Previous Page Next Page 
షా పేజి 18

 

    ఆ వుత్తరం పోస్ట్ చేసి వస్తుంటే దీప కారులో వెళ్తూ కనిపించింది ఆమె తనని చూసి తల తిప్పుకోవటం గమనించాడు సృజన్. అతనికి హటాత్తుగా జ్ఞానోదయం కలిగినట్లనిపించింది.
    దీప తనను కాదని మరొకరిని ఎందుకు వివాహం చేసుకుంటుందో ఇప్పుడు తెలిసింది. తమది ప్రస్తుతం ఆస్తీ, అంతస్తూ లేని కుటుంబం, బీదతనమంటే ఆమెకు అసహ్యం! డబ్బు లేని వారంటే చిరాకు.
    

                                                   *    *     *    *    

    పదిరోజులకే అర్ధరాత్రి తలుపు బాదుతున్న శబ్దానికి మెలుకువ వచ్చింది సృజన్ కి. అప్పటికే సుభద్ర లేచి లైట్ స్విచ్ వేసింది హల్లో.
    సృజన్ తలుపు తెరిచాడు.
    కానిస్టేబుల్స్ ఇద్దరు నిలబడి వున్నారు.
    "శ్రీధరం గారిల్లు ఇదేనా?"
    "అవును, ఏమిటి సంగతి" ఆందోళనగా అడిగాడు సృజన్.
    "మీరెవరు ? శ్రీధరం గారి కేమవుతారు?"
    "నాపేరు సృజన్! శ్రీధర్ మా అన్నయ్య!"
    "అయితే మీరు వెంటనే వైజాగ్ బయల్దేరాలి!"
    "ఎందుకు......?"
    "........."
    "ఏం జరిగింది చెప్పండి?" భయంగా అడిగింది సుభద్ర .
    "శ్రీధర్ గారిని ఎవరో హత్య చేశారు."
    కెవ్వుమని అరిచింది సుభద్ర.
    సృజన్ ఆమెను పడిపోకుండా పట్టుకొని సోఫామీదకు చేర్చాడు. ఆమె కర్రలా బిగుసుకుపోతోంది. శరీరంలో వణుకు!
    "వదినా.....వదినా!" కన్నీరు తుడుచుకుంటూ పిలుస్తున్నాడు సృజన్. మరి కొద్దిసేపట్లో స్పృహ తప్పిందామే.
    వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు సృజన్. మరో పదినిమిషాల్లో వచ్చేశాడతను.
    "ఏమి జరిగిందసలు?" అడిగాడతను.
    "అన్నయ్యను వైజాగ్ లో ఎవరో మర్డర్ చేశారట!"
    డాక్టర్ నిర్ఘాంతపోయాడు.
    "ముందు వదినను చుడండి డాక్టర్"
    "శ్రీధర్ లాంటి మంచి మనిషిని మర్డర్ చేయటమా?" నమ్మలేనట్లు అడిగాడు.
    "ముందు వదినేను చూడండి."
    డాక్టర్ ఆమెను పరీక్షించాడు.
    "మీరీమీ భయపడకండి! కాసేపటి తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది" అంటూ ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు.
    "నేను కాసేపట్లో మీ స్టేషన్ కోస్తాను -------మీరు వెళ్ళండి" అన్నాడు సృజన్ కానిస్టేబుల్స్ తో.
    మరికాసేపట్లో సుభద్రకు మెలకువ వచ్చిన వెంటనే మళ్ళీ ఏడుపు ప్రారంభించిందామె. పక్కింటివాళ్ళు ఆమె ఏడుపు విని ఆత్రుతగా వచ్చారు.
    "మీరు వదినను చూస్తుండండి. నేను ఇప్పుడే వస్తాను. " అన్నాడు సృజన్ స్కూటర్ బయటకు తీస్తూ-
    అయిదు నిముషాల్లో స్వరూప్ ఇంటికి చేరుకున్నాడు.
    "ఏమిట్రా - ఏం జరిగింది?" అనుమానంగా అడిగాడు స్వరూప్. అంత రాత్రి వేళ సృజన్ వచ్చిలేపేసరికి అతని నిద్ర మత్తంతా క్షణంలో వదిలిపోయింది.
    "అన్నయ్యను ఎవరో మర్డర్ చేశారుట వైజాగ్ లో . పోలీస్ లొచ్చి చెప్పారు."
    "మర్డరా?"
    "అవును"
    "అదేమిటి? అన్నయ్యను --అన్నయ్యకసలు అలాంటి విరోదులేవరుంటారు."
    "అదే నాకూ అర్ధం కావడం లేదు."
    "అదీ అంతగా పగబట్టి చంపాల్సిన విరోధం ఎవరికీ వుండదు కదా.........?"
    "నువ్వు వెంటనే రంగాగాడిని తీసుకుని మా ఇంటికి వెళ్ళు. నేను వెంటనే వైజాగ్ వెళ్ళాలి."
    "సరే--"
    సృజన్ రెడీ అయ్యేసరికి స్వరూప్ , రంగా వచ్చేశారు.
    "ఒరేయ్- వదినను జాగ్రత్తగా చూచుకోండి! నేను వీలయినంత త్వరగా వస్తాను" చెప్పాడు సృజన్."
    అప్పటికప్పుడే బస్టాండ్ కు బయలు దేరాడతను. అతని మనసంతా బండపారిపోయినట్లయింది. అన్నయ్యను ఎవరు చంపారో తెలీదు.......ఎందుకు చంపారో తెలీదు. కానీ వాళ్ళు తప్పించుకుపోలేరు. వారెవరయినా సరే - వెంటాడి- వేటాడదల్చుకున్నాడు తను.
    ఇన్ స్పెక్టర్ రాహి ఎదురుగ్గా నిలబడ్డ సృజన్ వేపు ఎగాదిగా చూశాడు.
    "శ్రీధర్ మీ అన్నయ్యేనా?"
    "అవునండీ"
    "ఇంట్లో ఏమయినా ప్రాబ్లమ్స్ వున్నాయా?"
    "ఏమీ లేవండీ!"
    "బంధువులతో గానీ, మిత్రులతో ఎప్పుడయినా మీ అన్నయ్య తగాదాపడటం జరిగిందా?"

 Previous Page Next Page