"మీ వుడ్ బి ఫాదరిన్లా ఏడీ?" సింహాద్రి నడిగాడతను.
"అదే నాకూ తెలీటం లేదు. బయట కారు స్టార్టవుతూంటే చూశాను. తీరా చూస్తే డ్రైవ్ చేస్తోంది భావయ్య! అంత క్విక్ గా మనకు తెలీకుండా గదిలోంచి బయటికెలా వెళ్ళిపోయాడో తెలీదు"
"చాలా ఫాస్ట్ గా చేశాడా పని" వప్పుకున్నాడు చిరంజీవి.
"ఇంతకూ అతని కూతురితో పెళ్ళి బాధ తప్పిపోయినట్లేనా?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
"సెంట్ పర్సెంట్"
సింహాద్రి తేలికగా గాలి పీల్చుకున్నాడు.
"ఇప్పుడు తిన్నగా మావయ్య దగ్గరకెళ్ళి నానా మాటలూ అంటాడేమో!"
"అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్"
"మరప్పుడు సంగతంతా మావయ్యకు తెలుస్తుంది కదా?"
"తప్పకుండా తెలుస్తుంది"
"తెలీగానే మరి మాంఛి కొరడా ఒకటి తీసుకుని మన కోసం రాడంటావా?"
"వస్తేరానీ! మనం అలాంటి సంభాషణ అస్సలు జరగలేదని పూర్తిగా వాదిస్తాం కదా!"
"ఐసీ!"
"ఎలావుంది మన ప్లాన్?" అడిగాడు చిరంజీవి.
"సింప్లీ సూపర్బ్! చాలా థాంక్స్ రా"
"దట్సాల్ రైట్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్" చిరునవ్వుతో అన్నాడతను.
మర్నాడు తెల్లవారుజామున ఎనిమిది గంటలకల్లా లేచి అద్దం ముందు కూర్చున్నాడు సింహాద్రి. చిరంజీవి డ్యూటీ కెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసరికి అప్పుడే మేకప్ పూర్తి చేసి లేచి నిలబడ్డాడు.
"ఎలా వుందిరా ఈ డ్రెస్ బాగా సూటయిందా?" అనడిగాడు ఆనందంగా.
"మాంచి రేసుగుర్రం లాగున్నావ్"
"ఇలా ఈ పోజులో నిలబడమంటావా, గడప దగ్గర?"
"ఛట్! రచయితలు గడప దగ్గరా, కిటికీ చువ్వలు పట్టుకునీ నిలబడతారేమిట్రా!"
"మరేం చేయమంటావ్?"
"ఆ అమ్మాయి వచ్చేసరికి టేబుల్ దగ్గర కూర్చుని నవల రాస్తూ వుండాలి"
"కానీ నాకు నవల రాయడం రాదుగా?"
చిరంజీవికి చిరాకేసుకొచ్చింది.
"రాకపోవడమేమిట్రా? నీకు రాజూ ఏడు చేపలు కథ తెలీదూ?"
"తెలుసు"
"దాన్నే సోషలైజ్ చేసెయ్? రాజు బదులు జమీందారు అని పెట్టు! ఆ జమీందారుకి ఏడుగురు కొడుకులు! ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీర్; ఒకడు బిజినెస్ మాన్, ఇంకోడు రచయిత అలా ఏర్పాటు చేసెయ్. ఆఖరోడు మాత్రం రిక్షావాడు. నవలంతా వాడి చుట్టూతా తిరుగుతుందన్నమాట!"
"కానీ జమీందారు కొడుకు రిక్షా తొక్కడు కదా?"
"ఆ విషయం ఎవడడుగుతాడ్రా నిన్ను? అంతగ్గాపోతే వాడుట్టి ప్రిన్సిఫుల్ద్ ఫెలో అని చెప్పు. తండ్రి డబ్బుతో బతకడం ఇష్టంలేని అభిమానమో, ఆత్మాభిమానమో అదేదో అఘోరించిందని కోసేయ్! నిజానికి వాడు విదేశాల్లో ఏదో పెద్ద కోర్సులు ఓ పాతిక చదివాడని చెప్పు. అయినాగాని కాయకష్టం చేసుకు బతకాలని వాడి హాబీ అన్నమాట. అలా ఏదోకటి లాగించెయ్యడమే"
"సరే. ఏవీ కాగితాలు."
