకపోలేదు.

    "భా....ర....తీ...." సారధి కంఠం ఆమె శ్రవణకుహరంలోకి దీనాతి దీనంగా పసిపిల్లవాడి  ఆక్రందనలా  సోకింది.

    'నేనున్నాను' అని ఆమె స్వగతంలా  చెప్పుకుంది, సిగ్గెందుకు? అతడు తన పతి, తన సర్వస్వం అతనిది. తన పమిటతీసి అతని వీపు చుట్టూ చాతీమీదుగా  కప్పింది. గాలికి ఎగిరిపోకుండా కుడిచేత్తో అతని చుట్టూ  పరిభ్రమించిన పమిట  అంచును  గట్టిగా  పట్టుకుని ఎడంచేతిని అతని వీపుచుట్టూ  పోనిచ్చి  తనవైపుకు శక్తి కొద్దీ లాక్కున్నది.

    బంగారు  తాళ్ళతో  నేసిన వలలో  చిక్కుపడినవానిలా  ఊపిరి సలపనట్లు "భారతీ! భారతీ!" అని ఏదో అంటున్నాడతను. ఆమెకు వినబడటంలేదు.

    ఆకాశంలో  మెరుపు మెరిసి  త్రుటికాలం  కాంతిరేఖ  భూమిమీద కూడా పొర్లాడింది. ఆ కొద్ది వ్యవధిలోనే  భూమిమీద ఏదో ప్రాకుతూ సారధి కళ్ళకి కనిపించి, త్రుళ్ళిపడి "భారతీ, పాము" అని అరిచి ఆమెను అంటుకుపోయాడు.

    భారతికి ప్రాణాలు ఎగిరిపోయినట్లయాయి. "పామా? ఎక్కడ?" అంది హీనస్వరంతో ఎలాగో.

    "ఇక్కడే మనకు దగ్గర్లోనే. మనమున్న వైపుకే  చరచరమని ప్రాకి వస్తోంది" ఎక్కడలేని శక్తి కూడదీసుకుని  ఈ మాటలు  అని అతడామె మీద మరింతగా ఒరిగిపోయాడు.

    భారతి ఆకస్మికంగా  ధైర్యం తెచ్చుకుంది. భయపడి గోలపెట్టి  కేకలు వేస్తే ప్రయోజనం లేదని గ్రహించి  అతని చెవిలో "ఉష్, మాట్లాడకండి. మీకేమీ భయంలేదు" అన్నది రహస్యంగా.

    ఆ మాటలు అతనిమీద  మంత్రంలా పని చేశాయి. ఇద్దరూ ఊపిరి బిగపట్టి, ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయి, కదలిక లేకుండా  ఆ చీకట్లో నిలబడ్డారు.

    క్షణాలు యుగాల్లా  గడుస్తున్నాయి. ఎటు చూస్తే అటు చీకటి, భయంకరంగా  కురిసే వానచప్పుడు, గాలికి ఊగే చెట్ల సవ్వడి.

    భారతి భయంతో  ప్రాణం పోతున్నట్లయింది. నలువైపుల నుంచీ ఎన్నో నాగుబాములు  పడగలు  విప్పుకుని, బుసలు కొడుతూ  మీదకు దూకుతున్నట్లూ ,శరీరమంతా  కాట్లు  వేస్తున్నట్లూ  అనుభూతి పొంది గజగజలాడిపోయింది.

    'చచ్చిపోతున్నామేమో:- ఒకవేళ  మా యిద్దరికీ అంత్యదశ సమీపించిందేమో' అనే పాడు ఆలోచన  ఆమె తలను తాకింది. భారతికి ఏడుపు వచ్చింది.

    చావంటే  ఆమెకు భయంలేదు. అసలు చాలా ధైర్యంగల  పిల్ల భారతి. కాని కాళ్ళ పారాణి ఇంకా ఆరకుండా, పెళ్ళి బట్టలు  గరగర ఇంకా తరగకుండా, బుగ్గమీద  పెళ్ళిబొట్టు  ఇంకా  చెరగకుండా__అప్పుడే చచ్చిపోవటం....గుండె ఝల్లుమంది.

    తనచుట్టూ  తన భర్త చెయ్యి వుంది. తన భర్త చుట్టూ తన చెయ్యి వుంది. ఒకరి చేతులు ఒకర్ని నాగుపాముల్లా  బంధించాయి. భయంతో అని కాస్త వణికి కదిలినట్లయినప్పుడు, ఒడలు వింత స్పర్శలతో  జలదరించినట్లవుతూంది.

    ఆయన ఏ దశలో వున్నాడో  తెలుసుకోవాలని  ఆత్రుతగా  వుంది భారతికి. భయంతో స్థంభీభూతుడయి  పోయినాడా? ఏం చేస్తున్నాడు? ఏమాలోచిస్తున్నాడు? ఆయనది ఎంత పిరికి హృదయమో ఆమె అర్ధం చేసుకుంది. జాలితో ఆమె మనసంతా  నిండిపోయింది. 'మీరేం చేస్తున్నారు? భయంగా వుందా?' అని అడుగుదామనుకుంది. ఇంతలో  నేల మీది గడ్డిమీద చరచరమని  ఏదో ప్రాకినట్లయింది.

