Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 19


    ఆమె మౌనంగా డ్రింక్ ఎన్ జాయ్ చేస్తూ కొంచెం కొంచెం తాగుతోంది. పెదిమలు ఎర్రబడుతున్నాయి.
    
    వికసించీ వికసించని అవయవాలు, గోల్డ్ స్పాట్ కలర్ తో తడిసిన పెదిమలు... అతని కళ్ళలోకి ఎర్రని జీరలు ప్రవేశిస్తున్నాయి.
    
    వినూత్న కూల్ డ్రింక్ తాగడం పూర్తి చేసి బాటిల్ పక్కన పెట్టేసింది. ధర్మేంద్ర ఆమె దగ్గరకు నడిచాడు.
    
    తల పైకెత్తి అతని మొహంలోకి చూసింది. అతని కళ్ళలోని ఎర్రని జీర ఆమె గుండెని తట్టి లేపినట్లయింది.
    
    "వినూత్నా" అన్నాడు.
    
    "ఊఁ"
    
    "యూ ఆర్ ఫెంటాస్టిక్."
    
    ఒళ్ళు పులకరించినట్లయింది.
    
    అతని చెయ్యి ఆమె భుజంమీద పడింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. రెండో చేతిని కూడా ఆమె భుజంమీద వేసి దగ్గరకు లాక్కున్నాడు.
    
    ఆమె శరీరంలోని ప్రతి అణువులో,  తడిసిన పెదవుల్లో చిన్న చిత్రమైన కదలిక- దేనికోసమో ఆరాటపడుతూ అంతలోనే సిగ్గు పడుతున్నట్టు.
    
                                              6
    
    శరీరంలోని నరనరాల్లో ప్రాకుతున్న విద్యుత్ తరంగాలు ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అయినాయి. త్రుళ్ళిపడినట్లయి అతన్ని వెనక్కి ఒక్కతోపు త్రోసింది.
    
    ఆమెనుంచి ఎలాంటి ప్రతిఘటనా ఎదురుచూడని ధర్మేంద్ర ఉలికిపడి ఏమిటి? అన్నాడు.
    
    "నాకిలాంటివి యిష్టంలేదు."
    
    "కిసెస్" తీసుకుంటున్నప్పుడు ఊరుకుంటున్నావుగా."
    
    "అంతవరకూ అయితే ఫరవాలేదు. కాని మరీ అంత ముందుకు పోవద్దు."
    
    ధర్మేంద్రలో ఉద్రేకతరంగాలింకా తగ్గలేదు. ఒక నవయౌవనమోహిని, చేతిదాకా వచ్చి, అనుభవించబోయే తరుణంలో చేయిదాటిపోతోంది. ఆమె కళ్ళలోకీ, వాటిలో మెదిలే హావభావాలనీ చూస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. తాను తొందరపడకూడదు. బలవంతం చేస్తే బెదిరిపోతుంది. ఆమె చెప్పేది నిజమే. ఆమె నిరాకరిస్తోంది తనంటే ఇష్టంలేక కాదు. అదంటే ఉన్న ఒకరకం భయంవల్ల. ఆ మాట కొస్తే కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు మొదటి రాత్రి భర్త దగ్గరకు పోవటనికే భయపడతారు. పెళ్ళికాని ఆడపిల్ల భయపడటంలో ఆశ్చర్యమేముంది? తన చేతుల్లో చిక్కుకుంది. ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కాకపోతే రేపయినా లొంగిపోక తప్పదు.
    
    "దట్సాల్ రైట్ నువ్వు చాలా డాషింగ్ వనుకున్నాను" అన్నాడు మొహంలోకి నవ్వు తెచ్చుకుంటూ.
    
    "కోపమొచ్చిందా?" అనడిగింది.
    
    "దేనికి? నే నీ సంగతి చాలా ఈజీగా తీసుకున్నాను" అన్నాడు.
    
    "అయితే సరే" అంది రిలీఫ్ గా ఫీలవుతూ.
    
                                                * * *
    
    వినూత్న ధర్మేంద్ర ఇంట్లోంచి బైటికి వచ్చాక సరాసరి హిమశైలజ దగ్గరకు వెళ్ళింది.
    
    హిమశైలజ ఇంట్లోనే ఉంది. "నీతో కొంచెం మాట్లాడాలి" అంది వినూత్న మెల్లగా.
    
    హిమశైలజ తల్లి దగ్గర్లోనే ఉంది. "రా నా గదిలోకి పోదాం" అని మేడమీదకు తీసుకెళ్ళింది."
    
    "ఏమిటి?"
    
    వినూత్న జరిగిందంతా గబగబా చెప్పేసింది. అప్పటిదాకా ఆమెలోని ఆరాటం చల్లారలేదు.
    
    అంతా విని హిమశైలజ చాలా తేలిగ్గా నవ్వేసింది. "దీనికా ఇంత భయపడుతున్నావు?" అంది.
    
    "ఏమిటంత తేలిగ్గా కొట్టి పారేస్తున్నావు? ఇది భయపడేటంత విషయం కాదా?"
    
    కాదు."
    
    "ఎందుకని?"
    
    "ఇప్పుడు ప్రపంచం చాలా వేగంతో నడుస్తుంది. ఈ వేగంలో శీలం, నీతి, కట్టుబాట్లు, సరిహద్దులు- వీటికంత ప్రాముఖ్యం లేదు. ఇవన్నీ కాల ప్రవాహంలో మధ్య మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు. వీటికి అపారమైన విలువ ఇచ్చి అనుక్షణం మనలని చిత్రహింసల పాలు చేస్తూ, మనల్ని మనం బంధించుకుని బ్రతకటంకన్నా లైట్ గా తీసుకుంటే పోయిందేముంది?"
    
    "అలా చెయ్యటం తప్పు కాదంటావా?"
    
    "ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలలో ఈ తప్పు అనే ఘట్టం అతి సామాన్యమైంది. చాలా సహజమైంది. వేగంగా పరిగెత్తే ఓ మహాప్రవాహంలో ఇదో చిన్న నీటిబొట్టు."
    
    "ఒకవేళ ఎవరితోనైనా అలా జరిగిందనుకో, ఆ తరువాత అతను పెళ్లి చేసుకోకుండా ఒదిలేస్తే?"
    
    "అసలు పెళ్ళికీ, దీనికీ ముడి పెట్టమని ఎవరు చెప్పారు? పెళ్ళనేది ఓ తోడుకోసం ఏర్పాటు చేసుకున్న భద్రత. అంతే పెళ్ళికాకముందు మగవాడు ఏమేమి చేశాడో మనం చూసొచ్చామా? అలాగే ఆడవాళ్ళ విషయమూ అంతే. ఒకరి గతాన్ని గురించి ఒకరు ప్రశ్నించుకునే, నిరసించే హక్కు ఎవరికీ లేదు. ఒకసారి సందర్భాన్ని బట్టి ఓ అనుభవం పొందటం జరిగితే అది ఎంతవరకూ ఆస్వాదించాలో అంతవరకూ ఆస్వాదించి వదిలెయ్యి. దాన్ని పట్టుకుని శాశ్వతంగా వేళ్ళాడటానికి ప్రయత్నించకు."
    
    వినూత్న కొంచెం సంకోచిస్తూనే "నీకు అలా ఎప్పుడయినా జరిగిందా?" అనడిగింది.
    
    "ఎలా?"
    
    "నువ్వన్నావే... అనుభవం."

 Previous Page Next Page