Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 19


    
    దేవాలయం దగ్గరపడడంతో మళ్ళీ హృదయంలోకి శశిరేఖ ప్రవేశించింది


    అన్నీ తను అనుకున్నట్టు జరుగుతాయా? ఆమె ఒంటరిగా దొరికితే తన మనసులో మెదులుతున్న భావాలన్నిట్నీచెప్పాలి.ఎవరో ముక్కూముఖం తెలియని వ్యక్తి మాట్లాడుతుంటే, ఏమైపోతుంది.తను?బహుశా ఉక్కిరిబిక్కిరై పోతుంది. తత్తరపాటుతో కదిలిపోతుంది. విస్మయం తోనో, ఆశ్చర్యంతోనో గడ్డకట్టుకుపోతుంది. కోపం వచ్చినా  రావచ్చు.


     అసలింతకీ తను ఒంటరిగా దొరుకుతుందా? ఏమో చూడాలి.


    అతను  వెళ్ళేటప్పటికి దేవాలయం దగ్గర హడావుడిగా వుంది. భజన పతాకస్థాయిలో వున్నట్టు వాళ్ళ గొంతులే చెబుతున్నాయి.


    అతను వీలైనంతలో  ఎవరికీ కనపడకుండా తను ఎప్పుడూ నిలబడుంటేచోటే నిలబడ్డాడు. దేవాలయం దగ్గరకొచ్చేవాళ్ళు అతనకి  కనిపిస్తారు గానీ అతను వాళ్ళకి కనపడదు. కారణం అతను వున్న చోటు చీకటిగా వుండడమే వెన్నెల మరింత తెలుపుకెక్కింది. నీలపు ఆకాశం మరీ నీలంగా కనిపిస్తోంది.


     అతనక్కడే నిలబడలేకపోయాడు. సిగరెట్లు తెచ్చుకోవడానికి బయల్దేరాడు. ఆ సాకుతో శశిరేఖ ఇల్లును కూడా చూడొచ్చు. తనకు ఎదురుపడ్డా ఎదురుపడొచ్చు. ఒకసారి చూస్తే మాట్లాడేటప్పటికి టెన్షన్ కాస్తంత తగ్గచ్చు.


     అలా అనుకుని అతను అంగడికి బయల్దేరాడు.


    దేవాలయం నుంచి నేరుగా నడిచి పక్కవీధిలోకి మలుపు తిరిగాడు.ఆ వీధిలోంచి చివరగా వచ్చేస్తే శశిరేఖ ఇల్లు. అతను ఆ ఇంటిని  సమీపించే కొద్దీ గుండె చప్పుడు ఎక్కువైంది క్రీగంట లోనికి చూశాడు. గానీ ఎవరూ కనిపించలేదు. ఇంటిముందు  జీప్ లేదు. అతను నేరుగా వెళ్ళిపోయాడు.


     వీధి చివరగా వుంది అంగడి. తను ఇంతవరకు అంగట్లో కి వెళ్ళలేదు. ఏం కావాలన్నా, ఎప్పుడూ ఎవర్నో  ఒకర్ని పంపింపటమే. తను వెళితే లోపల బేరాలు చేసుకుంటున్న వాళ్ళంతా ఇబ్బంది పడతారు.అందుకే అప్పుడూ బయటే నిలబడి అంగడి ఓనర్ ని కేకేశాడు.


     "రఘూ"


    లోపల ఎవరో చెప్పినట్టున్నారు. వాడు పరుగున బయటికివచ్చాడు. "సిగరెట్లు- ఓ ప్యాకెట్" అంటూ డబ్బులిచ్చాడు. వాడు అరక్షణంలో తెచ్చాడు.వాటిని తీసుకుని అక్కడినుండి తిరిగి బయల్దేరాడు.


    అప్పుడూ శశిరేఖ  అతడి కళ్ళపడలేదు.


    మామూలుగా తన స్థానంలో నిలుచుని సిరగెట్ వెలిగించాడు. టొబాగో వాసన ఉత్సాహాన్ని ఇస్తోంది.


     సత్యవతి కాబోలు వీధిలో పోతోంది. సత్యవతిలాంటి దానికి నవమి ఉత్సవాలు, దేవీనవరాత్రులు లాంటివి జరుగుతుంటే లాభం. ఆమె విధవ భర్త చనిపోయి సంవత్సరమైంది.  అన్నా వదినలున్నారు.


    ఆ వదిన బ్రహ్మారాక్షసి.సత్యవతి శీలం పొగొట్టుకోవడానికి రెడీగా  ఉన్నట్టు,అందుకు తాను అడ్డుపడి కుటుంబ పరువును కాపాడుతున్నట్టు  అనుకుంటూ పదిమందికీ చాటి చెప్పుకుంటూ ఉంటుంది.


    సత్యవతిని బయటికి కాలు పెట్టనివ్వదు. దేవుడి కార్యాలకైతే అబ్బే క్షన్ చెప్పదు. ఇలాంటి సమయాలోనే ఆమె బయటకి రాగలిగేది.  ఇంట్లో నుంచి బయటపడ్డానన్న సమయాల్లోనే  ఆమె బయటికి రాగలిగేది.  ఇంట్లో నుంచి బయటపడ్డానన్న ఆనందం, చెరనుంచి విముక్తి కలిగిందన్న రిలీఫ్ వెన్నెల్లో ఆమె  ముఖంలో ప్రస్ఫుటంగా తెలుస్తోంది.


     ఆమె సురేష్ వర్మకు బంధువు. అందువల్ల ఎప్పుడైనా తను వాళ్ళింటికి వెళ్ళినప్పుడో, లేదా ఆమె తనింటికి వచ్చినప్పుడో రెండోపెళ్ళి చేసుకొమ్మని సలహా ఇచ్చేవాడు. కానీ దీనికి సత్యవతి ఒప్పుకునేది కాదు.

 Previous Page Next Page