మూర్తి ఆలోచిస్తున్నాడు.
"ఆళ్ళు చెడ్డాళ్ళని నేననటం లేదు. ఎలాంటి యువహరమైనా తమవైపు ఎలాతిప్పేసుకుంటారో చూడమంటున్నాను. ఏటి బాబూ మాట్లాడవు?"
"చెప్పు చెప్పు వింటున్నాను."
"మొగాడు చెడ్డాడు చెడ్డాడంటాడు. పాతకాలం యిషయం నాకు తెలీదుగాని, యిప్పుడెక్కడ చూసినా పెళ్ళాం పిల్లల్నేసుకుని సినిమాల కెళ్ళేవాళ్ళు, ఆళ్ళ కోసం ఆసుపత్రులచుట్టూ తిరిగేవాళ్ళు ఆళ్ళకింతొస్తే అలమటించిపొయ్యే వాళ్ళు-యీళ్ళే కదండీ. అసలు దయిర్యంగా చెడ్డపనిచేసే మొగాడేడండీ యీరోజులో? ఒకేళ యామోహంచంపుకో లేక వున్నాననీ అమానమా అడ్డదారేమన్నా తొక్కినా చాటు మాటు యవహారమే కదండీ. పెళ్ళామంటే హడిలి చస్తూ, అబద్దాలతో కాపాడుకోటమే కదండీ. ఈ రోజులలో నేనది చేశాను. అని దయిర్యంగా చెప్పుకునే మొగాడిని చూపించండీ"
రిక్షా ఓ రద్దీగా వున్న వీధిలోవెడుతోంది. హోటళ్ళు రకరకాల దుకాణాలు, మెడికల్ షాపులు, ప్రయివేటు ఆసుపత్రులు-కోలాహలంగావుంది రోడ్డు.
"అస్సలు-కాటిన్యమంటారే, ఆడది పున్యానికి పుచ్చుకున్నా దనుకుంటాను బాబూ. మొగాడేటీ, మొగమాటంలో పెట్టేసరికి మెత్తగా జావైపోతాడు. ఈ లేడీడాక్టర్లున్నారనుకోండి పేషంట్లదగ్గర ఎంతకటినంగా వుంటారో తెలుసాండి. ఆ అంటే డబ్బు ఊ అంటే డబ్బు బల్లెక్కిస్తే డబ్బు, పొట్టమీద చెయ్యేస్తే డబ్బు, కడుపొస్తే డబ్బు, కడుపుతీస్తే డబ్బు పైగా ఎంత కరుగ్గామాట్లాడుతారు? డబ్బు తీసుకోవద్దని కాదు బాబూ. ఏదీ! మొగడాక్టర్లని అంత నిక్కచ్చిగా సంపాదించమనండి. దేని కన్నా పట్టు విడుపు వుండొద్దా?"
అతను ఆశ్చర్యంగా వింటున్నాడు.
"ఆడాళ్ళు కరుగ్గా వుంటారనటానికి ఇంకో వుదంతం చెబుతానుబాబూ నా మనవడో బళ్ళో చదువుతున్నాడు. ఆళ్ళ హెడ్ మిస్సెస్సమ్మ-ఆడదేమరి. ఆ మధ్య బళ్ళోఆడేదో తప్పు చేశాడంట. చేస్తే చేసుండొచ్చు. దానికి కొట్టొచ్చు. జల్మానా వెయ్యొచ్చు. కొన్నాళ్ళబాటు బడికి రానియ్యకుండా శిక్ష ఎయ్యొచ్చు. ఆవిడేం చేసిందో తెలుసా? ఆడి బట్టలిప్పించి, నెత్తిన పలకబెట్టి ప్రతి కళాసూ తిప్పించింది. ఆడింటికొచ్చి ఎంతోఏడ్సి, రైలుకింద తలెడతానని ఒకటే యిదయిపోయాడు. ఆడినాపలేక నాకు శోషొచ్చినాది. అదే మొగాడయితే అలా చేస్తాడా? అసలు దేవుళ్ళు కూడా చూడండి. అందరిలోకి భయంకరంగా వుండేది కాళికామ్మ గారే కదండీ!"
రాఘవ వుండే సందు వన్చుసింది. మూర్తి అతని యింటిముందు దిగి రిక్షాఅతనికి డబ్బులిచ్చాడు.
