"నీవన్నీ విచిత్రాలే-సాయంకాలమయ్యేసరికి టింగురంగా అని అలంకరించుకోవటానికి మనమేమన్నా కుబేరులమూ? కూటికి లేనోళ్ళం- అందులోనూ అవన్నీ వేరేటైపు ఆడోళ్ళకి-సంసారోళ్ళకి కాదు- ఏం నేనలా లేకపోయినా పిల్లను కనలేదా- తల్లిని కాలేదా?" అంటూ లా పాయింట్లు లేవదీస్తుందిగానీ శుభ్రంగా తయారవదు.
తన భార్యచెప్పే ఆ లా పాయింట్లు తప్పని తెలుస్తుంటోంది కానీ వాటిని ఎలా బదులు చెప్పాలో తెలిసేది కాదు. అందువల్ల ఆమెకు చెప్పడం వల్ల లాభం లేదని తెలిశాక చెప్పడం మానేశాడు.
ఆ కారణం వల్లనే మానసంటే అతనికి గౌరవం. తన భార్య చేయకపోయినా తనుమాత్రం పొలంపనుల నుంచి వచ్చాక శుభ్రంగా స్నానం చేస్తాడు. ఉన్నంతలో నీట్ గా వున్నవి, ఉతికినవి కట్టుకుంటాడు. ఫ్రెష్ గా తయారై మానసవాళ్ళింటికి వస్తాడు.
బొమ్మలా తయారైన మానసను చూడడం, మాట్లాడడం అతనికి బావుంటుంది మాటల మధ్యలో తన ఆడదాన్ని తిడుతూ మనసును పొగుడుతుంటాడు.
"సరేలేమ్మా! మీరిద్దరూ మాట్లాడుతూ వుండండి. నేనెళ్ళి సీరియల్ అయినా చూస్తాను" అని కాంచనమాల లేచి ఇంట్లోకి వెళ్ళింది.
ఉండరా- నీకోసం అని దోసెలు పెట్టాను- ఇస్తాను" అని మానస లోపలికి వెళ్ళి ఓ విస్తరాకుతో వచ్చింది అందులో రెండు దోసెలు కారం వున్నాయి.
మంచి ఆకలిమీదున్నాడు కనుకే ఆవురావురుమంటూ దాన్నందుకున్నాడు బాబూ.
"ఇంతకీ ఏమంటున్నాడు మీ ఓనర్" మానస తనకు ఇష్టమైన టాపిక్ కి శ్రీకారం చుట్టింది.
"మా ఓనర్ కు ఏమండీ! పెట్టిపుట్టిన రకం- ఆ భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి - చదువు, అందం, ఆస్తి, మంచి మనసూ...." ఎక్కిళ్ళు పుట్టడంతో ఆగాడు.
ఆ మాటలకే ఆమె ముఖం వెలిగిపోయింది.
ఆమెకు సురేష్ వర్మంటే వయసు వచ్చినట్నుంచి యిష్టం. దానికీ కారణం వుంది. సురేష్ వర్మ శ్రీనివాసరావుకు అల్లుడు వరసతాడు. ఆయనది కులాంతర వివాహం. అతని భార్యకు సురేష్ వర్మ బంధువు. అలా మానసుకు బావ వరసవుతాడు. ఒకే ఊర్లో వుండడంవల్ల చాలా దగ్గర బంధువుల్లాగా మసలుకునేవారు.
సురేష్ వర్మకు సరితూగరుగానీ ఆస్తిపాస్తుల్లో వీళ్ళూ లెక్కలోకి వచ్చేవాళ్ళే. దాంతో సురేష్ వర్మకు మానసను ఇవ్వాలని శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.
సురేష్ వర్మ తల్లి అమసూయమ్మకు ఇష్టమేగానీ సురేష్ వర్మ మాత్రం పడనివ్వడంలేదు. ్తను ముఖంమీద గుద్దినట్టు మానసను చేసుకోవడం తనకిష్టంలేదని శ్రీనివాసరావుకు ఎప్పుడో చెప్పేశాడు. ఆయన ఇప్పటికీ ప్రయత్నిస్తున్నట్టు కూడా అతనికి తెలియదు.
ఈకారణంచేత ఆమె వయసుకురాగనే సురేష్ వర్మవైపు ఇంట్లో వాళ్ళు వేలెత్తి చూపారు. ఇక అప్పటినుంచీ బావంటే ఇష్టం ఏర్పరచుకుంది కానీ అతను వద్దన్న విషయంగానీ ఎందువల్ల తమిద్దరికీ ఇంకా పెళ్ళికాలేదని గానీ ఆమెకు తెలియవు.
ఒక విధంగా ఆమె చాలా బెరుగుమనిషి . చొరవ తక్కువ. తనకంటే బాగా తక్కువనపించే వాళ్ళతో ఎంతబాగా మాట్లాడగలదో, తన కంటే అధికుడు అన్న వాళ్ళతో అంత తక్కువగా మాట్లాడగలుగుతుంది. ఆమెకు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువుగా వుంది.
