మాధవ జానకి ముఖంలోకి వింతగా చూస్తూ ఆ మాల జానకి చేతిలో పెట్టాడు. ఒకసారి మాధవ ముఖంలోకి చూసి ఆ మాల తన తలలో తురుముకుంది జానకి.
మాధవ ముఖం వెలిగిపోయింది.
ఒక్కసారిగా జానకి భుజాలు పట్టుకొని గుండెల దగ్గరగా లాక్కుని ఆ పూలను అఘ్రానించాడు. అంతలో జానకిని వదిలేసి - "సారీ! నీకు కష్టం కలిగించానా?" అన్నాడు ఆర్ద్రంగా.
జానకి చిరునవ్వు నవ్వింది అదే సమాధానమాననట్లు. అటు కాత్యాయని రావటంతో అక్కడ నుండి లేచిపోయాడు మాధవ.
తలలో తను కట్టిన కొక్కిరి బిక్కిరి మాలతో పాటు మరిన్ని సన్నజాజులు తురుముకుని తెల్లని జరీ చీరతో పాలగ్లాసు తీసుకుని తన దగ్గరకు వచ్చిన జానకిని చూస్తూ ఇంక నిగ్రహించుకోలేక పోయాడు మాధవ. ఆ సాయంత్రం జరిగిన సంఘటన అతనికి కొంత పోత్సాహన్నిచ్చింది.
సందేహిస్తూనే "నువ్వు ఇక్కడే పడుకుంటావా?" అన్నాడు.
"ఊహూ!' అనేసింది జానకి.
ఆశ్చర్యపోయాడు మాధవ. అతడి మనసు గాయపడింది.
"సరే వెళ్ళు" అన్నాడు పొడిగా.
పక్క గదిలోకి వచ్చేసిన జానకికి బావురుమని ఏడవాలనిపించింది. తలనిండా ఉన్న సన్నజాజులు తనను చూసి విరగబడి నవ్వినట్లనిపించింది. మాధవ అనుగ్రహం కోసం, అతని గుండెల్లో ఇమిడి పోవటం కోసం పరితపిస్తూ కూడా 'ఊహూ' అందేమిటి? అలా ఎందుకంది? అయినా అతను అలా అడగడం మేమిటి? "ఇక్కడ పడుకుంటావా?" అని నిలబెట్టి ప్రశ్నిస్తే "పడుకుంటాను" అని ఎలా చెప్పగలను? తన చెయ్యి పట్టి మీదకు లాక్కుని పక్కన పడుకో బెట్టుకోవాలి కాని.
ఎలా? ఎలా తెలుస్తుంది అతనికి తన మనసులో ప్రేమ? తన స్వచైతన్యాన్నీ ఆవరించుకున్న ప్రేమ సంగీతాన్నీ పడబద్ధం చేసే శక్తి తనకు లేదు. అంత మాత్రం చేత అతనికది వినిపించదా?
ఉదయం నుంచి పత్రి కదలికలో తనలో పులకలు నింపిన జానకి తన దగ్గర పడుకోవటానికి నిరాకరించగానే కుంగిపోయాడు మాధవ.
కాని వెళ్తూ వెళ్తూ జానకి చూసిన చూపు?
"నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను " అన్నట్లుగా ఉంది.
ఏమిటిది? ఈ ముడి ఎలా విప్పుకోవాలి?
జానకికి తన మీద ప్రేమ ఉంది. అందుకు సందేహం లేదు. మరి ఈ బిగువెందుకు? ఇంకా తనను పరీక్షించాలనుకుంటుందా? సరే! తనూ నిలబడగలగాలి.
* * *
ఆ రోజు ఉదయం ఏదో మెత్తని స్పర్శతో మెలకువ వచ్చింది మాధవకు. కళ్ళకెదురుగా జానకిని చూసి అనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు . చేతిలో పూలగుత్తితో అతని చెక్కిలి మీద కొట్టి నిద్రలేపింది జానకి.
"ఎంత పొద్దుపోయిందో తెలుస్తోందా? పిన్ని లేపమంటే లేపాను. లేకపోతే ఇంకా ఎంతసేపు నిద్రపోయేవారో?"
మాధవ జానకి మాటలేమీ వినటం లేదు. అప్పుడే స్నానం ముగించి వచ్చింది ఆమె. ఆ ప్రభాతకాంతులలో మెరిసిపోతున్న జానకి ముఖంలోకి చూస్తూ కూచున్నాడు.
"ఇవాళ ఎంత మంచిరోజు జానకీ!" అన్నాడు. అప్పటికర్ధమయింది జానకికి మాధవ తన మాటలు వినటం లేదని.
చిన్న చిరునవ్వుతో "మనం తలుచుకుంటే అన్ని రోజులూ మంచి రోజులే అవుతాయి" అనేసింది. ఇంత చొరవగా మాట్లాడగలిగినందుకు తనే ఆశ్చర్యపోయింది.
