Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 17


    "నువ్వు ఓ ముఠాకు నాయకుడివా?" ఆశ్చర్యంగా అన్నాడు గోపీ- "అయితే నీ పేరు చౌదరి అయుండాలి. అవునా?"
    వృద్ధుడు నవ్వి- "బాగానే ఊహించావు. మా ఇద్దరి పేర్లూవిదేశాల్లో కూడా వాడుకలో వున్నాయని చెప్పుకుంటారు. నీకు తెలియడంలో ఆశ్చర్యం లేదు. ఇంతకూ నేను చెప్పేదేమిటంటే- ఇది నాయుడి ఏరియా. నాయుడి ఏరియాలో నాయుడి మనిషిని దెబ్బతీశావు నువ్వు-" అన్నాడు.
    "ఇది నాయుడి ఏరియా అయితే ఇక్కడికి నువ్వెలా వచ్చావు? నీకేమీ ప్రమాదం లేదా?"
    "ఎందుకుండదు? వుంటుంది. కానీ నువ్విప్పుడు చూస్తున్న ముఖం నా అసలు రూపంకాదు. రూపాలు మార్చుకోవడంలో నాకు నేనే సాటి అని నాయుడు కూడా ఒప్పుకుంటాడు అన్నాడు వృద్ధుడు.
    "సరే-ఈ ఫిరంగిపురంలో రెండు ముఠాలున్నాయంటావు. అందుకు నేనేమీ చేయలేను. నేను మాత్రం ఎవ్వరితోనూ కలవలేను. స్వతంత్రంగా, నా దారి నాదిగా జీవిస్తాను...." అన్నాడు గోపీ.
    "అది అసాధ్యం. ఈ ఊళ్ళో మూడో ముఠాను తలెత్త నివ్వం. మాలో ఎవ్వరికీ చెందని వాళ్ళనిక్కడ బ్రతకనివ్వం. కొత్తగా ఇక్కడ ఎవరు అడుగుపెట్టి దాదాగిరీ వెలిగించాలనుకున్నా-మారెండు ముఠాల్లో ఒక దానిలో చేరక తప్పదు. ఇది తిరుగులేని సూత్రం-" అన్నాడు చౌదరి.
    "మీరెండు ముఠాలకూ ఒకరితో ఒకరికి పడదుకదా - మీలో మీరే కొట్టుకుంటారా-నాలాంటివాడిని పట్టించుకుంటారా?" అన్నాడు గోపీ.
    "మా రెండు ముఠాలకూ ఎలాంటి శత్రుత్వమైనా వుండవచ్చు. కానీ మూడోవాడీ ఊళ్ళో అడుగుపెడితే మేమిద్దరం ఒక్కటైపోతాం. వాడిని మట్టు పెట్టేకనే మా శత్రుత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తాం-" అన్నాడు చౌదరి.
    ఆ ముఠాలు అవిచ్చిన్నంగా ఆ ఊళ్ళో ఎలా మనగల్గుతున్నదీ గోపీకి అర్ధమయింది- "మనలో మనకు యుద్ధంవచ్చినపుడువాళ్ళు నూర్గురు. మనం అయిదుగురం-కానీ మనమీదకు ఎవరైనా యుద్దానికి వస్తే మనం నూట అయిదుగురం-" అన్నాడు ధర్మరాజు భీముడితో.
    ఈ ఐక్యమత్య సిద్దాంతాన్ని ఎందరు అర్ధంచేసుకుని ఆచరిస్తున్నారో తెలియదు కానీ ఫిరంగిపురం ముఠాలకు మాత్రం ఈ సిద్దాంతం బాగా ఉపయోగపడుతున్నది.
    కురుక్షేత్రం యుద్ధం జరిగినపుడు - అటు పక్షంనుండీ ఇటు పక్షం నుండీ పావులు హతమయ్యారు. ఫిరంగిపురంలో కురుక్షేత్ర యుద్ధం జరుగడానికి తను సూత్రధారి కావాలి. అదే తనకు మిగిలిన ఉపాయం కూడా!
    "ఎవరినైనా మట్టుపెట్టగల శక్తి ఉన్నమీరు-మీలో ఒకరిని ఎందుకు నాశనం చేయలేరు? ఒకే ఊరికి రెండు ముఠాలేమిటి? చౌదరి, నాయుడు- ఈ ఇద్దరిలో ఎవ్వరో ఒక్కరే మిగలాలని పట్టుబడితే - ఏదో ఒకటి తేలిపోదా?" అన్నాడు గోపీ.