అలాంటి భావన ఆమెకు వుందనిగానీ, దాన్ని అధిగమించాలని గానీ ఆమెకు తెలియదు. ఇతరులెవరూ చెప్పలేదు. ఈకారణంచేతే ఆమె సురేష్ తో మాట్లాడలేకపోతోంది.
ఆ సురేష్ దీన్ని చేసుకుంటాడా? ముఫ్పై ఏళ్ళు దాటుతున్నా వాడికి ఇంకా పెళ్ళిమీదకి పోలేదు మనసు. నన్నడిగితే మన మానసను ఇంకెవరి కైనా ఇచ్చి ఆ ముచ్చట జరిపించేద్దాం" అని గోపాల్రావు ఎప్పటికప్పుడు పోరుతున్నా.శ్రీనివాసరావు మాత్రం ఒప్పుకోవడంలేదు.
షడన్ గా తన మనసు మార్చుకోవడం మానసకూ ఇష్టం లేకుండా వుంది. ఏదొక విధంగా తనకూ సురేష్ వర్మకీపెళ్ళి జరిగిపోతే బావుంటుందని అనుకుంటూ వుంటుంది. దేవుళ్ళకు మొక్కుకుంటూ వుంటుంది.
అయితే తన మనసులోని మాటను సురేష్ వర్మకు ఏరోజూ చెప్పలేకపోయింది. అతన్ని చూస్తూనే చెమటలు పట్టేసేవి. చేతులూ, కాళ్ళూ వణికేవి. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేవి. అందుకే అతను ఎప్పుడైనా ఎదురైతే దూరంనుంచే తప్పుకునేది.
కానీ గుండెల్లో పొంగే ప్రేమని ఎవరితోనైనా పంచుకోవాలికదా! స్నేహితురాళ్ళున్నా వాళ్ళెవరితోనూ ఈ విషయాలు చెప్పలేకపోయింది.వదినతో మనసు విప్పలేకపోయింది. అలాంటి సమయంలో బాబూ తగిలాడు.
వాడు ఏదో పనులమీద ఇంటికొచ్చినప్పుడు సురేష్ వర్మ గురించి అడిగేది.బాబూ అతన్ని గురించి గొప్పగా చెబుతుంటే విని మురిసేది. అలా అలా వాడు రోజూ సాయంకాలం రావడం, ఇద్దరూ సురేష్ వర్మ గురించి మాట్లాడుకోవడమూ అలవాటైపోయాయి.
వాడు ఎక్కడ రాకుండా పోతాడేమోనని భయంవల్లే వాడు వచ్చి నప్పుడు ఏదో ఇంట్లో వున్న తినుబండరాలతోపాటు కాఫీకూడా ఇచ్చేది.
ఇప్పడూ జరుగుతున్నది అదే!
వాడు దోసెల్ని తింటూ ఆమె అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెబుతున్నాడు.
"ఇంతకీ మీ యజమాని పైర్లు ఏం చేశాడ్రా?" అని సురేష్ వర్మ పొలాల్లో ఏం పంటలు వేశారన్న విషయం గురించి అడగటం మొదలుపెట్టింది.
వాడు ఆ వివరాల్ని చెబుతున్నాడు.
తన యజమాని సురేష్ వర్మను మానస గాఢంగా ప్రేమిస్తోందని తెలుసు. కానీ ఆయనకి ఈమె అంటే ఇష్టం లేదని తెలుసు. ఎందుకిష్టం లేదో తెలియదు. ఆమెకి వయస్సు ఎక్కుతోందనీ, ఇప్పటికే ఇరవై ఆరు దాకా వున్నాయనీ, మరి శ్రీనివాసరావు కూతురికి ఎందుకు పెళ్ళి చేయలేదోనని వాడుఆలోచిస్తుంటాడు.
"మా బంధువుల్లో ఆడపిల్ల పెద్దమనిషి అయినప్పట్నించే సంబంధాలు వెతకటం మొదలుపెడతారండి. సంవత్సపం తిరగేసరికల్లా మూడు మూళ్ళూ పడిపోతాయి. కానీ చాలామందిని గమనించానుగానీ అదంత మంచి పనిగా కనిపించడంలేదు. ఓ ఆడపిల్ల ,ఓ మగాడ్నీ జతచేస్తారుగానీ ఇద్దరి మధ్యా ఏ ప్రేమా వుండదు.అభిమానం వుండదు.ఏదో అవసరంతీరుతూ వున్నట్టు వుంటుందిగానీ అంతకుమించిన పులకరింతలుగానీ, గాడిదగుడ్డు గానీ వుండవు. సినిమాల్లో చూపించినట్లు శరీరం తగలగానే పాటలు, పారవశ్యాలు ఏమీ వుండవు" బాబు తినడానికి బ్రేక్ ఇచ్చి చెప్పాడు.
అతనికి ఠక్కున తన పెళ్ళి విషయం గుర్తొచ్చింది.
" సరేలేరా! ఏమిటి మీ ఓనర్ ఈ మధ్య ఉభయాల దగ్గరికి వస్తున్నా డంట! ఇది తెలిసి నేను రోజూ వస్తున్నాను. నాకోసమేనా...?" అన్నది మానస.