Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 17


    "అవును అంతకు ముందు విశాఖపట్నంలో ఉండేవాళ్ళం ఇక్కడకు వచ్చి అయిదారు నెలలయింది"
    
    "ఈ ఇల్లు..."
    
    "సొంతమే ఇక్కడకు రాగానే నాన్నగారు కొనేశారు."
    
    "తల్లి లోపల్నుంచి పిలవగానే విజ్ఞత లోపలకు వెళ్ళి కాఫీ కప్ తో తిరిగి వచ్చింది. "తీసుకోండి" అంది అందిస్తూ.
    
    అతను కాఫీ కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఆమె ఎదురుగా నిలబడి ఉంది.
    
    ఆ నిశ్శబ్దం కొంచెం ఇబ్బందిగా అనిపించి "మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా?" అనడిగాడు.
    
    "ఇష్టమే!"
    
    "టీ.వీ.లో మేచెస్ చూస్తూ ఉంటారా?"
    
    "చూస్తూ ఉంటాను."
    
    "మీ అభిమాన ఇండియన్ క్రికెటర్ ఎవరు?"
    
    "వెంగ్ సర్కార్!"
    
    "వెంగ్ సర్కారా?" అన్నాడు ఆశ్చర్యంగా సాధారణంగా అందరూ మీ అభిమాన క్రికెటర్ ఎవరంటే గవాస్కరనో, కపిల్ దేవ్ అనో, రవిశాస్త్రి అనో చెప్పేస్తారు. వెంగ్ సర్కార్ పేరు సాధారణంగా చెప్పరు.
    
    "ఎందుకని?"
    
    "అతనికి రికార్డ్స్ అట్టే లేకపోయినా స్టడీగా, నిబ్బరంగా ఆడే సమర్ధత ఉంది. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా తన దారిన తాను చక్కగా ఆడుతూ ఎన్నోసార్లు కంట్రీని గెలిపించాడు. మరెన్నోసార్లు కిష్టపరిస్థితుల నుంచి సేవ్ చేశాడు. చాలా హుందాగా, రిజర్వ్ డ్ గా, ఎవరి గురించీ ఏ స్టేట్ మెంటూ ఇవ్వకుండా, 'తనకు రావలసినంత గుర్తింపు రాకపోయినా బాధపడకుండా ప్రాణం పోసి ఆడతాడు.
    
    రాజాచంద్రకు నిజమేననిపించింది. ఆ క్షణంలో వెంగ్ సర్కార్ ని తలచుకుంటే జాలేసింది.
    
    "క్రికెట్ అంటే నాకిష్టమే అయినా ఒకరకంగా కోపం కూడా"
    
    "ఎందుకని?" అనడిగాడు ఆశ్చర్యంగా.
    
    "మరి ఏ ఇతరగేమ్ మీదా లేనంత క్రేజ్ క్రికెట్ మీద ఏర్పడింది. నాలుగయిదేళ్ళ పిల్లాడి దగ్గర్నుంచి ఎనభై ఏళ్ల వృద్దుడిదాకా క్రికెట్ అంటే ప్రాణాలు విడిచిపెట్టే స్థితికి వచ్చేశారు. క్రికెట్ మేచ్ జరుగుతున్నప్పుడు దేశమంతా లెథార్చిక్ గా, దాన్ని గురించే ఆలోచిస్తూ టెన్షన్ ఫీలవుతూ, వృత్తి ఉద్యోగాలు అశాశ్వతమైనట్లు క్రికెట్ ఒక్కటే శాశ్వతమైనట్లు అందులో లీనమైపోయి మిగతా వ్యాపకాలను నిర్లక్ష్యం చెయ్యటం, గెలిస్తే కొండ ఎక్కినట్లుగా సంతోషపడటం, ఓడిపోతే హార్ట్ ఎటాక్ వచ్చినంతగా క్రుంగిపోవటం మరి ఏ ఇతరగేమ్ ని గురించీ అంత పట్టించుకోం. ఏ ఇతర ప్లేయర్ ని గురించీ అంత ఆలోచించం. విజయ అమృతరాజ్ టెన్నిస్ బాగా ఆడకపోయినా, రమేష్ కృష్ణన్ మొదటి రౌండ్ లో ఓడిపోయినా పెద్ద బాధపడం కాని,  గవాస్కర్ సెంచరీ కొట్టకపోతే, శ్రీకాంత్ సిక్సర్లు కొట్టకపోతే, కపిల్ దేవ్ బాగా బౌల్ చెయ్యకపోతే విలవిల్లాడి పోతాం ఇంతా చేస్తే ప్రపంచంలో టెన్నిస్, ఫుట్ బాల్ వంటి గేమ్స్ కొన్ని వందల, పోనీ పదుల దేశాలు ఏడెనిమిది కంటే లేవు. టెస్ట్ మేచ్ లు  ఆడేటప్పుడు అయిదురోజులబాటు టైమ్ వేస్ట్ చెయ్యటం, చివరికి నూటికి డెబ్బై అయిదు వంతులు రిజల్ట్ రాకుండా డ్రాగా ఎండ్ అయి నిరుత్సాహం మిగిలిపోవటం...ఇదంతా ఏమిటి చెప్పండి?"
    