    "అబ్బాయ్-" అన్నాడు చౌదరి నవ్వుతూ- "సృష్టిలో బ్యాలన్సు తప్పనిసరి. ఈ ప్రపంచంలో అమెరికా ఒక్కటే బలమైన దేశమయుంటే అది ఈ ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటినీ సామంత దేశాలు చేసుకుని ఉండేది. అలాగే రష్యాకూడా! ఆ రెండు దేశాలు సమఉజ్జీలు కావడంవల్లనే ఎన్నో ఇతర దేశాలు స్వతంత్రంగా బ్రతగ్గలుగుతున్నాయి. ఇది సృష్టి రహస్యం. ఈ ఫిరంగిపురంలో చౌదరి, నాయుడు అని ఇద్దరున్నారు కాబట్టే ఈ ఊళ్ళో సామాన్యులు కూడా ఉండగల్గుతున్నారు. ఈ ఊరొక ఊరు. అనిపించుకుంటున్నది. అదీకాక మేమిద్దరం సమ ఉజ్జీలం. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు నేను, నాయుడు భాగస్థులం. ఒకరంటే ఒకరికి గౌరవం ఉన్నది. అసూయ ఉన్నది. ఒకరి బలం ఒకరికి తెలుసు. బలహీనతలూ తెలుసు. సంకేత స్థలాలూ తెలుసు. అందువల్ల మాలో మేము అప్పుడప్పుడు కీచులాడుకున్న-ఒకరినొకరు రూపుమాపాలనుకోవడం జరుగదు అమెరికా, రష్యాలు పరస్పరం యుద్ధంచేస్తే - ఏ దేశమూ మిగులదని ఇద్దరికీ తెలుసు. అదీ మా కథ!"    
    గోపీ చౌదరి మాటలను శ్రద్దగా విన్నాడు- "మీ ముఠాలు నడిచే, నడిపే పద్దతి నాకెంతో వచ్చింది. పరస్పర ద్వేషంతోకూడా-పరస్పర సహకారాన్నందించుకోగల్గుతున్న మీ నుంచి సామాన్య ప్రజలెన్నో తెలుసుకోవలసి ఉన్నది. నేర్చుకోవలసి ఉన్నది. మీవంటి వారితో కలిసి ఇండడం నా ప్రాణాలకు రక్షణ కల్పిస్తే అది నాకూ మంచిదే-కానీ నువ్వీ మాటలు నిజంగానే అంటున్నావా? నేను మీకు అపరిచితుణ్ణికదా-నన్ను నీ ముఠాలోకి ఎలా తీసుకుంటావు?"
    చౌదరి నవ్వి- "నీ సామర్ధ్యం చూశాను. ఇలాంటి శక్తి యుక్తులు దొంగలకేనా ఉంటాయి-పోలీసులకేనా ఉంటాయి-" అన్నాడు.
    "అయితే నేను పోలీసుల మనిషిని కావచ్చు కదా!"
    "అసాధ్యం-నీ పోలికలవాడెవ్వడూ ఈ మధ్య ఈ చుట్టుపక్కల పోలీస్ డిపార్టుమెంట్లో అపాయింట్ మెంట్ కాలేదు. ఈ విషయంలో మా రికార్డ్సు ఎప్పుడూ అప్ టు డేట్ గా ఉంటాయి. అన్నాడు చౌదరి.
    "నువ్వు పొరపడ్డావని నా నమ్మకం. నేను పోలీసుల మనిషిని-"
    చౌదరి నవ్వి - "పోలీసులమనిషి నన్న భ్రమనీలో ఇంకాఉంటే ఒక్కవిషయంవిను. ఫిరంగిపురం ఆకలిగొన్న సింహంలాంటిది. పోలీసు మనిషి లేడికూనలాంటివాడు. ఈ ఊళ్ళో అడుగుపెట్టి ఇంతసేపైనా బ్రతికి ఉన్నావంటే- నువ్వు పోలీసులమనిషి కావని నువ్వే తెలుసుకోవాలి-" అన్నాడు.
    అది హెచ్చరికో, సూచనో, సమాచారమో గోపీకి అర్ధంకాలేదు.
    "మరి ఈ ఊళ్ళో పోలీసులున్నారుగా-" అన్నాడు గోపీ.
    "వెనకటికెవరో మేనత్త కొడుకూ ఓ మొగుడేనా అన్నదట. అలాగ-మా ఊరి[పోలీసులూ పోలీసులేనా?" అని తమాషాగానవ్వి అక్కడి పోలీసుల గురించి చెప్పాడు చౌదరి.
    ఫిరంగిపురంలోని పోలీసులు సామాన్యుడేం ఫిర్యాదుచేసినా వినిపించుకోరు. ఏ ఫిర్యాదైనా నాయుడు ద్వారాగానే చౌదరి ద్వారాగానీ వెళ్ళాలి. ఇద్దరిలో ఎవర్నిబ్బంది పెట్టాల్సివచ్చినా వాళ్ళు కేసు జోలికి వెళ్ళరు. అయితే వాళ్ళకు నెలకో ఏడాదికో ఇన్ని కేసులుండాలని ఉంటుంది. ఆకేసులువాళ్ళకు నాయుడు, చౌదరి సరఫరా చేస్తారు. అక్కడి పోలీసులకోసం వాళ్ళు దొంగతనాలు, దోపిడీలు సృష్టించి - నేరస్థుల్ని కూడా పట్టించి ఇస్తారు. అందువల్ల రికార్డ్సు బుక్సు ప్రకారం ఫిరంగిపురం పోలీసులు కడుసమర్ధులు.
    అంతా వినగానే గోపీకి నవ్వువచ్చింది. అయినా ఆవిషయమై ఇంకేమీ అనకుండా- "నాదిస్వతంత్ర ప్రవృత్తి. నేనెవరినీ బాస్ గా స్వీకరించలేదు. నాకు నేనే బాస్ ని-" అన్నాడు గోపీ.

 Previous Page Next Page