    గొంతు తడారిపోయినట్లయింది. సందేహంలేదు దగ్గర్లోనే  తమ కాళ్ళకు  తగిలేటంతటి  దగ్గరలోనే  చరచరమని ప్రాకి వస్తూంది. ఆమె చెయ్యి అతని శరీరంమీద మరింత  గట్టిగా  బిగుసుకుంది.

    నిమిషాలు మన్వంతరాల్లా  గడుస్తున్నాయి.
    భారతి  తనవి పాము చెవులు  చేసుకుని  ఆలకిస్తూంది. గడ్డిమీద చప్పుడు! ఈసారి కొంచెం దూరంగా  కదలినట్లయింది.

    తమకు....తమకు....ఆపద తప్పిపోయిందా?

    ఇంతలో మెరుపు మెరిసింది. త్రుటికాలం వెలిగిన ఆ కాంతిలో తన కళ్ళను మెరుపు వేగంతో  సారించి ఆమె స్పష్టంగా తిలకించింది. కొద్దిదూరంలో  ఓ చెట్టు వెనక్కు  మెలికలు తిరుగుతూ  వెళ్ళిపోతున్న నాగుపామును.

    ఆమెకు  ఆనందంతో  కేక వేయాలనిపించింది. ఉద్రేకాన్ని  అణుచుకుని, తెలివి తెచ్చుకుని "ఏమండీ! ఏమండీ!" అని భర్తని గట్టిగా  కుదుపుతూ  పిలిచింది.

    ఒక నిమిషం  తరువాత  సారథి మెల్లిగా  "ఊఁ" అన్నాడు మత్తు విడుతున్నట్లు.

    ఆ చీకటేగనుక  అప్పుడు లేకపోయినట్లయితే  అతని ముఖంలో  ప్రతిబింబించిన  భయాందోళనలన్నీ, హావభావాల్నీ  భారతి చూసి అతనిమీద  అనురాగవర్షం  కురిపించి ఉండేదో, అసహ్యించుకుని దూరంగా తొలగిపోయేదో గాని యిప్పుడు మాత్రం "భయం లేదండి, పాము వెళ్ళిపోయింది" అంది ఎంతో ఉత్సాహంగా. 

    "ఆఁ వెళ్ళిపోయిందా?" అన్నాడు సారథి నీరసంగా. అతని మాట ఏదో లోకం నుండి  వచ్చినట్లు  వినిపించింది.

    "అవును నేను చూశాను" అంది భారతి అతనికి  నమ్మకమూ, శక్తీ కలిగించటాని కన్నట్లు.

    మనసును  స్వాధీనపరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు, తీవ్రమైన అనారోగ్య స్థితి నుంచి  కోలుకుంటున్నట్లు  ఒక నిమిషం  సారధి మౌనంగా  నిలబడ్డాడు. తరువాత  "భారతీ!" అన్నాడు తడబడే కంఠంతో.

    భారతి చకిత అయి  ముఖం ఎత్తి చీకట్లో  అతన్ని  చూడటానికి  వ్యర్ధ ప్రయత్నం  చేసింది.

    సారథి  చేతులింకా  ఆమెను చుట్టుకునే వున్నాయి. చప్పున ఆమెను మరింత గట్టిగా పొదివి పట్టుకుని తనకు అభిముఖంగా  త్రిప్పుకుని, "భారతీ! చాలా పిరికివాణ్ని  నేను. నీ అండదండలు లేకుండా బ్రతకలేను. ఎప్పుడూ నన్ను కనిపెట్టుకుని  వుండవూ?" అన్నాడు వణికే గొంతుతో.

    ఆమె ప్రయత్నం మీద నిట్టూర్పు  ఆపుకుంది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఆ క్షణంలో అతని యందు ఆమెకున్న  ప్రేమ వేయింతలు  అధికమై, ఆ అనురాగ వల్లరి దిశల  అంచులవరకూ  వ్యాపించినట్లయి  ఆ అనుభూతితో ఆమె మేను పులకరించింది.

    ఆమె మృదువైన  వ్రేళ్ళు  అతని వీపును  అనురాగంతో  నిమిరాయి. "ఎలాంటి పరిస్థితిలోనూ  మిమ్మల్ని విడిచిపెట్టను. మీకు నేనున్నాను" అంది దృఢస్వరంతో.

    దూరంగా  ఏదో కాంతి  కనిపించింది. ఇద్దరి దృష్టీ అటుమరలి అదేమిటా అని చూస్తూ వుండిపోయారు.

    "అబ్బాయిగారూ!" అన్న కేక  వినిపించిందింతలో. ఆ గొంతు రాజయ్యది.

    అప్రయత్నంగా ఇద్దరూ  ఒకరినొకరు  వదిలేసి  దూరంగా జరిగి నిలబడ్డారు.

 Previous Page Next Page