Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 17

 

    మరింత సిగ్గుపడుతూ మరొక్కసారి మాధవ ముఖంలోకి చూడాలనుకున్నా వంచిన తల ఎత్తలేక లోపలికెళ్ళిపోయింది జానకి. అత్తయ్య ఇంత సరదాగా మాట్లాడుతుందని ఎన్నడూ ఊహించని మాధవ ఒక్కసారి కాత్యాయని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి తలదించుకున్నాడు. కాత్యాయని అభిమానంగా మాధవ తల నిమిరింది.

        
                                                         *    *    *

    తను పంపిన తెల్ల చీర కట్టుకుని, తలలో సన్నజాజులు తురుముకుని, మనసులోని సంభ్రమం స్పష్టంగా తెలియజేస్తూ అడుగులు తడబడుతుండగా పాలగ్లాసుతో తన దగ్గరకు వచ్చిన జానకిని తదేకంగా చూస్తూ నిలిచిపోయాడు మాధవ. జానకి చూపులు మాధవ చూపులతో చిక్కుకుపోయాయి. ఆ కళ్ళు తప్ప వేరు లోకమేమీలేనట్లు ఒకరి చూపులలో నుండి మరొకరికి ఏదో చైతన్య శక్తి స్రవించి ఈ లౌకిక వాతావరణానికి దూరంగా తీసుకు పోతున్నట్లు క్షణం చూపు మలుపుకుంటే ఆకళ్ళు ఏమయిపోతాయోనన్నట్లు మనసులు ప్రతిఫలించే ఆ కళ్ళలో మమతల లోతులు కొలుచుకున్నట్లు , యిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నిలిచిపోయారు.
    పరిసరాలు గుర్తుకు రావటం లేదు.
    కాలగమనం తెలియటం లేదు.
    అసలు శరీరమోకటున్నదనే స్పృహ కూడా రావటం లేదు. శరీరాలను ఆశ్రయించుకుని ఉన్న వారి మనసులు శరీరాలనే అధిగమించి ఒకదానితో నొకటి ఐక్యమై నామమాత్రపు శరీరాలకు నిలకడ లేకుండా చేశాయి. మాధవ కొద్దిగా ముందుకు తూలాడు.
    "జానకీ" అన్నాడు.
    ఆ కంఠం ఎంతో మత్తుగా ఉంది. ఈ మూడక్షరాలలో మురిపాలన్నీ మూట కట్టాయి. ఒక్క సంభోధనలోనే కోరికలన్నీ చిందులు తొక్కాయి. జానకి నిలువెల్లా పులకించింది.
    "పాలు తీసుకొచ్చాను"
    చెయ్యి జాపాడు మాధవ. అతని చేతికందియ్యకుండా నోటి కందియ్యాలనిపించింది జానకికి. జానకి మాధవ చేతి కందియ్యకుండా పాల గ్లాసు వెనక్కు తీసుకుంది. చెయ్యి కిందకు వొదిలేసి ఒకడుగు వెనకేశాడు మాధవ.
    "అక్కడ పెట్టు" అన్నాడు శాంతంగా.
    "లేదు మీ నోటికందిస్తాను " అనలేకపోయింది జానకి. ఎంత ప్రయత్నించినా ఆమె పెదవులు కదలలేదు. అసలు వంచిన తల ఎత్తలేకపోయింది. పాలు స్టూలు మీద పెట్టింది. మనసు ఘోల్లున గోలపెట్టి ఏడుస్తుంది. అయ్యయ్యో! తను అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి? ఈ పాడు సిగ్గు ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? తన శరీరం తన మాట వినదెం?
    ఒక్కసారి అయన పాదాల మీద ........నేను మీదాన్నే అని వాలిపోవాలని మనసు తపిస్తోన్నా అడుగులు భూమిలో పాతి పెట్టినట్లు ఒక్క అంగుళమైనా ముందుకు కదలవు.
    క్షణమైనా తన ముఖం మీద నిలపలేక బెదురుగా సిగ్గుగా చలించే జానకి కళ్ళలో జానకి మనసులో తనమీద ఉన్న మమత స్పష్టంగా తెలుస్తోంది మాధవకు.
    చల్లని గాలులు కిటికీ లోంచి వస్తున్నా నుదుటి మీద నిలిచాయి చిరుచెమట బిందువులు. గుండెలలోని కోరికల సందడులు మధురంగా వినిపిస్తున్నాయి. చిరునవ్వు చిమ్దిస్తోన్న క్రింది పెదవిని బలంగా నొక్కిన పలువరుస తళుకుల్లో రసిక హృదయం అందంగా ప్రతిఫలిస్తోంది. ఆ క్షణంలో జానకిని దగ్గరగా లాక్కుని గాడంగా అదిమేసుకోవాలని బలమైన కోరిక కలిగింది మాధవకు. అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఇప్పుడిప్పుడే జానకికి తన ప్రేమలో నమ్మకం కలుగుతోంది. ఇప్పుడు తొందరపడితే , జానకి కేవలం ఉద్రేకమనుకుంటే!
    ఇలా కాదు. తన ప్రేమను జానకి ఇంకా అర్ధం చేసుకునేలా ప్రవర్తించి జానకి స్వయంగా తన దగ్గరికి వచ్చేవరకూ సహనంతో ఉండాలి. జనకినే తన దగ్గరకు రప్పించుకునేటంత సున్నితంగా వ్యవహరించాలి.
    "నేను వెళ్ళనా?" మృదువుగా అడిగింది జానకి. ఆ అడగడంలోనే "నేను వెళ్ళలేను" అన్నది ధ్వనిస్తోంది. మాధవ నవ్వాడు. జానకి మరింత సిగ్గుపడి గబుక్కున పక్క గదిలోకి వచ్చేసింది. మాధవ ఆరాత్రి రెండు సార్లు గది తలుపు తట్టబోయి ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాడని జానకికి తెలియదు. తెల్లవార్లూ నిద్రపట్టని జానకి తెల్లవారుజామున లేచి వచ్చి తన పాదాల దగ్గర కొంచెం సేపు కూచుని వెళ్లిందని మాధవకు తెలియదు.