"టేబుల్ మీద వున్నవి చాల్లే. త్వరగా స్టార్ట్ చేసెయ్ ఆ పిల్ల వచ్చే టైమయింది"
సింహాద్రి టేబుల్ ముందు కూర్చుని తనలో తను కూడ బలుక్కుంటూ నవల రాయడం ప్రారంభించాడు.
"అనగనగా ఓ జమీందారు. ఆ జమీందారు చాలా బీదవాడు. కానీ అతని కొడుకులు చాలా ధనవంతులు. అతని భార్య ఇంకా బోలెడు ధనవంతురాలు. కానీ ఆఖరి కొడుకు మాత్రం పరమ గర్భ దరిద్రుడు..."
* * * * *
"రచయిత ధనుంజయ్ గారిల్లు ఇదేనాండీ?" అన్న సన్నని గొంతువిని ఉలిక్కిపడి, గాబరా అయిపోయి, ఠక్కున లేచి నిలబడ్డాడు సింహాద్రి.
ఎదురుగ్గా ఫోటోలో చూసిన బొమ్మ ప్రాణం ప్లస్ ఇంకా బోలెడు అందంతో ఎదురుగ్గా నిలబడి వుంది.
కొద్దిక్షణాలపాటు సింహాద్రి ఆమెవంకే చూస్తూ, నోరు మెదపకుండా నిలబడిపోయాడు.
ఆమెకు అతని మానసిక పరిస్థితి మీద అనుమానం కలిగింది. గాలిలోకి చేయెత్తి అతని కళ్ళముందు రెండు చిటికెలు వేసింది.
అప్పుడుగాని సింహాద్రి స్పృహలోకి రాలేదు.
"ఆ....ధనుంజయ్ గారిల్లాండి..... ఆయన ఈ గది ఖాళీ....." మిగతాది కూడా పూర్తి చేసి ఉంటే ఆమె బులెట్ లాగా అక్కడి నుంచి దూసుకు వెళ్ళిపోయుండేది.
కానీ సింహాద్రి పరిస్థితంతా హారర్ పిక్చర్ చూస్తున్న్తలు గమనిస్తోన్న చిరంజీవి చప్పున అడ్డుపడిపోయాడు.
"ఉష్! వాగకురా! రండి మేడమ్ రండి! ఇదే ధనుంజయ్ గారిల్లు" అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.
శ్రీదేవి సంతృప్తిగా గాలి పీల్చుకుంది.
"హమ్మయ్య......వెదకలేక చచ్చాను. పాడు ఇంటి నంబరురీ ఈ సిటీలో ఇంటినంబర్లకు ఒక వరుసాలేదూ, వాయీలేదు"
"అవునండీ! అసలివి ఇళ్ళ నెంబర్లు కాదండీ. సీక్రెట్ కోడ్ నంబర్లు. ఒకరిల్లు ఒకరికి తెలీకుండా ఉంటానికని కార్పోరేషన్ వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. రండి లోపల కూర్చోండి"
శ్రీదేవి లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది.
"అన్నట్లు ఇంతకూ ధనుంజయ్ గారెవరు?" అంది ఇద్దరినీ పరీక్షగా చూస్తూ.
"ఇదిగో వీడేనండీ" అన్నాడు చిరంజీవి చప్పున సింహాద్రిని చూపిస్తూ. అని సింహాద్రి భుజ మీద రహస్యంగా తన మోచేత్తో ఒక్కపోటు పొడిచాడు.
దాంతో సింహాద్రి "అమ్మో" అని అరవబోయి ఆపుకుని "అవునండీ.... నేనండి..." అన్నాడు గాబరాగా.
"మీరా!" ఆశ్చర్యంగా అడిగిందామె.
"అవునండీ! నేనే"
"ఓ.. నమస్తే"
"నమస్కారమండీ!"
"నా ఉత్తరం అందిందా మీకు?" అడిగిందామె.
"అందిందండీ! ఫోటో కూడా అందింది. ఫోటో చాలా బాగుందండీ"