అతని చేతిలో చిక్కుకున్న పైట చెంగు విదిపించుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
* * *
కాత్యాయనికి కాఫీ అందియ్యటానికి వెళ్ళిన జానకి కాత్యాయనిని చూసి అలాగే నిలబడిపోయింది. కాత్యాయనిని ఆ స్థితిలో జానకి ఎప్పుడూ చూడలేదు. ముఖమంతా వదిలిపోయింది. కళ్ళు ఎర్రగా అయిపోయి కొద్దిగా ఉబ్బి ఉన్నాయి. అతి బలవంతాన దుఖాన్ని నిగ్రహించుకుంటున్నదానిలా పైట చెంగుతో ముఖం మాటిమాటికీ తుడుచుకుంటుంది.
జానకిని చూడగానే చేతుల్లో ఉన్న ఉత్తారం చటుక్కున దిండు కింద దాచేసి చిరునవ్వుతో కాఫీ అందుకుంది. ఎంత ప్రయత్నించినా మాములుగా నవ్వలేకపోయింది కాత్యాయని.
జానకి మనసు కలవరపడింది. అయినా సంగతేమిటని కాత్యాయనిని అడిగే సాహసం మాత్రం లేదు. ఆ సంగతేమిటో ఆ దిండు కింద ఉత్తరంలో ఉందని మాత్రం అర్ధమయింది.
సాయంత్రం కాత్యాయని స్నానానికి వెళ్ళినప్పుడు జానకి భయపడుతూనే ఆ ఉత్తరాన్ని తీసింది.
బుచ్చిబాబు అంటారు ఒకచోట 'మనలో చాలామందిది తలుపు సందు నీతి'అని.
తలుపు సందు అంటే ఇతరులకు కనబడకుండా ఉన్నంతవరకూ ఘనమేనని చెయ్యటానికైనా జంకం. మన నీతి నియామాల శంకలన్నీ మనం ఇతరులకు దొరికిపోతామని భయం కలిగినప్పుడే. జానకి కూడా సాధారణ మానవ మాత్రురాలే! సాధారణ పరిస్థితులలో అయితే కాత్యాయని ఉత్తరం ఆమె చదివేది కాదు. కాని కాత్యాయనిని ఏ పరిస్థితులలోనూ తొణకని కాత్యాయనిని అంతగా కలవరపరిచిన ఆ ఉత్తరం తీసి చదవకుండా ఉండలేకపోయింది.
డియర్ మాధవా!
ఆశ్చర్యపోయింది . మాధవకు ఉత్తరం వస్తే కాత్యాయనికింత ఆవేదన దేనికి? వెంటనే కింద సంతకం చూసింది "నీ సరళ...."
ఒక్కసారిగా జానకి మెదడు దిమ్ముబోయింది. ఆలోచించటం మానేసింది. యాంత్రికంగా ఆ ఉత్తరం పైనుంచి కిందికి చదివేసింది.
డియర్ మాధవా!
నాతొ మాటమాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయావు కదూ! నీకేవరిచ్చారా అధికారం? ఇంతలో అయిపోయిందనుకున్నావు కాబోలు! ఇక్కడికి రాగానే దీనికి తగిన శిక్ష అనుభవించినప్పుడు తెలుస్తుందిలే! న్యాయానికి నీకు ఉత్తరం వ్రాయకుండా ఉండాలి. నీమీద కోపం వచ్చింది కనుక. అయినా ఎందుకు రాస్తున్నానూ అంటే-
మేము కొంతమంది స్నేహితులం రేపు ఆదివారం పిక్ నిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. నామాట నువ్వు కాదనవనీ , నువ్వు లేకుండా పిక్ నిక్ ఏమిటనీ నీ పేరు కూడా ఇచ్చేశాను. అంచేత తమరు ఉత్తరం అందుకోగానే తిరిగి టైన్లో రావాలి.
ఒకవేళ నువ్వు రాకపోతే , నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలైనట్టే !
అమ్మో! అలా కావటానికి వీల్లేదు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను గనుక, నేను వెళ్ళకపోతే నాకు బాధ కలుగుతుంది గనుక, నాకు బాధ కలిగితే నువ్వు ఒర్చలేవు కనుక - నువ్వు వస్తావు .
నీ రాకకోసం ఎదురు చూస్తూ .
నీ.......సరళ.
ఆ ఉత్తరం తిరిగి ఎలా దిండు కింద పెట్టింది , ఎప్పుడు వంటగదిలో కెళ్ళి తలుపులేసుకుని క్రింద కూలబడిందో జానకికే తెలియదు. రెండు గంటల సేపు కుళ్ళికుళ్ళి ఏడ్చాక కాని జానకికి చైతన్యమే రాలేదు. తరువాత కళ్ళు తుడుచుకుని తనను చూసి తను జాలిగా నవ్వుకుంది.
