అర్ధరాత్రి అయిపోయినా ఇంకా నిద్ర పట్టడం లేదు. పుస్తకాల వేపు చూడబుద్ది అవటమూ లేదు. అంతా నిశ్శబ్దం. కిటికీ బయటనుంఛీ కీచుపురుగుల రొద.
"సృజన్"
ఆలోచనల లోంచి తేరుకుని లేచి నిలబడ్డాడు.
శ్రీధర్ గదిలో కొచ్చి అతని భుజం మీద చేయి వేశాడు.
"నీ చదువుకి ఎలాంటి అఘాతం కలుగకూడదనుకున్నాను . కానీ అనుకోకుండా వద్దనుకున్నది జరగనే జరిగింది."
సృజన్ కిందకు చూస్తూ వింటున్నాడు.
"నిన్ను కోరేది ఒక్కటే! నువ్ మాత్రం చదువాపకు! పరీక్షలయె వరకూ ఇంటి విషయాలన్నీ మర్చిపో."
"అలాగే అన్నయ్యా."
"నేను ఎక్కడో చోట ఉద్యోగం సంపాదించగలను. మనం అది వరలా మనం కోరిన విధంగా బ్రతకలేకపోవచ్చు. కానీ బ్రతకగలం-"
"..... ...... ..... ........."
"నువ్వు భయపడవద్దు. మనం జీవితాన్ని చూసి భయపడకూడదు. దానితో పోరాడి లొంగదీసుకోవాలి."
అతను వెళ్ళిపోయాడు.
సృజన్ కి దుఖం పొంగుకొచ్చింది. అన్నయ్య ఎంత ఆవేదన చెందుతుందీ తలచుకుంటే మనసు వ్యకలమయిపోయింది.
మిగతా రాత్రంతా కన్నీటితోనే గడిచిపోయింది. తెల్లావారుతుండగా నిర్ణయించుకున్నాడు.
అన్నయ్య అలా బాధపడటం తను చూడలేదు. అన్నయ్యకు సహాయం చేయాలి. చదువు ముఖ్యం కాదు తనకు. తనను ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన అన్నా వదినలను సుఖపెట్టడం ముఖ్యం. ఒకవేళ యం.ఎ. పాసయినా ఏం జరుగుతుంది? తనకు ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ ఏమిటి? ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాల్లేకుండా వుండటం తనకు తెలుసు.
ఆ నిర్ణయం తీసుకున్నాక నిద్ర పట్టిందతనికి.
తిరిగి మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కిపోయింది.
"కాలేజ్ టైమయిపోయింది" అంది వదిన తనను నిద్రలేపుతూ.
లేచి కళ్ళు నులుముకుంటూ గడియారం వేపు చూసాడు తొమ్మిదయిపోయింది.
"నేనివాళ నుంచి కాలేజీకి వెళ్ళటం లేదు వదినా" అన్నాడతను.
ఆమె ఆశ్చర్యంగా చూసిందతనివేపు.
"అదేమిటి? ఎందుకని అలా?"
"అన్నయ్య అలా ఉద్యోగం కోసం అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకోవటం నాకిష్టం లేదోదినా! ఉద్యోగమేదో నేనే చేస్తాను."
"అంటే మీ అన్నయ్య మాటలకేమీ విలువ ఇవ్వవన్నమాట!"
"వదినా! అన్నయ్యతోనే మాట్లాడి వప్పిస్తాను. చదువు ఎప్పుడయినా చదువుకోవచ్చు. ఈ రోజుల్లో అందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయ్.
అంటూ శ్రీధర్ కోసం అతని గదివేపు వెళ్లాడతను.
"మీ అన్నయ్య పొద్దున్నే ఊరువెళ్ళారు."
సృజన్ ఆశ్చర్యపోయాడు.
"ఏ ఊరు వెళ్ళాడు?"
"గుంటూరు ! అక్కడ తెలిసినవారేవరో వున్నారుట! వారిద్వారా ఉద్యోగం సంపాదించుకుంటానన్నారు ---"
సృజన్ నిరాశపడిపోయాడు.
"ఎంత దారుణం వదినా! నాతొ చెప్పకుండానే వెళ్ళిపోయాడా?"
"నేనే చెప్పవద్దనాన్నను."
"ఎందుకు?"
"చెపితే నువ్ అడ్డుపడతావని తెలుసు!"