    రాజాచంద్రకు నిజమేననిపించింది. క్రికెట్ కోసం తాను చాలాసార్లు ఆఫీసు కెళ్ళటం మానెయ్యటం, అన్నం తినటం మానేసి దిగాలుపడి కూచోవటం... తన మీద తనకే అసహ్యమేసింది. "ఇహనుంచి క్రికెట్ గురించి ఎక్కువ టైమ్ వృథా చెయ్యకూడదు" అని నిర్ణయించుకున్నాడు.
    
    పది నిమిషాలు గడిచాక "ఇహ వస్తాను" అని లేచాడు.
    
    "ఎక్కడికి వెళతారు? ఇంటికా? ఆఫీసుకా?" అనడిగింది విజ్ఞత అంతకు ముందు మాటల్లో తన బిజినెస్, ఆఫీసు గురించి కొంతవరకూ చెప్పాడు.
    
    "ఆఫీసుకే."
    
    "పోనీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదూ? వీక్ గా కూడా కనబడుతున్నారు" అన్నది విజ్ఞత చనువుగా.
    
    "ఫరావలేదు వెళ్ళగలను. వారంరోజుల బట్టీ జ్వరం వల్ల వెళ్ళకపోవటం మూలాన చాలా వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది."
    
    "అమ్మా" అని పిలిచింది విజ్ఞత.
    
    భ్రమరాంబ లోపల్నుంచి వచ్చింది.
    
    "మీకు చాలా శ్రమ ఇచ్చాను. వస్తానండీ" అన్నాడు రాజాచంద్ర.
    
    బయటకి వచ్చాక విజ్ఞత ఆటో పిలిచింది. సరిగ్గా అతను ఆటో ఎక్కుతున్నప్పుడు ఆ పక్కనుంచి ఓ కారు సాగిపోయింది. ఆ కారు అర్ధనారీశ్వరరావు డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఆటో ఎక్కుతున్న రాజాచంద్రనీ, అతనికి దగ్గరగా నిలబడి ఉన్న అమ్మాయినీ చూశాడు. ఆమె ముఖకవళికలను గమనించలేదు. ఏ మనిషి గురించీ మంచిగా ఆలోచించటం అతని కలవాటులేదు. అతని పెదవులమీద చిన్న వక్రచాలనమొకటి మెరిసింది. "ఆహాఁ!" అనుకున్నాడు.
    
    విజ్ఞత బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. పక్కన జనం కూడా అయిదారుగురి కంటే ఎక్కువలేరు.
    
    ధర్మేంద్ర ఆటే స్కూటరుమీద వేగంగా వెడుతున్నాడు. ఆమెను చూడగానే అప్రయత్నంగా బ్రేక్ పడింది. 'ఫెంటాస్టిక్' అనుకున్నాడు.
    
    అందమైన అమ్మాయిలంటే అతనికి ప్రాణం. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అతన్లోని రక్తం ఉరకలువేసి ప్రవహిస్తుంది. అంతేకాదు. తన పర్సనాలిటీ మీదా, తనలోని ఆకర్షణశక్తి మీదా అతనికి చాలా నమ్మకం. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ధర్మారావు. అతన్లో యౌవనం ఉరకలు వెయ్యటం ప్రారంభించాక ధర్మేంద్రగా మార్చుకున్నాడు. తన మాటల్లో, చేతల్లో సినిమా హీరోలాగానే హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటాడు.
    
    తన ముందుగా వెళుతున్న స్కూటరు హఠాత్తుగా ఆగినట్లయ్యేసరికి విజ్ఞత దృష్టి అటువైపు మరలింది.

 Previous Page Next Page