                                                             5

    ఆ మరునాడు వంటమనిషిని కాఫీల దగ్గరకు రానియ్యలేదు జానకి. తనే డికాషన్ తీసి స్టౌ మీద పాలు పడేసింది. ఊహూ! కాఫీ నోటికందించాలని ప్రయత్నించి ప్రయోజనం లేదు. అంత పని తను చెయ్యలేదు. మాములుగా చేతికే అందిస్తుంది. అయన సగం తాగాక "మిగిలింది నాకియ్యండి" అని అడుగుతుంది. అప్పుడు ఆయనకి అర్ధమయిపోతుంది.
    జానకి పాలు దింపి కాత్యాయనికి కాఫీ కలిపిచ్చేసరికి మాధవ ముఖం కడుక్కుని డైనింగ్ హాల్లోకొచ్చాడు. జానకి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు.
    జానకి చిరునవ్వు నవ్వుతూనే చటుక్కున తల దించేసుకుంది. శరీరంలో రక్తమంతా వేగంగా ప్రవహించి ముఖంలో గూడు కట్టుకున్నట్లయింది. ఒక మధుర స్పాలనతో శరీరం ఒక పక్కకు ఒరిగింది.
    అడుగు తీసి అడుగు వేయటానికే గగనమయిపోయింది. నిర్వికారంగా నిశ్చలంగా తన ముఖంలోకి జానకి చూసిన క్షణాలలో సహితం మాధవ జానకి సమక్షంలో ఎలానో అయిపోయేవాడు. ప్రతి చిన్న కదలికలో తన మనసులోని అనురాగాన్నంత వ్యక్తం చేస్తూ లజ్జామూర్తీ తనముందు నిలిచిన జానకిని చూస్తుంటే మాధవలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. చిలిపితనం పొంగింది. తను చేసుకున్న నిర్ణయాలు గాలి కెగిరిపోగా, తనకు కాఫీ కప్పు అందిస్తున్న జానకి చేతిని రెండు చేతులతో పట్టుకుని కప్పు తీసుకున్నాడు మాధవ.
    ఆ స్పర్శతో ఏ శాస్త్రవిజ్ఞానానికీ అందని బలమైన విద్యుత్తరంగాలు నరనరానికీ ప్రవహించేసరికి , తన ముఖంలోకి చూస్తున్న మాధవ చూపులను ఎదుర్కోలేక అక్కడి నుండి పారిపోయింది జానకి. మాధవ సమక్షంలో నుండి వచ్చినా ఇంకా మాధవ చూపులు తనకు గిలిగింతలు పెడుతున్నట్టే అనిపించింది. జానకి ఆ పారవశ్యపు మత్తులోంచి బయటపడి డైనింగ్ హాల్లోకి వచ్చేసరికి మాధవ లేడు. మాధవ తాగి ఖాళీ చేసిన కప్పు మాత్రం కనిపించింది. తను అనుకున్నదేమిటి? జరిగిందేమిటి? ఊహింఛినవి ఊహించినట్టుగా ఎప్పుడూ జరగవెందుకని? ఛ! ఛ! ఇకముందు ఊహించకూడదసలు.
    తను అనుకున్నట్లుగా జరగకపోయినా జానకికి బాధ కలగలేదు. ఆమె మనసులో ఏదో ఆనందపారవశ్యపు పొంగులో ఊగిపోతోంది. ఆ పొంగులు చిరునవ్వులుగా చిందుతున్నాయి. మాధవ ఖాళీ చేసిన కప్పునే అందుకొని అందులోనే తన కాఫీ కలుపుకుని ఆప్యాయంగా తాగింది.
    ఆ సాయంత్రం జానకి సన్నజాజి మొగ్గలు పళ్ళెంలో పోసి మాల కడుతోంది. రోజూ మాలకట్టి కొంతభాగం దేవుడి విగ్రహానికి వేసి కొంతభాగం తను తలలో పెట్టుకోవటం అలవాటు జానకికి.
    "నేను సాయం చెయ్యనా?" ఎప్పుడొచ్చాడో వెనుకనుంచి, అన్నాడు మెల్లగా.
    జానకి ఉలికిపడింది. తన ఆలోచనల తీవ్రత ఆకారం ధరించిందా అన్నట్లు తన ఎదురుగా నుంచొని చిరునవ్వు నవ్వుతూన్న మాధవను చూసి లేవబోయింది తడబాటుతో.
    "లేవకు! కూచో. నీ ప్రక్కన కూచున్నంత మాత్రాన నిన్నేం తినెయ్యనులే!" అల్లరిగా నవ్వి జానకి పక్కన కూచున్నాడు.
    తనూ కొంతదారం తీసుకుని "నేనూ మాలకట్టనా?" అన్నాడు.
    జానకి తల ఊపింది.
    మాధవకు మాల అల్లటం చేత కాలేదు. కొక్కిరిబిక్కిరిగా వచ్చింది.
    "కొన్ని కొన్ని పనులు ఆడవాళ్ళే అందంగా చెయ్యగలరు. చూడు ఎంత చికాగ్గా వచ్చిందో పారేస్తాను" తను అల్లిన మాల పారేయ్యబోయాడు మాధవ. వద్దు పారేయ్యద్దు" చటుక్కున చెయ్యి జాచింది జానకి.

 Previous Page Next Page