ఎంత పిచ్చిది తను? ఎందుకేడుస్తుంది/ ఏడ్చే అధికారమెక్కడిది తనకు ? ఆయనకు తనేవరినని సరళ మీద ఈర్ష్య పడగలదు!
ఇదేమిటని అడగాలా? ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? ఎవరిని చేసుకున్నా తన అభ్యంతరం ఉండదన్నాక సంజాయిషీలు అడగగలదా? మరి అయన తనపై చూపిస్తున్న ప్రేమ?
తను ఆడది - అందమైన ఆడది. ఏకాంతంలో అందమైన ఆడది కనిపిస్తే మగవాడి కొకటే ఆలోచన. ఈయన కూడా అంతే.
మరొక్కసారి దుఖం పొంగివచ్చింది జానకికి.
జానకికి మనసులో ఎంత అనురాగమున్నా తనంత తను ఈ షన్మత్రమూ బయటపడలేదని అర్ధమవుతుంది మాధవకు. తను మగవాడు. జానకి స్త్రీ సహజంగా లజ్జ పడుతోంటే తను కొంత సాహసం చెయ్యకూడదూ?
ఈ రాత్రి వృధాపోనియ్యకూడదు.
తనే స్వయంగా బజారు కెళ్ళి పువ్వులు కొని తెచ్చి పక్క అల;అలంకరించాడు మాధవ. సువాసన గల అగరొత్తులు ఒక వారకి స్టూలు మీద అమర్చాడు. తను లేవెండర్ నీళ్ళతో స్నానం చేశాడు.
భోజనాల సమయంలో జానకి ముభావంగా ఉండటం చూసి కొంచెం కష్టమనిపించింది. కాని తన ఉత్సాహపు పొంగులో అది లక్ష్య పెట్టలేదు.
గది గుమ్మంలో నుంచుని గది అలంకరణను చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది జానకి.
కనీసం తలలో పువ్వులయినా లేకుండా అతి మాములు చీరతో వచ్చిన జానకికి చూసి కొంత నిరుత్సాహపడ్డాడు మాధవ.
జానకి ఎలా వున్నా అందంగానే ఉంటుంది.
అతనిలో ఉద్రేకం ఉరకలు వేస్తోంది. ఏ ఆలోచనలూ తోచటం లేదు. ఈ జానకితనది. తన స్వంతం చేసేసుకోవాలి ఈ రోజు.
"రా జానకి!" మృదువుగా పిలిచాడు.
జానకి అడుగులు ఎప్పటిలా తడబడలేదు. నిశ్చలంగా , నిదానంగా నడుస్తూ వచ్చి పాలగ్లాసు స్టూలు మీద పెట్టి పక్క గదిలోకి వెళ్ళబోయింది.
మాధవ జానకి రెండు భుజాలు పట్టుకుని ఆపి "ఊహు! నిన్ను వెళ్ళనివ్వను" అన్నాడు.
"వదలండి" అంది గంభీరంగా జానకి.
ఆ గంభీరస్వరం మాధవకు కటువుగా తోచింది. అయినా అతని మనసులో ఒకటే ఘోష!' ఈ రాత్రి వృధా చెయ్యకూడదు. ఈ రాత్రి వృధా చెయ్య కూడదు."
"వదలను. వదలను. నిన్ను వదలలేను జానకీ! నావల్ల కాదు" ఆమెను బలంగా తన వైపు తిప్పుకుని గుండెలకు హత్తుకుని గాడంగా ముద్దు పెట్టుకున్నాడు. జానకి విడిపించుకోవాలని పెనుగులడినా విడువకుండా అతని పెదవులు జానకి ముఖమంతా పరువులెత్తుతున్నాయి. చివరకు అతని పెదవులకు జానకి కన్నీటి బిందువులు ఉప్పగా తగిలిన తరువాత కాని స్పృహ రాలేదు. చటుక్కున వదిలేశాడు.
"జానకీ ఏడుస్తున్నావా?" పాలిపోయిన ముఖంతో అడిగాడు.
జానకి వెక్కివెక్కి ఏడ్చింది.
జానకి కన్నీళ్ళు చూడలేకపోయాడు మాధవ. ఆమెను చేతులలోకి తీసుకుని బుజ్జగింపుగా "వద్దు జానకీ ! ఏడవకు. నీ కోసం ఏం కావాలన్నా చేస్తాను" అన్నాడు.
జానకి నీళ్ళు నిండిన కళ్ళతోనే అతని ముఖంలోకి చూసింది.
"మీరు డబ్బుగలవారు. మీరు తలుచుకుంటే నాకంటే అందమైన వాళ్ళనే సంపాదించుకోగలరు. నన్నెందుకు క్షోభపెడతారు?"
"జానకీ!' దిగ్భ్రాంతి తో అరిచాడు మాధవ.
జానకి చటుక్కున పక్కగదిలోకెళ్ళిపోయి తలుపులు గడియ వేసేసుకుంది.