"అన్నయ్యకు శత్రువంటూ ఎవరూ లేరండీ! అసలు ఉండరు" జారిపోతున్న కన్నీటినీ తుడుచుకుంటూ అన్నాడు.
"అతను వైజాగ్ ఎందుకోచ్చాడు?"
జరిగినదంతా క్లుప్తంగా చెప్పాడు సృజన్.
"ఓ! అయితే ఏదయినా ఉద్యోగం కోసం గానీ, లేదా మరో విధమయిన సహాయం తెలిసినవారి నుంచి పొందాలనే ఉద్దేశ్యంతో గాని వచ్చాడన్నామాట!
"అదే అయుంటుందండీ!"
"ఇక్కడ మీకు తెలిసిన వారెవరయినా ఉన్నారా?"
"ఎవరూ లేరండీ. నాకు తెలిసినంత వరకూ! బిజినెస్ కి సంబంధించి ఎవరయినా మెడికల్ షాప్ డీలర్స్ తెలిస్తే తెలిసి ఉండవచ్చు......." ఇన్ స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు.
"అల్ రైట్! ముందు మార్చురీకి వెళదాం పద --------" అంటూ కుర్చీలో నుంచి లేచాడు. ఇద్దరూ జీప్ లో కూర్చున్నారు. కిక్కిరిసీపోయి వున్నా ఇరుకు రోడ్లమీద నుంచీ అతి కష్టంగా, నెమ్మదిగా వెళుతోంది జీప్. సాయంత్రపు సముద్రపు చల్ల గాలి చల్లగా విసురుగా తగులుతున్నా చెమటలు విపరీతంగా పట్టేస్తున్నాయ్.
"మా అన్నయ్యను ఎవరు చంపారో ఏమైనా క్లూ దొరికిందాండీ? అడిగాడు సృజన్.
"లేదు--"
"అది హత్యేనని ఎలా అనుకున్నారు?"
"రివాల్వర్ తాలుకూ బుల్లెట్ ఆధారంగా ........మార్చురీ రిపోర్ట్ కూడా అదే -"
"ఎక్కడ చంపారు?"
"హెవీ ప్లేట్స్ అండ్ వేసేల్స్ కంపెనీ కి కొంచెం దూరంలో మెయిన్ రోడ్ పక్కనే పడి ఉంది బాడీ?"
"వేలిముద్రలేమయినా........"
"ఏమీ దొరకలేదు-"
సృజన్ ఇంక మాట్లాడలేదు. అసలు అన్నయ్య వైజాగ్ ఎందుకొచ్చాడు? వచ్చి ఎన్ని రోజులయింది."
"ఇక్కడ ఎవరి దగ్గర కొచ్చాడు? ఇక్కడ అన్నయ్యకు తెలిసిన వారెవరయినా ఉన్నారా? ఏదీ తెలీటం లేదు.........ఆ వివరాల గురించి ఇన్ స్పెక్టర్ నడిగాడు సృజన్.
"అవన్నీ మాకూ తెలీటం లేదు. కానీ సిటి కొచ్చి సరిగ్గా వారమయింది! కిందటి శుక్రవారం ఉదయం హోటల్ సీషోర్ అనే చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నట్లు తెలిసింది. చాలా చీప్ హోటల్ అది. సాధారణంగా షిప్ లో వచ్చే విదేశీయులు ఆ హోటల్ లోనే గదులు తీసుకుని ఉంటుంటారు."
"హోటల్ వాళ్ళేమీ ఇన్ ఫర్మేషన్ ఇవ్వలేదా?"
"ఏమీ చేప్పటం లేదు రూమ్ తీసుకోవటం తప్పితే తర్వాత ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా కౌంటర్ కి రాలేదుట......! ఏదేమయినా సరయిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు పడుతుంది---"
జీప్ మార్చురీకి చేరుకుంది. జీప్ దిగుతుంటే శరీరం తూలిపోయినట్లయింది. దుఃఖం ముంచుకొస్తోంది. జీవం లేని అన్నయ్య శరీరాన్ని చూడబోతున్నడన్నా బాధ గుండెల్ని తెంచి వేస్తోంది.
మార్చురీ బయట జనం చాలా మంది గుంపులు గుంపులుగా నిలబడి వున్నారు. తమతమ కుటుంబాలకు చెందిన వారి శరీరాల కోసం.
కొంతమంది మొఖాలు వాడిపోయి వుంటే కొంతమంది మౌనంగా రోదిస్తున్నారు.
"ఆ లారీ ముండా కొడుక్కి మా అబ్బాయి ప్రాణాలే కావాల్సి వచ్చినాయా? వాడింట్లో కూడా తప్పకుండా వాడికొడుకు ఇదే చావు చస్తాడు! అయ్యో దేముడా! ఇరవై ఏళ్ళు పెంచింది వాడీ దిక్కుమాలిన చావు చస్తే చుడ్డానికా?" అంటూ విలపిస్తోంది ఒకావిడ.
మార్చురీ రూమ్ లోకి [ప్రవేశించాడు సృజన్.
శవాల మధ్య నుంచీ నడుస్తుంటే మనసంతా వికలమాయిపోతోందతనికి. వీళ్ళందరూ ఏవో కారణాల వల్ల అసాధారణమయిన చావుకి గురయిన వారె!
యాక్సిడేంటూ, చంపబడటమో, ఆత్మహత్యో........
ఏదొకటి!
ఇన్ స్పెక్టర్ డెడ్ బాడీ దగ్గర ఆగాడు.
మొఖం మీద గుడ్డ తొలగించగానే శ్రీధర్ ముఖం కనిపించింది సృజన్ కి. ఎండినట్లు వాడిపోయి గుర్తుపట్టటానికి వీల్లేనంతగా మార్పులు చెందిందది.
ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది సృజన్ లో.
"అన్నయ్యా- అన్నయ్యా- అన్నయ్యా?" హృదయం ఆరోపిస్తోంది.
తల్లిదండ్రులు పోయిన దగ్గర్నుంచీ అన్నయ్యే తనకు తల్లీ, తండ్రి అయి తనను అల్లరుముద్దుగా పెంచటం, తనకే లోటూ రాకుండా చూసుకోవటం - అన్నీ అతివేగంగా కళ్ళముందు తిరుగుతున్నాయ్.
"మీ అన్నయ్యేనా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
"ఆ - అవును-"
"అయితే - ఇక పదండి వెళ్ళిపోదాం."
ఇద్దరూ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు.
ఓ మూలగా వున్న కుర్చీలో కూర్చున్నాడు సృజన్.
ఆలోచనలు విపరీతంగా హింసిస్తున్నాయ్. ఇప్పుడేమిటి కర్తవ్యం అన్నయ్యకు అంత్యక్రియలు ఎలా జరపటం ? బాడీని ఇంటికి తీసుకెళ్ళి పోవాలా? వదిన ఈ దృశ్యం చూసి భరించగలదా! ఏదీ ఏమయినా ఆమె ఆఖరిసారిగా అన్నయ్య మొఖాన్ని చూడటమే మంచిదేమో -!
"శవాన్ని ఇంటికి తీసుకెళతారా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
"తీసుకెళ్ళాలనే వుంది .....కానీ......."