"ఎక్కడిది? ఎట్టుకోచ్చా? ఇస్తే దాయక- ఏం ప్రశ్నలు?" కస్సుమన్నాడు చిదంబరం- తొలిసారి జీవితంలో భార్య పై నోరు చేసుకున్నాడు.
గుప్పుమంటున్న వాసనని చేత్తో ఆపుకున్నాడు.
భర్తని పరీక్షగా చూసిందామె "తాగేరా" స్థిమితంగానే అడిగింది.
కస్సుమన్నాడు చిదంబరం. "తప్పేంతప్పేం తాగితే? ఏదో అనుకోకుండా దండిగా డబ్బోచ్చింది అందరం కలిశాం జల్సా అన్నారు. కాదనలేక? బలవంతం చేస్తే గుక్కెడు.."
అ మాటలంటున్నప్పుడు తనకి కళ్ళెదురుగా కార్టర్ బాటిల్ విస్కీ మెదిలింది. అరకోడి కదలాడింది.
నోట్లో పైట చెంగు కుక్కుకుందామె. పిల్లల ముందు 'వాదు' వద్దనుకుంది. అయినా గతించిన దాని గురించి పోట్లాడితే ఏం లాభం?
భార్యను లొంగదిశాననుకున్నాడు అతను. అలవాటు మనిషిని జయించినట్టు---
ఒక్కసారిగా రెండు వేలు రావటమో ఆశ ఎక్కువైంది. వచ్చినా రెండువేలు నెల తిరక్కముందే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళాయి. "పంచాగ్ని విద్య' లో జివుడిలాగా.
అప్పు చేస్తున్నాడు. కొత్తగా అలవాటైన పేక ఆడుతున్నాడు. ఆరు నెలల జీతం అడ్వాన్సుగా తీసుకున్నాడు. పెస్టివల్ అడ్వాన్సులు లోన్లు ఎప్పుడో అయిపోయాయి.
ఓపెన్ రాకపోతే కలిగే బాధ ఎలా తీరాలి? అందుకే 'మజా; లో అలావాటైన మందుని 'సేవిస్తున్నాడు' డబ్బు వచ్చినా రాకున్నా రోజు 'మందు' కొడ్తున్నాడు. అది బాగా అలవాటైంది. దాన్ని విడువలేడు. దిన్ని వదల్లెడు,
ఆశ! ఆశ! ఎప్పుడో జాక్ పాట్లో పోయిన డబ్బంతా పేకటాలో తిరిగొస్తుందని? ఎప్పుడో బ్రాకెట్స్ తగుల్తాయి. పోయిన డబ్బల్లా వచ్చి 'లక్షల' కదికారి అవుతానని! ఆకాశ హర్మ్యనిర్మాణానికి ఆశలు అలంకరణలు......ఎప్పుడు పూర్తవుతుందా మేడ?
ఆరు నెలలు గడిచాయి.
రోజు బ్రాకెట్ అందినట్టే అంది ఆశలు పెంచి అదిలోనో,అంతంలోనో తన్నేస్తోంది. మనసుకి కలిగిన బాధ పోయేందుకు కార్టర్ ఖాళి కాక తప్పటం లేదు. పేకలో జాక్ పాట్ తన్నేస్తోంది. రౌండ్ లో ఒకటో రెండో గెలిస్తే మిగతా అన్ని పెనాల్టిలు.
జాక్ పాట్లో అల్ కొంట్ తప్పటం లేదు. ఆశ అంతా జాక్ పాట్ మీదే మరీ. షో చేస్తే నాలుగొందలోస్తాయి కానీ అది తప్పుతోంది. మసాలా కరిగిపోతోంది.
అప్పులు మనిషిని మంచులా కమ్మేస్తున్నాయి. మబ్బుల్లా ముంచేస్తున్నాయి.
నలుగురిలో మునుపటిలా తిరగలేడు. మాటాల్లేడు. సిగ్గు, బెరుకు, చేతకానితనం తెచ్చిన అవమానం. ఆశ ముంచిన అవసరం. అలవాటుని చంపుకోలేని బలహీనత. ఇప్పుడు ఏవిధంగా చూసినా వెనక్కి వెల్లలేని ఆశ చేసిన చెరువు.
చుట్టూ ముళ్ళ కంచెలా కమ్ముకున్న పరిస్థితులు.
ఓ రోజు సాయంకాలం......బస్టాండులో తెలిసిన ముఖాన్ని అప్పు అడగటానికి వెళ్ళి వస్తున్నాడు.
అప్పుడు కలిశాడు మనుమంచి పల్లె మిత్రుడు.
