Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 18


    
     "అంతేనండీ- మీకోసం తప్ప  ఎవరికోసం వస్తాడు?"  వాడలా చెప్పే సరికి మానస మురిసిపోయింది.


    బాబు అప్పుడప్పుడు ఆమెతో అబద్ధాలు చెబుతుంటాడు. టిపిన్ అయిపోయాక కాఫీ యిచ్చింది. వాడు అది ముగిసేవరకు సురేష్ వర్మ గురించే చెబుతున్నాడు. ఈ మాటలు వినడానికే రోజూ తనకేదో  ఒకటిపెడుతోందని తెలుసు.


    ఎనిమిదైపోయినట్టుంది. ఊళ్ళో హడావుడి ఎక్కువైంది.గుళ్ళో భజన ప్రారంభమైంది.


     "మరి నే వెళ్ళతానండి" అంటూ బాబు లేచాడు.


     " మానసా!" లోపల్నుంచి కాంచనమాల పిలవడంతో-


    " ఏమిటొదినా?" అని అడిగింది.


    ఆమె సరేననకపోవడంతో బాబు అలానే నిలబడిపోయాడు.


    "హాల్లో బియ్యం బస్తా వుంది. దాన్ని బాబుతో చెప్పి వంటగదిలో వేయించవా?"


     "అలాగే" అంది మానస.


    " పదండి- వంటగదిలో బస్తా పెట్టేస్తాను" అన్నాడు బాబు.


    మానస  ముందు , వెనక బాబు లోపలికెళ్ళారు.


    కాంచన బాత్రూమ్ లో వున్నట్టుంది.


     వందకేజీల బస్తా- ఒక్కడే ఎత్తడానకి  కుదరడంలేదు.అందువల్ల వంటగది వరకు లాక్కొచ్చాడు.


    అక్కడ లేపడనికి మానస సాయం కోరాడు. కొద్దిగా పైకెత్తి గడప దాటించారు. లోపలికెళ్ళాక లాగడానికి కూడా కుదరడంలేదు. గచ్చు కాస్తంత గరుకుగా వుంది.


    "అదిగో ఆ మూలకి లాగేయ్"  అంటూ మానస కూడా సాయం చేస్తోంది.


     అతను బలాన్నంతా చేతుల్లోకి తెచ్చుకుని లాగుతున్నాడు.అతని కెదురుగా ఆమెకూడా బస్తాను లాగుతోంది.అలా లాగడం అలవాటు లేకపోవడంవల్ల కాబోలు, ఆమె చేతులు పట్టుతప్పాయి.తూలి అతనిమీద పడింది.


    ఆపడడంలో ఆమె  ఎద హత్తుకుపోయింది. ఏదో షాక్ లాంటిది నరాల్లో కదలడం ఆమె గుర్తించింది. అతనికి స్పృహేలేదు. కాబట్టే బస్తా లాగడంలో మునిగిపోయాడు. ఆమె మాత్రం పక్కకి జరిగిపోయింది.


    తొలిసారి వాడ్ని చూడడంలో ఏదో కొత్తదనం వచ్చింది. అంతకు ముందులా కాకుండా మనిషికూడా కొత్తగా కనిపించాడు. ఆ స్పర్శతాలూకు జలదరింపుక్షణాల్లో మాయమైనా ఆసంఘటన ఆరాత్రికి రెండు మూడు సార్లు జ్ఞప్తికొచ్చింది ఆమెకి.


                                                          *        *       *       *


    సురేష్ వర్మ ఇంట్లోంచి బయటపడ్డాడు.


    కళ్ళమీద సువాసనల్ని వెదజల్లే సన్నజాజూల్ని ఆరబెట్టినట్టనిపించడంతో కలపైకెత్తాడు. ఆకాశంలో చందమామ  మల్లెపూలచెండులా వుంది.

 

    అతనికి వెన్నెలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. మనసుతప్ప శరీరం లేనట్టు అనిపిస్తుంది అతనికి ఆరెండింట్నీ ఫీలవుతున్నప్పుడు. హృదయాన్నంతా గిలకొట్టే వెన్నెలంటే మరింత ఇష్టం. ఏమీ కారణం లేకుండానే ఉత్సహంగా వుంటాడు. ఇప్పుడు కాస్తంత టెన్షన్ లోవున్నా వెన్నెల ఉనికిని ఫీలవుతూ అడుగులు వేయడం ప్రారంభించాడు. సాయంత్రం చింతా మణి చెప్పిన పనిని  మరోసారి మననం చేసుకుంటున్నాడు.


         చింతామణి ఆ రోజు సాయంకాలం సురేష్ వర్మని కలుసుకుంది.


    "నువ్వు ఒంటరిగా వుంటావనే ఇంతదూరం నడిచొచ్చాను" అంటూ "ముందు కూర్చీ తెప్పించు. కూర్చుంటే తప్ప ఈ గుండె దడ తగ్గదు" అంది.


    బాబుకూర్చీ తెచ్చి వేశాడు.