సృజన్ అయిష్టంగానే రడీ అయి కాలేజీకి బయలుదేరాడు. రెండగులు వేశాడో లేదో, వాషింగ్ పౌడర్ పాకెట్ల సంచీతో భారతి ఎదురొచ్చిందతనికి.
"హయ్!" అన్నాడు సృజన్. అతను ఆమె ముఖంలోకి చుదలేకపోతున్నాడు.
"హయ్" అంది భారతి. "త్వరగా వద్దామని ఎంత ప్రయత్నించినా బస్ దొరకలేదు. కొంచెం వుంటే మీరు మిస్ అయిపోయేవారే!"
"మీరు క్షమిస్తానంటే ఓ విషయం చెప్తాను" నొచ్చుకుంటూ అన్నాడు సృజన్.
అతనేం చెప్పాలనుకుంటున్నాడో అర్ధమయిందామెకి. కొద్ది క్షణాలు మౌనంగా నిలబడ్డాక మందహాసం చేస్తూ మాట్లాడింది.
"పోనీల్లెండి! ఉద్యోగం అనేది అంత తేలిగ్గా దొరుకుతుందని నేనూ అనుకోలేదు."
సృజన్ మనసు కొంత తేలికయింది.
"అనుకోని పరిస్థితులవల్ల......." అంటూ వివరించబోయాడు గానీ అతని మాట పూర్తీ కాకుండానే ఆమె మాట్లాడేసింది.
"మీరీమీ బాధపడకండి! మీరు నామీద ఇంత అభిమానం చూపటమే నాకు ఎంతో అనందం కలిగించింది. మీ ప్రయత్నం ఫలించక పోయినా ఫరవాలేదు గానీ నామీద ఇదే అభిమానం నిలచిపోతే చాలు--"
సృజన్ ఆశ్చర్యపోతూ, ఆనందంతోనూ చలించిపోయాడు. ఆమె మాటలు పూర్తిగా కదిల్చి వేసినాయ్ అతనిని.
"ఇప్పుడెం చేయాలనుకున్నారు మరి?"
"మా బాబాయ్ ఉత్తరం రాశాడు. వైజాగ్ వస్తే ఏదయినా ఉద్యోగం యిప్పిస్తానని అక్కడికే వెళ్దామని నిర్ణయించుకున్నాను. బహుశా రేపే వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరి దగ్గరయినా ఓ వంద రూపాయలు అప్పు సంపాదించాలి........!" సృజన్ చటుక్కున తన జేబులోంచి పర్స్ తీశాడు. అందులో నుంచి వందరూపాయల కాగితం బయటకు తీశాడు. అదే ఆఖరి కాగితం!
ఆట తరువాత తన దగ్గర డబ్బేమీ వుండదు. డబ్బు తను అది వరలా దానధర్మాలు చేయకూడదని వదిన చెప్పింది.
"వద్దండీ! మీ దగ్గర అప్పు చేయటం నా కిష్టం లేదు......" అంది భారతి అతని భావాలు చదివినట్లు.
"అంటే నన్ను పరాయి వ్యక్తిగా భావిస్తున్నారన్నమాట....." చిరుకోపంతో అన్నాడతను.
" నిజం చెప్పాలంటే నా జీవితంలో నా పట్ల యింత ఆదరణ చూపిన మొదటి వ్యక్తీ మీరే! కనుక మీ దగ్గర డబ్బు తీసుకుని మీకు ఋణపడటం నా కిష్టం లేదు."
"నేను మీకిది ఉచితంగా ఇవ్వటం లేదు. మీకు ఉద్యోగం సంపాదించుకున్నాక నాకు పంపించేద్దురు గాని! సరేనా?"
ఆమె ఓ క్షణం అలోచించి డబ్బు తీసుకుంది.
"మీరు తప్పకుండా తిరిగి తీసుకుంటారనే ఆశతోనే ఈ డబ్బు తీసుకుంటున్నాను....."
"ష్యూర్........."
"థాంక్ యూ వెరీ మచ్! వస్తానండీ!" ఆమె వెళ్ళిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది సృజన్ కి. తనకి ఉద్యోగం దొరికిందని, జీతం రాగానే అతని వందరూపాయలు పంపించబొతనని అతను అప్పుడప్పుడూ ఉత్తరాలు రాస్తే సంతోషిస్తుందనీ రాసిందామె. సృజన్ వెంటనే ఉత్తరం రాశాడామెకి. తనకి డబ్బు అవసరమయినప్పుడు తనే అడుగుతాననీ అంతవరకూ ఆమె ఆ డబ్బు పంపవద్దనీనూ..........