సంస్కరణలేని జుత్తు. పిక్కుపోయి కళాకాంతులు నశించిన ముఖం గాజు గోళాల్లా వున్న కళ్ళు. మాసిన చొక్కా శ్రద్ధ లేని జివితంలాగా ముఖం నిండా వైరాగ్యం.........
"నువు నువేనా" ఆశ్చర్యంగా అడిగాడతను.
చచ్చిన చావైంది చిదంబరానికి.
"ఎందిట్లా తయారైనావ్? మనుళ్లో చెబ్తే నే నమ్మలా? ఏందిది సార్? రోజు మట్కా అడ్తన్నవంటగదా? తాగుతవంటగదా? ఇస్పేటు అడ్తన్నవంటగదా? అన్నీ అప్పుల్జేసినావంటగదా? మొన్న సుబ్బారెడ్డి కన్పిస్తే అప్పడ్గినా వంటగదా? పట్టపగలు సూర్యుడిని కమ్మేసిన చిక్కని మబ్బులో వడగళ్ళ వాన కురిసినట్టుగా అడుగాడతాను.
నోరెత్తలేదు చిదంబరం. తలదించుకున్నాడు. తనకంటే వయసులో, చదువులో యోగ్యతలో అన్నిటా చిన్నవాడు ఈ రోజుయిలా నడి రోడ్డులో నిలేసి నిలదీసి ప్రశ్నిస్తూ వుంటే......
"సార్! ఎంత బాగుండినవ్ నువు? అప్పటికి యిప్పటికి ఎంత యత్తాశం! ఇదేంది ఇల్లా చేదిపోయినావ్? ఈ వురోచ్చి పాడైపోయినావ్! నీకు డబ్బాశ ఎందుకు పుట్టింది సర్? ఎవర్నేర్పింనార్ సార్ యిది? ఇట్టయితే నీ పిల్లలెం గావాల? ఆమేం గావాల? ఎట్లా బతుకుతారు? దించిన తలెత్తలేకపోయాడు ఉత్తమ ఉపాద్యాయుడు.
"సార్! తలారి పెద్దన్న తాగుతుంటే బుద్ది చెప్పి మన్పించావ్! మాది గెంకడు తాగి దొంగతనాలు చేస్తుంటే బుద్ది చెప్పి మాన్పించినావే? నువిట్లా ఎట్లాయినావ్ సార్! ఒకరికి చెప్పేవాడివి నువిట్లా చేప్పించుకోవాలా?"
చిదంబరానికి పాతాళానికి పడిపోతున్నట్లుగా వుంది.
"పిల్లల చదువులెట్లా? పెండిండేట్లా? అస్సలు నువెందిట్లయినావ్! నీ ఆరోగ్యమేం గావాల? ఇది బాగాలేదు సార్? నువు మళ్ళా మనూరికి మర్పించుకో!"
చిదంబరం తలుపేడు.
"కాఫీ తాగుదాం రాసార్!"
జేబులో ఏమి లేదు. అందుకే నంబరు రాయించటానికి, పక్కలో చేయి కలపటానికి, సీసా సిలు తీయటానికి అన్నిటికి బదులు కోసం వెళ్ళాడు. అప్పైనా సరే అని వెళ్ళేడు. కానీ కీర్తి దిగంతాలకి పాకింది. అప్పు పుట్టలేదు ఇప్పుడు హొటలుకి ఎలా వెళ్ళాలి!
'రాసార్! కాఫీ తాగుదాం, బిల్లు నేనిస్తా!'
కబేలాకి మేక వెళ్లినట్టు వెళ్ళాడు.
టిఫినయింది. తృప్తిగా తిని ఎన్నాళ్ళయింది! కాఫీ తాగేరు.
"సార్! మనూరికి రా! పొలం గుత్తకి తీస్కో. ఎవరో ఒకరం మేం పండిస్తాం. అప్పులుఇ తిర్తాయి. పొలం కొనుక్కో! నేను యింటికి స్థలం యిస్తా! కొట్టం యేస్కో! నీకింకేం ఖర్చుంటది. పిల్లల్ని బాగా చదివిందు."
"అలాగే!" గొంతు పెకిలింది చిదంబరానికి.
"వస్తా సార్! నీకు నేను చెప్పేటంతోన్ని కాదు. నీకాడ చదువుకున్నా నాకు బుద్ది చెప్పినవాడివి. అదే నా బాధ" వెళ్ళిపోయాడతను.
మరణశిక్ష విధించినట్టుగా బాధపడిపోయాడు చిదంబరం.