Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 18


    అతనామెవైపు చూసి వెక్కిరించినట్లు చూశాడు.
    
    విజ్ఞత చూసీ చూడనట్లు ఊరుకుంది.
    
    అతను మళ్ళీ "హలో" అన్నాడు వినిపించీ వినిపించనట్లు.
    
    ఆమె తల పక్కకి తిప్పుకుంది.
    
    ధర్మేంద్ర ఒక్కక్షణం ఆలోచించి స్కూటర్ మీద ముందుకు సాగిపోయాడు.
    
    సరిగ్గా రెండు ఫర్లాంగుల అవతల ఐస్ పార్లర్ దగ్గర వినూత్న అతనికోసం ఎదురుచూస్తూ నిలబడింది.
    
    స్కూటర్ స్లో చేసేసరికి వచ్చి అతని వెనక కూర్చుంది.
    
    "సరిగ్గా ఆ సమయానికి అర్ధనారీశ్వరరావు కారు డ్రైవ్ చేసుకుంటూ అటుకేసి వస్తునండు. ఈ దృశ్యం అతని కళ్ళబడింది.
    
    'ఊహుఁ మొత్తంమీద ఆ ఇంట్లో అందరూ అందరే!' అనుకున్నాడు. వినూత్న అతన్ని చూసింది కాని లెక్కచెయ్యలేదు.
    
    స్కూటర్ ముందుకి సాగుతుంది.
    
    "ఎటు పోదాం?" అడిగింది వినూత్న.
    
    "మా ఇంటికి."
    
    "వద్దు ధర్మేన్ వాళ్ళెవరూ మనసు విప్పి మాట్లాడరు. నన్ను చూడగానే మొహాలు ముడుచుకుంటారు."
    
    "వాళ్ళెవరూ ఇంట్లో లేరులే."
    
    "లేరా?"
    
    "లేరు ఊరెళ్ళారు"
    
    వినూత్న ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఊరుకుంది.
    
    పది నిమిషాల తరువాత స్కూటర్ ఓ ఇంటిముందాగింది.
    
                                            * * *
    
    రాఖేష్ తన స్నేహితులతో బార్ లో కూర్చున్నాడు. ఇవేళ అతని ఫ్రెండ్స్ లో ఒకరిది బర్త్ డే అందుకని గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారు.
    
    బేరర్ ట్రేలో డ్రింక్స్ తీసుకొచ్చాడు. గ్లాసులు అందరి ముందూ పెడుతున్నాడు.
    
    "నా కొద్దు నేను కూల్ డ్రింక్ తీసుకుంటాను" అన్నాడు రాఖేష్.
    
    అతను డ్యాషింగ్ గానే ఉంటాడు గాని, ఇంతవరకూ డ్రింక్స్ అలవాటు చేసుకోలేదు.
    
    స్నేహితుడు అతనివైపు ఆశ్చర్యంగా చూశాడు.
    
    "అవును నా కలవాటు లేదు."
    
    "రాఖేష్! నువ్వు అన్ని విషయాల్లో అంత స్మార్ట్ ఉంటావు. డ్రింక్స్ అలవాటు లేకపోవడమేమిటి?"
    
    రాఖేష్ లజ్జితుడయ్యాడు. "ఎందుకనో పడదని నాకు భయం."
    
    "దటీజ్ సిల్లీ యూ ఆర్ వెరీ లేట్ మొదట లైట్ గా తీసుకో తరువాత ఇంప్రూవ్ చేద్దువుగాని" అంటూ ఓ స్మాల్ పెగ్ ఉన్న గ్లాసు అతని ముందుకు తోసి, అందులో సోడా వేసి, ఐస్ క్బూబ్స్ వేశాడు.
    
    "ఛీర్స్"
    
    మిగతావారితోబాటు రాఖేష్ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకున్నాడు.
    
    అదే సమయానికి అర్ధనారీశ్వరరావు తన స్నేహితులతో కలసి లోపలకు వస్తున్నాడు. అతని దృష్టి రాఖేష్ మీద పడింది.
    
    "ఊహుఁ ఆ రాజాచంద్ర పెంపకం అలా తగలడిందన్నమాట. ఆ ఇంట్లో అందరూ గ్రంథసాంగులే' అనుకున్నాడు.
    
    అక్కడికి కొద్దిదూరంలో ఉన్న మరోబార్ లో తన కొడుకు లిద్దరూ కలిసి మందు కొడుతున్న సత్యం అతనికి తెలీదు.
    
                                           * * *
    
    ధర్మేంద్ర స్కూటర్ దిగాడు.
    
    "రా లోపలకు" అన్నాడు.
    
    వినూత్న మనసులో చిన్న సంకోచం ఏదో భయం.
    
    ఒక క్షణం సందిగ్ధంగా నిలబడింది.
    
    "లోపలకు రావాలంటే భయంగా ఉందా?" అన్నాడు ఆమె కళ్ళలోకి నవ్వుతూ చూస్తూ.
    
    ఆమె నామోషీ ఫీలయింది. "ఎందుకు భయం?"
    
    "నిన్నేమయినా చేస్తానేమోనని?"
    
    ఆమెకు కాస్త ధైర్యమొచ్చింది. "ఏమయినా అంటే?" అంది పెంకెగా.
    
    "నిన్ను..."
    
    "ఏం చేస్తావేం?"
    
    "రేప్ చేస్తానని."
    
    "ఓస్ ఇంతేనా?"
    
    ఆమె తనని ఉడికిస్తుందని అర్ధమయింది. పైనుంచి కిందవరకూ చూశాడు. వయసుకు తగ్గట్టుగా వికసించని అవయవాలు అదో అందంగా భాసిస్తూ కవ్విస్తున్నాయి. ఒంట్లోని రక్తం వెచ్చగా జరజరా ప్రవహించి నట్లయింది.
    
    బయటకు మాత్రం నవ్వుతూ చూసి తాళం తీశాడు వినూత్న నిస్సంకోచంగా అతని వెనకే లోపలకి అడుగుపెట్టింది.
    
    హాలు ఆధునాతనంగా,  చాలా రిచ్ గా ఉంది. ఫ్రిజ్ దగ్గర కెళ్ళి డోర్ తీసి "ఏం తీసుకుంటావు గోల్డ్ స్పాటా? లింకా? ఏం కావాలి?" అన్నాడు.
    
    "నాకు గోల్డ్ స్పాటే ఇష్టం" అంది వినూత్న.
    
    ఫ్రిజ్ లో నుంచి గోల్డ్ స్పాట్ బాటిల్ తీసి ఆమెకిచ్చి, తాను లిమ్కా అందుకున్నాడు.
    
    "కోకోకోలా పోయాక కూల్ డ్రింక్స్ తాగటంలో థ్రిల్ పోయింది" అన్నాడు.

 Previous Page Next Page