"రుజువులూ సాక్ష్యాలూ కావాలా! ఏం నే చెపుతుంటే నమ్మకంలేదూ? ఆ... ఎలా వుంటుందిలెండి. ఆ చక్రం మీ బెస్ట్ ఫ్రెండాయె!"
"వాడలాంటివాడు కాదే?"
"అంటే నే మంచిదాన్ని కాదని అర్ధమా? మీ చక్రం మంచి మీరు మంచి మీ బుద్దులు అంతకన్నా మంచివి. మీరేదే నా మాటవిని ఉద్దరిస్తారని చెప్పటానికొచ్చాను. ఎంతసేపు మీవాడు మంచివాడంటమే దీనినిబట్టి మీ యిద్దరు కూడబలుక్కుని నాటక మాడుతున్నారనిపిస్తున్నది. నే యిలాంటివి సహించను తక్షణం యిల్లు ఖాళీ చేయండి."
"ఇదెక్కడి న్యాయమండీ! వాడు మిమ్మల్ని చూసి ఈలేయటమేమిటి నే యిల్లు ఖాళీ చేయటమేమిటి? నే ఎప్పుడయినా మిమ్మల్ని చూసి ఈలేశావా? ఇకిలించానా? కన్ను కొ....అదె.... అదే... ఇలాంటి పాడుపనులేమీ చేయలేదు కదండీ" మళ్ళీ అద్దెకొంపకోసం బాటాబూట్లు, కరోనా చెప్పులు అరిగిపోయేటట్లు తిరగాలేమో అని లబలబ లాడుతూ అడిగాడు మదన్ గోపాల్.
"అదంతా నాకు తెలియదు. మీరు యిల్లన్నా ఖాళీ చేయండి. ఆ చక్రాన్నయినా గుమ్మం తొక్కనీయకండి" గట్టిగా చెప్పేసింది వైజయంతి.
"ఇప్పుడి కిప్పుడేం కుదరదు. కాస్త నన్ను ఊపిరి తీసుకోనివ్వండి."
"వీల్లేదు."
"ప్లీజ్! అల అనకండి.
"వీల్లేదంటే వీల్లేదు."
ఎవరో పిలిచినట్లు బామ్మగారొచ్చింది. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి "ఏమిటర్రా పిల్లకాయలూ, పోట్లాడుకుంటున్నారు?" అంది.
బామ్మగారిని చూసి ఇరువురు గతుక్కుమన్నారు. ఈ విషయం బామ్మగారిముందనటం ఇద్దరికీ యిష్టంలేదు.
"అదికాదు నాన్నమ్మా! ద్రౌపదీ వస్త్రాభరణం సినిమా యివాళే వచ్చింది. ఈరోజు టిక్కెట్లు దొరకవని చెపితే వినటం లేదు. మీకేం మగవాళ్ళు ఆమాత్రం సంపాదించలేకపోరు. అంటూ ధూంధాం అని ఎగురుతున్నది. అవునా వైజయంతి గారూ!"
"అవునవును. మీరు సంపాదించకపోతే వూరుకునేది లేదనేగా ఇంతసేపు నే పోట్లాడేది."
"ద్రౌపది వస్త్రాభరణమా? చెప్పావుకాదేమిరా! లవకుశ, వెంకటేశ్వర వైభవం, సీతారామకల్యాణం. చూశాగాని, ద్రౌపదీవస్త్రాభరణం సినిమా చూడలేదురా మదనా! ఆ చేత్తో నాక్కూడా ఓ టిక్కెట్టు కొనుక్కురా. అమ్మాయిలతో నేనూ వెళతాను" మహానందపడిపోతూ అంది బామ్మగారు.
"చచ్చితి, చచ్చితి" అనుకున్నాడు మదన్ గోపాల్.
"తిక్క బాగా కుదిరింది" అనుకుని బామ్మగారివైపు తిరిగి "దానికేం భాగ్యం బామ్మగారూ! టిక్కెట్టు నే పెట్టుకుతీసుకెళతాను. మీలాంటి పెద్దవారికి చూపించటం పుణ్యం పురుషార్ధం. మీ మనవడు నామాట వినటంలేదు. టిక్కెట్లు తెప్పించే భారంమీది. చాలా వినయంగా అంది వైజయంతి."
నీ తెలివేపాటిదో చూస్తానన్నట్లు మదన్ గోపాల్ వైపు ఓ చూపు పారేసింది వైజయంతి.
"అయ్యో భగవంతుడా ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా తొందరలో నోరుజారి ద్రౌపదీవస్త్రాభరణం అన్నాను. ఈ వూళ్ళోవున్న ముఫ్ఫైరెండు హాల్సులోను ఆ సినిమా లేదే. తాతలనాడు తీసిన ఏ పాడుసినిమా అయినా ఆ పేరుతో లేదే. కదలడు వదలడు, తిరగడు తిప్పడు లాంటి పాతవితప్ప మరొకటి ఆడటంలేదే, "ప్రేమిస్తే పెళ్ళికాదు" అంటూ ఏ సినిమా పేరో చెప్పక ద్రౌపదీవస్త్రాభరణం అన్నాను. నిజం చెప్పినా నాన్నమ్మ నమ్మదు. ఈపిల్ల రాక్షసిమాటే నమ్ముతుంది. ఓ ద్రౌపదీ నీ పేరెందుకు గుర్తొచ్చిందమ్మా. అయ్యో నేనేం చేయాలి" మదన్ గోపాల్ తనలోతానే లబ్బున గోలపెట్టుకున్నాడు.