మాధవ కూడా సంభ్రమంతో కళ్ళు పెద్దవయ్యాయి.
"నిజంగా?" అన్నాడు చిలిపిగా నవ్వుతూ -- నవ్వు నణుచుకుంటూ తల దించుకుంది జానకి.
"అయినా ఆ సంగతి ఇప్పుడా చెప్పేది? తెల్లవారిపోయాక? అయ్యో ప్రాణం ఊసూరుమంటోంది" దిగులుగా నిట్టూర్చాడు మాధవ.
"మీకిప్పుడు తోచింది అడగాలని ...." పకపక నవ్వేసి వెళ్ళిపోయింది జానకి.
తెల్లబోయాడు మాధవ. జానకిలో ఇంత చిలిపితనం ఉందని అతనెన్నడూ ఊహించలేదు.
జానకి చేతిలో కాఫీ అందుకుంటూ అటూ ఇటూ చూసి బుగ్గమీద చిటికేశాడు మాధవ.
చటుక్కున ఒక్కడుగు వెనక్కు వేసింది జానకి. బిత్తరపోయి చూశాడు మాధవ.
తలెత్తి మాధవ ముఖంలోకి చూసి మధురంగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది జానకి.
మాధవకర్ధమయింది.
స్త్రీ సహజమైన లజ్జ. సంకోచం అంతే!
సున్నితమైన మనసు. చిన్న ఉద్వేగానికి తీవ్రంగా కదిలిపోతోంది. సాహసించి తనే ఆమెను దగ్గరకు తీసుకోవాలి . ఓహు౧ ఇంక ఈ విరహం భరించలేడు.
కాత్యాయని భోజనానికి కూచుంటూ మాధవను కూడా పిలిచింది.
"నేను తర్వాత తింటానత్తయ్యా!" అన్నాడు మాధవ. కాత్యాయని అర్ధం చేసుకుని నవ్వుకుంది. జానకికి అర్ధమయింది. నిలువెల్లా వణికింది ఆనందంతో.
కాత్యాయని భోజనం ముగించి లేచాక మాధవకు వడ్డించింది జానకి.
"నువ్వూ వడ్డించుకో" అన్నాడు మాధవ.
"నేను తరువాత తింటాను" నమ్రతతో అంది జానకి. "నేనూ తరువాత తింటా" కీచు గొంతుతో జానకిని వెక్కిరిస్తూ నవ్వి తన కంచం ముందుకు తోసేశాడు.
జానకి విధిలేక తనూ వడ్డించుకుని కూచుంది. మాధవ ముందు ఏదో సంకోచంతో ముద్ద తీసి నోట్లో పెట్టుకోలేకపోయింది జానకి. అది గ్రహించి "తినలేకపోతున్నావా? నన్ను తినిపించమంటావా?' అంటూనే తన కంచంలో ముద్ద తీసి జానకి నోట్లో పెట్టేశాడు మాధవ. ఆశించని ఈ సంఘటనకు ఉక్కిరిబిక్కిరై పొలమారింది జానకికి. తలమీద నెమ్మదిగా తట్టి మంచి నీళ్ళందించి "మర్యాదగా తిను మరి" అన్నాడు.
భోజనాలు ముగించాక తన దగ్గరకు తమలపాకులు తీసుకొచ్చిన జానకిని చెయ్యి పట్టుకుని తన మీదకు లాక్కుని చేతులతో చుట్టేశాడు. "నన్నింకా పరీక్షించకు జానకీ! నీవాడిని" అతి దీనంగా అన్నాడు. జానకి కళ్ళూ చెమ్మగిల్లాయి. అతని చేతులు ఇంకా పైపైకి పోసాగాయి. జానకి కంగారు పడి లేవబోతూ "ఇదేమిటి?" పట్టపగలు" అంది విసుక్కుంటూ నవ్వుతూనే.
ఆమెను లేవనియ్యకుండా పక్కమీద అదిమి పట్టి 'అంటే రాత్రికి అనిగ్రహిస్తావన్నమాటేగా!" అన్నాడు.
మాధవ ఇలా మాట్లాడినప్పుడే జానకి గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా అతని ప్రశ్నల స్థాయిలో సమాధానం చెప్పలేదు.
"చెప్పకపోతే వదలను" రెట్టించాడు మళ్ళీ.
"నా అనుగ్రహమేమిటి? మీ అగ్రహానుగ్రహాల మీద ఆధారపడి ఉన్నదాన్ని" అంది.
మాధవ జానకిని వదిలేసి కోపంగా మరోవైపు తిరిగాడు.
"ఫో! ఇలా మాట్లాడితే నా దగ్గరకు రానక్కరలేదు"
జానకి పక్కమీది నుండి లేచిపోయింది.
"మీ అలక తీర్చడానికి తీరిగ్గా మళ్ళీ వస్తాను. ఇప్పుడు నాకు పనుంది"