    చింతామణి తనను వెదుక్కుంటూ మామిడితోటకి వచ్చిందంటే విషయ మేదో చాలా ఇంపార్టెంట్ అయివుంటుంది.అదేదో వినడానికి కుర్చీ లోంచి శరీరాన్నంతా ముందుకు తోశాడతను.


      "ఈరోజుతో ఉభయాలు లాస్ట్. నువ్వు మొట్టమొదట చెయ్యాల్సిన పని ఏమిటో తెలుసా? శశిరేకతో ఈ రోజు మాట్లాడడం" అన్నది చింతా మణి.

 

     "నాకు పరిచయమే లేదుకదా" అతను తత్తరపడ్డాడు. నిజానికి అతను చొరవతో వ్యవహరించే మనిషే, కానీ అదేమిటో గానీ శశిరేఖ పేరుచెప్పగానే నోటి నుంచి మాట రావడంలేదు.ఇప్పుడే ఇలా వుంటే ఆమె ఎదురు పడ్డప్పుడు ఎలా వుటుంది?


    "అదే- పరిచయం తరువాత- ముందు ఆమెతో మాట్లాడు-ఒకటి రెండు మాటలు- ముఖ్యంగా  ఆమె మరిచిపోలేనంతగా మెస్మరైజ్ చేయగలగాలి" అన్నది.


     "అలాగే" చాలా సేపటికి ధైర్యం తెచ్చుకుని  అన్నాడు సురేష్ వర్మ.


    "సెహ్ భాష్" చింతామణి మెచ్చుకుంది.  "సాహసం చేస్తేనే రాణీ లభించేది"అని నవ్వుతూ లేచి నిలబడింది.


    "ఈ రోజు దేవాలయం దగ్గిర ఆమె ఒంటరిగా వుండేటట్లు చేస్తాను. గంగారత్నం ఏదో విధంగా పది నిముషాలపాటు ఆమెతో లేకుండా చేస్తాను. సరేనా?"  మరోసారి  మొత్తం  వివరించి ఆమె తిరిగి రావడానికి బయల్దేరింది.


     ఇక అప్పట్నుంచీ అతను ఎలా మాట్లాడాలా అని రిహార్సల్స్ చేసుకుంటూనే వున్నాడు.  కానీ. ఏదీ కుదరడం లేదు.


     సమయానుకూలంగా  ఏదో ఒకటి మాట్లాడదామని బయల్దేరాడు.


    నవమి   ఉత్సవాలు కాబట్టి  వీధులన్నీ ఊడ్చి శుభ్రం చేశారు. ముగ్గులతో ఉన్న వీధుల్లో వనెన్నెలపూట నడవడం బావుంటుంది.


     అతను వెన్నెలను తొక్కకుండా అడుగులు వేస్తున్నట్టు నిదానంగా  నడుస్తున్నాడు.


    అంతవరకు ఫ్రీగా నడుస్తున్న అతను శ్రీ నివాసరావు ఇల్లు  వచ్చేటప్పటికి కాస్తంత వేగం పెంచాడు. మానస అక్కడెక్కడో గేటుకు ఆనుకుని తనను చూడడానికి నిలుచుని వుంటుందనితెలుసు. ఆమె అంటే అతనికి ఇష్టంలేదు. దానికి కారణం కూడాలేదు. అందంతోపాటు వమంచి మనసు వున్న అమ్మాయి, కానీ అదేమిటో అతనికి ఇష్టం కలగలేదు. పైపెచ్చు తన కోసం కాచుక్కూర్చున్నందువల్ల జాలి కల్గుతోంది. బాబూగాడు ఆ అమ్మా యిని చేసుకొమ్మని వూదరగొట్టేస్తుంటాడు.


     అతను ఎంత తొందరగా నడిచినా మానస పట్టేసింది. అతను రోజూ ఉభయాల దగ్గిరకి వస్తున్నాడని తెలిసి ఎనిమిది గంటల నుంచి కాపుకాసేది. ఈరోజూ అతను దొరికిపోయాడు.


     వెన్నెల్లో ఆమె అప్పుడే చెట్టుకొమ్మ నుంచి కోసిన మందారం పువ్వులా వుంది.అతన్ని చూడగానే  ఆమెకళ్ళల్లో ప్రేమ భావం ఉబికింది. బుగ్గల్లో సిగ్గు ఎర్రగుడ్డ ముఖాన వేసుకున్నట్టు రంగు పులుముకుంది. అతను ఠక్కున తల తిప్పుకున్నాడు.


     ఇల్లుదాటి ఏడడుగులు వచ్చాక స్థిమిత పడ్డాడు. తను శ్రీనివాసరావుకు నిర్మొహమాటంగా మానసను చేసుకోవడం లేదని చెప్పాకకూడా ఆమె ఎందుకంతగా నిరీక్షస్తోంది ?ఇప్పటికే పాతికేళ్ళు దాటేశాయి. తనకంటే అంత ఇష్టమా? కారణమేమైనా తనవల్ల ఆమె నష్టపోతోంది.

 Previous Page Next Page