"వస్తాబాబూ? నే చెప్పాననికాదు. చదువుకున్నారు మీలాంటోళ్ళు ఆలోచిస్తేనేగాని కొన్ని నిజాలు బయటపడవండీ. పెద్ద పెద్ద ఊళ్ళ కెళ్ళి చూడండి ఎంత స్వేచ్చ ఎంత స్వేచ్చ ఆడదాని సుకంకోసమే మొగాడు బతుకంతా ధారపోసినట్లనిపిస్తాడు. ఆనాడు మొగాడి దౌర్జన్యం నిజమయితే కావచ్చు. ఈనాడు యీ జావగారిపోవటమూ నిజమే బాబూ. అన్నీ వుంటాయి. డబ్బు సంపాయిస్తాడు. ఆఫీసులో పులిలా వుంటాడు. ఇంటికొస్తే జావే. అసలు యీ రోజుల్లో ఆడదానిమీద చెయ్యిచేసుకున్న మొగాన్ని చూపించండి. చేసుకుంటే అది నిద్రమాత్రలు మింగటమో, నూతిలో ఉరకటమో, యింతేకదండీ. అసలు మాటకొస్తే 'చస్తాను చస్తాను' అని యిదేకదండీ ఆళ్ళ నోట్లోంచి రాలిపడేది. వస్తా బాబూ."
రిక్షా అతను శెలవు తీసుకుని రిక్షా ఎక్కి వెళ్ళి పోయాడు.
మూర్తి తలంతా ఆలోచనలతో నిండిపోయింది. అతన్లో సంఘర్షణ మొదలయింది. తను రాస్తోన్న నవల్లో తనను తికమక పెడుతున్న స్త్రీ పాత్ర కళ్ళముందు మెదులుతోంది. అతనికి కొంతవరకు దారి దొరికినట్లయింది. రిక్షా అతని మాటల్లోని నిజమెంతో. దాన్ని ఎంతవరకూ స్వీకరించాలో, ఎక్కడ విజ్రుంభించాలో అతనికి తెలుసు.
కొన్ని నిజాలుంటాయి. అవి మనిషి పరం కావచ్చు, జాతి పరం కావచ్చు, వాటిని అంగీకరించక తప్పదు.
ఒక సిద్దాంతానికి లోబడి మనిషి మిగతా సత్యాలని చూడటానికి యిష్టపడకపోవటాన్ని అతను గర్హిస్తాడు. ఒకసారి తప్పు నీలో వుండవచ్చు. ఒకసారి నాలో వుండవచ్చు రెండూ చెప్పగలగాలి. విశ్వజనీనతకు శాశ్వతత్వం లేదు. విశ్వజనీనతలో పూర్తి యదార్ధమూ లేదు.
ఈ ప్రపంచమంతా విభిన్న యధార్దాలతో నిండివుంది. ఒక్కోసారి ఏకత్వంలొ భిన్నత్వముంటుంది. ఇది మనిషి అర్ధం చేసుకోగలగాలి.
అనంతమూర్తి రాఘవ యింటి గుమ్మం ముందు నిలబడి తలుపు తట్టాడు.
* * *
రాఘవ తలుపు తీశాడు. మూర్తిని చూడగానే అతని ముఖం సంతోషంతో యింతయింది.
"రా! చాలా రోజులయింది కదూ కలిసి"
ఇద్దరూ కూర్చున్నారు.
"ఇవేళ ఆఫీసుకు వెళ్ళలేదు."
"ఏం?"
"పెద్దమ్మాయి విమలకు వంటిలో బాగాలేదు. అందుకని సెలవుపెట్టేశాను?"
"ఏమిటి సుస్తీ?"
"బ్లీడింగ్ ఓవర్ గా వుంటోంది. చాలా వీక్ గా వుంది."
మూర్తి తాను వచ్చిన ప్రసక్తి ఎలా తీసుకొద్దామా అని ఆలోచిస్తున్నాడు.
"ఈ పిల్లల్ని గురించి నాకు మనశ్శాంతి వుండటం లేదనుకో" అన్నాడు రాఘవ.
"అంటే...?"
"పెద్దవాడు రామం కొరకరాని కొయ్య అయిపోయాడు. చదువులో పైకి రాలేదు. ఇంటికి వేళపట్టునరాడు. ఒక్కోరోజు అసలు రాడు. ఎవరింట్లోనో పడుకున్నానంటాడు. ఎవరితోనో వెళ్ళానంటాడు. ఉద్యోగం చెయ్యరా అంటే వాళ్ళిచ్చే రెండొందలూ మూడొందలూ తన అవసరాలకు చాలదంటాడు. నేనెక్కడ్నుంచయినా పదివేలు తెస్తే దాంతో వ్యాపారం చేసి అమాంతం లక్షలకు లక్షలు గడిస్తానంటాడు. ఏం వ్యాపారం చేస్తావురా అంటే గడియకోటి చెబుతాడు. ఒకసారి పట్టుపురుగు లంటాడు, ఒకసారి ఆటోమోబైల్ అంటాడు. ఇహ రెండోవాడు తాను బుద్ది మంతుడే ఇంజనీరింగ్ అయ్యాక వాడికి ఉద్యోగమొస్తుందో రాదో అని హడలిచస్తున్నాను. అవునూ నీకిలాంటి బాధలుండవా?"
"నేను మనిషిని కానా?" అన్నాడు మూర్తి.